శ్రీదేవీ చతుఃషష్ట్యుపచార పూజా స్తోత్రం-మానసిక పూజ
ఒకసారి శంకరాచార్యునికి, అరవై నాలుగు మంది యోగినులూ
చతుష్షష్టి ఉపచారాలతో పూజ చేస్తున్నట్టు, ఆ పూజని స్వీకరిస్తున్నట్టు అమ్మవారు దర్శనం ఇచ్చారు. అప్పుడు ఆ అనుభూతికి అపరిమితానందం
పొందిన శంకరాచార్యుడు, "శ్రీదేవీ
చతుఃషష్ట్యుపచార పూజా స్తోత్రం" ఆశువుగా చెప్పాడు. ఆ
స్తోత్రంలో ఆ అరవైనాలుగు ఉపచారాల గురించీ వివరంగా తెలుస్తుంది. తాను చూసినది
చూసినట్టుగా స్తుతించాడు శంకరాచార్యుడు.
శ్రీలలితా రహస్య సహస్ర నామాల్లో 235వ నామం చతుఃషష్ట్యుపచారాఢ్యా. అరవై నాలుగు రకములైన ఉపచారములతో సేవలందుకుంటున్న తల్లి అని ఈ నామానికి అర్ధం. ఇక్కడ అమ్మపై చెప్పబడిన ఆ చతుఃషష్ట్యుపచార పూజా స్తోత్రం, ఆ పూజావిధానం గురించి చెప్పుకుందాం. ఆ 64 ఉపచారాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
శ్రీదేవీ చతుఃషష్ట్యుపచార పూజా స్తోత్రం
ఉషసి మాగధమఙ్గలగాయనైః ఝటితి జాగృహి జాగృహి జాగృహి |
అతికృపార్ద్రకటాక్షనిఱీక్షణైః జగదిదం జగదమ్బ సుఖీకురు ||1 ||
కనకమయవితర్దిశోభమానం దిశి దిశి పూర్ణసువర్ణకుమ్భయుక్తమ్ |
మణిమయమణ్టపమధ్యమేహి మాతః మయి కృపయాశు సమర్చనం గ్రహీతుమ్ ||2 ||
కనకకలశశోభమానశీర్షం జలధరలమ్బి సముల్లసత్పతాకమ్ |
భగవతి తవ సంనివాసహేతోః మణిమయమన్దిరమేతదర్పయామి ||3 ||
తపనీయమయీ సుతూలికా కమనీయా మృదులోత్తరచ్ఛదా |
నవరత్నవిభూషితా మయా శిబికేయం జగదమ్బ తేర్పితా ||4 ||
కనకమయవితర్దిస్థాపితే తూలికాఢ్యే వివిధకుసుమకీర్ణే కోటిబాలార్కవర్ణే |
భగవతి రమణీయే రత్నసింహాసనేస్మిన్ ఉపవిశ పదయుగ్మం హేమపీఠే నిధాయ ||5 ||
మణిమౌక్తికనిర్మితం మహాన్తం కనకస్తమ్భచతుష్టయేన యుక్తమ్ |
కమనీయతమం భవాని తుభ్యం నవముల్లోచమహం సమర్పయామి ||6 ||
దూర్వయా సరసిజాన్వితవిష్ణుకాన్తయా చ సహితం కుసుమాఢ్యమ్ |
పద్మయుగ్మసదృశే పదయుగ్మే పాద్యమేతదురరీకురు మాతః ||7||
గన్ధపుష్పయవసర్షపదూర్వాసంయుతం తిలకుశాక్షతమిశ్రమ్ |
హేమపాత్రనిహితం సహ రత్నైః అర్ఘ్యమేతదురరీకురు మాతః ||8 ||
జలజద్యుతినా కరేణ జాతీఫలతక్కోలలవఙ్గగన్ధయుక్తైః |
అమృతైరమృతౌరివాతిశీతైః భగవత్యాచమనం విధీయతామ్ ||9 ||
నిహితం కనకస్య సంపుటే పిహితం రత్నపిధానకేన యత్ |
తదిదం జగదమ్బ తేఽర్పితం మధుపర్కం జనని ప్రగృహ్యతామ్ ||10 ||
ఏతచ్చమ్పకతైలమమ్బ వివిధైః పుష్పైః ముహుర్వాసితం
న్యస్తం రత్నమయే సువర్ణచషకే భృఙ్గైః భ్రమద్భిః వృతమ్ |
సానన్దం సురసున్దరీభిరభితో హస్తైః ధృతం తే మయా
కేశేషు భ్రమరభ్రమేషు సకలేష్వఙ్గేషు చాలిప్యతే ||11 ||
మాతః కుఙ్కుమపఙ్కనిర్మితమిదం దేహే తవోద్వర్తనం
భక్త్యాహం కలయామి హేమరజసా సంమిశ్రితం కేసరైః |
కేశానామలకైః విశోధ్య విశదాన్కస్తూరికోదఞ్చితైః
స్నానం తే నవరత్నకుమ్భసహితైః సంవాసితోష్ణోదకైః ||12 ||
దధిదుగ్ధఘృతైః సమాక్షికైః సితయా శర్కరయా సమన్వితైః |
స్నపయామి తవాహమాదరాత్ జనని త్వాం పునరుష్ణవారిభిః ||13 ||
ఏలోశీరసువాసితైః సకుసుమైర్గఙ్గాది తీర్థోదకైః
మాణిక్యామలమౌక్తికామృతరసైః స్వచ్ఛైః సువర్ణోదకైః |
మన్త్రాన్వైదికతాన్త్రికాన్పరిపఠన్సానన్దమత్యాదరాత్
స్నానం తే పరికల్పయామి జనని స్నేహాత్త్వమఙ్గీకురు ||14 ||
బాలార్కద్యుతి దాడిమీయకుసుమప్రస్పర్ధి సర్వోత్తమం
మాతస్త్వం పరిధేహి దివ్యవసనం భక్త్యా మయా కల్పితమ్ |
ముక్తాభిః గ్రథితం సుకంచుకమిదం స్వీకృత్య పీతప్రభం
తప్తస్వర్ణసమానవర్ణమతులం ప్రావర్ణమఙ్గీకురు ||15 ||
నవరత్నమయే మయార్పితే కమనీయే తపనీయపాదుకే |
సవిలాసమిదం పదద్వయం కృపయా దేవి తయోర్నిధీయతామ్ ||16 ||
బహుభిరగరుధూపైః సాదరం ధూపయిత్వా భగవతి తవ కేశాన్కఙ్కతైర్మార్జయిత్వా |
సురభిభిరరవిన్దైశ్చమ్పకైశ్చార్చయిత్వా ఝటితి కనకసూత్రైర్జూటయన్వేష్టయామి ||17 ||
సౌవీరాంజనమిదమమ్బ చక్షుషోస్తే విన్యస్తం కనకశలాకయా మయా యత్ |
తన్న్యూనం మలినమపి త్వదక్షిసఙ్గాత్ బ్రహ్మేన్ద్రాద్యభిలషణీయతామియాయ ||18 ||
మఞ్జీరే పదయోర్నిధాయ రుచిరాం విన్యస్య కాంచీం కటౌ
ముక్తాహారమురోజయోరనుపమాం నక్షత్రమాలాం గలే |
కేయూరాణి భుజేషు రత్నవలయశ్రేణీం కరేషు క్రమా-
త్తాటఙ్కే తవ కర్ణయోర్వినిదధే శీర్షే చ చూడామణిమ్ ||19 ||
ధమ్మిల్లే తవ దేవి హేమకుసుమాన్యాధాయ ఫాలస్థలే
ముక్తారాజివిరాజమానతిలకం నాసాపుటే మౌక్తికమ్ |
మాతర్మౌక్తికజాలికాం చ కుచయోః సర్వాఙ్గులీషూర్మికాః
కటకాం కాఞ్చనకిఙ్కిణీర్వినిదధే రత్నావతంసం శ్రుతౌ ||20 ||
మాతః ఫాలతలే తవాతివిమలే కాశ్మీరకస్తూరికా-
కర్పూరాగరుభిః కరోమి తిలకం దేహేంగరాగం తతః |
వక్షోజాదిషు యక్షకర్దమరసం సిక్త్వా చ పుష్పద్రవం
పాదౌ చన్దనలేపనాదిభిరహం సంపూజయామి క్రమాత్ ||21 ||
రత్నాక్షతైస్త్వాం పరిపూజయామి ముక్తాఫలైర్వా రుచిరైరవిద్ధైః |
అఖణ్డితైర్దేవి యవాదిభిర్వా కాశ్మీరపంకాంకితతణ్డులైర్వా ||22 ||
జనని చమ్పకతలైమిదం పురో మృగమదోపయుతం పటవాసకమ్ |
సురభిగన్ధమిదం చ చతుఃసమం సపది సర్వమిదం పరిగృహ్యతామ్ ||23 ||
సీమన్తే తే భగవతి మయా సాదరం న్యస్తమేతత్
సిన్దూరం మే హృదయకమలే హర్షవర్షం తనోతి |
బాలాదిత్యద్యుతిరివ సదా లోహితా యస్య కాన్తీ-
రన్తర్ధ్వాన్తం హరతి సకలం చేతసా చిన్తయైవ ||24 ||
మన్దారకున్దకరవీరలవఙ్గపుష్పైః త్వాం దేవి సన్తతం అహం పరిపూజయామి |
జాతీజపావకులచమ్పకకేతకాది- నానావిధాని కుసుమాని చ తేఽర్పయామి ||25 ||
మాలతీవకులహేమపుష్పికా- కాంచనారకరవీరకైతకైః |
కర్ణికారగిరికర్ణికాదిభిః పూజయామి జగదమ్బ తే వపుః ||26 ||
పారిజాతశతపత్రపాటలైః మల్లికావకులచంపకాదిభిః |
అమ్బుజైః సుకుసుమైశ్చ సాదరం పూజయామి జగదమ్బ తే వపుః ||27 ||
లాక్షాసంమిలితైః సితాభ్రసహితైః శ్రీవాససంమిశ్రితైః
కర్పూరాకలితైః శిరైర్మధుయుతైర్గోసర్పిషా లోడితైః |
శ్రీఖణ్డాగరుగుగ్గులుప్రభృతిభిర్నానావిధైర్వస్త్తుభిః
ధూపం తే పరికల్పయామి జనని స్నేహాత్త్వమఙ్గీకురు ||28 ||
రత్నాలంకృతహేమపాత్రనిహితైర్గోసర్పిషా లోడితైః
దీపైర్దీర్ఘతరాన్ధకారభిదురైర్బాలార్కకోటిప్రభైః |
ఆతామ్రజ్వలదుజ్జ్వలప్రవిలసద్రత్నప్రదీపైస్తథా
మాతస్త్వామహమాదరాదనుదినం నీరాజయామ్యుచ్చకైః ||29 ||
మాతస్త్వాం దధిదుగ్ధపాయసమహాశాల్యన్నసంతానికాః
సూపాపూపసితాఘృతైః సవటకైః సక్షౌద్రరమ్భాఫలైః |
ఏలాజీరకహిఙ్గునాగరనిశాకుస్తుమ్భరీసంస్కృతైః
శాకైః సాకమహం సుధాధికరసైః సంతర్పయామ్యర్చయన్ ||30 ||
సాపూపసూపదధిదుగ్ధసితాఘృతాని సుస్వాదుభక్తపరమాన్నపురఃసరాణి |
శాకోల్లసన్మరిచిజీరకబాహ్నికాని భక్ష్యాణి భుఙ్క్ష్వ జగదమ్బ మయార్పితాని ||31 ||
క్షీరమేతదిదంముత్తమోత్తమం ప్రాజ్యమాజ్యమిదముజ్జ్వలం మధు |
మాతరేతదమృతోపమం పయః సంభ్రమేణ పరిపీయతాం ముహుః ||32 ||
ఉష్ణోదకైః పాణియుగం ముఖం చ ప్రక్షాల్య మాతః కలధౌతపాత్రే |
కర్పూరమిశ్రేణ సకుఙ్కుమేన హస్తౌ సముద్వర్తయ చన్దనేన ||33 ||
అతిశీతముశీరవాసితం తపనీయే కలశే నివేశితమ్ |
పటపూతమిదం జితామృతం శుచి గంగాజలమమ్బ పీయతామ్ ||34 ||
జమ్బవామ్రరమ్భాఫలసంయుతాని ద్రాక్షాఫలక్షౌద్రసమన్వితాని |
సనారికేలాని సదాడిమాని ఫలాని తే దేవి సమర్పయామి ||35 ||
కూశ్మాణ్డకోశాతకిసంయుతాని జమ్బీరనారఙ్గసమన్వితాని |
సబీజపూరాణి సబాదరాణి ఫలాని తే దేవి సమర్పయామి ||36 ||
కర్పూరేణ యుతైర్లవఙ్గసహితైస్తక్కోలచూర్ణాన్వితైః
సుస్వాదుక్రముకైః సగౌరఖదిరైః సుస్నిగ్ధజాతీఫలైః |
మాతః కైతకపత్రపాణ్డురుచిభిస్తాంబూలవల్లీదలైః
సానన్దం ముఖమణ్డనార్థమతులం తాంబూలమంగీకురు ||37 ||
ఏలాలవఙ్గాదిసమన్వితాని తక్కోలకర్పూరవిమిశ్రితాని |
తామ్బూలవల్లీదలసంయుతాని పూగాని తే దేవి సమర్పయామి ||38 ||
తామ్బూలనిర్జితసుతప్తసువర్ణవర్ణం స్వర్ణాక్తపూగఫలమౌక్తికచూర్ణయుక్తమ్ |
సౌవర్ణపాత్రనిహితం ఖదిరేన సార్ధం తామ్బూలమమ్బ వదనామ్బురుహే గృహాణ ||39 ||
మహతి కనకపాత్రే స్థాపయిత్వా విశాలాన్ డమరుసదృశరూపాన్బద్ధగోధూమదీపాన్ |
బహుఘృతమథ తేషు న్యస్య దీపాన్ప్రకృష్టాన్భువనజనని కుర్వే నిత్యమారార్తికం తే ||40 ||
సవినయమథ దత్వా జానుయుగ్మం ధరణ్యాం సపది శిరసి ధృత్వా పాత్రమారార్తికస్య |
ముఖకమలసమీపే తేంబ సార్థం త్రివారం భ్రమయతి మయి భూయాత్తే కృపార్ద్రః కటాక్షః ||41 ||
అథ బహుమణిమిశ్రైర్మౌక్తికైస్త్వాం వికీర్య త్రిభువనకమనీయైః పూజయిత్వా చ వస్త్రైః |
మిలితవివిధముక్తాం దివ్యమాణిక్యయుక్తాం జనని కనకవృష్టిం దక్షిణాం తేఽర్పయామి ||42 ||
మాతః కాఞ్చనదణ్డమణ్డితమిదం పూర్ణేన్దుబిమ్బప్రభం
నానారత్నవిశోభిహేమకలశం లోకత్రయాహ్లాదకమ్ |
భాస్వన్మౌక్తికజాలికాపరివృతం ప్రీత్యాత్మహస్తే ధృతం
ఛత్రం తే పరికల్పయామి శిరసి త్వష్ట్రా స్వయం నిర్మితమ్ ||43 ||
శరదిన్దుమరీచిగౌరబర్ణై- ర్మణిముక్తావిలసత్సువర్ణదణ్డైః |
జగదమ్బ విచిత్రచామరైస్త్వా- మహమానన్దభరేణ బీజయామి ||44 ||
మార్తాండమండలనిభో జగదమ్బ యోయం భక్త్యా మయా మణిమయో ముకురోర్పితస్తే |
పూర్ణేన్దుబిమ్బరుచిరం వదనం స్వకీయమస్మిన్విలోకయ విలోలవిలోచనే త్వమ్ ||45 ||
ఇన్ద్రాదయో నతినతైర్మకుటప్రదీపైర్నీరాజయన్తి సతతం తవ పాదపీఠమ్ |
తస్మాదహం తవ సమస్తశరీరమేతన్నీరాజయామి జగదమ్బ సహస్రదీపైః ||46 ||
ప్రియగతిరతితుఙ్గో రత్నపల్యాణయుక్తః కనకమయవిభూషః స్నిగ్ధగమ్భీరఘోషః |
భగవతి కలితోయం వాహనార్థం మయా తే తురగశతసమేతో వాయువేగస్తురంగః ||47 ||
మధుకరవృతకుమ్భన్యస్తసిన్దూరరేణుః కనకకలితఘణ్టాకిఙ్కణీశోభికణ్ఠః |
శ్రవణయుగలచంచచ్చామరో మేఘతుల్యో జనని తవ ముదే స్యాన్మత్తమాతంగ ఏషః ||48 ||
ద్రుతతరతురగైర్విరాజమానం మణిమయచక్రచతుష్టయేన యుక్తమ్ |
కనకమయమముం వితానవన్తం భగవతి తే హి రథం సమర్పయామి ||49 ||
హయగజరథపత్తిశోభమానం దిశి దిశి దున్దుభిమేఘనాదయుక్తమ్ |
అతిబహు చతురఙ్గసైన్యమేత- ద్భగవతి భక్తిభరేణ తేర్పయామి ||50 ||
పరిఘీకృతసప్తసాగరం బహుసంపత్సహితం మయామ్బ తే విపులమ్ |
ప్రబలం ధరణీతలాభిధం దృఢదుర్గం నిఖిలం సమర్పయామి ||51 ||
శతపత్రయుతైః స్వభావశీతైః అతిసౌరభ్యయుతైః పరాగపీతైః |
భ్రమరీముఖరీకృతైరనన్తైః వ్యజనైస్త్వాం జగదమ్బ వీజయామి ||52 ||
భ్రమరలులితలోలకున్తలాలీ- విగలితమాల్యవికీర్ణరఙ్గభూమిః |
ఇయమతిరుచిరా నటీ నటన్తీ తవ హృదయే ముదమాతనోతు మాతః ||53 ||
ముఖనయనవిలాసలోలవేణీ- విలసితనిర్జితలోలభృఙ్గమాలాః |
యువజనసుఖకారిచారులీలా భగవతి తే పురతో నటన్తి బాలాః ||54 ||
భ్రమదలికులతుల్యాలోలధమ్మిల్లభారాః స్మితముఖకమలోద్యద్దివ్యలావణ్యపూరాః |
అనుపమితసువేషా వారయోషా నటన్తి పరభృతకలకణ్ఠ్యో దేవి దైన్యం ధునోతు ||55 ||
డమరుడిణ్డిమజర్ఝరఝల్లరీ- మృదురవద్రగడద్ద్రగడాదయః |
ఝటితి ఝాఙ్కృతఝాఙ్కృతఝాఙ్కృతైః బహుదయం హృదయం సుఖయన్తు తే ||56 ||
విపఞ్చీషు సప్తస్వరాన్వాదయన్త్య- స్తవ ద్వారి గాయన్తి గన్ధర్వకన్యాః |
క్షణం సావధానేన చిత్తేన మాతః సమాకర్ణయ త్వం మయా ప్రార్థితాసి ||57 ||
అభినయకమనీయైర్నర్తనైర్నర్తకీనాం క్షనమపి రమయిత్వా చేత ఏతత్త్వదీయమ్ |
స్వయమహమతిచితైర్నృత్తవాదిత్రగీతైః భగవతి భవదీయం మానసం రఞ్జయామి ||58 ||
తవ దేవి గుణానువర్ణనే చతురా నో చతురాననాదయః |
తదిహైకముఖేషు జన్తుషు స్తవనం కస్తవ కర్తుమీశ్వరః ||59 ||
పదే పదే యత్పరిపూజకేభ్యః సద్యోఽశ్వమేధాదిఫలం దదాతి |
తత్సర్వపాపక్షయ హేతుభూతం ప్రదక్షిణం తే పరితః కరోమి ||60 ||
రక్తోత్పలారక్తలతాప్రభాభ్యాం ధ్వజోర్ధ్వరేఖాకులిశాఙ్కితాభ్యామ్ |
అశేషబృన్దారకవన్దితాభ్యాం నమో భవానీపదపఙ్కజాభ్యామ్ ||61 ||
చరణనలినయుగ్మం పఙ్కజైః పూజయిత్వా కనకకమలమాలాం కన్ఠదేశేర్పయిత్వా |
శిరసి వినిహితోఽయం రత్నపుష్పాఞ్జలిస్తే హృదయకమలమధ్యే దేవి హర్షం తనోతు ||62 ||
అథ మణిమయఞ్చకాభిరామే కనకమయవితానరాజమానే |
ప్రసరదగరుధూపధూపితేఽస్మి- న్భగవతి భవనేఽస్తు తే నివాసః ||63 ||
ఏతస్మిన్మణిఖచితే సువర్ణపీఠే త్రైలోక్యాభయవరదౌ నిధాయ హస్తౌ |
విస్తీర్ణే మృదులతరోత్తరచ్ఛదేఽస్మి- న్పర్యఙ్కే కనకమయే నిషీద మాతః ||64 ||
తవ దేవి సరోజచిహ్నయోః పదయోర్నిర్జితపద్మరాగయోః |
అతిరక్తతరైరలక్తకైః పునరుక్తాం రచయామి రక్తతామ్ ||65 ||
అథ మాతరుశీరవాసితం నిజతామ్బూలరసేన రంజితమ్ |
తపనీయమయే హి పట్టకే ముఖగణ్డూచజలం విధీయతామ్ ||66 ||
క్షణమథ జగదమ్బ మఞ్చకేస్మి- న్మృదుతలతూలికయా విరాజమానే |
అతిరహసి ముదా శివేన సార్ధం సుఖశయనం కురు తత్ర మాం స్మరన్తీ ||67 ||
ముక్తాకున్దేన్దుగౌరాం మణిమయకుటాం రత్నతాటంకయుక్తా-
మక్షస్రక్పుష్పహస్తామభయవరకరాం చన్ద్రచూడాం త్రినేత్రామ్ |
నానాలంకారయుక్తాం సురమకుటమణిద్యోతితస్వర్ణపీఠాం
సానన్దాం సుప్రసన్నాం త్రిభువనజననీం చేతసా చిన్తయామి ||68 ||
ఏషా భక్త్యా తవ విరచితా యా మయా దేవి పూజా
స్వీకృత్యైనాం సపది సకలాన్మేపరాధాన్క్షమస్వ |
న్యూనం యత్తత్తవ కరుణయా పూర్ణతామేతు సద్యః
సానన్దం మే హృదయకమలే తేఽస్తు నిత్యం నివాసః ||69 ||
పూజామిమాం యః పఠతి ప్రభాతే మధ్యాహ్నకాలే యది వా ప్రదోషే |
ధర్మార్థకామాన్పురుషోభ్యుపైతి దేహావసానే శివభావమేతి ||70 ||
పూజామిమాం పఠేన్నిత్యం పూజాం కర్తుమనీశ్వరః |
పూజాఫలమవాప్నోతి వాఞ్ఛితార్థం చ విన్దతి ||71 ||
ప్రత్యహం భక్తిసంయుక్తో యః పూజనమిదం పఠేత్ |
వాగ్వాదిన్యాః ప్రసాదేన వత్సరాత్స కవిర్భవేత్ ||72 ||
ఇతి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యస్య శ్రీగోవింద భగవత్పూజ్యపాద శిష్యస్య
శ్రీమత్ శంకర భగవతః కృతౌ దేవీ చతుఃషష్ట్యుపచార పూజాస్తోత్రం సంపూర్ణమ్ ||
పైన చెప్పిన చతుఃషష్ట్యుపచార పూజా స్తోత్రంలో చెప్పబడిన 64 ఉపచారాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. మేలుకొలుపు
ఉషోదయమైనదమ్మా, జగత్తులన్నీ నీ కృపాకటాక్షము కొరకు నిరీక్షిస్తున్నవి. సుఖముగా మేలుకొని మమ్ము ఏలుకోవమ్మా.
2. మణిమయ మంటపానికి తోడ్కొనిపోవడం
మణిమయ మంటపములో, బంగారువేదికపై, అన్ని దిశలలో సువర్ణ పూర్ణ కుంభములు ఉంచి, నిన్ను అర్చించుకుంటానమ్మా. నాపై కృపతో ఈ అర్చన గ్రహించు తల్లీ.
3. బంగారుకలశముతో జలసమర్పణ
బంగారుకలశములో శుద్ధోదకమును నింపి నీ కొరకై సమర్పిస్తున్నానమ్మా.
4. మెత్తని తూలికలతో ఏర్పరచిన నవరత్న విభూషితమైన శిబిక అంటే పల్లకి
నవరత్నములతో అలంకరింపబడి, తూలికల (ఈకలు) పరుపును పరచిన పల్లకిని నీ సేవకై అర్పిస్తున్నాను తల్లీ.
5. రత్నసింహాసనం
బంగారు వేదిక, ఆపై తూలికలతో మెత్త, బాలభానుడి కిరణాల వలె రంగురంగులలో వుండే కుసుమములు, ఇవన్నీ పరచిన రత్నసింహాసనం సిద్ధం చేసాను. నీ పాదాలు దానిమీద ఉంచి కూర్చో తల్లీ.
6. అర్ఘ్యం
మణులు, ముత్యములతో నిర్మితమైన నాలుగు బంగారు స్తంభములతో ఉన్న ఈ మంటపములో సువర్ణ పాత్రలో శుద్ధోదకమును అర్ఘ్యము కొరకై సమర్పిస్తున్నానమ్మా.
7. పాద్యం
అన్నిరకముల సుగంధ పత్రములు, పుష్పములు, గంధము, తిలకుశలు, అక్షతలు, రత్నములు కలిపిన నీటిని బంగారు పాత్రలలో తెచ్చి ఆ జలములతో నీ పాదములు కడుగుతున్నానమ్మా.
8. ఆచమనీయం
జాజికాయ, లవంగము, ఏలకులు, తేనె వంటి సుగంధ ద్రవ్యములు కలిపిన ఈ చల్లని నీటిని ఆచమనీయం కొరకు సమర్పిస్తున్నానమ్మా.
9. మధుపర్కం
రత్నములు పొదిగిన వస్త్రమును బంగారు మందసములో పెట్టి నీకు అర్పిస్తున్నానమ్మా.
10. సుగంధ తైల లేపనం
సంపెంగలు వంటి వివిధ సుగంధ పుష్పముల నుంచి సేకరించిన పరిమళ తైలమును రత్నములు పొదిగిన బంగారు పాత్రలో వాసెన కట్టి ఉంచినానమ్మా. అందమైన దేవతాస్త్రీలు తమ హస్తములతో తుమ్మెదల వంటి నీ కురులకు తైలమును అద్దుటకు సిద్ధంగా ఉన్నారమ్మా.
11. ఉద్వర్తనం
నీ సర్వాంగములకు ఈ సుగంధ తైలమును లేపనం చేస్తున్నారమ్మా. కుంకుమ పువ్వు కేసరపత్రములు, స్వర్ణరజత ధూళిని కలిపి ఉసిరి, కస్తూరి వంటి సుగంధ ద్రవ్యములతో నలుగు పెడుతున్నారు తల్లీ.
12. స్నానం
నవరత్న ఖచిత కుంభములతో నీ స్నానము కొరకై ఉష్ణోదకమును అర్పిస్తున్నానమ్మా. పాలు, పెరుగు, నెయ్యి, చక్కర, తేనె వంటి పంచామృతములతో నిన్ను అభిషేకిస్తున్నానమ్మా. తిరిగి ఉష్ణోదకముతో నీకు స్నానము చేయిస్తున్నానమ్మా. ఏలకులు, పరిమళపుష్పములు, మాణిక్యములు, ముత్యములు బంగారు కలశములతో వైదిక మంత్రములతో మంత్రించిన గంగాది దివ్యనదుల జలములను మంత్రపఠనంతో అభిషేకిస్తున్నానమ్మా. స్నేహముతో అనుమతించవమ్మా.
13. వస్త్రం
బాలభానుడివలె ఎర్రని రంగుతో మెరుస్తున్న ఉత్తమమైన చీరను, ముత్యములు కుట్టిన బంగారు వర్ణపు రవికను నీ కొరకై సమర్పిస్తున్నానమ్మా. కృపతో స్వీకరించమ్మా.
14. పాదుకలు
నవరత్నములు పొదిగిన పాదుకలు నీ పాదములకు ఇష్టముగా తొడుగుతున్నానమ్మా.
15. స్నానానంతరం ధూపం
చక్కని సుగంధ ధూపమును ఎంతో ఆదరముతో నీ కేశములకు వేస్తున్నానమ్మా.
బంగారు కాటుక పాత్రలో ఉంచిన సౌవీరమనే అంజనాన్ని నీ కనులకు అద్దుతున్నానమ్మా.
17. ఆభూషణం
పాదములకు మంజీరములు, నడుముకు ముత్యాలహారములు, కంఠమునకు నక్షత్రమాలలు, భుజములకు కేయూరములు, చేతులకు రత్నకంకణములు, చెవులకు తాటంకములు, శిరసునకు చూడామణి అలంకరిస్తున్నానమ్మా.
18. అలంకరణ
కొప్పున బంగారు కుసుమములు, నుదుటన ముత్యములు అద్దిన తిలకము, నాసికకు ముత్యపు ముక్కెర, వక్షస్థలముపై ముత్యముల పేరులు, వేళ్ళకు ఉంగరములు, నడుముకు కిందుగా చక్కగా సవ్వడి చేయు రత్న స్వర్ణ కింకిణులు అలంకరిస్తున్నానమ్మా.
19. సర్వాంగములకు సుగంధ లేపనం
కాశ్మీరము నుంచి తెచ్చిన కస్తూరిని ఫాలమునకు, కర్పూర అగరు మిశ్రమాన్ని దేహమునకు అంగరాగముగాను, సుగంధ ద్రవ్యములను చేర్చిన చందనము మరియు చిక్కని పుష్ప స్రావములను వక్షస్థలమందును, పాదములకు చందనముతో నిన్ను లేపనం చేస్తున్నానమ్మా.
20. అక్షతలు
రత్నఅక్షతలు, ముత్యపు గుత్తులు, కాశ్మీరకుంకుమాక్షతలతో నిన్ను పూజిస్తున్నానమ్మా.
21. సుగంధద్రవ్యములు
సంపెంగనూనె, కస్తూరి, పునుగు, గోరోజనం వంటి మృగమదముల వలన ఏర్పడిన సుగంధ ద్రవ్యములను చందన సహితంగా ఇప్పుడే నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించమ్మా.
22. సిందూరము
పాపిటలో సూర్యకాంతిని పోలిన ఎర్రని రక్తవర్ణ సిందూరమును అద్దుతున్నానమ్మా.
23. పుష్పార్చన
మందారాలు, ఎర్ర కలువలు, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, పొన్న, పొగడ, లవంగలతా పుష్పములు సేకరించి నిన్ను అర్చిస్తున్నాను తల్లీ.
24. మాలలు సమర్పించటం
జాజి, మల్లిక, సంపెంగ, మొగలి, మాలతీవంటి వివిధములైన పరిమళ పుష్పములతో, నీకు మాలలు సమర్పించి పుష్పార్చన చేస్తున్నాను తల్లీ.
25. పుష్ప పూజ
పారిజాతములు, తామరలు, పాటలీ పుష్పములు వంటి పుష్పములు సేకరించి పూజ చేస్తున్నానమ్మా.
26. ధూపం
గుగ్గిలము, కర్పూరము, సాంబ్రాణి, లత్తుక, చందనము, వంటి నానావిధ సుగంధ ద్రవ్యములతో నీకు ధూపం వేస్తున్నాను తల్లీ. ఇష్టంగా స్వీకరించమ్మా.
27. దీపం
అంధకారమును పోగొట్టి, కోటి సూర్యుల కాంతిని నింపేందుకు, రత్నాలంకృతమైన బంగారు దివ్వెలతో మహాదరముతో నీకు దీపం చూపిస్తున్నాను తల్లీ.
28. పంచామృతం
పాలు, పెరుగు, నెయ్యి, శర్కర, మీగడ, తేనె వంటి మధుర పదార్ధములను అర్పిస్తున్నానమ్మా.
29. శాక పాకముల నైవేద్యం
సుగంధభరితమైన అన్నము, పులుసులు, అపూపములు, వడియములు, అరటిపళ్ళు, మరియు ఏలకులు, జీలకర్ర, ఇంగువ, కొత్తిమీర వంటి వస్తువులతో చేసిన శాకములు, పాయసము మొదలైన అమృతము వంటి తియ్యని పదార్ధములను నీకు అర్పిస్తున్నానమ్మా.
30. భక్ష్య భోజ్య సమర్పణ
మంచి రుచికరమైన పరమాన్నము, భక్ష్యములు, భోజ్యములు, అప్పములు సమర్పిస్తున్నానమ్మా. తేనె, నెయ్యి కలిపిన అమృతోపమానమైన చిక్కని పాలను ఇస్తున్నానమ్మా. సంభ్రమముగా తాగు తల్లీ.
31. అర్ఘ్యం
కర్పూరము, చందనము, కుంకుమపువ్వు కలిపిన వెచ్చని నీటిని చేతులు, నోరు కడుగుకొనటానికి ఈ ధౌత పాత్రలో అందిస్తున్నానమ్మా.
32. ఆచమనీయం
అతి చల్లని శుభ్రమైన గంగాజలమును త్రాగుటకై వాసెన కట్టిన కలశములో ఉంచానమ్మా.
33. మధుర ఫల సమర్పణ
బత్తాయిలు, మామిడి, అరటి, ద్రాక్ష, కొబ్బరి, దానిమ్మ వంటి మధుర ఫలములు సమర్పిస్తున్నానమ్మా.
34. ఫల సమర్పణ
గుమ్మడి, కోశాతకి, నారింజ, నిమ్మ, రేగు వంటి బీజములతో కూడిన ఫలములు సమర్పిస్తున్నానమ్మా.
35. తాంబూలము
పచ్చ కర్పూరము, లవంగము, కాల్చినముత్యపు చూర్ణము, పోకలు, కుంకుమపూవు, కాచు, జాజీఫలము, జాపత్రి, ఏలకులు, తక్కోలము తెల్లని తమలపాకులతో సహా నీకు ముఖరుచి కోసం సమర్పిస్తున్నానమ్మా. నీవు నమిలిన తాంబూల శేషమును ప్రసాదముగా అనుగ్రహించుటకై ఈ స్వర్ణపాత్రను ఉంచుతున్నానమ్మా.
36. హారతి
విశాలమైన బంగారు పాత్రలలో నేయి దీపాలను వెలిగించి, ఢమరు ఘోషల మధ్య ప్రకృష్టముగా నీకు హారతులు ఇస్తున్నానమ్మా. వినయముగా నీ జాను యుగ్మముల నుంచి శిరసు వరకు హారతిని చూపిస్తున్నానమ్మా. నీ కృపా కటాక్షము చూచుటకై ముఖము వద్ద మూడు సార్లు హారతిని తిప్పుతున్నానమ్మా.
37. దక్షిణ
మణులు, ముత్యములు, మాణిక్యములు, వస్త్రములు దక్షిణగా సమర్పిస్తూ, నీకు కనకాభిషేకం చేస్తున్నాను తల్లీ.
38. ఛత్రం
పూర్ణ చంద్ర బింబము వలె గుండ్రముగా, ముత్యములుచుట్టబడిన ఛత్రమును దాని బంగారుకడ్డీని గట్టిగ పట్టుకుని, నీ శిరసుపై వుంచుతున్నానమ్మా.
39. చామరం
ముత్యములు అల్లిన బంగారు దండమునకు చుట్టబడిన తెల్లని విచిత్ర చామరమును నీ ఆనందము కొరకై వీస్తున్నాను తల్లీ.
40. దర్పణం
సూర్యుని వలె ప్రకాశించుతున్న నీ వదనమును చూచుకొనుటకై మణిమయ దర్పణమును నీ ముందు ఉంచుతున్నానమ్మా.
41. నీరాజనం
ఇంద్రాదులు సహితం తలవంచి మొక్కిన నీ మకుటము నుంచి నీ పాదపీఠము వరకూ, నీ సమస్త శరీరమునకూ సహస్ర దీపములతో ప్రదీపముగా నీరాజనం ఇస్తున్నాను తల్లీ.
42. అశ్వసేవ
వాయువేగముతో పరుగెత్తే, చక్కని ఘోష చేస్తున్న వంద సాలంకృత గుఱ్ఱములపై పల్యాణమును (జీను) అమర్చి నీ సేవకై సమర్పిస్తున్నాను తల్లీ.
43. గజసేవ
శ్రవణపేయముగా ఘీంకారము చేస్తూ, బంగరు ఘంటలు చక్కని రవళి చేస్తూ ఉంటే, ఎత్తైన కుంభస్థలము కలిగి, నల్లని మేఘము వలె ఉన్న మదపుటేనుగులను నీ సేవకై ఇస్తున్నాను తల్లీ.
44. రథ సమర్పణ
ఓ భగవతీ, కనక మణిమయమైన నాలుగు చక్రముల రథమును వేగముగా పరుగెత్తే గుఱ్ఱములను పూన్చి నీకు రథమును సమర్పిస్తున్నానమ్మా.
45. చతురంగ సైన్యము
గుఱ్ఱములు, గజములు, రథములు, కాల్బలము, దిశదిశలా మేఘనాదము చేస్తూ, ఉత్సాహముగా ఉన్న చతురంగ సైన్యమును భక్తితో నీకు సమర్పిస్తున్నానమ్మా.
46. దృఢమైన దుర్గము
సప్తసాగర మధ్యంలో ఉన్న ఈ భూతలముపై ఎంతో సుసంపన్నమై, విశాలమై, పటిష్టమైనదై, దృఢమైన కోటను సమస్తం నీకు అర్పిస్తున్నానమ్మా.
47. వింజామర సేవ
వంద తాళ పత్రములతో అల్లిన, చల్లగా సువాసనతో కూడిన గాలి వీచే స్వభావము కల వింజామరను నీ ఆనందము కొరకై వీస్తున్నానమ్మా.
48. నాట్యసేవ
నిన్ను ఆహ్లాదపరచుటకై రంగభూమిపై అలవోకగా నృత్యము చేసెడి నాట్యకత్తెలు సిద్ధముగా ఉన్నారమ్మా.
49. కేశాలంకరణ సేవ
నిన్ను సింగారించుటకై, నీకు ఇష్టమైన కేశాలంకరణ చేయుటకై, అందముగా జడలు, కొప్పులు వేసే చక్కని వేశ్య కాంతలు ఇక్కడే ఉన్నారమ్మా.
50. వాద్యసేవ
అమ్మా, నీకు వీనుల విందుగా ఢమరు, డిండిమము, చల్లగా మృదు రవళి చేస్తూ, ఘల్లుఘల్లున ఝంకారము వినిపిస్తూ హృదయానికి సుఖకరంగా వాద్యగాళ్ళు వాద్యములు వాయిస్తున్నారమ్మా.
51. గానసేవ
గంధర్వ కన్యలు వీణలు మీటుతూ సప్తస్వరాలు పాడుతూ, నీ ద్వారము వద్ద నీకొఱకై గానం చేస్తున్నారు, సావధానంగా విని ఆనందించమని ప్రార్ధిస్తున్నానమ్మా.
52. నృత్య సేవ
కమనీయమైన అభినయంతో రమణీయంగా నర్తకీమణులు నిన్ను రంజింపచేయటానికి నృత్యం చేస్తున్నారమ్మా. స్వయముగా నేనే నట్టువాంగము, గానము చేస్తున్నాను తల్లీ.
53. కీర్తన
అమ్మా, నీ గుణ గానమును కీర్తించుటకై నీపై స్తవములు కూర్చి స్తుతిస్తున్నానమ్మా.
54. ప్రదక్షిణం
పదే పదే నీ పూజ చేస్తానమ్మా. వెంటనే అశ్వమేధయజ్ఞం చేసినంత ఫలమీయవమ్మా.
నేచేసిన పాపమంతా నశించిపోవాలని నీకు ప్రదక్షిణం చేస్తున్నానమ్మా.
55. నమస్కారం
ఎర్రని కలువ పూవులు, ఎర్రని లతల వలె ధ్వజమంత ఉన్నతంగా ఉన్న ఓ విద్యాదేవీ, శ్రేష్ఠులచేత కొలువబడే తల్లీ, నీకు నా నమస్కారము.
56. రత్నపుష్పాంజలి
నీ పాదకమలాలను పంకజములతో పూజిస్తాను, కంఠానికి బంగారు కమలమాలను వేస్తాను, తల వంచి నీకు రత్న పుష్పాంజలిని సమర్పిస్తాను. హృదయ కమలంలో ఆనందంగా ఉన్నదమ్మా.
57. ధూపం
కనకమణిమయమైన మనోజ్ఞమైన పాత్రలో నీకు అగరు ధూపము వేస్తున్నాను తల్లీ.
58. మణిపీఠం
మణిమయ పీఠముపై కూర్చుని మూడు లోకాలకు వరములు, అభయము ప్రసాదించమ్మా.
59. పర్యంకము
బంగారు మంచముపై, మెత్తని పరుపుపై నిన్ను కూర్చుండ బెడుతున్నాను తల్లీ.
60. పారాణి
పాదాలకు ఉన్న పారాణి కాస్త చెరిగిపోయిందమ్మా, మళ్ళీ లత్తుక పూసి రాగరంజితం చేస్తున్నాను తల్లీ.
61. తాంబూలానంతరం ముఖ గండూషజల సమర్పణ
తాంబూలం వేసుకున్నావు కదమ్మా, నోరంతా ఎర్రగా ఉన్నది. నోరు కడుగుకోవటానికి జలం నింపి గండూషపాత్రను ఇక్కడ ఉంచుతున్నానమ్మా.
62. తూలికా తల్పంపై సుఖ శయనం
ఓ జగదంబా, శివునిలో అర్ధభాగము నీవు. ఈ మెత్తని తూలికాతల్పముపై క్షణకాలమైనా సుఖముగా శయనించు తల్లీ.
63. సంపూర్ణ దర్శనం
అమ్మా, త్రిభువనజననీ, మాణిక్యములు, ముత్యములు, మణి మకుటము, రత్న తాటంకములు, జపమాల, పుష్పములతో, వరదాభయ హస్తములతో, శిరసుపై చంద్రకళతో, మూడు కన్నులతో, సర్వాలంకారములతో, మణుల కాంతితో ప్రకాశిస్తున్న స్వర్ణపీఠముపై ఆనందముగా, ప్రసన్నముగా ఉన్న నిన్ను నా చిత్తములో దర్శిస్తున్నానమ్మా.
64. క్షమాప్రార్ధన
భక్తి తో నేను రచించిన ఈ పూజా స్తోత్రాన్ని స్వీకరించి నా అపరాధాలను మన్నించు తల్లీ.
నాపై కరుణతో తక్షణమే నా హృదయకమలములో ఆనందముగా నిత్యం నివసించు తల్లీ.
ఫలశృతి
ఈ పూజను త్రికాలములలోనూ పఠించిన వారు ధర్మ అర్ధ కామములు సిద్ధించి దేహావసాన సమయమున శివభావన పొందుతారు. ఈ స్తోత్రము పఠనము చేస్తూ మానసిక పూజ చేసిన వారికి,
పూజాఫలము లభించి కోరిన కోరికలు తీరగలవు. ఒక సంవత్సరం పాటు, ప్రతిరోజూ ఈ స్తోత్రముతో పూజ చేసిన వారు వాగ్వాదినీ ప్రసాదం లభించి కవి అవుతారు.
శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ గోవింద భగవత్పాద శిష్యుడైన, శ్రీశంకర భగవత్పాదుడు చెప్పిన శ్రీదేవీ చతుఃషష్ట్యుపచార పూజా స్తోత్రం సంపూర్ణం.
ఈ 64 సేవలూ అమ్మవారికి చేసే సేవలే. చదవండి. తెలుసుకోండి. ఆనందించండి.
అమ్మవారిని యధాశక్తి సేవించుకోండి. ఆ శ్రీమాత అనుగ్రహం పొందండి.
శ్రీరస్తు
శుభమస్తు
సౌభాగ్యమస్తు
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650