8, ఆగస్టు 2022, సోమవారం

రచయిత్రి పరిచయం

రచయిత్రి పరిచయం 

శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి గారు 1957లో నందివాడ శ్రీరామకృష్ణ శర్మ, లీలాకుమారి దంపతులకు జ్యేష్ఠ పుత్రికగా జన్మించారు. వీరికి చిన్నప్పటి నుంచే తల్లితండ్రుల వలన వివిధ ఆధ్యాత్మిక, వేదాంత కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొనటం అలవాటు అయింది. రచయిత్రి తనకు తండ్రి వైపు నుంచి విద్య, తల్లి వైపు నుంచి సాహిత్యం వారసత్వంగా వచ్చాయని భావిస్తారు. 1979 లో శ్రీ భట్టిప్రోలు రమేష్ కుమార్ గారితో వివాహం జరిగింది. ప్రమోద్, ప్రదీప్ ఇద్దరు సంతానం. M.Sc., M.Ed., PGDCA, Ph.D. చేసిన శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వృత్తి రీత్యా ఉపాధ్యాయ విద్యార్థులకు గణిత అధ్యాపకురాలు, ప్రవృత్తి రీత్యా రచయిత్రి. భట్టిప్రోలు విజయలక్ష్మి పేరుతో రాసిన ఎన్నో కథలు, వ్యాసాలూ, ప్రశ్నలు-సమాధానాలు, పిల్లల కోసం కథలు, నవలలు వంటివి వివిధ పత్రికలూ, పేపర్లలో ప్రచురితమయ్యాయి. సాహిత్యమంటే ఎంతో ఇష్టం. చదవటమంటే ఇష్టం. చదువు చెప్పడమంటే ఇష్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రచురించిన కొన్ని గణిత పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించారు.  తెలుగు అకాడెమీ వారు ప్రచురించిన D.Ed., B.Ed. గణిత బోధనా పాఠ్య పుస్తకాలు రచించారు. ఎన్నో పాఠశాలలు, కళాశాలలలో గణితం మరియు గణిత బోధనా శాస్త్రం బోధించిన విజయలక్ష్మి గారు 2014 లో వివేకవర్ధిని సంస్థ వారి నీలంసంజీవరెడ్డి ఉపాధ్యాయ శిక్షణా కళాశాల నుంచి పదవీ విరమణ చేశారు. 

గత కొన్నేళ్ల నుంచీ, మారుతున్న పాఠకుల అభిరుచిని గమనించి డిజిటల్ పుస్తకాలు ఎక్కువగా చదువుతున్న పాఠకులకు వీలుగా బ్లాగులు రాయటం ప్రారంభించారు. చిన్ననాటి జ్ఞాపకాలతో "జ్ఞాపకాలదొంతర", భర్తతో కలిసి భారతదేశమంతా చేసిన విస్తృతమైన ప్రయాణాల అనుభవాలతో, "ప్రయాణోపనిషత్" అనే బ్లాగులు రాస్తున్నారు. ఈ బ్లాగులు రెండూ కూడా పాఠకుల మెప్పు పొందాయి. ఇటీవల "శ్రీలలితావిజయం" అనే బ్లాగ్ లో శ్రీ లలితా దివ్య రహస్య సహస్ర నామ వ్యాఖ్యానం, అమ్మవారి కరుణాకటాక్షాల వల్ల విజయవంతంగా ప్రచురించబడి, పాఠకుల ప్రసంశలు అందుకుంది. ఆ ప్రోత్సాహమే ఈ పుస్తక ప్రచురణకి దోహదపడింది. ఏ అంశం మీద రాసినా, సరళమైన భాషతో, ఎదుట పాఠకులను కూర్చోపెట్టి విడమరిచి చెప్తున్నట్టుగా రచించటం వీరి ప్రత్యేక శైలి. ఈ ప్రత్యేకత వల్ల పాఠకులు రచయిత్రి తమతో సంభాషిస్తున్నట్టు భావిస్తూ రచనలో లీనమయి చదువుతారు. 

ఈ "శ్రీలలితా విజయం" ముఖ్యంగా సంస్కృతాంధ్రాలు కఠినంగా భావించే సామాన్య పాఠకులకు
కూడా అమ్మవారిని గురించి సులభంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వేయి నామాలనీ  
వాటి అర్ధాలనీ విపులంగా వివరించి చెప్పిన రచన ఇది. ఈ రచన పుస్తకరూపంలో కూడా పాఠకులకు సంతృప్తినీ, ఆనందాన్నీ కూడా ఇస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు. చదవండి, చదివించండి. అమ్మవారి భక్తుల ఇంట్లో వుండదగిన పుస్తకం ఇది. అమ్మవారిని ధ్యానించండి, ఉపాసించండి. ఆనందం పొందండి. 

శ్రీ లలితాంబికాయై నమః 




అభిప్రాయాలు --- అభినందనలు

 అభిప్రాయాలు --- అభినందనలు


 1. శ్రీమతి విస్సా భారతలక్ష్మి గారి అభిప్రాయం 

ఓం శ్రీ మాత్రే నమః 

అక్కకు జిజ్ఞాస తత్త్వం వుంది. తనకు హిందూ సంస్కృతీ, సనాతనధర్మం, దేవతల మహాత్మ్యం గురించి తెలుసుకోవాలని చాలా ఉత్సాహం. అందు గురించే తాను చాలా పుస్తకాలూ, గ్రంధాలు, ఉపనిషత్తులు, వాటి తాలూకు వ్యాఖ్యానాలు చదివేది. శ్రీ సిద్ధేశ్వరానందస్వామి లాంటి వారి భాషణాల ద్వారా చాలా జ్ఞానం సంపాదించింది. భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలని సందర్శించి వాటి స్థలపురాణాలు, మహాత్మ్యాలు (ప్రసిద్ధ దేవాలయాలవి) తెలుసుకుంది. వీటన్నిటి ద్వారా ప్రేరేపింపబడి ఈ లలితాసహస్రనామభాష్యం వ్రాసేటందుకు తగిన జ్ఞానం, అర్హత సంపాదించింది. ఆ అమ్మవారి అనుగ్రహంతో, ఎంతో దీక్షతో ఈ వ్యాఖ్యానం వ్రాసి తాను, మనందరికీ అందించటం నిజంగా నాకు చాలా ఆనందంగా వుంది. ఇది మన అదృష్టం అని భావించవచ్చు. ఇక తన వ్యాఖ్యానశైలి చూస్తే, తనకు తెలుగుభాష మీద వున్న పటుత్వం తెలుస్తుంది. తాను వాడిన పదాలు కూడా చాలా సున్నితంగా మనసుని హత్తుకునే లాగా వున్నాయి. 

ఇందులో నాకు చాలా నచ్చిన విషయం, మొదట అమ్మవారి చిత్రం ఉండటం. చదివేవారిని ముందు లలితాదేవిని తల్చుకోమని చెప్పటమే. అలాగే నామ వివరణ చివరిలో, ఓం శ్రీ ...... నమః అని వ్రాయటంలో మళ్ళీ అమ్మవారిని స్మరించమని చెప్పటమే. అదే కదా అందులోని పరమార్ధం.
అమ్మవారి ప్రతి నామ వివరణలో అనేకానేక అర్ధాలు, వాటి మూలాలు, సందర్భాలు కనిపిస్తాయి. వాటిని ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగాలు, పురాణాలు, ఇంకా ఎందరో ఋషుల ద్వారా వ్రాయబడిన గ్రంధాల ద్వారా సేకరించి, సమయోచితంగా కూర్చటం చాలా ఆసక్తికరంగా వుంది. మనకు తెలియని ముఖ్యవిషయాలు, ముఖ్యంగా మన పురాణాల లోని కొన్ని సందర్భాలు ఇందులో తాను పొందుపరిచింది. 

లలితాసహస్రపారాయణ చేసేవారికి ఈ నామ వివరణ, అమ్మవారి పట్ల మరింత శ్రద్ధ, భక్తి కలిగేటట్లు చేస్తుంది. ఎందుకంటే, ఈ అర్ధాలు, సందర్భాలు తెలియడం మూలంగా, ఆ నామం చదివేటప్పుడు అమ్మవారి శక్తి మన ముందు ద్విగుణీకృతమై నిలుస్తుంది. ఈ కారణంగా మనం యాంత్రికంగా సహస్రనామాలు చదవటం బదులు ఆ నామంతో పాటు దాని అర్ధాన్ని కూడా మనసులో తల్చుకుని పారాయణ చేస్తే, అమ్మవారి మీద మన ఏకాగ్రత పెరుగుతుంది. పారాయణానికి సార్ధకత చేకూరుతుంది. 

తాను ఎంతో దీక్షతోనూ, భక్తితోనూ, లీనమై తన విజ్ఞానాన్ని మన ముందు ఉంచినందుకు, మా విజయలక్ష్మి అక్కకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. తాను చేసిన ఈ కృషి ఫలితం, అమ్మవారి ఆశీస్సుల ద్వారా తనకు తప్పక అందుతుందని, అలాగే అది చదివిన మనందరకు కూడా అమ్మవారి దీవెనలుంటాయని ఆశిస్తున్నాను. 


---------------------భారతలక్ష్మి 

********************************************************


2. శ్రీమతి అజిత గారి అనుభవం

మేడమ్ గారు నమస్కారంచాల చక్కగా వివరించారు. మీతో పరిచయం అద్బుతమైన  ప్రసాదం. అమ్మ సహస్ర నామాలు అర్థ వివరణ చదువుతున్న సమయంలో అమ్మవారు నా ప్రక్కన కూర్చోవడం, నాట్యం చేయడం, ఆనందంగా కనిపించడం లాంటి అనుభవాలు జరిగాయి. మీరు వ్రాసిన ప్రతి నామంలో ఓ ప్రత్యేకత ఉంది. అమ్మవారి అనుగ్రహం మీపై సదా ఉండాలని, ఇలాంటివి మరిన్నో రాయాలని, మా లాంటి  చిన్న వారికి  మీరు గురువులుగా  ఉండి, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో  సౌందర్యలహరి, దేవిభాగవతం లాంటి గ్రంథాల సారాంశం మాకు తెలపాలని, తెలియని వారికి మార్గం కావాలని, ఆ అమ్మవారి దీవెనలు మీపై నిరంతరం సూర్య కిరణాలుగా వెలుగులు వెలగాలని, మనస్పూర్తిగా మనసార మీకు సదా నా పాదాభివందనాలు. చాల చాల చాల చక్కటి అనుభవాలు, ఆనందం మీ ద్వారా అనుభవ అనుభూతిని కలిగించారు. నిజమండి ఏంతటి అనుభవం. అమ్మను వర్ణించుట నా జన్మ ధన్యం. మీ ద్వారా నాకు చాల చాల అమ్మతో అనుబంధం పెరిగింది. ధన్యురాలిని. చాల చాల సంతోషంగా ఉందండి. జై గురు చండి హ్రీయానందబాబా గారుమేడమ్ గారు మీరు పంపిన ప్రతి నామం చాల విశేషం. అర్థ వివరణ లో నాకు కలిగిన ఒకటి రెండు అనుభవాలు చెప్పాలనుకున్నాను. మేడమ్ మొదటగా నేను కొన్ని రోజుల వరకు ఊరికే చదువుతూ వెళ్లాను. ఆ తరువాత నేను పెద్దగా పట్టించుకోలేదు. ఓ రోజు ఊరికే చూస్తూ ఉంటే, నా వెన్ను తట్టి కొట్టినంతగా అనిపించి, ఏంటి ఇలా జరిగింది అని చూసా ఎవరు లేరు. మరల చూసా లేరు. ఇక ఆ విషయాన్ని వదిలేసి 176 నామం చదువుతుంటే నాలో కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆనామంలో మా గురువుగారు హ్రీయానందబాబా గారు కనిపించడం, అమ్మ చండిమాత  కనిపించడం జరిగింది. వెంటనే తేరుకొని మరల మరల చూసా. అదే రూపం కనిపించింది. చాల విశేష స్పందన లభించింది.

ప్రతి నామంలో ఓ అందమైన అనుభవం. అది అనుభవించే వారికే తెలుస్తుంది కదా. మరి యొక్క సారి  నాట్య మయూరం లా...... ఆ సమయంలో నా శరీరం పూర్తిగా తెలియని అనుభూతిని ఆస్వాదించిందండి. చాల అనుభవాలు జరిగాయి. మీరు పడిన శ్రమ  మీకు తెలియకుండానే ఫలితం ఆ భగవంతుడు వరంలా ప్రసాదించాడు. మేడమ్ గారు మీరు పరిచయం కావడం నా జన్మ ధన్యం. మీతో జరిగిన అథ్యాత్మిక సత్సంగం పూర్వ జన్మ ఫలం. నేను మా గురువు గారితో సంభాషణ చేసాను అనే ఆనందం పూర్తిగా కలిగింది. ఇక్కడ విజయలక్ష్మి మేడమ్ గారు కాదు, హ్రీయానందాబాబాతో జరిగిన అద్భుతమైన మాటలు అనే అనాలి. మాటలు రావడం లేదు. చెప్పాలని ఉన్నారాయాలని ఉన్నాఈ జీవితం సరిపోదు. భలేగా ఉందండి మీ సహస్ర నామ వివరణ. మీతో  మాట్లాడటం, మీతో ఈ బంధం ఏర్పడటం, నిజంగా నా జన్మ ధన్యం మేడమ్. తప్పుగా ఉంటే మన్నించగలరు. పెద్దవారు మీ ముందు నేను ఏదీ చెప్పలేను. భగవత్ సంకల్పంతో మీరు ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో రాసి మా లాంటి మామూలు ఏలాంటి అర్హత లేని వారిని మీ మార్గ ప్రయాణంలో నడిపించాలని కోరుతూనా మనస్పూర్తిగా కృతజ్ఞతాభి  పాద వందనములు మేడమ్ గారు ఏమైన అక్షర దోషం ఉన్న సరిదిద్దుతూ గురువుగారిగా  ఈ శిష్యురాలిని క్షమించ గలరు. సర్వదా మీ ప్రేమకు, మీ అభిమాన ఆప్యాయతకు సర్వదా పాద కృతజ్ఞతాభివందన నమస్కారములతో, మీ ప్రేమకు నేను ఓ భక్తురాలిని. చాల చక్కటి అనుభవించిన అనుభవం.  

మీరు రాసిన ప్రతి వాక్యం సహజ సిద్ధం.  అమ్మ  అమ్మే కద మీ లాంటి సాధన పట్టుదల ఉన్న వారిని తన బిడ్డలుగా తన ఒడిలో  చెర్చుకొని ఇలాంటి మహత్తర శక్తి కార్యానికి మిమ్మల్ని సిద్దపర్చడం చాల అద్భుతం. మీ రాసిన శ్రీ లలిత సహస్ర నామాల  వివరణ  ఓ తపస్సు లా ధ్యాన మార్గంలో నడిపించిది అమ్మ. నిజమే ప్రతి ఒక్కరి అభిప్రాయం చాల చాల ఆనందంగా రాసారు తమ దైన అనుభవ సరళిలో రాసారు. చిన్న పిల్లలకు సైతం అర్థం అయ్యేలా ఉంది. మీ కష్టం మీ కృషి ఏ ఒక్క నామంలో వృధా కాకుండా చాల చాల జాగ్రత్త గా శ్రీ లలితమాతయే మీ హృదయ స్పందనైన పీఠం పై కుర్చోని సహస్ర నామ వివరణ పూరించడం జరిగింది. విజయ ఫథం పై రథ యాత్ర మహోత్సవ కార్యక్రమం  జరిగేలా చేసిన  మీ సాహస ఉన్నతికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు చాల ఆనందం మేడమ్ గారు. ఇదే ఇదే నా హృదయ పూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు. త్వరలో మరి యొక్క పారాయణ గ్రంథం ఆ అమ్మ సంకల్పం తో…

............అజిత 

********************************************************


3. శ్రీమతి లక్ష్మీ రాధిక అభిప్రాయం 

|| శ్రీ మాత్రే నమః ||

శ్రీ లలితా దేవిని స్తుతిస్తూ పఠించే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత  ఉందనీ, భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినవారికి సకల శుభాలూ, సౌభాగ్యాలూ, ఆయురార్యోగాలూ ఆ పరదేవత ప్రసాదిస్తుందనీ, ఆ శ్రీమాత మీద విశ్వాసం గలవారి ప్రగాఢమైన నమ్మకం. నేను కూడా మా అమ్మా నాన్నగార్లు ఇచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహం, ప్రోద్బలంతో వాళ్ళు చెప్పిన ప్రకారం లలితా సహస్ర నామ పారాయణ చేస్తూ ఉంటాను. అయితే నాకున్న పరిమిత జ్ఞానం వల్ల, ఆ సహస్ర నామాల అంతరార్ధాలు, వివరణ అంతగా తెలియకపోయినా, నాకు తెలిసినంతవరకు అర్ధం చేసుకుని పారాయణ చేసుకుంటూ ఉంటాను. ఆ అమ్మవారి దయవల్ల బాగానే సాగుతూ వస్తోంది.

స్తోత్రాలు పఠించటం మంచిదే. అయితే ఏ స్తోత్రమైనా బాగా అర్ధం చేసుకుని చదివితేనే, పరమార్ధం లభిస్తుంది అనేది సత్యం. నోటికి వచ్చుకదా అని మనసు పెట్టకుండా, అర్ధం తెలియకుండా చదివితే అది పరిపూర్ణం కాదు. ఈ విషయానికి సంబంధించి నాకు ఒక సమాధానం చూపించింది, శ్రీ లలితావిజయం పేరుతో, శ్రీ లలితా సహస్ర నామ సరళ వ్యాఖ్యానానికి  శ్రీకారం చుట్టిన శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి. ఇప్పుడు లలితా సహస్ర నామ పారాయణ చేస్తున్నప్పుడు ప్రతీ నామం అర్ధవంతంగా, ఎంతో  భక్తిపరంగా  అనిపిస్తోంది. 

నిజానికి ఇంటర్నెట్లో కొంతమంది ఇచ్చిన వ్యాఖ్యానాలు ఇప్పటికే కొన్ని అందుబాటులో వున్నాయి. కానీ అవి అంతగా ఎప్పుడూ చదవాలి అనిపించలేదు, పట్టించుకోలేదు గూడా.  ఎప్పుడైతే మన భట్టిప్రోలు విజయలక్ష్మి, శ్రీ లలితాసహస్రనామ వ్యాఖ్యానం రాస్తోంది అని తెలిసిందో, అప్పటినించి చాలా ఆసక్తితో ఆ వ్యాఖ్యానం చదవడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడూ తనతో డిస్కస్ కూడా చేసేదాన్ని, నాకేదైనా  సందేహం వస్తే అర్ధం చేస్కోవడానికి. ప్రతిరోజూ ఆవిడ పెట్టే పోస్ట్స్, మొదటినించి ఈరోజు వరకూ క్రమం తప్పకుండా చదువుతూ వచ్చాను.

ప్రతీ శ్లోకమూ, అందులోని ప్రతీ నామము కూడా చాలా చక్కగా సులభమైన శైలిలో, చక్కటి వివరణలతో, ఆ నామాలకు అనుగుణంగా, సందర్భానుసారంగా వాటికి తగిన వేదాంతపరమైన విషయాలు జోడించి, చక్కగా తనదైన ప్రత్యేక రచనా శైలిలో సంకలనం చేశారు. సమగ్రంగా సహస్రనామాలలో ప్రతి నామం గురించిన వివరణ చాలా చక్కగా అమరింది. 
    
ప్రారంభంలో అమ్మవారి ఆవిర్భావాన్ని, ఆవిడ రూపాన్ని, ఆభరణాలని, వర్ణించిన తీరు ఆ అమ్మవారిని ప్రత్యక్షంగా చూపించినట్టుగా ఉంది. అమ్మవారి పరాక్రమాలనూ, రధాలనూ,  దండనాయకురాళ్లతో ఆవిడ భండాసురాది రాక్షస సంహారం చేసిన తీరునూ, వర్ణించిన విధానం చాలా బావుంది. షట్చక్రాల ప్రాశస్త్యం, వాటిల్లోని ఒక్కో చక్రము, ఆ చక్రాల అధిష్టానదేవతలు,  ఇంద్రధనుస్సు లోని రంగులని పోలే ఆ దేవతల మేని రంగులు, ఆ చక్రాలలో ఉండే పద్మాలు, వాటి రేకుల సంఖ్య, ఆ చక్రాలు నిర్దేశించే మానవ శరీర ధాతువుల గురించి, చాలా సమాచారం సవివరంగా తెలియచేశారు. శ్రీ చక్రం, అందులో ఉండే  త్రిభుజాలు, శ్రీచక్రం లోని తొమ్మిది ఆవరణల్లోనూ వున్న తొమ్మిదిమంది ప్రధాన యోగినుల గురించి కూడా చాలా  వివరాలు వేదాంతపరంగా, గణిత పూర్వకంగా పొందుపరిచారు.

శివ శివాని ల మధ్య అనురాగం, ప్రేమ, శృంగారం చాలా సహజంగా,  దైవత్వం తెలిసేటట్టు  వర్ణించారు. శివుడు, శివాని ఒక్కరేనని, నారాయణుడు, నారాయణీ వేరువేరు కాదనీ, అద్వైత  సిద్ధాంతాన్ని బలపరిచి ధృవీకరించారు. శ్రీ లలిత, ఆబ్రహ్మకీటజననీ అనీ, అమ్మవారిని ప్రతి జీవిలోనూ చూడగలగాలనీ, సర్వం బ్రహ్మమయమనే నిజాన్ని గ్రహించాలనీ, ఆ సాధనే మనల్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్తుందనే అర్ధాన్ని కూడా విశదీకరించారు. అక్షరమాల లోని ప్రతి ఒక్క అక్షరంతో అమ్మవారి నామాల కూర్పు ప్రశంసనీయం. శ్రీ లలితాదేవిని ఒక స్త్రీ మూర్తిగా, మాతృమూర్తిగా, భార్యగా, అనురాగమూర్తిగా, గురువుగా, శిష్ట రక్షకురాలిగా, దుష్టులని శిక్షించే దేవత లాగా, కైవల్యప్రదాయినిగా, వేదమూర్తిగా, పండితురాలిగా, చతుషష్టి కళామయిగా, ఆయా నామాలకు చక్కగా సరిపోయేట్టుగా చిత్రీకరించారు, వర్ణించారు.

ఒక్కొక్క నామానికి విజయలక్ష్మి ఇచ్చిన వివరణ చదివాక తెలిసింది, ఆ సహస్రనామాలలో అంత అర్ధం దాగి ఉందనీ, ప్రతీ నామానికీ అంత వివరణ ఉందనీ. ఇంతటి మహత్కార్యాన్ని అంత చక్కగా చేయగలిగారంటే, ఆ అమ్మవారి అనుజ్ఞ, కృప విజయలక్ష్మి వెన్నంటే ఉండి ఉండాలి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పటికీ భట్టిప్రోలు విజయలక్ష్మికీ, వారి కుటుంబ సభ్యులకీ  ఉండాలని కోరుకుంటున్నాను. నాకూ చదవగలిగే అవకాశం కలిగినందుకు, నేను కూడా ఆ అమ్మవారికి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. 

|| శ్రీ మాత్రే నమః ||

-------------------లక్ష్మీరాధిక 

********************************************************


4. శ్రీమతి సునీత గారి అభిప్రాయం  

నేను రోజూ మీ శ్రీ లలితా సహస్ర నామ సరళ వ్యాఖ్యానం  చదువుతున్నాను. మీరు అద్భుతంగా వ్రాస్తున్నారు, ప్రతి నామాన్ని విపులంగా వివరించిన విధానం, మీకు పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వాటిపై ఎంత లోతైన పరిజ్ఞానం ఉందో చూపిస్తుంది. మీ జ్ఞాపకశక్తి కి నా నమస్కారాలు. మీలాంటి గురువుని కలిగి ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాలిని మరియు మన చర్చలన్నీ ఆధ్యాత్మిక మార్గంలో నా ఆసక్తిని పెంచాయి. 

మన మానససరోవర్ యాత్ర నుండి, నేను అడిగిన చాలా సందేహాలను మీరు ఉదాహరణలతో నివృత్తి చేసారు. అవన్నీ ఫోన్ కాల్‌లలో లేదా మనము కలిసినప్పుడల్లా. ఆ చర్చలలో నాకు కలిగిన మరిన్ని ప్రశ్నలకు మీ అనుభవాలతో ప్రస్తుత తరానికి సరిపోయే సమాధానాలు ఇచ్చారు. ఈ నామాలన్నింటినీ,  సందేహాలు తలెత్తకుండా, మీరు  సరళమైన భాషలో మరియు సమగ్రమైన వివరణలతో రాసారు, ఎక్కడా పక్కదారి పట్టలేదు. అందుచేత నాకు ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు రాలేదు. రోజూ నేను నామాలు చదువుతున్నప్పుడు, మీరు వాయిస్ ఇస్తున్నట్లు అనిపించింది. మీరు నా పక్కన నిలబడి వివరిస్తునట్టు ఉంది. అర్ధం తెలియక, ఇన్ని రోజులు లలితా సహస్రనామం చదివాను, కానీ మీ శ్రీ లలితా విజయం చదవడం మొదలుపెట్టాక, నా మనసుకి  అర్ధం తెలిసి, అమ్మవారిని చూసిన అనుభూతి పొందుతున్నాను. ఉదాహరణకు: అమ్మవారి కళ్ళు, ముక్కు, చీర, గజ్జల సవ్వడి మొదలైనవి మరియు లలితా దేవి యొక్క అందమైన ముఖం కనిపిస్తుంది. 

ఈ మధ్యలో చాలామంది, ఒక దేవుడిని పూజిస్తూ ఇంకో దేవుడిని ఫాలో అయ్యే వాళ్ళని ఏదో ఒకటి  అంటున్నారు. అలా కాకుండా అందరూ ఒకటే, అందరు అమ్మ స్వరూపాలే, అని చాలా బాగా చెప్పారు. ఈ స్తోత్రాల అర్థం తెలిశాక చదవడంలోని మాధుర్యం చాల నచ్చింది. నేను ఇతర స్తోత్రాలను కూడా ఈ విధంగా అర్థం తెలుసుకొని చదవడం ప్రారంభించాను. మీ సమయం మరియు కృషికి చాలా ధన్యవాదాలు. అమ్మవారి కృపా కటాక్షం మీ పై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ఇలాంటి మరెన్నో స్తోత్రాలకి వివరణ ఇస్తారని ఆశిస్తూ, 

మీ ఆశీర్వాదాలు మా పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ....

-------- సునీత దొంత 



********************************************************


5. Smt. Padmavati Rajasekharuni's Opinion

It is my proud privilege to share my views on ‘Lalitha Sahasra Nama Sarala Vyakhyanam’ written by Smt. Bhattiprolu Vijayalakshmi. I have followed it quite regularly and found it thought provoking and highly intriguing. I have read such analyses even earlier, but this one appealed to me the most because I did not consider it as something religious or divine, but could view it as an analogy of cosmic super power that controls our actions and reactions.

Mrs. Vijayalakshmi has, in her Vyakhyanam, made Sree Lalitha matha appear before our eyes, live and as an all-time ultimate supremacy. In conformation with  the Hindu doctrine, ‘Yatra Naryastu Pujyante, Ramanthe Tatra Devatah’, Lalitha Ammavaru is shown as the Super Naari and all other deities flourishing in her aura. The author has written not just enough to understand the meaning of the thousand names but gone beyond, with allusions, personal experiences and library references to expand the concept behind the thousand names.

I congratulate Mrs. Vijayalakshmi  for having accomplished this mammoth task with single devotion and dedication giving her hundred percent time and thought. I have seen her feel uncomfortable sometimes during that thought process till she pens down what she had been brooding over. She would cut herself away from social chats and limit them only to the essential. Late night scripting, constant references, regular cross checking with elders in the family – this was her life for the past few months. And all this would not have been possible without the constant and unconditional support extended by her husband Mr. Ramesh Kumar. He had been most accommodative and understanding all through. He is the invisible and silent co author for this blog.

Knowing the couple as regular pilgrims to almost all places of divine interest in India and abroad even from their young years, I feel that this attempt is the culmination of their spiritual journey which had started decades ago.

May goddess Lalitha shower the downpour of her choicest blessings of good health, inner peace and harmony to them. May Mrs. Vijayalakshmi come up with more such writings to spread her knowledge to one and all.

Om Shanti. I am blessed to be the author’s sister.

Padmavati Rajasekharuni


********************************************************

6. Opinion of Sri Nandiwada Ramanand

Dear All,
Lalita Sahasranama is a sacred and a secret form of worship. By secret it was meant that till it was disclosed, it's a secret. But afterwards, it was brought into public domain. Here the public are those who are deserving the knowledge of this sacred stotram. 


The commentary rendered by Vijayalakshmi is not only in very understandable terms but also a comprehensive explanation. She could vividly portray the implicit meaning into words as she was blessed and has visited almost all the Shakthi peethams and has had an insight of our Supreme mother.


Most important for undertaking a venture of this magnitude, one should have 'Her' blessings, which Vijayalakshmi received in abundance. It was divine to me. My best wishes for  further forays into such godly pursuits. Thank you.

Nandiwada Ramanand


********************************************************


7. శ్రీ గరికపాటి  ప్రభాకర రామానుజ స్వామి  గారి అభిప్రాయం

శ్రీరామ జయం! నమస్కారం అండీ! శ్రీమతి విజయలక్ష్మీ రమేష్ కుమార్ భట్టిప్రోలు,

మీరు శ్రీ లలితాసహస్రనామావళి వ్యాఖ్యానం వ్రాయడం, అందులోకీ సరళంగా అందరికీ సులభమైన రీతిలో తెలుగు భాషలో వ్రాయ సంకల్పం, పరాభఙట్టారికా అపాంగ వీక్షణీయత మీపై పడటం ... మొట్టమొదటి ఓం శ్రీమాత్రే నమః  అను నామంలో శ్రీ కి మీ వివరణ శైలి (పద విన్యాసం) చదవగానే మీ లక్ష్యం మీ భావం ప్రస్ఫుటంగా వ్యక్తమైంది.  ఈ లలితా సహస్ర నామాల మాలికలో ప్రతీ పదం దేనికదే స్వతంత్ర జీవలక్షణం కలవి...

మీరు శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానం వ్రాయడం, అందులోకీ సరళంగా అందరికీ సులభమైన రీతిలో తెలుగు భాషలో వ్రాయ సంకల్పించడం మీ ఆర్తి కి పరాకాష్ట, పరాభట్టారికా అపాంగ వీక్షణీయత మీపై ఉండటం, మొట్టమొదటి ఓం శ్రీమాత్రే నమః అను నామంలో, శ్రీ కి సమృద్ధి, ముక్తి  అనే మీ వివరణ శైలి పద విన్యాసం చదవగానే మీ లక్ష్యం మీ భావ వ్యక్తీకరణ నాకు ఓ గని, ఓ నిధి దొరికింది అని గొప్ప సంతృప్తి కలిగింది. 

నిజారుణం, ఆజ్ఞ చక్రం, మృగనాభి కస్తూరి తిలకం, ప్రవాహంలో చేపల చూపులు ప్రదర్శించే తీరు, నవ చంపక పరిమళం, నాసాభరణమై తరళ కాంతిపుంజాల ప్రభను లుప్తం కావించడం, అనునయపు నడక, శ్లోకం 15లో స్తనభార దళన్మధ్య మాయను, అదే ఆధారంగా మూడు ముడతలలో ముజ్జగములను నిక్షిప్తం చేయు ప్రక్రియ, శ్లోకం 23లో సుధాసాగర మధ్యస్తగా మణిద్వీప నివాసినిని ఆవిష్కరించిన వైనం అద్భుతంగా ఉంది.

శ్లోకం 34 హరనేత్రాగ్నిలో సృష్టి కార్యం(క్రియ) చేయగలనేర్పరితనం, ప్రజ్ఞ మీ స్వంతం. 72వ శ్లోకం లో రమా రాకేందు సాక్షిగా రతి రూపాన్ని ఆవిష్కరించి అర్థనారీశ్వర తత్వం ప్రతిపాదించిన అద్వైతం, 141లో చిత్కళా అంటూ జీవులలో ఉండు జీవం నా అంశయే, చైతన్యశక్తిని అనుగ్రహించి ఆపై మిథ్యా జగత్తు కు ముక్తి తానై లయలాస్యం సాక్షాత్త్కరింపజేసిన మీ పాండిత్యం అజరామరం. 

మీ ఈ లలితా సహస్ర నామాల వ్యాఖ్యాన కావ్య కళా మధువు, రసజ్ఞులచే పానం గావించబడి పురాతనమైన, అంటే అతి ప్రాచీన భాష గ్రంథ రచనా ప్రాశస్త్యం పొంది, నిత్య నూతనంగా మీ భట్టిప్రోలు వంశవృక్షంలో ఈ వ్యాఖ్యానం  శిఖరాగ్రంమై వెలుగొందుతూ చిరస్థాయిగా నిలిచిపోనుంది. చాలా బాగుంది.  చాలా సంతోషం మీ ఈ కృషికి అభినందనలు.  జగజ్జననీ దివ్య ఆశీస్సులు. శుభమస్తు!! శుభం!!  

మీ ఆత్మీయ భగద్భంధువులు,  శ్రీమాన్ ప్రభాకర రామానుజ స్వామి 

9133802229 , హిల్కౌంటీ, మియాపూర్


********************************************************

8. శ్రీమతి ముళ్ళపూడి శ్రీదేవి గారి అభిప్రాయం

శ్రీ మాత్రే నమః 

శ్రీలలితా పరమేశ్వరి వశిన్యాది వాగ్దేవతలకు - తన సహస్రనామ స్తోత్ర వైభవాన్ని భక్తులకు వర్ణించి, వివరించి చెప్పమని ఆదేశించింది. వశ్యవాక్కులైన వాగ్దేవతలు వర్ణించిన తన వైభవాన్ని దేవి మెచ్చి ఆమోదించింది. 

పరదేవత అనుమతి, అనుగ్రహం లేనిదే ఎంతవారికయినా వాక్సిద్ధి లభించదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టలేనట్లు! అమ్మ అనుమతితో వాగ్దేవతలు విజయలక్ష్మిని ఆవహించి, తాము దర్శించిన లలితావైభవాన్ని ప్రత్యక్షం చేసి, ఆ తల్లి నామ రూప గుణ విశేషాలను భక్తులకు, జిజ్ఞాసువులకు వివరించమని ఆదేశించారని నా కనిపిస్తోంది. 

సామాన్యభక్తులకు కూడా వారి స్థాయిలో అర్ధమయ్యే రీతిలో దేవీ నామ వైశిష్ట్యాన్ని వివరించింది విజయలక్ష్మి. ఆ నామానికి, ఆపదానికి నిఘంటువులో ఎన్ని అర్ధాలున్నాయో చెప్పి, ఆ అర్ధాలన్నిటినీ అమ్మ నామాలకు అన్వయించి, ఆ నామభావం అర్థమయ్యేటట్లు చెప్పింది విజయలక్ష్మి. నారాయణ తత్త్వమూ, నారాయణీ తత్త్వమూ ఒకటేనని ఎన్నో సందర్భాలలో కథల రూపంలో నిరూపించింది. 

శ్రీ లలితాసహస్రనామస్తోత్రం పారాయణం ఒక అద్భుతమైన అనుభవం. అనుష్టుప్ ఛందంలోని ఆ శ్లోకాలు సంగీతాత్మకంగా ఉంటాయి. ఎవరికి వారు ఏకాంతంలో నిదానంగా, చిన్నగొంతుతో చెప్పుకున్నా, సామూహికంగా, ఏకకంఠంతో పారాయణ చేసినా ఆ తృప్తి, సంతోషం అనుభవైకవేద్యం. లలితాదేవిని ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి కలుగుతుంది. అమ్మతత్త్వం బోధపడినట్లే, సాంద్రమైన ఆనందాన్ని అనుభవిస్తాము. 

"యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః, ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే" అని విష్ణుసహస్రనామాలను గురించి భీష్మాచార్యుడు చెప్పినట్లు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పరదేవత గుణవైభవాన్ని ప్రత్యక్షంగా ప్రకటిస్తూ, మహిమాన్వితమైన ఈ మహామాలా మంత్రమై భాసిస్తోంది. ప్రతి ఒక్క నామమూ స్థూల, సూక్ష్మ, విశేషార్థాలతో దేవి గుణ, కర్మ, స్వభావాలను విశ్లేషిస్తుంది. దేవతలు,  ఋషులు,  భక్తులు అమ్మతత్త్వాన్ని భావాతీత స్థితిలో దర్శించి, ఆ తత్త్వాన్ని పురాణాలుగా, ఉపనిషత్తులుగా, స్మృతులుగా, భాష్యాలుగా ఉపాసకులకు వెల్లడి చేశారు. 

శ్రీ భాస్కరరాయల వారు ఆ భాష్యాలద్వారా అమ్మతత్త్వాన్ని తనలో ఆవాహన చేసుకుని భక్తిప్రపత్తులతో తనదైన ప్రత్యేక మార్గంలో భక్తలోకానికి అందించారు. భాస్కరరాయల వారి  మార్గాన్ని అనుసరించి విజయలక్ష్మి శ్రీ లలితా విజయాన్ని మహోన్నతంగా, సోదాహరణంగా మనకి ప్రత్యక్షం చేసింది. 

ఈ వ్యాఖ్యానం మొదలుపెట్టిన దగ్గరనుంచి విజయలక్ష్మి ప్రహ్లాదుడు లాగా - "పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషించుచున్, హాసలీలానిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్", సర్వకాల సర్వావస్థల్లోనూ లలితా పరదేవత చింతనామృతాస్వాదనంతో మరొక ధ్యాస లేకుండా గడిపింది. ఆ తృప్తి, సంతోషం తలమునకలుగా అనుభవించింది. అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా పొందింది. భాష్యరచనా యజ్ఞంలో పూర్తిగా కృతకృత్యురాలయింది. 

విజయలక్ష్మీ! శ్రీలలితాదేవి అనుగ్రహంతో నువ్వూ, నీ భర్తా, నీ పిల్లలూ, నీకుటుంబమూ అందరూ పరిపూర్ణమైన ఆరోగ్యంతో, సుదీర్ఘమైన ఆయుస్సుతో, సుఖశాంతులతో, సిరిసంపదలతో చల్లగా సంతోషంగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఇలాంటివి చేయవలసినవి, చెప్పవలసినవి చాలా ఉన్నాయి. త్వరగా మొదలుపెట్టు. 



----------ముళ్ళపూడి శ్రీదేవి



********************************************************


 9. శ్రీమతి తెన్నేటి అమృతవల్లి గారి అభిప్రాయం

ఓం శ్రీమాత్రేనమః.  

అభిప్రాయాలు చెప్పే అంత జ్ఞానం లేదు కానీ, నువ్వు ప్రతి నామానికి అందించిన ఈ విశ్లేషణలు  చదువుతునంత సేపు నన్ను నేనే మర్చిపోతాను. ఇలా మాకు అందించాలి అనే సంకల్పం కలగటం, నిజంగా అది మా అదృష్టం. ఎన్నిసార్లు చదివినా పారాయణ చేసేటప్పుడు మళ్ళీ అర్ధం చదువుతాను. నీ అపారమైన జ్ఞానశక్తికి నిజంగా నా ధన్యవాదాలు.      

ఆ జ్ఞానజ్ఞేయస్వరూపిణి నీయందు  ఇలాగే వుండి, ఇంకా ఎన్నో మాకు అందచేయగలవని, ఆ తల్లి కరుణతో రాయాలి, అని మా ప్రార్ధన. నీకు తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదం ఉంటుంది. నీకు ఏ ఆటంకమూ లేకుండా నీ  వెనకాల నిలబడి సహాయ సహకారాలు అందిస్తున్న,  శ్రీ రమేష్ గారికి, నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ లలితా త్రిపుర సుందరికి నా శతకోటి నమస్కారములు. నీకు ఆ సంకల్పము, నీకలమునకు ఆ శక్తి, ఇవ్వాలి అని మనఃస్ఫూర్తి గా కోరుకుంటున్నాను. 

  .............. తెన్నేటి అమృతవల్లి


********************************************************


10. శ్రీమతి గానుగపాటి సీతామహాలక్ష్మి గారి అభిప్రాయం 

శ్రీ మాత్రేనమః

విజయలక్ష్మీ!  నీ లలితా సహస్ర నామ వ్యాఖ్యానం చాల బాగుంది. అర్థం తెలుసుకుని చదివితే  చాల హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు ఎవరో రాసినట్టు, ఇది రెలిజియస్ గా అనిపించలేదు. అందరిలో దైవాన్ని చూడమన్నట్టు ఉంది. అంతే కాదు, అన్నిటిలో, ప్రకృతిలో దైవాన్ని చూడమన్నట్టు వుంది. దీనికోసం నువ్వు ఎంత కష్టబడ్డావో, అంత వివరంగా మీనింగ్ ఇవ్వటంలో తెలుస్తోంది. థాంక్ యు. 

ఇలాగే చాలా రాసి మాకు అందివ్వాలని, అందుకు దేవుడు నీకు  సహకరించాలని కోరుకుంటున్నాను. రమేష్ గారు చాల సపోర్ట్ చేసి ఇందులో భాగం అయ్యారు. మీ ఫ్యామిలీకి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. 


 ------------ గానుగపాటి సీతామహాలక్ష్మి 



********************************************************

11. శ్రీమతి మహేశ్వరి గారి అభిప్రాయం 

శ్రీ మాత్రే నమః

మీరు వ్రాసిన లలితా మాత నామాల యొక్క విశ్లేషణ చాలా చక్కగా, సరళంగా, చాలా ఆసక్తిగా ఎవరికైనా కూడా సులువుగా అర్థమయ్యే రీతిలో అద్భుతంగా ఉంది. నామాల యొక్క రహస్య విశ్లేషణ చాలా బాగా వివరించారు. చక్రాల గురించి వివరించారు. సాధన ఏ  భాగాల్లో ఎలా  జరుగుతుందో కూడా చక్కగా వివరించారు. ఎన్నో కొత్త విషయాలను మాకు తెలిపారు. అప్పుడే అయిపోయిందా అనిపించే లాగా ఎంతో బాగా, ఎంతో శ్రమపడి, మా కోసం చాలా పరిశ్రమ చేశారు. మీకు చాలా ధన్యవాదములు. నేను మిమ్మల్ని సహస్ర నామాలు వివరణ గురించి అడిగినప్పుడు,  చెప్పుకుందాం అన్నారు. నాకు 'అయ్యో నేను ఒక్కదాన్నే వింటే ఎలా', అనే బాధ ఉండింది.  ఆశ్చర్యంగా మీరు వెంటనే పోస్ట్ చేస్తాను, అని చెప్పగానే నేనెంతో ఆనందించాను. అన్ని నామాలు వివరణ అయిపోయింది. చదివాను. చదివినప్పుడు అర్థమవుతుంది. మళ్ళీ కొన్ని నామాల అర్ధం మర్చిపోతూనే ఉన్నాను. కానీ నా మార్గం మాత్రం మరువలేదు. ఎక్కడ మధ్యలో మొదలుపెట్టినాకూడా పారాయణ మాత్రం ఎల్లవేళల మానసికంగా కొనసాగుతూనే ఉంటుంది. నాకు అది బాగా అలవాటైపోయింది. మనసులో నామాలు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి. కానీ నేను ఏనాడు పుస్తకం తీసుకుని బట్టి చేయలేదు, వాటంతటవే వచ్చేసాయి. మళ్లీ మళ్లీ మీ వివరణ చదువుతాను.  మీరు చాలా ఎక్కువే వివరించారు. నాలాంటి వాళ్లకు అది చాలు. ఆంటీ మీరు సరస్వతి మాత నాకు. అంకుల్ చాలా ఓపికగా మీకు సహకరించారు. వారికి కూడా నా నమస్కారములు, ధన్యవాదములు తెలియజేయండి. ఇదంతా లలిత అమ్మవారి అనుగ్రహం వలన సాధ్యమయ్యింది. మీరు ఇలాంటివి ఇంకా ఎన్నో వివరణ ఇవ్వాలని నా కోరిక. బ్రహ్మానంద రసం అనే సముద్రములో ఓలలాడడానికి కావలసిన శక్తిని ఇచ్చి, ఆ మార్గంలో పయనింప చేయమని లలితా మాతని వేడుకుంటున్నాను. మీలాంటి వారి పరిచయం గొప్ప అదృష్టం లాంటిది.  

ఎలాంటి సందేహాలు వచ్చినా మీరు ఎంతో చక్కగా ఓపికగా వివరించేవారు. మీరు ఇలా ఇంకా కొనసాగించాలని,  కొత్త విషయాలను మాకు నేర్పించాలని, మీకు కావలసిన శక్తి అమ్మ ప్రసాదించాలని, వేడుకుంటూ మీకు నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు తెలియజేయుచున్నాను. 

శ్రీ మాత్రే నమః

----------------మహేశ్వరి 


********************************************************

12. శ్రీమతి ఉమాదేవి గారి అభిప్రాయం 

శ్రీమతి విజయ లక్ష్మి గారికి, నమస్కారములతో,
  
మీరు వ్రాస్తున్న లలితా సహస్ర నామ వివరణ మొదటి నుంచి చాలా ఆసక్తిగా చదువుతున్నాను. నాకు చాలా నచ్చింది. మా ఫ్రెండ్స్ కి కూడా ప్రతి రోజు నేను చదివిన వెంటనే పంపుతున్నాను. ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులగు దగు వారు చదువుతున్నారు. అమ్మవారి ప్రతీ నామ వివరణ కూడా పండిత పామర జనకంగా అనిపించింది నాకు. మీ వివరణతో ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. వాగ్దేవతలు, కళలు, కావ్యాలు, తంత్ర విద్యలు, షోడశీ విద్యలు, తిధి నిత్యాది దేవతలు మొదలగు వాటి గురించి తెలిసింది. 

శ్రీ లలిత అమ్మవారు ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ రూపాలలో ఉంటుంది, ఆ మాత శక్తి ఎలా ఉంటుంది, మనం అమ్మ వారిని ఎలా ధ్యానించాలి, అనుగ్రహం ఎలా పొందాలి, దుష్ట శిక్షణ ఎలా చేసింది, అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ పువ్వులతో, ఏ పదార్థాలతో, ఏ ఏ వేళలో పూజిస్తే అమ్మ ప్రసన్నురాలవుతుంది, అనే విషయాలని విపులంగా విశదీకరించారు. అంతే కాకుండా శ్రీ భాస్కర రాయల వారి గురించి మాకు తెలియచెప్పారు. గత ఆరు మాసాలుగా ఆనందంతో కూడిన శ్రమతో మా కందరికి ఆధ్యాత్మిక విందు చేశారు. మీకు నా  కృతజ్ఞతలు.
 
మూడున్నర సంవత్సరాల క్రితం, నా మానస సరోవరం యాత్రలో మీ పరిచయం కలిగినందుకు చాలా ఆనందం గా ఉంది. అప్పుడు మీ గురించి గానీ, మీ ఆధ్యాత్మిక వికాసం గురించి గానీ, అంతగా తెలియదు. తరువాత ఒక సంవత్సరం నుంచీ, మళ్ళీ అనుకోకుండా మనం కలవడం ముదావహం. మీ జ్ఞాపకాల దొంతర రచనల ద్వారా, మీది చిన్నతనం నుంచీ ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కటుంబమని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఇక మీ ప్రయాణోపనిషత్ రచనల ద్వారా మీరు దర్శించిన పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు, ఇంకా తెలియని అనేక విషయాలు తెలిసాయి.  

ఆ తరువాత కూడా మీరు మీ ఇంట్లో వికసించిన బ్రహ్మ కమలం,  హోమం ఫొటోస్ నాకు పంపుతూ మన పరిచయం కొనసాగడానికి సహకరించారు. చివరిగా, మీకు, మీ లలితాసహస్రనామ వివరణను ప్రచురించే ఉద్దేశ్యం ఉంటే అందులో నాకు కూడా భాగస్వామ్యం కలిగించమని కోరుతున్నాను. ఎంతయినా పుస్తకం పుస్తకమే కదా, ఎంత టెక్నాలజీ ఉన్నా. 

రమేష్ గారికి నా నమస్కారములు తెలుపగలరు. 


--------------------ఉమాదేవి


********************************************************


13. శ్రీమతి లోకా అపర్ణ గారి అభిప్రాయం 

నా జీవితం లో నేను ఒక రోల్ మోడల్ గారు భావించే విజయలక్ష్మి మేడం గారికి పాదాభివందనాలు.
నేను మీరు చేసిన ఈ అద్భుతమైన లలిత సహస్రనామ వివరణను గురించి మాట్లాడే స్థాయికి ఎదగలేదు. నా అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాను, తప్పులుంటే మన్నించగలరు. మీ వివరణ పెద్దగా భాషా జ్ఞానం లేనివాళ్లకు కూడా అర్థం అయ్యే విధంగా సరళంగా ఉంది. సరళంగా ఉండటం తో పాటు, భాష అందాన్ని కూడా తగ్గకుండా, ఎంతో అద్భుతంగా వివరించారు. మీ ప్రతి పనిలో సంపూర్ణమైన సాధికారత చూపుతూ, వివరణ ప్రారంభం, మధ్యమం, సమాప్తం అన్నిటిలోనూ మీకంటూ వైవిధ్యమైన శైలి ఉండి, మీ కష్టం తెలుస్తోంది. మీరు మనసు పెట్టి చేశారు. ఆ లలితా పరాభట్టారిక మీతోనే ఉంది. మీరు ఈ వివరణ ను పుస్తకీకరణ చేస్తే, భావి తరంలో వారికి కూడా ఉపయోగపడుతుంది మేడం గారు. మీ అదృష్టంలో మాకు కూడా భాగాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ,


----------------మీ అపర్ణ


********************************************************

14. శ్రీమతి మాధవపెద్ది ఫణి రాధాకుమారి గారి అభిప్రాయం

 శ్రీ లలితా విజయం (శ్రీ లలితా సహస్రనామ సరళ వ్యాఖ్యానం)

లలితా సహస్రనామాలపై సరళ వ్యాఖ్యానం వ్రాయాలనే విజయలక్ష్మి భట్టిప్రోలు గారి సంకల్పం చాలా గొప్పది.ఒక్కొక్క నామానికి ఆవిడ వ్రాసే వ్యాఖ్యానం చదువుతూంటే, విషయం ఇట్టే తేటతెల్లమవుతుంది. అంతేకాదు, ఇన్నాళ్ళూ నేను లలితాసహస్రనామాలు అర్ధం పూర్తిగా తెలుసుకోకుండా పారాయణం చేస్తున్నాననే విషయం కూడా నాకు తెలిసింది. నేను ఎన్నో ఏళ్ళుగా లలితాసహస్రనామ పారాయణ యాంత్రికంగా చేస్తున్నా ఈమధ్యనే అందులోని నామాలకు ఉన్న అర్ధాలను తెలుసుకోవాలని అన్పించటం, భట్టిప్రోలు విజయలక్ష్మిగారి సరళ వ్యాఖ్యానం చూడటం కాకతాళీయంగా సంభవించింది.

రోజుకొక శ్లోకం చొప్పున అవి తెలుసుకుంటూ చదువుతూఉంటే, ఎంతో ఆనందంగా అన్పించింది. ప్రతి నామానికీ ఉన్న అర్ధాన్నీ, ప్రాముఖ్యతనూ విజయలక్ష్మి వివరించే విధానం, అందరికీ అర్ధమయ్యే చిన్నచిన్న పదాలతో విశదీకరించి చెప్పటంతో  ప్రతినామం యొక్క విశిష్టత చక్కగా అర్ధమయింది. ఒక్కొక్క ముత్యాన్ని గుదిగుచ్చి అందమైన ముత్యాలహారాన్ని తయారుచేసే విధంగా అమ్మవారి ఒక్కొక్క నామాన్ని విశదీకరించి, సహస్రనామ హారాన్ని సమకూర్చిన విధానం బహుధా ప్రశంసనీయం. 

అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఈ శ్రీ లలితా విజయాన్ని విజయవంతంగా పూర్తిచేయటం జరుగుతుంది. విజయలక్ష్మి ఇదేవిధంగా మరెన్నో వ్యాఖ్యానాలను విశదీకరించి మనకందించాలనీ, ఆమెకూ, ఆమె కుటుంబానికీ ఆ జగదీశ్వరి ఆయురారోగ్య ఆనంద ఐశ్వర్యాలనూ అనుగ్రహించాలనీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.


   ------------ మాధవపెద్ది ఫణిరాధాకుమారి




********************************************************

15. శ్రీ ద్రోణంరాజు వేంకట శ్రీరామచంద్రమూర్తి గారి అభిప్రాయం 

 
ఒక ఆలోచన వీచిక...

మా ఊరి గురించో, విహార, సంసార, వివరాల గురించో రాయాలంటే కావాల్సింది ఆలోచన.. వివేచన.. అవగాహన. 

చిరు ప్రాయం నుంచే ఆ జిజ్ఞాస - దానికి ప్రోత్సాహం లభించడం విశేషం. సాధు సత్సంగం లో పాల్గొనడం - పండిత సభల్లో సమావేశాల్లో ప్రత్యక్ష గ్రాహ్యత తో పాటు నండూరి - నందివాడ కుటుంబ జీన్స్ (వంశీ కృతం) లీలా మాత్రంగా కలిసి వచ్చాయి అనుకోవాలి.

ఆ తర్వాత బోధనా వ్యాసంగం ఎలాగూ ఉన్నదే!!

వీటితో పాటు ఏదో రాయాలన్న ప్రగాఢ కాంక్ష, వేద సాహిత్యం సంస్కృత ప్రవేశాల కలయికతో పాటు సాక్షాత్ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి - అందుకే సరైన భావ గాంభీర్యంతో లాలిత్యంతో హృదయ స్పందనతో అక్షరరూపంగా వెలసినది ఈ "లలితా సహస్రనామ సరళమైన వ్యాఖ్యానం".

ఇది భట్టిప్రోలు వారి సహకారంతో నందివాడ విజయలక్ష్మీ ఆచరించిన శ్రీ లలితా మహా యజ్ఞం. ఈమెతో కుటుంబం అంతా ధన్యం.

శుభం భూయత్!! 

------ ద్రోణంరాజు వేంకట శ్రీరామచంద్ర మూర్తి



********************************************************

16. శ్రీమతి ఆకెళ్ళ గిరిజ అభిప్రాయం 

నువ్వు రాసిన శ్రీ లలితా విజయం లో ఒక్కొక్క నామానికి వివరణ చాలా చాలా బావుంది. చాలా సరళంగా, ఎంతో సింపుల్ గా, ఎవరికైనా సులభంగా అర్ధం అయ్యేలాగా రాయగలగడం నీ పూర్వజన్మ సుకృతం, దేవుడిచ్చిన అదృష్టం. 

రోజూ ఒక శ్లోకం తీసుకుని, అన్ని నామాలకి అంత వివరంగా వివరించడానికి నువ్వు యెంత కష్టపడ్డావో, నీ కమిట్ మెంట్ కి, రమేష్ గారి కోఆపరేషన్ కి, సత్తా కోటి నమస్కారాలు. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి, ఇలాగే అన్నీ రాయించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 

నీ చిన్ననాటి స్నేహితురాలు. 

-------------Dr. Akella Girija 


********************************************************

17. శ్రీమతి మొదలి పద్మ గారి అభిప్రాయం 

ఓం శ్రీ లలితా త్రిపురసుందరీ దేవ్యై నమః  

ముందుగా ఆ లలితాపరమేశ్వరీ స్తోత్రాలపై మీ సరళీకృత వ్యాఖ్యానానికి అభినందనం. అభివందనం. కొన్ని అరుదైన ఆరంభాలకు ముందు మనసు సంశయాలకు లోను కావడం,  మనం చేయగలమా లేదా అన్న ఆందోళన వెంటాడటం సహజమే అయినా వాటన్నింటినీ మించిన తపన, భక్తిచింతన మీకు వెన్నంటి నడిపించిన అంశాలుగా పేర్కొన్నారు. ఐనా సత్సంకల్పానికి  అమ్మ వారి ఆశీస్సులు లభించక  ఆగేనా. 

చరాచర జగత్తును శాసించే అమ్మవారి గురించి రాసే అవకాశం - ఆలోచన అపురూపం అమూల్యం. భాషాడంబరం కన్నా భావసంపద మిన్నగా తొణికిసలాడే మీ వాక్యనిర్మాణం అమ్మవారి కరుణావీక్షణ కిరణమే. మీ అనుభూతి పరిమళం అమ్మవారి చరణాల అక్షరహారతిలా దేదీప్యమైంది. 

మీరు సాగించే ఈ ఆధ్యాత్మికదారిలో మరెన్నో అద్భుతాలు చేయగలిగే శక్తి ఆ అమ్మవారు మీకు అందించాలని మనసారా ఆశిస్తూ నమస్సులు.

 ...... మొదలి పద్మ


********************************************************

18. శ్రీమతి వసంత శ్రీనివాస్ గారి అభిప్రాయం 

శ్రీ లలితా విజయం ఈరోజు తో పూర్తి చేశాను. అర్థం తెలియకుండా ఈ నామాలు చదివే మా లాంటి వారికి మీ విశ్లేషణ డిటైల్డ్ వివరణ ఎంతో కొంత జ్ఞానాన్ని ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఇవి ఎంత వివరంగా రాయటానికి మీరు ఎంత కృషి చేసి వుంటారో. ఇంత వివరంగా రాయటానికి కృషి మాత్రమే సరిపోదు. అమ్మవారి అనుగ్రహం కూడా వుండాలి. ఇంత అధ్భుతం గా వ్రాసిన మీకు నా ప్రణామాలు. 

 ........ వసంత శ్రీనివాస్ మద్దాల


********************************************************








 శ్రీమతి నండూరి సువర్చలాదేవి గారి అభినందనపూర్వక ఆశీర్వచనం 

అమ్మలగన్న అమ్మ, శ్రీమాత ప్రేరణతో శ్రీలలితా సహస్రనామాల రహస్యవివరణ వ్రాసింది విజయలక్ష్మి. ఈ వివరణ జలపాతంలా, అందంగా, సరళంగా సాగింది. ఇక దీనికి పరిచయవాక్యాలు వ్రాయబూనటం సాహసమే. ఇటువంటి భగవత్ స్తోత్రాలు, భాష్యం చదవాలనుకునే భక్తులకు ఈ ముందు మాటలు అవసరం లేదు.

జీవన సరళి కర్మతో ప్రారంభం అవుతుంది. కర్మల వలన కలిగే సుఖదుఃఖానుభూతులన్నీ భక్తిని ప్రేరేపిస్తాయి. కర్మ ద్వారా, భక్తి ద్వారా, ఉపాసనను ఎంచుకుంటాము. కర్మ, భక్తి, ఉపాసనలు జ్ఞానం కోసం తపింపచేస్తాయి. జ్ఞానతపన భాష్యాలను, వ్యాఖ్యానాలను చదివింపచేస్తుంది.

శ్రీలలితావిజయం చదువరులకు ఆ జ్ఞానతపనకు పునాదులు వేస్తుంది అనటానికి సందేహం లేదు. శ్రీమతి విజయలక్ష్మి "విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేటపఱతు", అన్నంతగా తన సాధన, అనుభవాల మేళవింపుతో అతిసరళంగా, సహజంగా, ధారగా, అత్యంత మధురంగా వ్రాసింది.

ఎంతని వ్రాయను, ఏమని పొగడుదు, శ్రీ లలితావిజయం వివరణ విశేషం. ఏమి వ్రాసినా, ఎంత వ్రాసినా తక్కువే. చదివి, మననం చేసి, అనుభవాలు పొందగలగటం అమ్మ అనుగ్రహమే. ఈ పుస్తకం అందరికీ అమ్మ అనుగ్రహం ప్రసాదిస్తుందని నమ్ముతున్నాను.


-------------నండూరి సువర్చల
























ఆముఖం

ఆముఖం 

శ్రీలలితా విజయం అనే శీర్షికతో, లలితాదేవి ప్రేరణతో, శ్రీ లలితా దివ్య రహస్య సాహస్ర నామ స్తోత్రానికి రచించిన భాష్యం ఇది. వేయి నామాలకూ సరళమైన భాషలో ఈ భాష్యం రాశాను. 2021 లో గురుపూర్ణిమ నాడు హఠాత్తుగా అమ్మవారు ఆవేశించినట్టు మొదటి శ్లోకానికి భాష్యం, సాధారణ తెలుగు చదవగలిగే వారికి అందటం కోసం ఈ వ్యాఖ్యానం మొదలుపెట్టి బ్లాగ్ లో పోస్ట్ చేశాను. అది మొదలు రోజూ బ్లాగ్ లో ఒక శ్లోకం చొప్పున మొత్తం 183 రోజులలో మొత్తం స్తోత్రానికి భాష్యం రచించి ముగించటం జరిగింది.

ముందు రోజుల్లో నాకు ఫోనులో అందుబాటులో వున్న వారికి, కాస్త భక్తి, ఆస్తికతా వున్నవారికి పంపించేదాన్ని. మొదటి రోజు 50 మంది చదివితే, చివరి రోజు నాటికి ఆ సంఖ్య 40 వేలకు చేరుకుంది. ఎన్నో దేశాలలో వాళ్ళు చదివారు. చదివిన వాళ్ళు వాళ్ళ బంధువులకీ, స్నేహితులకీ కూడా పంపించి చదివించారు. వాట్సాప్ లో బ్రాడ్ కాస్ట్ గ్రూప్ పెట్టి లింక్ అందరికీ పంపించేదాన్ని. మధ్యలో ఎందరో మాట్లాడారు. కొందరు వారి అనుభవాలు చెప్పుకున్నారు. కొందరు వారి కోరికలు సజావుగా తీరాయని చెప్పారు. చాలా సంతోషం వేసింది. కొందరు ఏ సమస్యకి ఏ నామం ఉపయోగిస్తుందో అడిగి మరీ తెలుసుకున్నారు. పోస్ట్ పెట్టటం కొంచెం ఆలస్యం అయితే చాలు, చాలా ఆరాటపడేవాళ్లు. నేను రాసిన ఈ శ్రీలలితా విజయం ఇలా చక్కగా ఎంతోమంది చదవటం ఆనందం కలిగించింది.

వీరిలో చాలామంది మాకు ఈ కొత్త తరహాలో స్క్రీన్ మీద చదవడం చేత కావటం లేదు. పుస్తకరూపంలో కావాలన్నారు. మరి కొందరు చూపు సరిగా ఆనని వారు కూడా స్క్రీన్ మీద కన్నా పుస్తకం బావుంటుంది అన్నారు, వారి కోసమే ఈ పుస్తకం తేవాలనుకున్నాం. కొందరు మాకు తెలుగు అర్ధం అవుతుంది కానీ చదవటం రాదు, మా కోసం ఇంగ్లీషులో చెప్పండి అన్నారు. కానీ భారతదేశ ఫిలాసఫీని, మన సనాతనధర్మాన్ని, మన దేశంలోని ఏ భాషలోకైనా అనువదించగలమేమో కానీ ఇంగ్లీషులో కష్టం. అసలు మౌలిక భావనలే వేరువేరు కనుక, ఇంగ్లీష్ భాష వొకాబులరీ సరిపోదు. అయినా మా చెల్లెలు, రాజశేఖరుని పద్మావతి తాను ప్రయత్నిస్తానంది. తాను ఇంగ్లీష్ లో M.A., M.Ed., M.Phil. తన ఇంగ్లీష్ భాష బావుంటుంది. ఇంకా పని మొదలు కాలేదు. పూర్తి అయితే మాత్రం అందరికీ ఆనందమే. నేను మాత్రం, యూట్యూబ్ లో Vijayalakshmi Bhattiprolu అనే పేరుతో ఒక ఛానెల్ తెరిచి, కనీసం తెలుగు వినడం వచ్చినవారికీ, చూపు సరిగాలేనివారికీ, పనులలో బిజీగా ఉండేవారికీ ఉపయోగపడుతుందని, తిరిగి అదే విధంగా రోజుకో శ్లోకం చొప్పున ఒక వీడియో ప్రెజెంట్ చేస్తున్నాను. చూసి, వినే ఆసక్తి వున్నవారు ఆ ఛానల్ లో చూడవచ్చు. ఈ శ్రీలలితా విజయం బ్లాగ్ లో చదవాలనుకునే వారు ఇప్పుడు కూడా www.moddeep.blogspot.in లో చదువుకోవచ్చు. e-book కూడా వస్తుంది. చూడండి.  

నేను భట్టిప్రోలు విజయలక్ష్మి పేరుతో ఎన్నో ఇతర రచనలు చేసినప్పటికీ, ఈ తరహా సాహిత్యాన్ని రాయటం ఇదే ప్రారంభం. చాలా కథలు, వ్యాసాలూ, ప్రశ్నలు-సమాధానాలు, పిల్లల కోసం కథలు, నవలలు వంటివి వివిధ పత్రికలూ, పేపర్లలో ప్రచురితమయ్యాయి. ధారావాహికంగా వచ్చినవి కూడా వున్నాయి. రెండు సంవత్సరాల నుంచీ జ్ఞాపకాలదొంతర పేరుతో ఒక బ్లాగ్ ను తెరిచి, ఇప్పటివరకూ సుమారు 45, 46 పోస్టులు పోస్ట్ చేయటం జరిగింది. ఇది మా కుటుంబాల గురించి, నా జ్ఞాపకాలన్నీ ఏర్చి కూర్చి పేర్చిన దొంతర. నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. పూర్తి అయిపోవటం అనే మాట దానికి వర్తించదు. అది ధారావాహికం. ఈ బ్లాగ్ చదవాలంటే, www.moddeep1.blogspot.in లో చూడండి.

ఇదేకాక, మా దంపతులు రిటైర్మెంట్ తరువాత భారతదేశం అంతా విస్తృతంగా ప్రయాణించటం జరిగింది. ఆ అనుభవాలతో ప్రయాణోపనిషత్ పేరుతో ఇంకొక బ్లాగ్ ని తెరిచి నేను, మావారు రమేష్ కుమార్ గారు కలిసి చేసిన యాత్రల వివరాలు, అనుభూతులు, కొన్ని ఫొటోలతో కలబోసుకుంటూ ఒక ట్రావెలాగ్ ని రాశాను. ఈ రెండింటికీ మంచి పేరొచ్చింది. ఈ ట్రావెలాగ్ www.moddeep2.blogspot.in లో చదువుకోవచ్చు.

బ్లాగ్ రచన పూర్తి అవగానే, మా వారి కజిన్ శ్రీమతి ఇందిరా భట్టిప్రోలు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి దంపతి సన్మానం చేశారు. ఆ సన్మానం ఆ కామేశ్వరీ కామేశ్వరులకే జరిగిందని భావించాము. నాతో మొదటి నుంచీ అమ్మవారి గురించి చర్చిస్తూ, నన్ను ఎంతో ప్రోత్సహించిన ఇందిరక్కకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ శ్రీలలితా విజయం బ్లాగ్ అందరికీ నచ్చినట్లే, పుస్తక రూపం కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. అమ్మవారి ఆదేశంగా భావించి పూనికగా పూర్తి చేసిన పని ఇది. పుస్తకరూపంలో కొంచెం తీరికగా చేద్దాంలే అనుకుంటుండగా మా కజిన్ భార్య, శ్రీమతి నండూరి ఇందిర వచ్చి 'పుస్తకం వేయండి, నేను నా పారాయణ గ్రూప్ లో పంచుకుంటాను' అంటూ తనకు తానుగా విరాళం పట్టుకొచ్చింది. అప్పుడు అది అమ్మవారి ఆదేశంగా భావించి, మా దంపతులు పుస్తకం పని మొదలు పెట్టాం. మమ్మల్ని పుస్తక ప్రచురణకి ప్రేరేపించిన ఈ ఇందిరక్కకీ కృతజ్ఞతలు. పుస్తక ప్రచురణకి మా చెల్లెళ్ళు విస్సా భారతలక్ష్మి, రాజశేఖరుని పద్మావతి, మా తమ్ముడు నందివాడ వివేకానంద్, మా పిల్లలు, ప్రమోద్, ప్రదీప్ లు, మా ఆత్మీయ నెచ్చెలులు సునీత దొంత, ఉమా పుట్రేవు కూడా ఎంతో ఇష్టంగా వారి వంతు విరాళం అందచేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు.

ఈ పుస్తకం ప్రూఫులు దిద్దటంలో సహాయం చేసినఉమా పుట్రేవు, రాజశేఖరుని పద్మావతిఎరగుడిపాటి రాధిక, లకు కృతజ్ఞతలు. పేజ్ మేకింగ్ లో తోడ్పడిన గౌతమ్ బొప్పనకు నా ధన్యవాదాలు. పుస్తక ప్రచురణ పూర్తిగా కొత్త అయిన మాకు ఎన్నో విధాల సహాయం చేస్తూ, ఈ పుస్తకాన్ని ప్రచురించిన శ్రీ కౌండిన్య శాస్త్రి గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. శాస్త్రిగారిని మాకు పరిచయం చేసిన ఆత్మీయులు శ్రీ లీలాప్రసాద్ గారికి నమస్కారాలు. తమ ఆశీర్వచనాలని అందించిన అత్తయ్య శ్రీమతి నండూరి సువర్చలాదేవి గారికీ, పిన్ని శ్రీమతి శ్రీదేవి గారికీ వందనాలు. బ్లాగ్ లో చదివి తమ స్పందనను తెలిపిన వారందరి సుమనస్సులకు నమస్సులు. చివరిగా నా పాఠకులందరికీ ప్రేమతో నా కృతజ్ఞతలు. ఈ పాఠకుల ప్రోత్సాహం లేకపోతే, ఈ శ్రీలలితావిజయం రూపు దిద్దుకునేది కాదేమో. అందరినీ మించి నాలాంటి సామాన్యురాలిని ఈ బృహత్తర, మహత్తర కార్యానికి ఎంచుకున్న మా అమ్మ, ఆ లలితాపరాభట్టారికకు పాదాభివందనాలు.

---మీ భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650