31, జులై 2021, శనివారం

8. కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరా తాటంకయుగళీభూతతపనోడుపమండలా

కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరా
తాటంకయుగళీభూతతపనోడుపమండలా ॥ 8 ॥

21. కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరా

మంజరి అంటే పూల చెండు. అందునా ఆ పూలు కదంబపుష్పాలు. 

కదంబాలు సౌగంధికాలు, చుట్టూ పరాగాలతో బంతుల్లా చూడ చక్కగా ఉంటాయి. 

అమ్మవారు చక్కగా ఒక చిన్న కదంబ పూల చెండు చెవి నిండా మనోహరంగా 

అలంకరించుకుంది. ఆ సుగంధము అంతటా ఆవరించుకుంది. 

సాధారణంగా పూలచెండు తలలో తురుముకుంటాం. కానీ అమ్మవారు చెవికి పెట్టింది. 

ఆ సుగంధానికి పక్కనే ఉన్న కామేశ్వరుడు పరవశించాడు.  

కామేశ్వరి కూడా తాను సృష్టించిన ఆ సుగంధ ప్రవాహంలో 

తాను కూడా కామేశ్వరునితో కలసి ఆనందిస్తూ వున్నది. 

సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడితే కానీ మనుగడ లేని వాళ్ళు, 

చెవిలో పువ్వుని వెటకారంగా చేసి మాట్లాడుతారు. 

దేవుని పాదాల నుంచి వచ్చిన పుష్పాలను శిరసున కానీ, చెవిపై కానీ ధరించటం మన పద్ధతి. 

సహస్రారంలో  కొలువైన అమ్మను సూచిస్తూ  సిద్ధులు, యోగులు, 

సన్న్యాసులు పుష్పాలని శిరసుపై ధరిస్తారు. కంచి పరమాచార్యులు పూలమాలలు,  

తులసీమాలలు ఇస్తే, శిరసు మీదే పెట్టుకునేవారు. 

సామాన్యులు చెవిపై కానీ, ముచ్చిలిగుంటపై కానీ ధరిస్తారు. ఇది మన ఆచారం. 

ముచ్చిలిగుంట కన్నా చెవే  ముక్కుకు దగ్గరగా ఉంటుంది. 

వాసనలను సునాయాసంగా ముక్కుకు చేరవేస్తుంది. 

అమ్మవారు చెవి, ముక్కుకు గల సంబంధాన్ని మనకు ప్రబోధిస్తూ తనకెంతో ఇష్టమైన, 

ఒక చిన్న కదంబ మంజరిని  చెవిపై ధరించింది. 

చెవి చుట్టూ ఒక చిన్న కదంబ పుష్పమాలను ధరించి మనోహరంగా వెలిగిపోతున్న, 

ఆ కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహర కు వందనం. 

ఓం శ్రీ కదంబమంజరీ క్లుప్తకర్ణపూరమనోహరాయై నమః 


22. తాటంకయుగళీభూతతపనోడుపమండలా

అమ్మవారు అద్భుతమైన, మహా ప్రకాశవంతమైన తాటంక యుగళాలను ధరించి వుంది. 

తాటంకాలంటే చెవికమ్మలు. అవి మామూలుగా వెలిగిపోయే వజ్రాలవో మాణిక్యాలవో కావు.

అవి తపనోడుప మండలాలు. తపనుడు అంటే సూర్యుడు. ఉడుప అంటే చంద్రుడు. 

సూర్యచంద్రులు దివారాత్రాలను తమ వెలుగుతో నింపి మనకు వేడిని, చల్లదనాన్ని 

ఇవ్వటమే కాకుండా, మనకు ప్రాణాధారమైన అన్నాన్ని, నీటినీ, వెలుగునీ, 

ఇంకా ఎన్నింటినో ఇస్తున్న మహా గ్రహమండలాలు.  

అటువంటి మహా గ్రహ మండలాలను తన చెవి కమ్మల జతగా ధరించి వుంది అమ్మవారు.

ఆ సూర్య చంద్రులిద్దరూ అమ్మ ఆజ్ఞానుబద్ధులై, ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఏమి ఎలా 

ఇవ్వాలో ఇస్తూ, అమ్మ చెవికి వేలాడుతూ మహా ప్రకాశవంతంగా వున్నారు. 

అటూ ఇటూ సూర్యచంద్రులు, మధ్యలో ఈ రెండు గ్రహమండలాల కన్నా 

అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్న, ఆ జగదంబను మనసులో దర్శిస్తే జన్మకు ధన్యత. 

సూర్యచంద్రులనే తన తాటంకాలుగా ధరించి, మనలను తన కరుణా సముద్రంలో 

ముంచివేసిన, ఆ తాటంకయుగళీభూతతపనోడుపమండల కు వందనం.  

ఓం శ్రీ తాటంకయుగళీభూతతపనోడుపమండలాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


30, జులై 2021, శుక్రవారం

7. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా


నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ॥ 7 ॥

19. నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా

నవ చంపకపుష్పం అంటే అప్పుడే నూతనంగా వికసించిన సంపెంగపువ్వు. 

అమ్మవారి నాసాదండాన్ని, అంటే ముక్కు దూలాన్ని ఈ పుష్పంతో పోలుస్తున్నారు. 

అమ్మవారి నాసా దండం ఈ కొత్తగా విరిసిన సంపెంగలాగా విరాజిల్లుతున్నది అని భావం. 

అమ్మవారు పుష్పాలకే సుగంధాన్ని ఇచ్చే తల్లి కదా. 

అందునా సంపెంగలు ఎక్కడో విరిసినా, ఆ ప్రాంతం అంతటా సుగంధాలు విరజల్లుతాయి.  

పైగా అప్పుడే విరబూసిన సంపెంగలు మృదువుగా, సున్నితంగా,  

కుసుమ కోమలం అన్న పదానికి అసలు సిసలైన అర్థంలా ఉంటాయి. 

సంపెంగకి ఇంకో లక్షణం కూడా వుంది. అవి మొత్తం విచ్చుకోవు, మొగ్గగానూ వుండవు. 

విచ్చీ విచ్చుకోని ఆ సంపెంగ, అమ్మవారి ముక్కు వలే ఉన్నదట. 

ఆ సంపెంగకు ఆ సుగంధాలు అమ్మవారి ముక్కు నుంచే సంప్రాప్తించాయి. 

వాసనలు చూసే ముక్కు,  పువ్వుకే ఆ వాసనలని ఇచ్చింది. 

మన వాసనలన్నీ మనల్ని అమ్మవారి ముక్కు దగ్గరకే చేరుస్తాయి, 

ఎందుకంటే, ఆ వాసనల మూటను మనతో అనుసంధానించింది ఆ అమ్మే. 

వాసనలంటే, ఎన్నెన్ని జన్మల నుంచో మనలో స్థిరపడిపోయిన 

మన ఆలోచనలు, కోరికలు, అనుభవాలు, అనుభూతులు, మన స్వభావం మొదలైనవి.  

మనకు ఆ సంచిత వాసనలను ఇస్తూనే, మళ్ళీ ఆ యా వాసనల నుంచి 

మనలను విముక్తులను చేసేదీ ఆ జగన్మాతే. 

నవ చంపక పుష్పపు నాసాదండంతో విరాజిల్లుతున్న, 

ఆ నవచంపకపుష్పాభనాసాదండవిరాజిత కు వందనం.  

ఓం శ్రీ నవచంపకపుష్పాభనాసాదండవిరాజితాయై నమః 


20. తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా

అమ్మవారి నాసాభరణము, అంటే ముక్కుబులాకీ, ముక్కుపుడకలు తారల కాంతినే 

ధిక్కరించేంత ప్రకాశంతో ధగధగ మెరుస్తున్నాయి.  

ఇక్కడ నాసాభరణాలకు అమర్చిన ఆ రవ్వలకాంతులు 

అమ్మవారి ముఖదీప్తిని మరింత భాసమానంగా మనకు చూపిస్తున్నాయి. 

తారలు అంటే ఆకాశంలో మెరిసే  నక్షత్రాలు, గ్రహాలు. 

ఆ తారకలు ఎంతో ప్రకాశంగా తమ సహజ కాంతితో వెలిగిపోతున్నా కూడా 

వాటి కాంతి అమ్మవారి ముక్కుపుడక ముందు వెలాతెలా పోతున్నాయి. 

మరి వాటికి ఆ కాంతిని ఇచ్చింది కూడా సంపూర్ణ కాంతితో వెలుగొందుతున్న అమ్మే కదా. 

ఆ తారల కాంతి ప్రభావాన్ని మించిన కాంతితో జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న 

అమ్మవారి నాసాభరణాన్ని దర్శనం చేస్తే, ఆ నక్షత్ర, గ్రహ దోషాలు పోయి 

తుల లేని అమ్మ ఆశీర్వచనం, అండ లభిస్తాయి. 

కనుక అమ్మవారి ముక్కుపుడకని కానీ, బులాకీని కానీ భక్తి, శ్రద్ధలతో 

దర్శించినవారి అన్ని నక్షత్ర, గ్రహ దోషాలనీ అమ్మ పరిహారం చేస్తుంది. 

ఎందుకంటే, ఆ నక్షత్రాలు, గ్రహాల ప్రకాశ ప్రభావాల కన్నా 

అమ్మ నాసాభరణ ప్రకాశ ప్రభావాలు ఎన్నో రెట్లు ఎక్కువ. 

తారల కాంతిని తిరస్కరించేంత ప్రకాశం కల ముక్కెరలను ధరించి, 

మనలను కష్టాల నుంచి గట్టెక్కించే ఆ తారాకాంతితిరస్కారినాసాభరణభాసుర కు వందనం.  

ఓం శ్రీ తారాకాంతితిరస్కారినాసాభరణభాసురాయై నమః



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


29, జులై 2021, గురువారం

6. వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా 
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా ॥ 6 ॥


17. వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా

అమ్మవారి వదనము స్మరుని యొక్క మంగళకరమైన గృహము లాగా వున్నది. 

స్మరుడంటే మన్మధుడు. అంతేకాదు, మన్మధుని ఇంటి వలే ఉన్న అమ్మవారి వదనంలో 

ఆమె కనుబొమ్మలు ఆ మంగళగృహానికి కట్టిన తోరణాల వలే ఉన్నాయి. 

చిల్లికా అంటే కనుబొమలు. మన్మధుని మంగళమయమైన గృహమునకు 

కట్టిన తోరణమే అమ్మవారి కనుబొమ్మలు. 

చక్కగా మన్మధుని గృహమును పోలిన ముఖము,  

అట్టి మంగళకరమైన గృహమునకు కట్టిన తోరణములుగా  ఆ కనుబొమ్మలు.  

ఎంత అందమైన, అద్భుతమైన పోలిక. 

మన్మధుడే అందానికి మారుపేరు. ఆ స్మరుని నివాసము ఇంకెంత అందంగా ఉండి ఉంటుంది. 

అటువంటి ఇంటికి తోరణాలు కడితే, అది ఇంకెంత శోభాయమానంగా ఉంటుంది. 

అన్నింటినీ మించి ఆ తోరణాలు అమ్మ కనుబొమ్మలే అయితే, ఇక వర్ణనాతీతం. 

తోరణాలు ఇంటికి శుభప్రదం, మంగళకరం. ఇంటిని రక్షించేవి తోరణాలు. 

అమ్మవారు తన కనుబొమ్మలనే తోరణాలతో మన గృహాలను రక్షిస్తూ, 

వాటిని మంగళకరం చేస్తూ ఉన్నది. 

మన్మధుని మంగళ గృహము వంటి వదనంలో, తన కనుబొమ్మలనే 

తోరణములుగా తీర్చిదిద్దిన, ఆ వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లిక కు వందనం. 
    
ఓం శ్రీ వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికాయై నమః 


18. వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా

ఈ నామం మరింత రుచి. వక్త్రము అంటే వదనము. పరీవాహము అంటే ప్రవాహం. 

అమ్మవారి ముఖమే లక్ష్మీప్రదం. ఆ ముఖమే ఒక మహా ప్రవాహమైతే,

మహా వేగంగా ప్రవహిస్తున్న ఆ ఝరిలో, మరింత  వేగంగా చలించే మీనాలే ఆమె కళ్ళైతే, 

ఆ దృశ్యం ఎంత నయన మనోహరంగా ఉంటుంది. 

ముఖమా, అది అతి వేగంగా ప్రవహిస్తున్న ఓ చైతన్య స్రవంతి. 

అమ్మ కన్నులా, ఆ మహా ప్రవాహంలో జలజల పరుగెడుతున్న చేపలు. 

చేప తన సంతానాన్ని కేవలం తన  చూపు తోనే పెంచుతుంది. 

చేప పిల్లలు పెరగటానికి, ఆ తల్లి చేప చూపు చాలు. 

ఇక్కడ అమ్మవారిని  మీనాభలోచనా అనడంతో, 

అమ్మవారి కడగంటి చూపు చాలు, మన పోషణ, రక్షణ జరగడానికి అన్న భావం.

ఆ చూపు చాలు మనలను ఉద్ధరించడానికి. మనలని సంరక్షించడానికి. 

అందుకే మహానుభావుల దగ్గరకు, ఉపాసకుల దగ్గరకు, సిద్ధుల దగ్గరకు వెళ్ళినపుడు,

వారి కృపాకటాక్షము చాలు, మనం ఉద్ధరింపబడటానికి. 

అమ్మ కరుణామయి కదా, ఈ సమస్త సృష్టిని తన కన్నులతో చూస్తూ పోషిస్తూ ఉంటుంది. 

లక్ష్మి వంటి ముఖ మహా ప్రవాహములో చలిస్తున్న మీనముల వంటి 

కన్నులు కల, ఆ వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచన కు వందనం. 

ఓం శ్రీ వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


28, జులై 2021, బుధవారం

5. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా

 అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా 
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా ॥ 5 ॥


15. అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా

స్పష్టంగా అమ్మవారి నుదురు కనిపిస్తోంది. 

ఆ నుదురు అందంగా అష్టమినాటి చంద్రుని వలే ఉన్నది. 

అష్టమి నాటి చంద్రుడు సరిగ్గా అర్ధ చంద్రుడు. చంద్రునివి షోడశ కళలు. 

ఆ  పదహారు కళల్లో అష్టమి మధ్యలోనిది. 

అష్టమి నాడు అది శుక్లాష్టమి అయినా, కృష్ణాష్టమి అయినా అర్ధచంద్రుడే కనిపిస్తాడు. 

అయితే, శుక్లాష్టమి చంద్రుడు కృష్ణాష్టమి నాడు కనపడడు. అప్పుడు కనిపించే అర్ధభాగం వేరు. 

అలాగే,  కృష్ణాష్టమి చంద్రుడు శుక్లాష్టమి నాడు కనపడడు. ఇప్పుడు కనిపించే అర్ధభాగం వేరు.

ఒకసారి ఒక అర్ధభాగం కనిపిస్తే, ఇంకోసారి ఇంకో అర్ధభాగం కనిపిస్తుంది. 

మిగిలిన అర్ధభాగం చీకటిగా వున్నా, శ్రద్ధగా చూస్తే అందులోనూ చంద్రుడు కనపడతాడు. 

మనకి  దృక్కు ఉండాలే గానీ, అన్నిరోజులూ షోడశకళలు చూడవచ్చు. 

అలా ఆ అదృశ్యంగా వున్న భాగాన్ని కూడా దృశ్యంగా దర్శించగలగటం ఒక దివ్యానుభూతి. 

ఈ అష్టమి చంద్రుడే అర్ధనారీశ్వర తత్వానికి ప్రత్యక్ష ఉదాహరణ. 

శివుడు, శక్తి ఇద్దరూ కలిస్తేనే సంపూర్ణం. 

దృశ్య, అదృశ్య చంద్రులిద్దరినీ కలిపితేనే పూర్ణచంద్ర దర్శనం.  

అష్టమి చంద్రుడిలో పూర్ణ చంద్రుణ్ణి దర్శించుకోవటమే అసలైన దర్శనం. 

అమ్మవారి శోభస్కరమైన ళికము, లలాటము ఆ అష్టమి చంద్రుడిలా వెలిగిపోతోంది.  

అష్టమి చంద్రుడు వంటి శోభస్కరమైన అళికము గల, 

ఆ అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభిత కు వందనం. 

ఓం శ్రీ అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితాయై నమః 


16. ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా

 అమ్మవారి ముఖం అష్టమి చంద్రునిలా వెలిగిపోతోంది కదా. 

చంద్రునికి మచ్చ, కళంకం, వున్నట్టే అమ్మవారికి కూడా ఒక మచ్చ వున్నదిట. 

ఆ మచ్చ ఏమిటీ అంటే, అమ్మవారి నుదుటను వున్న తిలకం. 

అది మృగనాభీ విశేషమైన కస్తూరీ తిలకం. 

కస్తూరి మృగం నాభి వద్ద ఏర్పడే ఒక తిత్తి నుంచి వెలువడే పదార్థమే ఈ కస్తూరి. 

పరిమళాలను వెదజల్లే ఈ కస్తూరినే అమ్మవారు తిలకంగా ధరించి ఉన్నది. 

అమ్మవారి ముఖ చంద్ర మండలానికి అందాన్ని చేకూర్చే కస్తూరిని ఇవ్వగలిగే 

ఆ కస్తూరి మృగం ఎంత పుణ్యం చేసుకుందో కదా. 

అమ్మవారి నుదుటన ఈ కస్తూరీ తిలకం చంద్రునిలో మచ్చ వలే ఉన్నదిట.

చంద్రునికి మచ్చ ఎంత అందమో, అమ్మవారికి కస్తూరీ తిలకం అంత అందం.   

మృగనాభీ విశేషమైన కస్తూరీతిలకాన్ని చంద్రునిపై కళంకం వలే ధరించిన,  

ఆ ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషక కు వందనం. 

ఓం శ్రీ ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


27, జులై 2021, మంగళవారం

4. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా


చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా ॥ 4 ॥

13. చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా

అమ్మవారు తన పరిమళ భరితమైన కబరీభరముతో ఆ చిదగ్ని కుండము నుంచి 

నెమ్మది నెమ్మదిగా బయటకు ప్రకటితమవుతోంది. 

సాధారణంగా, దేవుని పాదాలకు నమస్కరించి మొదలు పెట్టాలనే భావనతో, 

ఎవరైనా దేవతావర్ణన చేసేటప్పుడు పాదముల నుంచీ ప్రారంభించి వర్ణిస్తారు. 

కానీ ఇక్కడ శ్రీలలిత కుండంలో నుంచి పైకి ఆవిర్భవిస్తోంది. 

అందువలన అమ్మవారిని ఆపాదమస్తకం కాకుండా, శిరసు నుంచి పాదాల దాకా వర్ణిస్తుస్తాం. 

అమ్మ ఎలా ఎలా బైటకు వస్తే, అలా అలా అమ్మని వర్ణిస్తూ కీర్తిస్తున్నాం. 

ముందుగా దర్శనమిచ్చినవి అమ్మవారి కురులు. 

కనుక ఇక్కడ తొలుతగా అమ్మవారి కేశపాశాల గురించి చెప్తూ, 

చంపకం, అశోకం, పున్నాగ వంటి పరిమళభరితమైన పుష్పాల సువాసన 

అమ్మవారి కేశరాశికి వున్నదట. 

అమ్మ కేశాలకు పరిమళం చంపకం, అశోకం, పున్నాగ వంటి పుష్పాల వలన రాలేదు.  

ఆ పుష్పాలకే ఆ పరిమళం అమ్మ కురుల మీద ఉండటం వలన అబ్బినాయి.

పుష్పాలకే పరిమళాన్ని అందించే కబరీభరం అమ్మది. 

నిజమే కదా, ఈ అఖిల చరాచర జగత్తులో అన్నీ అమ్మ ఇస్తేనే వచ్చాయి.

అమ్మ జగజ్జనని కదా, పుష్పాలకు, వాటి పరిమళాలకు కూడా. 

చంపకం, అశోకం, పున్నాగల వంటి పరిమళ భరితములైన పుష్పాలకే 

సుగంధాన్ని అందించే వేణీభరం, కబరీభరం, కచభరం కలిగివున్న, 

ఆ  చంపకాశోకపున్నాగసౌగన్ధికలసత్కచ కు వందనం.    

ఓం శ్రీ చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచాయై నమః 


14. కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా

ఈ నామంలో అమ్మవారి కిరీటాన్ని వర్ణిస్తున్నారు. 

ఆ బంగరు కిరీటంలో కురువింద మణులు పొందికకా, పొంకంగా, వరుసగా పేర్చబడ్డాయి. 

కురువిందమణులు భూమిలో ఏర్పడే రాళ్లు. 

ఆ రాళ్లను సాన పడితే అవి కెంపులయ్యి ధగధగలాడతాయి.

అలా ధగద్ధగాయమానంగా వెలిగిపోతున్న మణులతో పొదిగిన కిరీటాన్ని అమ్మ ధరించి వుంది. 

దానికి సాటి వచ్చే కిరీటమే మరొకటి లేదు. 

అన్ని కిరీటాలూ అమ్మవారి కిరీటం ముందు పరాజితులే. అందరూ అమ్మకు సామంతులే. 

ఒకసారి అమ్మవారు బహు రమ్యంగా సభ తీర్చి వున్నది. 

ఆ సభలో బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు మొదలైన దేవతలంతా అమ్మవారిని కీర్తిస్తూ వున్నారు. 

అమ్మ విలాసంగా తన తలను ఊపుతూ అందరినీ వింటున్నది. 

అప్పుడు మహేశ్వరుడు వస్తున్నాడని పరివారం సమాచారం అందించారు. 

అమ్మ హఠాత్తుగా లేచి నిలబడింది. అది చూసి సభాసదులంతా లేచారు. 

అమ్మ తన భర్తను ఆహ్వానించటానికి పరుగున కదలి ద్వారం వైపు వెళ్తున్నది. 

అమ్మ పాదాలు చూసిన దేవతలందరూ వంగి పాదాలకు నమస్కరించటం మొదలుపెట్టారు. 

సాధారణంగా ఎవరూ ఎవరికీ సకిరీట నమస్కారం చెయ్యరు. 

కానీ, ఇక్కడ వేగంగా కదులుతున్న అమ్మవారిని చూసి ఎక్కడ అమ్మవారి పాదాలు 

మళ్ళీ దొరకవో అని అందరు దేవతలూ తక్షణమే వంగి సకిరీట నమస్కారాలు చేస్తున్నారు. 

పరిచారకులు, అమ్మా, ఇదిగో ఇంద్రుని కిరీటం, ఇదిగో, బ్రహ్మ కిరీటం, మణులు పొదిగి వున్నాయి,

మీ పాదాల వద్ద వున్నాయి, కొద్దిగా జాగ్రత్త తల్లీ అని చెప్తూ 

ఆమెకి ద్వారం వైపుకు దారి చూపిస్తున్నారు. 

అమ్మవారికి కామేశ్వరుని ఆహ్వానించడం పైనే ధ్యాస. 

భర్తకు పాద నమస్కారం చేసి, సగౌరంగా సభలోకి తీసుకు వచ్చి, 

తన పక్కనే ఎంతో మర్యాదతో సింహాసనంపై కూర్చుండబెట్టింది. 

ఈ ముచ్చట సౌందర్యలహరిలో ఆదిశంకరుడు ప్రస్తావించాడు. 

అమ్మవారి కిరీటం ముందు అన్ని కిరీటాలూ ప్రణమిల్లవలసిందే. 

మాణిక్యమకుటం ధరించిన, ఆ కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండిత కు వందనం. 

ఓం శ్రీ కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


26, జులై 2021, సోమవారం

3. మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా


 మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా 
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలా ॥ 3 ॥

10. మనోరూపేక్షుకోదండా

అమ్మవారి ఎడమవైపు రెండవ చేతిలో ఇక్షు కోదండాన్ని ధరించి వున్నది. 

ఇక్షు అంటే చెరకు. అమ్మవారు చెరకు విల్లు ధరించి వున్నదన్నమాట.

చెరకు విల్లు పట్టుకునేది మన్మధుడు కదా, మన లలితాదేవికి కూడా ఉన్నదా, అంటే, వున్నది. 

మనస్సుని మధిస్తే పుట్టేవాడు మన్మధుడు. 

ఇక్కడ అమ్మవారు చేస్తోంది కూడా మనోమథనమే కదా. 

మన మనస్సులను మధించి దాన్ని తన అదుపాజ్ఞలలో పెట్టుకుంటున్నది. 

అందుకే అమ్మవారు పట్టుకున్న ఆ ఇక్షు కోదండాన్ని మనోరూపా అన్నారు. 

మనస్సనే రూపంతో వున్న చెరకు విల్లును ధరించి అమ్మవారు ఆవిర్భవించింది. 

మరి భండాసురుడనే దుష్ట మనసుని  పట్టుకుని దాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవాలి కదా. 

ఈ ఇక్షు కోదండం, అంటే చెఱకువిల్లు ఏదో కాదు, మన మనస్సే. 

దానిని అమ్మవారికి సంపూర్ణంగా ఇచ్చేస్తే, మిగిలింది ఆ అమ్మ చూసుకుంటుంది. 

మన మనసుని అమ్మవారికి అర్పిస్తే, దాని లాలన, పాలనలు ఇకపై ఆ అమ్మవే. 

చెరకు అంటే తెలుసు కదా, తీయని రసాలూరుతూ ఉంటుంది. 

ఆ తియ్యదనానికి మోహపడి, ప్రతి జీవుడూ ఈ మనసుకి లొంగిపోతూ ఉంటాడు. 

ఆ మనస్సేమో చంచల, కళ్ళాలు లేని గుర్రం. 

అటువంటి మనసుని కొంచెం సాధన చేసి దాన్ని అమ్మవారికి సమర్పిస్తే, 

ఆ అమ్మవారు ఇచ్చే మధురమైన  కరుణను ఎల్లప్పుడూ పొందొచ్చు. 

సదాలోచనలు చేసే మనసుని కరుణిస్తూ,  

దురాలోచనలు చేసే మనసుని దండిస్తూ ఉంటుంది ఈ కోదండంతో అమ్మ.   

మనస్సనే చెరకు విల్లుని ధరించి వస్తున్న, ఆ మనోరూపేక్షుకోదండా కు వందనం. 

ఓం శ్రీ మనోరూపేక్షుకోదండాయై నమః  


11. పంచతన్మాత్రసాయకా

కోదండం ఒక్కటే ఉంటే చాలదు కదా, దానికి తగిన బాణాలూ ఉండాలి. 

అమ్మవారు తన కుడివైపు రెండవ చేతితో పంచబాణాలు పట్టుకున్నది. 

అవే పంచ తన్మాత్రలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. 

ఈ పంచ తన్మాత్రలనే మనం జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా అనుభవిస్తున్నాం. 

ఈ  పంచ తన్మాత్రలే స్థూలంగా చూస్తే పంచ భూతాలు. 

శబ్దం ఆకాశం నుంచి ఉద్భవిస్తుంది, దాన్ని మన చెవి వింటుంది, అదే శ్రోత్రేంద్రియం

స్పర్శ వాయువు ద్వారా తెలుస్తుంది. దాన్ని మన చర్మం గ్రహిస్తుంది, అదే త్వగింద్రియం. 

రూపం అగ్ని ద్వారా ప్రకటితమవుతుంది. దాన్ని మన కన్ను చూస్తుంది, అదే చక్షురింద్రియం. 

రసం నీరు ద్వారా బహిర్గతమవుతోంది. దాని రుచిని మన నాలుకతో ఆస్వాదిస్తాం, 

అదే రసనేంద్రియం. 

గంధం పృథ్వి ద్వారా ప్రకటితమవుతుంది. దాన్ని ముక్కుతో వాసన చూస్తాం,

అదే ఘ్రాణేంద్రియం.  

ఈ పంచ తన్మాత్రలనీ బాణాలుగా చేసుకుని, దుష్టశిక్షణకై, శిష్ట రక్షణకై 

లలితాదేవి ఆవిర్భవించింది. 

పంచ తన్మాత్రలను  ధరించి వున్న, ఆ పంచతన్మాత్రసాయక కు వందనం. 

ఓం శ్రీ పంచతన్మాత్రసాయకాయై నమః 


12. నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా

లలితాదేవి అరుణవర్ణంతో ఉందని ముందే తెలుసుకున్నాం. 

ఆ అరుణవర్ణ ప్రవాహం ఈ బ్రహ్మాండ మండలాలనన్నింటినీ పూర్తిగా ఆవహించేసింది. 

అమ్మవారిది అరుణ వర్ణం, అగ్ని వర్ణం, ఆదిత్య వర్ణం. 

ఎరుపు సౌభాగ్యానికి సంకేతం, అందుకే మన సనాతన ధర్మంలో 

ఎర్రని కుంకుమ ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకోవటం ఆచారంగా వస్తున్నది. 

అమ్మ తన ఎర్రని కిరణ ప్రవాహంలో ఈ సమస్త బ్రహ్మాండ మండలాలనూ కప్పేసింది. 

అంటే మొత్తం సమస్త విశ్వాన్నీ తన ప్రభావంతో ముంచేసింది. 

తన అధీనం లోనే అన్ని బ్రహ్మాండాలనూ ఉంచుకుంది. 

అమ్మవారి నుంచి వస్తున్న ఆ అరుణకిరణ ప్రభావంలో లోకాలోకాలన్నీ మునిగి వున్నాయి. 

ఆ అరుణ కిరణ వర్షంలో అన్ని  బ్రహ్మాండమండలాలూ ఆనందంలో వున్నాయి. 

తన అరుణ కిరణ వర్షంలో బ్రహ్మాండ మండలాలన్నింటినీ ఆవరించిన, 

ఆ నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల కు వందనం. 

ఓం శ్రీ నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయై నమః 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


25, జులై 2021, ఆదివారం

2. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ 2 ॥

 ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా 
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ 2 ॥

6. ఉద్యద్భాను సహస్రాభా 

ఉదయిస్తున్న భానుడు, ఏవిధంగా అయితే కొద్దికొద్దిగా ప్రకటితమవుతూ, ప్రకాశవంతమైన

ఎర్రెర్రని కిరణాలతో భాసిస్తూ ఉదయిస్తున్నాడో, అదే విధంగా శ్రీ లలిత కూడా ఎర్రని

ప్రకాశవంతమైన కాంతితో ఆ చిదగ్నికుండంలో నుంచి ఆవిర్భవిస్తూ వున్నది. 

భ అన్నా, ఆభ అన్నా మిక్కిలి ప్రకాశవంతమైన దీప్తి, వెలుగు.  

సహస్రాభా అంటే అటువంటి వెయ్యి కిరణాలతో వెలిగిపోతున్నది ఆ తల్లి అని అర్ధం.  

అమ్మవారిని కీర్తిస్తూ అరుణాం కరుణాతరంగితాక్షీమ్ అంటాం, 

అమ్మవారు అరుణిమవర్ణంతో వున్నది. 

అలాగే జపాకుసుమభాసురాం అంటాం. మందార పువ్వు వంటి ఎర్రని కాంతితో, ప్రకాశిస్తున్నది. 

అలా అమ్మవారు అరుణవర్ణంతో బాలభానుడి నుంచి వెలువడే 

వెయ్యి కిరణాల కాంతితో వెలిగిపోతూ ఆ కుండంలో నుంచి ఆవిర్భవిస్తున్నది. 

మిక్కిలి ప్రకాశవంతమైన సహస్ర అరుణ కిరణాలతో మెరిసిపోతున్న,

ఆ ఉద్యద్భానుసహస్రాభాకు వందనం. 

ఓం శ్రీ ఉద్యద్భానుసహస్రాభాయై నమః 


7. చతుర్బాహుసమన్వితా 

నాలుగు బాహువులతో కూడి వుండి, ఎంతో తేజస్సు, ఓజస్సు తో విరాజిల్లుతున్నదీ అమ్మ. 

నాలుగు బాహువులు నాలుగు యుగాలు కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలకు ప్రతీక. 

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కాలాలకు ప్రతీక. 

మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములకు ప్రతీక. 

నాలుగు అవస్థలైన జాగ్రత్, సుషుప్తి, నిద్ర, తురీయము లకు సంకేతం. 

బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలకు సంకేతం. 

బ్రాహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాస ఆశ్రమాలకు సంకేతం. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. 

లలితాదేవి తన నాలుగు బాహువులతో, ఆ బాహువుల్లో ధర్మ సంరక్షణార్థం ధరించిన 

ఆయుధాలతో, ఎంతో తేజస్సుతో ఆవిర్భవిస్తున్నది. 

సమున్నతమైన నాలుగు బాహువులు గల, ఆ చతుర్బాహుసమన్విత కు వందనం. 

ఓం శ్రీ చతుర్బాహుసమన్వితాయై నమః 


8. రాగస్వరూపపాశాఢ్యా

అమ్మవారు తన నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలు ధరించి ఉన్నది. 

తన ఎడమవైపు కిందనున్న చేతితో ఆమె పాశమును ధరించి వున్నది. 

పాశము అంటే, తాడు, బంధము. మనలను కట్టి ఉంచేది. 

మన చుట్టూ అల్లుకున్న ఒక బంధనము అది. 

అంతే కాదు, మన శత్రువులను కూడా కట్టి వేయగలదు. 

ఈ శత్రువులు అంతః శత్రువులైనా, బహిర్ శత్రువులైనా. 

ఇక్కడ అమ్మవారు భండాసుర వధ కోసం వచ్చింది.

ఆ భండాసురుడ్ని బంధించడానికి తగిన పాశం తెచ్చింది.  

ఈ శ్రీ లలితా దివ్య రహస్య సహస్ర నామ స్తోత్రం చెప్పిన 

వశిన్యాది వాగ్దేవతలు ఈ పాశాన్నే రాగస్వరూపా అంటున్నారు.  

రాగము, లేదా అనురాగము, మమకారము వంటివన్నీ బంధనాలే కదా. 

ఎవరి మీదైనా, దేనిమీదైనా రాగం కలిగి ఉంటే మనం కట్టుబడిపోయినట్లే కదా.

అవే కదా వాసనలంటే. ఈ  వాసనలకు ఎంత దూరంగా, స్వేచ్ఛగా ఉంటే అంత విముక్తి. 

జీవుడు రాగ ద్వేషాలు కలిగి ఉంటే, ఆ  పాశాలతోనే బద్ధుడై ఉంటే, ముక్తుడు ఎప్పుడవుతాడు.  

ఇక్కడ రాగం తనపైనే  కలిగి ఉండమని అమ్మవారు పాశం ధరించి మనల్ని 

తనతో అనురాగమనే బంధాన్ని కలపాలని వచ్చింది. 

రాగమనే పాశంతో భక్తులను బంధించిన, రాగస్వరూప పాశాఢ్యకు వందనం.  

ఓం శ్రీ రాగస్వరూపపాశాఢ్యాయై నమః 


9. క్రోధాకారాంకుశోజ్జ్వలా

శ్రీలలిత తన కుడివైపు వున్న కింది చేతిలో అంకుశాన్ని ధరించి వున్నది. 

ఆ అంకుశం కూడా క్రోధం నుంచి అంకురించినది. అది కూడా ఉజ్వలమై వెలుగొందుతున్నది. 

అమ్మవారి ఆ క్రోధం కూడా ధర్మాగ్రహమే. 

అమ్మవారికి  కోపం వచ్చింది,  దాంతో అంకుశమనే ఆయుధాన్ని ధరించి వచ్చింది. 

కోపం ఎందుకు వచ్చిందీ అంటే, దేవతాశక్తులు ఆసురీశక్తుల వల్ల బాధింపబడుతున్నాయి. 

రక్షణ కోసం ఆ దేవతాశక్తులు అమ్మ శరణు కోరి వచ్చాయి. 

జప, తప, హోమాదులతో తనని తృప్తి పరచాయి. 

వారి భక్తి, శ్రధ్ధ, శరణాగతి చూసి వారిపై అమ్మవారికి కరుణ కలిగింది. 

వారి కష్టం చూసి ఆమెకి కోపం వచ్చింది. అది క్రోధంగా, ఉగ్రంగా మారింది. 

ఆయుధం ధరించింది. 

క్రోధం నుంచి వెలువడిన ఉజ్వలమైన పాశం ధరించిన, ఆ క్రోధాకారాంకుశోజ్జ్వల కు వందనం.

ఓం శ్రీ క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


24, జులై 2021, శనివారం

1. శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండసంభూతా, దేవకార్యసముద్యతా

శ్రీమాత్రే నమః 


శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్నికుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥

1. శ్రీ మాత

శ్రీమాత అంటే కేవలం శ్రీ అనే గౌరవవాచకంతో తల్లిని పిలవడం మాత్రమే కాదు. 

శ్రీ అంటే లక్ష్మి, సంపద, సమృద్ధి, సంతృప్తి, ముక్తి, మోక్షం, మంత్రం, తంత్రం, యంత్రం, 

ఫలం, పుష్పం. 

అంతేనా, ఇంకా అష్టలక్ష్ముల రూపంతో, మనకు కావాల్సిన, ధనం, ధాన్యం, ధైర్యం, విద్య, వరాలు,

విజయం, సంతానం, వాహనాలు, సేవకులు, అభయాలు అన్నీ ఇచ్చే అపరావతారం 

ఈ శ్రీమాత. 

ఇంతకీ ఆ తల్లి ఎవరూ అంటే, అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, 

చాల పెద్దమ్మ. మనందరికీ అమ్మ. 

చిన్న దెబ్బ తగిలితే వెంటనే అసంకల్పితంగా అమ్మా.... అంటామే, ఆ అమ్మ. 

అందరినీ కాపాడే అమ్మ, అందరినీ పోషించే అమ్మ, అందరినీ కాచి కటాక్షించే అమ్మ. 

ఈ మాతే లోకాలన్నింటికీ మాతృస్వరూపిణి. 

ఈ తల్లి కృపాకటాక్షం ఉన్నంతవరకూ లోకంలో ఎవరికీ, దేనికీ లోటన్నది ఉండనే ఉండదు.

మాతృస్వరూపిణి, ఆ శ్రీమాతకు వందనం.

ఓం శ్రీ శ్రీమాత్రేనమః


2. శ్రీమహారాజ్ఞీ

శ్రీమహారాజ్ఞీ అన్నది ఈ మాత గురించే. 

ప్రప్రథమ నామం శ్రీమాతా అయితే, రెండవ నామం శ్రీమహారాజ్ఞీ. 

మనల్ని, లోకాలన్నింటిని పరిపాలించే మహాశక్తి ఈ శ్రీ మహారాజ్ఞి.

కామేశ్వరుని చెంత చేరి, తన కనుసన్నలలో, తన కనుసన్నలతో 

ఈ చరాచర జగత్తు నంతటినీ పరిపాలించే మహారాజ్ఞి ఈ లలితాదేవి. 

సమస్త సృష్టికీ ఆధారభూతం, ఆదీ ఆమే, అంతమూ ఆమే.  

సృష్టి, స్థితి, లయ అన్నీ ఆమె ఆజ్ఞ అనుసారం గానే నడుస్తున్నాయి. 

ఈ సృష్టిలో ప్రతి కర్మా, కార్యమూ అన్నీ నిర్వహింపచేసే తల్లి.

ఆ తల్లి కటాక్షంతోనే ఈ సమస్త లోకాలూ సంరక్షింపబడుతూ వున్నాయి. 

మహత్తరమైన పాలననూ, లాలననూ అందించే, ఆ శ్రీ మహారాజ్ఞికి వందనం. 

ఓం శ్రీ శ్రీమహారాజ్ఞై నమః 


3. శ్రీమత్సింహాసనేశ్వరీ

మరి అలా పరిపాలించే మహారాజ్ఞికి సింహాసనం కావద్దూ.

అదే ఆ శ్రీమత్సింహాసనం. మామూలు సింహాసనాలు ఆ శక్తికి  నిలువలేవు. 

అటువంటి అమేయమైన శక్తికి ఒక ప్రత్యేకమైన సింహాసనం కావాలి. అదే ఈ శ్రీమత్ సింహాసనం. 

ఆ సింహాసనానికి నాలుగు కాళ్ళు, పైన పరుపు, ఆ పైన ఆనుకోవటానికి ఓ మెత్త, 

సింహాసనం చేతులపై అమ్మవారు చేతులు పెట్టుకోవటానికి అటూ ఇటూ రెండు మెత్తలు.

పైన ఓ ఛత్రం. ఇన్ని హంగులతో ఉన్నది ఆ సింహాసనం.

బ్రహ్మ, గోవిందుడు, రుద్రుడు, ఈశ్వరుడు నాలుగు కాళ్లుగా వుంటూ 

అమ్మవారికి పరిపాలనా కార్యక్రమంలో దోహదం చేస్తూ వుండే సింహాసనం. 

సదాశివుడే పరుపై, మహేశానుడు మెత్తలయి, అన్నీ శివమయమైన ఈ సింహాసనంపై 

ఆ శ్రీ మహారాజ్ఞి ఆసీనురాలయి మనలను అందరినీ చల్లగా పరిపాలిస్తుంది. 

ఆ శంభువే మళ్లీ తానే కామేశ్వరుడయి, ఈ కామేశ్వరి పక్కన ఆ సింహాసనంపైనే ఆశీనుడయ్యాడు.

అంత గొప్ప సింహాసనం అది. పరమశివుడు మాత్రమే ఆ శక్తిని భరించగలడు అని చెప్పటానికి 

కట్టెదుర కనిపించే ఉదాహరణం ఈ సింహాసనం. 

ఆదిదంపతులే అధిరోహించిన శ్రీమత్సింహాసనం. 

ఆ సింహాసనంపై కూర్చుని లోకాలన్నింటినీ పరిపాలిస్తున్న ఆ తల్లే ఈ శ్రీమత్సింహాసనేశ్వరి. 

మహత్తరమైన సింహాసనం మీద ఆసీనురాలైన, ఆ శ్రీమత్సింహాసనేశ్వరికి వందనం. 

ఓం శ్రీ శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః


4. చిదగ్నికుండసంభూతా

చిదగ్నికుండంలో దుష్ట శిక్షణార్ధం, శిష్ట రక్షణార్థం ఆవిర్భవించిన కరుణామయి ఈమె.  

భండాసురుడనే రాక్షసునిచే అరవైవేల సంవత్సరాలు పీడింపబడిన ఇంద్రాది దేవతలు 

కామప్రళయంచే వేధించబడుతూ, అమ్మ రక్షణ కోరుతూ, జపాలు, తపాలు చేసి 

తదనంతరం హోమం చేయడానికి ఒక హోమగుండం తవ్వి దానిలో ఆహుతిగా 

వారి శరీరాలే సమిధలుగా వ్రేల్చుతుంటే, ఆ లలితామహారాజ్ఞి ఆ చిదగ్నికుండంలో 

నుంచి వారికి అభయమిస్తూ ఆవిర్భవించింది.  

చిత్ అంటే బుద్ధి, తెలివి, జ్ఞానం.  

చిదగ్ని అంటే జ్ఞానాగ్ని. జ్ఞానాన్ని కూడా అగ్నిలో దగ్ధం చేస్తేనే కానీ అమ్మ ఆవిర్భవించదు.   

అప్పుడు అమ్మ తనంతట తానే ఆ చిదగ్ని కుండం నుంచి దేవతల సంరక్షణార్ధమై వచ్చింది.  

చిదగ్ని కుండంలో నుంచి ఉద్భవించిన, ఆ చిదగ్నికుండసంభూతకు వందనం. 

ఓం శ్రీ చిదగ్నికుండసంభూతాయైనమః


5. దేవకార్యసముద్యతా 

దేవకార్య సముద్యతా, దేవతల రక్షణార్థం, వారిని భండాసురుడు సృష్టించిన

కామప్రళయం నుంచి సముద్ధరించటం కోసం అవతరించిన మహాశక్తి ఈ దేవి. 

దేవతలకైనా సరే, అభయమిచ్చేదీ, కష్టాల నుంచీ సముద్ధరించేదీ ఈ తల్లే.  

అప్పటికి అరవైవేల  సంవత్సరాల నుంచీ భండాసురుడిచే వేధించబడుతూ, 

అమ్మని వెతుక్కుంటూ వెళ్లి, ఆ లలితాదేవికి శరణాగతి చేసిన, దేవేంద్రాదుల రక్షణభారం

తాను స్వీకరిస్తూ, దేవతలకి అభయం ఇచ్చి దేవకార్యం కోసం సన్నద్ధురాలైన 

ఈ తల్లి దేవకార్య సముద్యత. 

దేవకార్యార్థమై ఆవిర్భవించిన ఆ తల్లి, ఆ దేవకార్యసముద్యతకు వందనం. 

ఓం శ్రీ దేవకార్యసముద్యతాయైనమః 

 


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650