10. మనోరూపేక్షుకోదండా
అమ్మవారి ఎడమవైపు రెండవ చేతిలో ఇక్షు కోదండాన్ని ధరించి వున్నది.
ఇక్షు అంటే చెరకు. అమ్మవారు చెరకు విల్లు ధరించి వున్నదన్నమాట.
చెరకు విల్లు పట్టుకునేది మన్మధుడు కదా, మన లలితాదేవికి కూడా ఉన్నదా, అంటే, వున్నది.
మనస్సుని మధిస్తే పుట్టేవాడు మన్మధుడు.
ఇక్కడ అమ్మవారు చేస్తోంది కూడా మనోమథనమే కదా.
మన మనస్సులను మధించి దాన్ని తన అదుపాజ్ఞలలో పెట్టుకుంటున్నది.
అందుకే అమ్మవారు పట్టుకున్న ఆ ఇక్షు కోదండాన్ని మనోరూపా అన్నారు.
మనస్సనే రూపంతో వున్న చెరకు విల్లును ధరించి అమ్మవారు ఆవిర్భవించింది.
మరి భండాసురుడనే దుష్ట మనసుని పట్టుకుని దాన్ని ఆధీనంలోకి తెచ్చుకోవాలి కదా.
ఈ ఇక్షు కోదండం, అంటే చెఱకువిల్లు ఏదో కాదు, మన మనస్సే.
దానిని అమ్మవారికి సంపూర్ణంగా ఇచ్చేస్తే, మిగిలింది ఆ అమ్మ చూసుకుంటుంది.
మన మనసుని అమ్మవారికి అర్పిస్తే, దాని లాలన, పాలనలు ఇకపై ఆ అమ్మవే.
చెరకు అంటే తెలుసు కదా, తీయని రసాలూరుతూ ఉంటుంది.
ఆ తియ్యదనానికి మోహపడి, ప్రతి జీవుడూ ఈ మనసుకి లొంగిపోతూ ఉంటాడు.
ఆ మనస్సేమో చంచల, కళ్ళాలు లేని గుర్రం.
అటువంటి మనసుని కొంచెం సాధన చేసి దాన్ని అమ్మవారికి సమర్పిస్తే,
ఆ అమ్మవారు ఇచ్చే మధురమైన కరుణను ఎల్లప్పుడూ పొందొచ్చు.
సదాలోచనలు చేసే మనసుని కరుణిస్తూ,
దురాలోచనలు చేసే మనసుని దండిస్తూ ఉంటుంది ఈ కోదండంతో అమ్మ.
మనస్సనే చెరకు విల్లుని ధరించి వస్తున్న, ఆ మనోరూపేక్షుకోదండా కు వందనం.
ఓం శ్రీ మనోరూపేక్షుకోదండాయై నమః
11. పంచతన్మాత్రసాయకా
కోదండం ఒక్కటే ఉంటే చాలదు కదా, దానికి తగిన బాణాలూ ఉండాలి.
అమ్మవారు తన కుడివైపు రెండవ చేతితో పంచబాణాలు పట్టుకున్నది.
అవే పంచ తన్మాత్రలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు.
ఈ పంచ తన్మాత్రలనే మనం జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా అనుభవిస్తున్నాం.
ఈ పంచ తన్మాత్రలే స్థూలంగా చూస్తే పంచ భూతాలు.
శబ్దం ఆకాశం నుంచి ఉద్భవిస్తుంది, దాన్ని మన చెవి వింటుంది, అదే శ్రోత్రేంద్రియం.
స్పర్శ వాయువు ద్వారా తెలుస్తుంది. దాన్ని మన చర్మం గ్రహిస్తుంది, అదే త్వగింద్రియం.
రూపం అగ్ని ద్వారా ప్రకటితమవుతుంది. దాన్ని మన కన్ను చూస్తుంది, అదే చక్షురింద్రియం.
రసం నీరు ద్వారా బహిర్గతమవుతోంది. దాని రుచిని మన నాలుకతో ఆస్వాదిస్తాం,
అదే రసనేంద్రియం.
గంధం పృథ్వి ద్వారా ప్రకటితమవుతుంది. దాన్ని ముక్కుతో వాసన చూస్తాం,
అదే ఘ్రాణేంద్రియం.
ఈ పంచ తన్మాత్రలనీ బాణాలుగా చేసుకుని, దుష్టశిక్షణకై, శిష్ట రక్షణకై
లలితాదేవి ఆవిర్భవించింది.
పంచ తన్మాత్రలను ధరించి వున్న, ఆ పంచతన్మాత్రసాయక కు వందనం.
ఓం శ్రీ పంచతన్మాత్రసాయకాయై నమః
12. నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా
లలితాదేవి అరుణవర్ణంతో ఉందని ముందే తెలుసుకున్నాం.
ఆ అరుణవర్ణ ప్రవాహం ఈ బ్రహ్మాండ మండలాలనన్నింటినీ పూర్తిగా ఆవహించేసింది.
అమ్మవారిది అరుణ వర్ణం, అగ్ని వర్ణం, ఆదిత్య వర్ణం.
ఎరుపు సౌభాగ్యానికి సంకేతం, అందుకే మన సనాతన ధర్మంలో
ఎర్రని కుంకుమ ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకోవటం ఆచారంగా వస్తున్నది.
అమ్మ తన ఎర్రని కిరణ ప్రవాహంలో ఈ సమస్త బ్రహ్మాండ మండలాలనూ కప్పేసింది.
అంటే మొత్తం సమస్త విశ్వాన్నీ తన ప్రభావంతో ముంచేసింది.
తన అధీనం లోనే అన్ని బ్రహ్మాండాలనూ ఉంచుకుంది.
అమ్మవారి నుంచి వస్తున్న ఆ అరుణకిరణ ప్రభావంలో లోకాలోకాలన్నీ మునిగి వున్నాయి.
ఆ అరుణ కిరణ వర్షంలో అన్ని బ్రహ్మాండమండలాలూ ఆనందంలో వున్నాయి.
తన అరుణ కిరణ వర్షంలో బ్రహ్మాండ మండలాలన్నింటినీ ఆవరించిన,
ఆ నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల కు వందనం.
ఓం శ్రీ నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి