రచయిత్రి పరిచయం
శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి గారు 1957లో నందివాడ శ్రీరామకృష్ణ శర్మ, లీలాకుమారి దంపతులకు జ్యేష్ఠ పుత్రికగా జన్మించారు. వీరికి చిన్నప్పటి నుంచే తల్లితండ్రుల వలన వివిధ ఆధ్యాత్మిక, వేదాంత కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొనటం అలవాటు అయింది. రచయిత్రి తనకు తండ్రి వైపు నుంచి విద్య, తల్లి వైపు నుంచి సాహిత్యం వారసత్వంగా వచ్చాయని భావిస్తారు. 1979 లో శ్రీ భట్టిప్రోలు రమేష్ కుమార్ గారితో వివాహం జరిగింది. ప్రమోద్, ప్రదీప్ ఇద్దరు సంతానం. M.Sc., M.Ed., PGDCA, Ph.D. చేసిన శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వృత్తి రీత్యా ఉపాధ్యాయ విద్యార్థులకు గణిత అధ్యాపకురాలు, ప్రవృత్తి రీత్యా రచయిత్రి. భట్టిప్రోలు విజయలక్ష్మి పేరుతో రాసిన ఎన్నో కథలు, వ్యాసాలూ, ప్రశ్నలు-సమాధానాలు, పిల్లల కోసం కథలు, నవలలు వంటివి వివిధ పత్రికలూ, పేపర్లలో ప్రచురితమయ్యాయి. సాహిత్యమంటే ఎంతో ఇష్టం. చదవటమంటే ఇష్టం. చదువు చెప్పడమంటే ఇష్టం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రచురించిన కొన్ని గణిత పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించారు. తెలుగు అకాడెమీ వారు ప్రచురించిన D.Ed., B.Ed. గణిత బోధనా పాఠ్య పుస్తకాలు రచించారు. ఎన్నో పాఠశాలలు, కళాశాలలలో గణితం మరియు గణిత బోధనా శాస్త్రం బోధించిన విజయలక్ష్మి గారు 2014 లో వివేకవర్ధిని సంస్థ వారి నీలంసంజీవరెడ్డి ఉపాధ్యాయ శిక్షణా కళాశాల నుంచి పదవీ విరమణ చేశారు.
గత కొన్నేళ్ల నుంచీ, మారుతున్న పాఠకుల అభిరుచిని గమనించి డిజిటల్ పుస్తకాలు ఎక్కువగా చదువుతున్న పాఠకులకు వీలుగా బ్లాగులు రాయటం ప్రారంభించారు. చిన్ననాటి జ్ఞాపకాలతో "జ్ఞాపకాలదొంతర", భర్తతో కలిసి భారతదేశమంతా చేసిన విస్తృతమైన ప్రయాణాల అనుభవాలతో, "ప్రయాణోపనిషత్" అనే బ్లాగులు రాస్తున్నారు. ఈ బ్లాగులు రెండూ కూడా పాఠకుల మెప్పు పొందాయి. ఇటీవల "శ్రీలలితావిజయం" అనే బ్లాగ్ లో శ్రీ లలితా దివ్య రహస్య సహస్ర నామ వ్యాఖ్యానం, అమ్మవారి కరుణాకటాక్షాల వల్ల విజయవంతంగా ప్రచురించబడి, పాఠకుల ప్రసంశలు అందుకుంది. ఆ ప్రోత్సాహమే ఈ పుస్తక ప్రచురణకి దోహదపడింది. ఏ అంశం మీద రాసినా, సరళమైన భాషతో, ఎదుట పాఠకులను కూర్చోపెట్టి విడమరిచి చెప్తున్నట్టుగా రచించటం వీరి ప్రత్యేక శైలి. ఈ ప్రత్యేకత వల్ల పాఠకులు రచయిత్రి తమతో సంభాషిస్తున్నట్టు భావిస్తూ రచనలో లీనమయి చదువుతారు.
ఈ "శ్రీలలితా విజయం" ముఖ్యంగా సంస్కృతాంధ్రాలు కఠినంగా భావించే సామాన్య పాఠకులకు
కూడా అమ్మవారిని గురించి సులభంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. వేయి నామాలనీ
వాటి అర్ధాలనీ విపులంగా వివరించి చెప్పిన రచన ఇది. ఈ రచన పుస్తకరూపంలో కూడా పాఠకులకు సంతృప్తినీ, ఆనందాన్నీ కూడా ఇస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు. చదవండి, చదివించండి. అమ్మవారి భక్తుల ఇంట్లో వుండదగిన పుస్తకం ఇది. అమ్మవారిని ధ్యానించండి, ఉపాసించండి. ఆనందం పొందండి.
శ్రీ లలితాంబికాయై నమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి