శ్రీదేవీ చతుఃషష్ట్యుపచార పూజా విధానం
ఒకసారి శంకరాచార్యునికి, ఆ అరవై నాలుగు మంది యోగినులూ చతుష్షష్టి ఉపచారాలతో పూజ చేస్తున్నట్టు, ఆ పూజని స్వీకరిస్తున్నట్టు, అమ్మవారు దర్శనం ఇచ్చారు. అప్పుడు ఆ అనుభూతికి అపరిమితానందం పొందిన శంకరాచార్యుడు, "శ్రీదేవీ చతుఃషష్ట్యుపచార పూజా స్తోత్రం" ఆశువుగా చెప్పాడు. ఆ స్తోత్రంలో ఆ అరవైనాలుగు ఉపచారాల గురించీ వివరంగా తెలుస్తుంది. తాను చూసినది చూసినట్టుగా స్తుతించాడు శంకరాచార్యుడు.
శ్రీలలితా రహస్య సహస్ర నామాల్లో 235వ నామం చతుఃషష్ట్యుపచారాఢ్యా. అరవై నాలుగు రకములైన ఉపచారములతో సేవలందుకుంటున్న తల్లి అని ఈ నామానికి అర్ధం. ఇక్కడ అమ్మపై చెప్పబడిన ఆ చతుఃషష్ట్యుపచార పూజా స్తోత్రం, ఆ పూజావిధానం గురించి చెప్పుకుందాం. ఆ 64 ఉపచారాలు ఏమిటో ఒకసారి చూద్దాం. కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ చెప్పుకుంటున్న ఈ 64 ఉపచారాలు విస్తృతంగా చాలా గ్రంధాల్లో కనపడుతున్నాయి.
చతుఃషష్ట్యుపచారాలు
1. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము
చేతులు కడగటానికి అర్ఘ్యము, పాదాలు కడగటానికి పాద్యము, నోరు కడగటానికి ఆచమనీయము కొరకు అమ్మవారికి నీటిని వివిధపాత్రలతో సమర్పించటం.
2. ఆభరణ అవరోపణము
ముందరి దినము అలంకారణార్ధము అలంకరించిన ఆభరణములు తీసివేయటం.
3. సుగంధ తైలాభ్యంజనము
సువాసనలు వెదచల్లు తైలమును శరీరమునకు అద్దటం
4. మజ్జనశాలా ప్రవేశము
స్నానశాలకు తోడ్కొని పోవటం
5. మణిపీఠోపవేశనము
మణులు పొదిగిన పీట మీద కూర్చుండబెట్టటం
6. దివ్యస్నానీయ ఉద్వర్తనము
స్నానమునకు ముందు దివ్యమైన సుగంధద్రవ్యములతో నలుగు పెట్టటం
7. ఉష్ణోదక స్నానము
గోరువెచ్చని నీటితో స్నానము చేయించటం
8. కనక కలశచ్యుత సకల తీర్థాభిషేచనము
బంగరు కలశములతో తెచ్చిన నానావిధ తీర్థములతో జలకములాడించటం
9. ధౌతవస్త్ర పరిమార్జనము
శుభ్రముగా ఉతికిన తెల్లని వస్త్రముతో శరీరము తడి ఆరే లాగా తుడవటం
10. అరుణ దుకూల పరిధానము
ఎర్రని రంగులో ఉన్న మెత్తని, తేలికైన వస్త్రమును కట్టటం
11. అరుణకుచోత్తరీయము
వక్షస్థలముపై ఎర్రని ఉత్తరీయమును కప్పటం
12. ఆలేపన మంటప ప్రవేశనము
గంధములు మొదలగునవి రాచుటకు లేపన మంటపము లోనికి తోడ్కొనిపోవటం
13. చందన అగరు కుంకుమ సంకు మృగమద కర్పూర కస్తూరీ గోరోజనాది దివ్య గంధ సర్వాంగీణ ఆలేపనము
చందనము, అగరు, కుంకుమపువ్వు, మృగ మదమైన జవ్వాది, కస్తూరి, గోరోజనము, దివ్య గంధము సర్వాంగములకు పూయటం
14. కేశములు, కళలకు అగరు ధూపము
జుత్తుకు, శిరసుపై నున్న చంద్రకళకు అగరు ధూపము వేయటం
15. వేణీబంధనము, మల్లికా మాలతీ చంపక అశోక మంజరీ పున్నాగ కల్హార
ముఖ్య సర్వ ఋతు కుసుమమాల సంప్రయము
ధూపము వేసిన తరువాత జడ అల్లి ఆ పై, మల్లికలు, మాలతులు, సంపెంగలు, అశోకములు, పున్నాగలు, మరువకము,ఎర్ర కలువలు మొదలైన ఏ ఋతువులో దొరికే పుష్పములు ఆ ఋతువులో సేకరించి మాలలు కూర్చి అలంకరించటం
16. భూషణ మంటప ప్రవేశము
ఆభూషణముల ఉన్న అలంకరణ మంటపమునకు తోడ్కొనిపోవటం
17. మణిపీఠోపవేశనము
ఆభరణ మంటపములో మణిపీఠము పైన కూర్చుండబెట్టటం
18. నవమణిమకుటధారణము
కొంగ్రొత్త మణి మకుటాన్ని అలంకరించటం
19. చంద్రకళా ఆరోపణము
శిరసుపై చంద్ర కళను ఉంచటం
20. సీమంత సింధూర ధారణము
పాపటలో సిందూరం పూయటం
21. తిలక ధారణము
నుదుటన తిలకము దిద్దటం
22. కాలాంజన లేపనము
నల్లని కాటుకను కన్నులకు అద్దటం
23. పాళీయుగము
చెంపసరములను అలంకరించటం
24. మణికుండలయుగళము
మణులు పొదిగిన కుండలములు ధరింపచేయటం
25. నాసాభరణము
నాసికకు ముక్కెరను ఉంచటం
26. అధరయావకలేపనము
పెదవులకు లత్తుకను పూయటం
27. ఆర్య భూషణము
మంచి ఉత్కృష్టమైన ప్రధాన ఆభూషణమును అలంకరించటం
28. మాంగల్యసూత్ర అలంకరణము
మంగళసూత్రమును ధరింపచేయటం
29.హేమచింతాకము
బంగారు చింతాకు పతకాన్ని అలంకరించటం
30. స్వర్ణపతక ధారణము
స్వర్ణ పతకము కల హారాన్ని ధరింపచేయటం
31. మహాపతకము
పెద్ద పతకమున్న హారాన్ని అలంకరించటం
32. ముక్తావళి
మూడు వరుసలున్న ముత్యాల సరమును అలంకరించటం
33. ఏకావళి
27 మంచి మేలిమిజాతి ముత్యాలున్న ఒక్క వరుస ముత్యాలహారాన్ని వేయటం
34. చన్నభీరము
భుజముపై నుంచి యజ్ఞోపవీతము వలె వేయు సూత్రమును అలంకరించటం
35. కేయూర యుగళ భూషణ చతుష్టయము
నాలుగు భుజములకు నాలుగు భుజకీర్తులను అలంకరించటం
36. వలయావళి
నాలుగు హస్తములకు కంకణములు తొడగటం
37. ఊర్మికావళి
అన్ని వేళ్ళకు ఉంగరములు తొడగటం
38. కాంచీదామము
నడుము చుట్టూ పుష్పమాల వలె వడ్డాణమును అలంకరించటం
39. కటిసూత్రము
నడుముకు చుట్టూ స్వర్ణ హారములు కట్టటం
40. సౌభాగ్యాభరణము
కంఠసీమకు హత్తుకుంటూ ఉండే అశోకపత్రపు పతకమున్న ఆభరణం పెట్టటం
41. పాదకటకములు
పాదములకు అందెలు అలంకరించటం
42. రత్ననూపురములు
రత్న మంజీరములు కాలికి తొడగటం
43. పాద అంగుళీయకములు
కాలివేళ్ళకు మెట్టెలు, పిళ్లేడులు పెట్టటం
44. పాశధారణము
చేతిలో పాశమును ధరింపచేయటం
45. అంకుశధారణము
మరియొక చేతికి అంకుశమును అలంకరించటం
46. పుండ్రేక్షుచాపము
ఇంకొక చేతిలో తెల్లటి విల్లును అమర్చటం
47. పుష్పబాణములు
మిగిలిన నాలుగవ చేతిలో పుష్పబాణములు పెట్టటం
48. శ్రీ మణి మాణిక్య పాదుకా సమర్పణము
శ్రీ చరణాలకు మణులు మాణిక్యములు పొదిగిన పాదుకలు తొడగటం
49. స్వ సామన వేషభి ఆవరణ దేవతాభి సహ మహాచక్రాధిరోహణము
తమకు తగిన అలంకారముతో వేంచేసిన ఆవరణదేవతలతో అమర్చబడిన మహా చక్రరాజముపై కూర్చుండబెట్టటం
50. కామేశ్వరాంక పర్యంక ఉపవేశము
పంచప్రేతాసనమైన పర్యంకముపై కామేశ్వరుని అంకపీఠముపై కూర్చుండబెట్టటం
51. అమృతచషక సమర్పణము
అమృతము నింపిన సుధాపాత్రను సమర్పించటం
52. ఆచమనీయ సమర్పణము
సుధాపానం తరువాత ముఖప్రక్షాళనము కొరకు శుద్ధ జలములను అందించటం
53. కర్పూరవీటిక సమర్పణము
పచ్చ కప్పురపు తాంబూలమును సమర్పించటం
54. ఆనందోల్లాస విలాసహాసము
తాంబూలమును సేవిస్తున్నపుడు ఆ ముఖములో ఆనందముతో, ఉల్లాసముతో కనిపించే శృంగారభరితమైన మందహాసాన్ని వీక్షించటం
55. మంగళార్తికము
వివిధ రకములైన దీపముల గుత్తులతో హారతులెత్తటం
56. ఛత్రము
ఎండ సెగ సోకకుండా గొడుగు పట్టటం
57. చామరము
గాలి కొరకు చామరీ మృగము కేశముల నుంచి కూర్చిన చామరముతో వీచటం
58. దర్పణము
ముఖావలోకనము కొరకు అద్దమును చూపించటం
59. తాళావృతము
తాటియాకులతో చేసిన వీవన విసరటం
60. చందన సమర్పణము
దివ్యశ్రీచందనాన్ని లేపనం చేయటం
61. పుష్పము
మంచి సుగంధాన్ని ప్రసరించే జాతి పుష్పాలతో అర్చించటం
62. ధూపము
సువాసన భరితమైన సాంబ్రాణి ధూపాన్ని వేయటం
63. దీపము
చక్కని వెలుగు ప్రసరించే దీపము చూపటం
64. నైవేద్య తాంబూల నీరాజన నమస్కారములు
నైవేద్యము, తాంబూలము సమర్పించి కర్పూర నీరాజనమిచ్చి నమస్కారములు చెయ్యటం
మొత్తం మీద అమ్మవారికి చేసే సేవలే అవి అన్నీనూ.
చదవండి. తెలుసుకోండి. ఆనందించండి.
అమ్మవారిని యధాశక్తి సేవించుకోండి.
ఆ శ్రీమాత అనుగ్రహం పొందండి.
శ్రీరస్తు
శుభమస్తు
సౌభాగ్యమస్తు
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650