ఆముఖం
శ్రీలలితా విజయం అనే శీర్షికతో, లలితాదేవి ప్రేరణతో, శ్రీ లలితా దివ్య రహస్య సాహస్ర నామ
స్తోత్రానికి రచించిన భాష్యం ఇది. వేయి నామాలకూ సరళమైన భాషలో ఈ భాష్యం రాశాను. 2021 లో
గురుపూర్ణిమ నాడు హఠాత్తుగా అమ్మవారు ఆవేశించినట్టు మొదటి శ్లోకానికి భాష్యం, సాధారణ తెలుగు చదవగలిగే వారికి
అందటం కోసం ఈ వ్యాఖ్యానం మొదలుపెట్టి బ్లాగ్ లో పోస్ట్ చేశాను. అది మొదలు రోజూ బ్లాగ్ లో ఒక శ్లోకం చొప్పున మొత్తం 183 రోజులలో మొత్తం స్తోత్రానికి
భాష్యం రచించి ముగించటం జరిగింది.
ముందు రోజుల్లో నాకు ఫోనులో అందుబాటులో వున్న వారికి, కాస్త భక్తి, ఆస్తికతా వున్నవారికి పంపించేదాన్ని. మొదటి రోజు 50 మంది చదివితే, చివరి రోజు నాటికి ఆ సంఖ్య 40 వేలకు చేరుకుంది. ఎన్నో దేశాలలో వాళ్ళు చదివారు. చదివిన వాళ్ళు వాళ్ళ బంధువులకీ, స్నేహితులకీ కూడా పంపించి చదివించారు. వాట్సాప్ లో బ్రాడ్ కాస్ట్ గ్రూప్ పెట్టి లింక్ అందరికీ పంపించేదాన్ని. మధ్యలో ఎందరో మాట్లాడారు. కొందరు వారి అనుభవాలు చెప్పుకున్నారు. కొందరు వారి కోరికలు సజావుగా తీరాయని చెప్పారు. చాలా సంతోషం వేసింది. కొందరు ఏ సమస్యకి ఏ నామం ఉపయోగిస్తుందో అడిగి మరీ తెలుసుకున్నారు. పోస్ట్ పెట్టటం కొంచెం ఆలస్యం అయితే చాలు, చాలా ఆరాటపడేవాళ్లు. నేను రాసిన ఈ శ్రీలలితా విజయం ఇలా చక్కగా ఎంతోమంది చదవటం ఆనందం కలిగించింది.
వీరిలో చాలామంది మాకు ఈ కొత్త తరహాలో స్క్రీన్ మీద చదవడం చేత కావటం లేదు. పుస్తకరూపంలో కావాలన్నారు. మరి కొందరు చూపు సరిగా ఆనని వారు కూడా స్క్రీన్ మీద కన్నా పుస్తకం బావుంటుంది అన్నారు, వారి కోసమే ఈ పుస్తకం తేవాలనుకున్నాం. కొందరు మాకు తెలుగు అర్ధం అవుతుంది కానీ చదవటం రాదు, మా కోసం ఇంగ్లీషులో చెప్పండి అన్నారు. కానీ భారతదేశ ఫిలాసఫీని, మన సనాతనధర్మాన్ని, మన దేశంలోని ఏ భాషలోకైనా అనువదించగలమేమో కానీ ఇంగ్లీషులో కష్టం. అసలు మౌలిక భావనలే వేరువేరు కనుక, ఇంగ్లీష్ భాష వొకాబులరీ సరిపోదు. అయినా మా చెల్లెలు, రాజశేఖరుని పద్మావతి తాను ప్రయత్నిస్తానంది. తాను ఇంగ్లీష్ లో M.A., M.Ed., M.Phil. తన ఇంగ్లీష్ భాష బావుంటుంది. ఇంకా పని మొదలు కాలేదు. పూర్తి అయితే మాత్రం అందరికీ ఆనందమే. నేను మాత్రం, యూట్యూబ్ లో Vijayalakshmi Bhattiprolu అనే పేరుతో ఒక ఛానెల్ తెరిచి, కనీసం తెలుగు వినడం వచ్చినవారికీ, చూపు సరిగాలేనివారికీ, పనులలో బిజీగా ఉండేవారికీ ఉపయోగపడుతుందని, తిరిగి అదే విధంగా రోజుకో శ్లోకం చొప్పున ఒక వీడియో ప్రెజెంట్ చేస్తున్నాను. చూసి, వినే ఆసక్తి వున్నవారు ఆ ఛానల్ లో చూడవచ్చు. ఈ శ్రీలలితా విజయం బ్లాగ్ లో చదవాలనుకునే వారు ఇప్పుడు కూడా www.moddeep.blogspot.in లో చదువుకోవచ్చు. e-book కూడా వస్తుంది. చూడండి.
నేను భట్టిప్రోలు విజయలక్ష్మి పేరుతో ఎన్నో ఇతర రచనలు చేసినప్పటికీ, ఈ తరహా సాహిత్యాన్ని రాయటం ఇదే ప్రారంభం. చాలా కథలు, వ్యాసాలూ, ప్రశ్నలు-సమాధానాలు, పిల్లల కోసం కథలు, నవలలు వంటివి వివిధ పత్రికలూ, పేపర్లలో ప్రచురితమయ్యాయి. ధారావాహికంగా వచ్చినవి కూడా వున్నాయి. రెండు సంవత్సరాల నుంచీ జ్ఞాపకాలదొంతర పేరుతో ఒక బ్లాగ్ ను తెరిచి, ఇప్పటివరకూ సుమారు 45, 46 పోస్టులు పోస్ట్ చేయటం జరిగింది. ఇది మా కుటుంబాల గురించి, నా జ్ఞాపకాలన్నీ ఏర్చి కూర్చి పేర్చిన దొంతర. నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. పూర్తి అయిపోవటం అనే మాట దానికి వర్తించదు. అది ధారావాహికం. ఈ బ్లాగ్ చదవాలంటే, www.moddeep1.blogspot.in లో చూడండి.
ఇదేకాక, మా దంపతులు రిటైర్మెంట్ తరువాత భారతదేశం అంతా విస్తృతంగా ప్రయాణించటం జరిగింది. ఆ అనుభవాలతో ప్రయాణోపనిషత్ పేరుతో ఇంకొక బ్లాగ్ ని తెరిచి నేను, మావారు రమేష్ కుమార్ గారు కలిసి చేసిన యాత్రల వివరాలు, అనుభూతులు, కొన్ని ఫొటోలతో కలబోసుకుంటూ ఒక ట్రావెలాగ్ ని రాశాను. ఈ రెండింటికీ మంచి పేరొచ్చింది. ఈ ట్రావెలాగ్ www.moddeep2.blogspot.in లో చదువుకోవచ్చు.
బ్లాగ్ రచన పూర్తి అవగానే, మా వారి కజిన్ శ్రీమతి ఇందిరా భట్టిప్రోలు మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి దంపతి సన్మానం చేశారు. ఆ సన్మానం ఆ కామేశ్వరీ కామేశ్వరులకే జరిగిందని భావించాము. నాతో మొదటి నుంచీ అమ్మవారి గురించి చర్చిస్తూ, నన్ను ఎంతో ప్రోత్సహించిన ఇందిరక్కకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ శ్రీలలితా విజయం బ్లాగ్ అందరికీ నచ్చినట్లే, పుస్తక రూపం కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. అమ్మవారి ఆదేశంగా భావించి పూనికగా పూర్తి చేసిన పని ఇది. పుస్తకరూపంలో కొంచెం తీరికగా చేద్దాంలే అనుకుంటుండగా మా కజిన్ భార్య, శ్రీమతి నండూరి ఇందిర వచ్చి 'పుస్తకం వేయండి, నేను నా పారాయణ గ్రూప్ లో పంచుకుంటాను' అంటూ తనకు తానుగా విరాళం పట్టుకొచ్చింది. అప్పుడు అది అమ్మవారి ఆదేశంగా భావించి, మా దంపతులు పుస్తకం పని మొదలు పెట్టాం. మమ్మల్ని పుస్తక ప్రచురణకి ప్రేరేపించిన ఈ ఇందిరక్కకీ కృతజ్ఞతలు. పుస్తక ప్రచురణకి మా చెల్లెళ్ళు విస్సా భారతలక్ష్మి, రాజశేఖరుని పద్మావతి, మా తమ్ముడు నందివాడ వివేకానంద్, మా పిల్లలు, ప్రమోద్, ప్రదీప్ లు, మా ఆత్మీయ నెచ్చెలులు సునీత దొంత, ఉమా పుట్రేవు కూడా ఎంతో ఇష్టంగా వారి వంతు విరాళం అందచేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు.
ఈ పుస్తకం ప్రూఫులు దిద్దటంలో సహాయం చేసిన, ఉమా పుట్రేవు, రాజశేఖరుని పద్మావతి, ఎరగుడిపాటి రాధిక, లకు కృతజ్ఞతలు. పేజ్ మేకింగ్ లో తోడ్పడిన గౌతమ్ బొప్పనకు నా ధన్యవాదాలు. పుస్తక ప్రచురణ పూర్తిగా కొత్త అయిన మాకు ఎన్నో విధాల సహాయం చేస్తూ, ఈ పుస్తకాన్ని ప్రచురించిన శ్రీ కౌండిన్య శాస్త్రి గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. శాస్త్రిగారిని మాకు పరిచయం చేసిన ఆత్మీయులు శ్రీ లీలాప్రసాద్ గారికి నమస్కారాలు. తమ ఆశీర్వచనాలని అందించిన అత్తయ్య శ్రీమతి నండూరి సువర్చలాదేవి గారికీ, పిన్ని శ్రీమతి శ్రీదేవి గారికీ వందనాలు. బ్లాగ్ లో చదివి తమ స్పందనను తెలిపిన వారందరి సుమనస్సులకు నమస్సులు. చివరిగా నా పాఠకులందరికీ ప్రేమతో నా కృతజ్ఞతలు. ఈ పాఠకుల ప్రోత్సాహం లేకపోతే, ఈ శ్రీలలితావిజయం రూపు దిద్దుకునేది కాదేమో. అందరినీ మించి నాలాంటి సామాన్యురాలిని ఈ బృహత్తర, మహత్తర కార్యానికి ఎంచుకున్న మా అమ్మ, ఆ లలితాపరాభట్టారికకు పాదాభివందనాలు.
---మీ భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి