25, జులై 2021, ఆదివారం

2. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ 2 ॥

 ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా 
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ 2 ॥

6. ఉద్యద్భాను సహస్రాభా 

ఉదయిస్తున్న భానుడు, ఏవిధంగా అయితే కొద్దికొద్దిగా ప్రకటితమవుతూ, ప్రకాశవంతమైన

ఎర్రెర్రని కిరణాలతో భాసిస్తూ ఉదయిస్తున్నాడో, అదే విధంగా శ్రీ లలిత కూడా ఎర్రని

ప్రకాశవంతమైన కాంతితో ఆ చిదగ్నికుండంలో నుంచి ఆవిర్భవిస్తూ వున్నది. 

భ అన్నా, ఆభ అన్నా మిక్కిలి ప్రకాశవంతమైన దీప్తి, వెలుగు.  

సహస్రాభా అంటే అటువంటి వెయ్యి కిరణాలతో వెలిగిపోతున్నది ఆ తల్లి అని అర్ధం.  

అమ్మవారిని కీర్తిస్తూ అరుణాం కరుణాతరంగితాక్షీమ్ అంటాం, 

అమ్మవారు అరుణిమవర్ణంతో వున్నది. 

అలాగే జపాకుసుమభాసురాం అంటాం. మందార పువ్వు వంటి ఎర్రని కాంతితో, ప్రకాశిస్తున్నది. 

అలా అమ్మవారు అరుణవర్ణంతో బాలభానుడి నుంచి వెలువడే 

వెయ్యి కిరణాల కాంతితో వెలిగిపోతూ ఆ కుండంలో నుంచి ఆవిర్భవిస్తున్నది. 

మిక్కిలి ప్రకాశవంతమైన సహస్ర అరుణ కిరణాలతో మెరిసిపోతున్న,

ఆ ఉద్యద్భానుసహస్రాభాకు వందనం. 

ఓం శ్రీ ఉద్యద్భానుసహస్రాభాయై నమః 


7. చతుర్బాహుసమన్వితా 

నాలుగు బాహువులతో కూడి వుండి, ఎంతో తేజస్సు, ఓజస్సు తో విరాజిల్లుతున్నదీ అమ్మ. 

నాలుగు బాహువులు నాలుగు యుగాలు కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలకు ప్రతీక. 

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కాలాలకు ప్రతీక. 

మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములకు ప్రతీక. 

నాలుగు అవస్థలైన జాగ్రత్, సుషుప్తి, నిద్ర, తురీయము లకు సంకేతం. 

బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలకు సంకేతం. 

బ్రాహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్న్యాస ఆశ్రమాలకు సంకేతం. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. 

లలితాదేవి తన నాలుగు బాహువులతో, ఆ బాహువుల్లో ధర్మ సంరక్షణార్థం ధరించిన 

ఆయుధాలతో, ఎంతో తేజస్సుతో ఆవిర్భవిస్తున్నది. 

సమున్నతమైన నాలుగు బాహువులు గల, ఆ చతుర్బాహుసమన్విత కు వందనం. 

ఓం శ్రీ చతుర్బాహుసమన్వితాయై నమః 


8. రాగస్వరూపపాశాఢ్యా

అమ్మవారు తన నాలుగు చేతులలో నాలుగు ఆయుధాలు ధరించి ఉన్నది. 

తన ఎడమవైపు కిందనున్న చేతితో ఆమె పాశమును ధరించి వున్నది. 

పాశము అంటే, తాడు, బంధము. మనలను కట్టి ఉంచేది. 

మన చుట్టూ అల్లుకున్న ఒక బంధనము అది. 

అంతే కాదు, మన శత్రువులను కూడా కట్టి వేయగలదు. 

ఈ శత్రువులు అంతః శత్రువులైనా, బహిర్ శత్రువులైనా. 

ఇక్కడ అమ్మవారు భండాసుర వధ కోసం వచ్చింది.

ఆ భండాసురుడ్ని బంధించడానికి తగిన పాశం తెచ్చింది.  

ఈ శ్రీ లలితా దివ్య రహస్య సహస్ర నామ స్తోత్రం చెప్పిన 

వశిన్యాది వాగ్దేవతలు ఈ పాశాన్నే రాగస్వరూపా అంటున్నారు.  

రాగము, లేదా అనురాగము, మమకారము వంటివన్నీ బంధనాలే కదా. 

ఎవరి మీదైనా, దేనిమీదైనా రాగం కలిగి ఉంటే మనం కట్టుబడిపోయినట్లే కదా.

అవే కదా వాసనలంటే. ఈ  వాసనలకు ఎంత దూరంగా, స్వేచ్ఛగా ఉంటే అంత విముక్తి. 

జీవుడు రాగ ద్వేషాలు కలిగి ఉంటే, ఆ  పాశాలతోనే బద్ధుడై ఉంటే, ముక్తుడు ఎప్పుడవుతాడు.  

ఇక్కడ రాగం తనపైనే  కలిగి ఉండమని అమ్మవారు పాశం ధరించి మనల్ని 

తనతో అనురాగమనే బంధాన్ని కలపాలని వచ్చింది. 

రాగమనే పాశంతో భక్తులను బంధించిన, రాగస్వరూప పాశాఢ్యకు వందనం.  

ఓం శ్రీ రాగస్వరూపపాశాఢ్యాయై నమః 


9. క్రోధాకారాంకుశోజ్జ్వలా

శ్రీలలిత తన కుడివైపు వున్న కింది చేతిలో అంకుశాన్ని ధరించి వున్నది. 

ఆ అంకుశం కూడా క్రోధం నుంచి అంకురించినది. అది కూడా ఉజ్వలమై వెలుగొందుతున్నది. 

అమ్మవారి ఆ క్రోధం కూడా ధర్మాగ్రహమే. 

అమ్మవారికి  కోపం వచ్చింది,  దాంతో అంకుశమనే ఆయుధాన్ని ధరించి వచ్చింది. 

కోపం ఎందుకు వచ్చిందీ అంటే, దేవతాశక్తులు ఆసురీశక్తుల వల్ల బాధింపబడుతున్నాయి. 

రక్షణ కోసం ఆ దేవతాశక్తులు అమ్మ శరణు కోరి వచ్చాయి. 

జప, తప, హోమాదులతో తనని తృప్తి పరచాయి. 

వారి భక్తి, శ్రధ్ధ, శరణాగతి చూసి వారిపై అమ్మవారికి కరుణ కలిగింది. 

వారి కష్టం చూసి ఆమెకి కోపం వచ్చింది. అది క్రోధంగా, ఉగ్రంగా మారింది. 

ఆయుధం ధరించింది. 

క్రోధం నుంచి వెలువడిన ఉజ్వలమైన పాశం ధరించిన, ఆ క్రోధాకారాంకుశోజ్జ్వల కు వందనం.

ఓం శ్రీ క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650


3 కామెంట్‌లు: