12, నవంబర్ 2021, శుక్రవారం

112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ

   

విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః 
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥

548. విమర్శరూపిణీ

పరమాత్మకు స్వభావసిద్ధమైన స్ఫురణ వున్నది. ఆ స్ఫురణా శక్తికే విమర్శ అని పేరు. 

పరమాత్మ యొక్క స్వాభావికమైన స్ఫురణ స్వరూపురాలు కనుక, ఈ నామంలో ఆ తల్లిని 

విమర్శరూపిణీ అని చెప్పుకుంటున్నాం. ఈ శక్తియే సమస్త జగత్తూ ఏర్పడటానికీ, లయించడానికీ 

కూడా కారణభూతము అని సౌభాగ్యసుధోదయంలో చెప్పబడింది. 

మాతృకావివేకములో విమర్శ అనగా వాచక శబ్దము, ఆ వాచక శబ్దమే ఆ పరమేశ్వరి భావనను 

తెలియచేస్తుంది అని చెప్పారు. అంటే, అమ్మ తనకు తానుగా శబ్దరూపములో తనను

ప్రకటించుకొనుచున్నది అని అర్ధం. శబ్దము, అర్ధము రెండూ కలిసే కదా ఉంటాయి. 

అమ్మ అని మనం పిలుచుకునే భావన వాచ్యార్థము అయితే,  

విమర్శ అని చెప్పుకుంటున్నది వాచకశబ్దము. వాచకశబ్దము, వాచ్యార్థమూ రెండూ అమ్మే. 

కనుక అమ్మ అన్నా, విమర్శ అన్నా, ఆ రెండూ ఒక్కటే. అందుకే అమ్మ విమర్శరూపిణీ. 

విమర్శనాత్మక శక్తి రూపములో అందరిలోనూ వున్నది ఆ పరమేశ్వరియే. 

ఆత్మ విమర్శ చేసుకుంటే, అది ఆత్మ జ్ఞానానికి దోహదమవుతుంది. 

ఆత్మ విమర్శ రూపంలో మనలను ఉద్ధరించే శక్తే విమర్శరూపిణీ.   

అమ్మ యొక్క స్వభావసిద్ధ శక్తి స్వరూపమైన, ఆ విమర్శరూపిణి కి వందనం. 

ఓం శ్రీ విమర్శరూపిణ్యై నమః  


549. విద్యా 

విద్య అంటే మోక్షసాధకమైనది, జ్ఞానదాయకమైనది అని అర్ధం. 

విద్య జ్ఞానస్వరూపిణి, వేదస్వరూపిణి. మోక్షాన్నీ, జ్ఞానాన్నీ ఇచ్చేది ఆ శ్రీమాతే కనుక, 

ఆ తల్లిని ఈ నామంలో విద్యా అని పిలుస్తున్నాం.  

దేవీమాహాత్మ్యములో "ఓ భగవతీ, నీవే విద్యాస్వరూపిణివి" అని చెప్పారు. 

గౌడపాదసూత్రములో, చైతన్యశక్తియే విద్య, హృదయములో వుండే కళయే విద్య, అని చెప్పారు. 

శైవతంత్రములో, ఏ కళ చేత వివేకము కలిగి, విద్యా అవిద్యా జ్ఞానము కలుగుతోందో, 

ఆ కళయే విద్య అనీ, దానినే తేజోనిష్టాకళ అంటారనీ వున్నది.  

జ్ఞానరూపములో అంతఃకరణ యందు వెలుగునది విద్య, ఆ వెలుగు అగ్ని తేజస్సు కాదు, 

అది జ్ఞాన తేజస్సు. కనుక అంతఃకరణ అందలి చైతన్యమనే తేజోకళయే విద్య అని తెలుస్తోంది. 

చైతన్య రూపములో అంతఃకరణలో తేజోకళగా వెలుగుతున్న, ఆ విద్య కు వందనం.  

ఓం శ్రీ విద్యాయై నమః  


550. వియదాది జగత్ప్రసూః 

వియత్ అంటే ఆకాశము. వియత్ మొదలైన పంచభూతములతో నిండి వున్న ఈ జగత్తును 

ప్రసవించిన ఆ జగన్మాతనే ఈ నామంలో వియదాది జగత్ప్రసూ అంటున్నాం. 

ఆ పరమేశ్వరి నుంచియే ఆకాశం ఏర్పడింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, 

వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృధ్వి వచ్చాయి. 

వరుసగా ప్రకృతి, పురుషుడు, త్రిగుణాలు, పంచ తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, 

మొదలైనవన్నీ ఏర్పడ్డాయి. ఈ ప్రపంచమే పంచీకరణం వలన ఏర్పడింది. 

ఈ సమస్త తత్వాలతో జగత్తులనన్నింటినీ ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రసవిస్తున్నది 

ఆ మూలప్రకృతి శ్రీలలిత. తిరిగి ఈ తత్వాలన్నీ ఆ జగజ్జననిలోనే లయమవుతున్నాయి. 

ఆకాశం మొదలు అన్ని తత్వముల పుట్టుకకూ ఆధారమైన, ఆ వియదాదిజగత్ప్రసూ కు వందనం. 

ఓం శ్రీ వియదాదిజగత్ప్రసువే నమః  


551. సర్వవ్యాధి ప్రశమనీ 

సర్వ వ్యాధులనూ ఉపశమింప చేయునది సర్వవ్యాధి ప్రశమనీ. 

ఆధి వ్యాధుల నుండి తన భక్తులను రక్షించునది అని ఈ నామానికి అర్ధం. 

అమ్మను ప్రార్ధిస్తే, అన్ని వ్యాధుల నుండీ తప్పక ఉపశమనం లభిస్తుంది. 

అంటే, వ్యాధులను తొలగిస్తుంది అని అర్ధం కాదు. వ్యాధి యొక్క బాధ నుండి ఉపశమనం 

లభిస్తుంది అని అర్ధం. వ్యాధితో పాటు, దానిని భరించే, సహించే శక్తిని కూడా ఆ తల్లే ఇస్తుంది. 

'పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే' అని శాస్త్రం చెప్పింది. 

కనుక వ్యాధి వచ్చిందీ అంటే, అది ఖచ్చితంగా పూర్వజన్మలలో చేసిన పాపమే. 

అటువంటి ప్రారబ్ధం వలన వచ్చిన వ్యాధులను తప్పనిసరిగా అనుభవించవలసినదే. 

కాకపోతే, ఈ జన్మలో జ్ఞానం కలిగి, అమ్మను శరణు వేడితే, అమ్మ ఉపశమనం కలిగించి, 

ఆ వ్యాధి రుణం తీర్చుకునేందుకు అవసరమైన శక్తినీ, సహనాన్నీ ఇస్తుంది. 

అందుకే కొందరు, కష్టాలను అనుభవిస్తున్నా కూడా ధైర్యంగానే వుంటారు. 

ఆ పరమేశ్వరి ఇచ్చిన ధైర్యం అది. అందుకే అమ్మను సర్వవ్యాధిప్రశమనీ అంటున్నాం.    

తనను నమ్మినవారికి ఆధి వ్యాధులు కలిగినప్పుడు, ఉపశమనం కలిగిస్తున్న,

ఆ సర్వవ్యాధిప్రశమని కి వందనం. 

ఓం శ్రీ సర్వ వ్యాధిప్రశమన్యై నమః 

  

552. సర్వమృత్యు నివారిణీ

మృత్యువులు రెండు రకాలు. ఒకటి కాల మృత్యువు, రెండు అకాల మృత్యువు. 

కాల మృత్యువు అంటే సహజంగా ఆయువు తీరిన తరువాత కలిగే మరణం. ఇది ప్రకృతి సహజం. 

'జాతస్య మరణం ధృవం' అన్నది భగవద్గీత. పుట్టినవాడికి మరణం తప్పదు. 

అయినప్పటికీ ఆ మరణం దేహానికే కానీ, ఆత్మకు కాదు. ఆత్మ ఎప్పటికీ చిరంజీవి.

ఈ ఆత్మజ్ఞానమును కలిగినవానికి మృత్యువు లేదు. ఇటువంటివారికి మరణం కేవలం

పాత వస్త్రాన్ని విడచి, నూతన వస్త్రం ధరించటంతో సమానం. 

అకాల మృత్యువు అంటే, ఆయువు తీరకుండానే, అనుకోని సంఘటనల వలన ప్రాణం పోవడం. 

అమ్మను సేవించినవారికి అకాల మృత్యువు కలగదు. 

కొన్నిసార్లు అజ్ఞానం కొద్దీ కాలమృత్యువును కూడా అకాలమృత్యువుగా భావిస్తూ ఉంటాం. 

కానీ అమ్మ భక్తులకు ఏర్పడ్డ మృత్యువు ఎప్పుడూ అకాలమృత్యువు  కాదు. 

అవి అన్నీ ఆయుష్షు తీరి మరణం సంభవించిన మృత్యువులే. 

ఇక సంపూర్ణంగా జీవాత్మ, పరమాత్మా ఒక్కరే అనే జ్ఞానం పొంది, ఆత్మజ్ఞానం కలిగిన వానికి 

పునర్జన్మే ఉండదు. పుట్టుక లేకపోతే మరణమే లేదు. 

అటువంటి వారు ఎప్పుడూ జననమరణాలకు అతీతంగా  ఆ పరమాత్మ యందే రమిస్తూ, 

బ్రహ్మానందంలో వుంటారు. వారికి మరణం లేదు. 

మృత్యువు అంటే అజ్ఞానం అని కూడా అర్ధం వుంది. తన భక్తులను  మృత్యువు అనే అజ్ఞానం 

నుంచి ఉద్ధరించి జ్ఞానామృతం ప్రసాదిస్తుంది ఈ పరదేవత. 

అందుకే అమ్మను ఈ నామంలో సర్వమృత్యు నివారిణీ అంటున్నాం. 

తన భక్తులకు మృత్యుభయం నివారించే, ఆ సర్వమృత్యు నివారిణి కి వందనం. 

ఓం శ్రీ సర్వ మృత్యునివారిణ్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

11, నవంబర్ 2021, గురువారం

111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా

  

పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా 
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥

542. పుణ్యకీర్తిః

పుణ్యమును ఇచ్చునది శ్రీమాత. పుణ్యమును ఇచ్చే తల్లి అని కీర్తిని పొందినది శ్రీమాత. 

అందుకే ఈ నామంలో ఆ మాహేశ్వరిని పుణ్యకీర్తీ అని చెప్పుకుంటున్నాం. 

పుణ్య కార్యములు, ధర్మకార్యములు చేయటం వలన పుణ్యము వస్తుంది. అటువంటి పుణ్యము 

వలన కీర్తి వస్తుంది. అట్టి కీర్తిని ఇవ్వడం ఆ పరమేశ్వరికే సాధ్యం. కనుకనే ఆ తల్లి పుణ్యకీర్తీ.  

పుణ్యకార్యములు చేయాలనే బుద్ధి పుట్టించేదీ, ఆ పుణ్యకార్యములు చేయించేదీ కూడా ఆ శ్రీదేవే. 

ఆ విధంగా చేసిన పుణ్యకార్యముల ఫలితంగా, పుణ్యాన్ని మన లెక్కలో వేసేదీ అమ్మే. 

ఆ పుణ్యము వలన కీర్తి లభించేలా చూసేదీ ఆ తల్లే. సర్వమూ ఆ శ్రీదేవికి సమర్పణ చేసి, 

భారమంతా శ్రీమాతపై ఉంచి, జరగవలసిన పనిని చేయటం మాత్రమే భక్తుడు చేయవలసినది. 

ప్రతిఫలాపేక్షను ఆశించకుండా, ఏ స్వార్ధము లేకుండా చేసే పుణ్యకార్యాన్ని అమ్మ ఆనందంగా 

స్వీకరిస్తుంది. పుణ్య కార్యాలు చేస్తున్నాను అనే అహంకారము కానీ, వచ్చిన కీర్తిని చూసి 

గర్వము కానీ, ఆ పుణ్యకార్యము యొక్క విలువను తగ్గిస్తాయి. 

ఇతరులకు వస్తున్న కీర్తిని చూసి అసూయ పడేవాడిని అమ్మ ఆమోదించదు. 

కనుక ఫలము, కీర్తి పట్ల అపేక్ష ఉండకూడదు. పరులను చూసి అసూయ పడకూడదు.  

ఈ రెండూ ఉన్నతికి దారి తీయకపోగా పతనానికి దోహదం చేస్తాయి. 

పుణ్యమునూ, కీర్తినీ ఇచ్చేది ఆ శ్రీదేవి మాత్రమే అన్న దృఢ విశ్వాసం ఉండాలి. 

పుణ్యమును ఇచ్చే తల్లి అని కీర్తి కలిగి వున్న, ఆ పుణ్యకీర్తి కి వందనం. 

ఓం శ్రీ పుణ్యకీర్త్యై నమః  


543. పుణ్యలభ్యా

పుణ్యము వలన మాత్రమే దొరికేది కనుక అమ్మను, ఈ నామంలో పుణ్యలభ్యా అంటున్నాం. 

అమ్మను పట్టుకోవాలంటే పుణ్యము చేయండి, అట్టి పుణ్య మార్గములో వున్నవారికి అమ్మ 

లభిస్తుంది అని ఈ నామంలో చెప్తున్నారు. అందరికీ దొరకనిది, దుర్లభమైనది ఆ త్రిపురసుందరి. 

అటువంటి దుర్లభమైన శక్తిని పొందాలంటే, ఒక మార్గం, పుణ్యం చేయటం. ఆ పుణ్య ఫలితాన్ని

ఆశించకుండా ఆ పుణ్యాన్నీ, దాని వలన వచ్చిన కీర్తినీ తిరిగి ఆ అమ్మకే సమర్పించటం. 

ఇటువంటి పుణ్యం ఎంత అధికంగా చేస్తే, అంత త్వరగా అమ్మకి చేరువవుతాము. 

దేవీభాగవతం తృతీయ స్కంధంలో, 'అధిక పుణ్యం చేసిన వారు, ఇంద్రియనిగ్రహం వున్నవారు 

అమ్మను చూడగలరు. ఇతరులు చూడలేరు' అని చెప్పారు. 

పూర్వ పుణ్యము చేత మాత్రమే దక్కే, ఆ పుణ్యలభ్య కు వందనం.  

ఓం శ్రీ పుణ్యలభ్యాయై నమః  


544. పుణ్యశ్రవణ కీర్తనా 

పుణ్యం ఎన్నో రకాలుగా చెయ్యచ్చు. ఆ మార్గాల్లో ఒకటి, అమ్మవారి పుణ్యస్వరూపమైన కథలను, 

శ్రవణం లేదా కీర్తనం చేయటం. పుణ్య కథలను విన్నా, గానం చేసినా ఆ శ్రీమాత సంతోషిస్తుంది. 

కనుక పుణ్య కథలను వినండి, వినిపించండి. అందుకే ఈ పుణ్య చరిత్రలను కథలుగా 

సప్తాహం, నవాహం, దశాహం అంటూ కొన్ని దినాల పాటు చెప్పిస్తూ వుంటారు. 

పురాణ ప్రవచనాల శ్రవణం కూడా పుణ్య కథా శ్రవణమే కదా. 

హరిదాసుల చేత, గాయనీ గాయకుల చేత పుణ్యకథా గానాలు, కీర్తనలు వినిపించడం, వినడం 

కూడా పుణ్య సముపార్జనమే. త్యాగరాజు, సూరదాసు, మీరాబాయి, రామదాసు, అన్నమయ్య, 

కబీరుదాసు, వంటి భక్తులందరూ గానం ద్వారానే ఆ పరమాత్మను పొందారు. 

నిత్యమూ ఆ భగవతిపై అత్యంత శ్రద్ధతో పుణ్యకథా గానం కానీ, శ్రవణం కానీ చేసేవారిపై అమ్మ 

అనుగ్రహం చూపిస్తుంది. నారద భక్తి సూత్రాలలో నవవిధ భక్తులలో శ్రవణము, కీర్తనము కూడా 

ఉన్నాయని చెప్పారు. పుణ్యకథా గానం, పుణ్యకథా శ్రవణం అంటే ఆ శ్రీదేవికి ఎంతో ప్రీతి. 

పుణ్యచరిత్రలను కథలుగా,  కీర్తనలుగా అనుగ్రహించిన, ఆ పుణ్యశ్రవణకీర్తన కు వందనం. 

ఓం శ్రీ పుణ్యశ్రవణకీర్తనాయై నమః  


545. పులోమజార్చితా 

పులోముని కుమార్తె అయిన శచీదేవిచే అర్చింపబడినది అని భావార్ధం. 

ఈ కథ దేవీ భాగవతం లోని షష్ఠ స్కంధంలో చెప్పబడింది. 

పూర్వం వృత్రాసురుడనే బ్రహ్మరాక్షసుడిని చంపి, బ్రహ్మహత్యా దోషం పొందాడు ఇంద్రుడు. 

అప్పుడు పురంధరుడు ఇంద్రపదవికి అర్హత కోల్పోయాడు. రాజు లేకపోతే, దేవలోకమంతా 

అల్లకల్లోలమై పోయింది. దేవాదులూ, త్రిమూర్తులూ ఆలోచించి, నూరు అశ్వమేధయాగములు 

చేసిన నహుషుడనే చక్రవర్తిని, అధిక పుణ్యము కలవాడిగా గుర్తించి, దేవేంద్ర పదవిని ఇచ్చారు. 

పుణ్యము వలన, నహుషునికి కీర్తి కలిగింది. ఆ కీర్తి వలన ఇంద్ర పదవి లభించింది. 

కానీ తాను ఇంద్రుడిని, అనే గర్వం కలిగి, పురంధరుని భార్య, శచీదేవిని తనతో ఉండమని 

కోరాడు. శచీదేవి, పులోముని కుమార్తె,  పురంధరుని భార్య, మహా పతివ్రత. 

దేవతల గురువైన, బృహస్పతిని, నహుషుని వలన వచ్చిన ఆపదను తప్పించమని కోరింది.   

బృహస్పతి శ్రీవిద్యను ఉపదేశించి, ఆ శ్రీదేవిని అర్చిస్తే, ఆ తల్లి కృప వలన ఆపద తీరిపోతుంది, 

అని మార్గం చూపాడు. శచీదేవి ఆ లలితాత్రిపురసుందరిని శ్రద్ధాభక్తులతో అర్చించింది.  

ఆ పూజ ఫలితంగా నహుషుడు శాపము పొంది సర్పముగా మారాడు. 

శచీపతికి బ్రహ్మహత్యా దోషం పోయి తిరిగి ఇంద్ర పదవి దక్కింది. 

పులోమజచే పూజలందుకొని, ఆ పతివ్రత ఆపదను తప్పించిన, ఆ పులోమజార్చిత కు వందనం. 

ఓం శ్రీ పులోమజార్చితాయై నమః 

  

546. బంధమోచనీ

బంధమోచనీ అంటే, బంధముల నుండి తప్పించునది అని భావం. 

భక్తులకు, ఉపాసకులకు బంధనములు కలగకుండా చేయటం, కలిగిన బంధనముల నుండి

విడిపించటం ఆ అమ్మ కృపావిశేషం. బంధనముల నుండి, కారాగారముల నుండి విమోచనము 

కలిగించునది అని ఈ నామానికి అర్ధం. అజ్ఞానము వలన ఏర్పడిన సంసారబంధనముల నుండి 

తప్పించే శక్తి కలది ఈ త్రిపురసుందరీదేవియే. 

హరివంశంలో ఒక గాధ వుంది. శ్రీ కృష్ణుని మనవడు అనిరుద్ధుడు, బాణాసురుని చెరసాలలో 

బద్ధుడయ్యాడు. అపుడు, అనిరుద్ధుడు బంధ విముక్తికై ఆ నారాయణిని ధ్యానించగా, 

నారాయణుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి అనిరుద్ధుని కారాగార విముక్తుణ్ణి చేసాడు.  

శ్రీలలిత, శ్రీ కృష్ణుడు వేరు వేరు కాదు కదా. 

దేవీభాగవతం షష్ఠ స్కంధంలో మరొక కథ వుంది. ఒకసారి ఏకావళి అనే రాజకన్యను కాలకేతుడనే

రాక్షసుడు అపహరించాడు. ఏకావళికి యశోవతి అనే ఒక చెలికత్తె వుంది. 

ఆమె భగవతీ ఉపాసకురాలు. ఏకావళిని కాలకేతు చెర నుంచి తప్పించమని ఆమె భగవతిని 

ప్రార్ధించింది. అప్పుడు ఆ భగవతి కరుణించి ఏకావళిని, ఆ రాక్షస బంధనం నుంచి విడిపించింది. 

ఎవరికైనా ఇటువంటి కష్టం వచ్చినప్పుడు, ఈ నామంతో అమ్మను జపిస్తే, మేలు కలుగుతుంది.
 
తనను నమ్మిన భక్తులను అన్ని రకముల బంధనముల నుంచీ

తప్పించే,  ఆ బంధమోచని కి వందనం. 

ఓం శ్రీ బంధమోచన్యై నమః 


547. బంధురాలకా 

బంధురాలకా అంటే, చక్కని గిరజాల జుట్టు కలది అని అర్ధం. 

ఈ నామానికి బర్బరాలకా అనే పాఠాంతరము కూడా వున్నదని భాస్కరరాయ పండితుడు

చెప్పాడు. ఈ బర్బరాలకా అనే నామమే ఎక్కువ మందికి సమ్మతమనీ, సాంప్రదాయ సిద్ధమనీ 

కూడా భాస్కరరాయలు అభిప్రాయపడ్డాడు. బర్బరాలకా అన్నా, బంధురాలకా అన్నా ఒకే అర్ధం, 

నల్లని గిరజాలు తిరిగిన ముంగురులు కలదానా అని. 

వంకులు తిరిగిన జుత్తునే ఆభరణంగా కలది ఆ లలితాదేవి.   

జుట్టు మొదలు వద్ద చిక్కులు ఏర్పడవు, కానీ గిరజాల వలన చిక్కులు ఏర్పడతాయి. 

జుట్టు మొదట్లో చిక్కులు లేనట్లే, సృష్టి ప్రారంభంలోనూ ఏ చిక్కులూ లేవు. 

ఆ తరువాతే, చేసుకున్న కర్మల వలన చిక్కులు ఏర్పరుచుకుని, 

ఆ చిక్కులలోనే, గిరజాలలో వలె చుట్లు చుట్లు తిరుగుతూ ఉంటాం. 

అమ్మ గిరజాలని ధ్యానిస్తే, ఆ చిక్కుల చుట్లలో నుంచి బయటపడేస్తుంది. 

ఆ చిక్కులు ఎలా విప్పుకోవాలో  కూడా తెలుస్తుంది.

అంటే అమ్మను ధ్యానిస్తే, జుట్టు సంస్కరించబడుతుంది. చిక్కు వీడిపోతుంది

గిరజాల ముంగురులతో శోభిస్తున్న, ఆ బంధురాలక, ఆ బర్బరాలక కు వందనం. 

ఓం శ్రీబంధురాలకాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

  

10, నవంబర్ 2021, బుధవారం

110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ స్వాహా, స్వధా, అమతిః, మేధా, శ్రుతిః, స్మృతిః, అనుత్తమా

 

సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ 
స్వాహా, స్వధా, అమ
తిః, మేధా, శ్రుతిః, స్మృతిః, అనుత్తమా ॥ 110 ॥

533. సర్వౌదనప్రీతచిత్తా

అన్ని రకముల అన్నములనూ ఇష్టముగా, ప్రీతితో భుజించునది పరమేశ్వరి అని అర్ధం. 

పాయసాన్నము, స్నిగ్ధౌదనము, గుడాన్నము, దధ్యన్నము, ముద్గౌదనము, హరిద్రాన్నము, 

వంటి అన్ని రకముల అన్నములనూ ఇష్టపడుతుంది. ఏ అన్నమైనా అమ్మ ప్రసాదమే. 

కనుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పారు. 

అందుకే అన్నమును నిందించటం కానీ, వృధా చేయటం కానీ చెయ్యటం దోషం.  

దైవ దూషణతో సమానం. అన్నద్వేషము దైవద్వేషమే. 

రకరకము లైన చిత్రాన్నము లంటే ప్రీతి కల, ఆ సర్వౌదనప్రీతచిత్త కు వందనం. 

ఓం శ్రీ సర్వౌదనప్రీతచిత్తాయై నమః  


534. యాకిన్యంబాస్వరూపిణీ 

యాకిన్యంబాస్వరూపిణీ అంటే ఆ సహస్రారములో కొలువై వున్న సహస్రదళపద్మస్ధయే.  

ఈ యాకీనీ నామ దేవత సర్వ వర్ణములలో శోభిల్లుతూ,  సర్వ ఆయుధములనూ ధరించి, 

సకల దిశలనూ ఏకకాలంలో చూడగలిగే సహస్ర ముఖములు కలిగి, శుక్లధాతువులో ఉంటూ, 

అన్ని రకముల చిత్రాన్నములనూ ప్రీతితో నైవేద్యముగా స్వీకరించు శ్రీ లలితాపరమేశ్వరి.  

"డ, ర, ల, క, స, హ, య" అను బీజాక్షరములతో సూచింపబడే డాకినీ, రాకినీ, లాకినీ, కాకినీ, 

సాకినీ, హాకినీ, యాకీనీ అని పిలువబడే ఈ శక్తులు మహా త్రిపురసుందరి అంశస్వరూపాలైన 

మహాయోగినులు. సహస్రదళపద్మము పూర్ణచంద్రుని వలె షోడశకళలతో ప్రకాశిస్తూ ఉంటుంది. 

ఆ ప్రకాశం సూర్యకాంతి వలె తేజస్సుతో, చంద్రకాంతి వలె చల్లదనంతో ఉంటుంది. 

అక్కడ చంద్రునికి వృద్ధి, క్షయములు లేవు. నిష్కళంక చంద్రుడు. 

ఈ సహస్రార స్థానము మన శరీరమును దాటి పైన వున్న జ్యోతిశ్చక్రములో వున్నది కనుక, 

ఆ చంద్రునికి భూమిపైన ఉన్నట్లు కళా భేదములుండవు. అది ఎప్పుడూ పూర్ణమే. 

ఆ పూర్ణ స్థానములో శివాశివులిద్దరూ ఆ సహస్రదళపద్మముపై కూడి వుంటారు. 

అదే పరమాత్మ స్థానం. ఆ దృశ్యాన్ని వీక్షించిన వారిని యోగులు, అవధూతలు అంటాం. 
 
యోగీశ్వరులకు ఆత్మ దర్శనమయేది ఇక్కడే. శివాశివులిద్దరినీ సహస్రారముపై కలిపి చూసిన

వారికి పునర్జన్మ లేదు. ఏ బంధనమూ వారిని తాకలేదు. ఈ లోకములో ఉంటూనే తామరపత్రం 

మీద నీటిబొట్టు వలె, నిర్వికల్ప, నిరంజన స్థితిలో వుంటారు. సాయుజ్య ముక్తిని పొందుతారు. 

సహస్ర దళ పద్మములో వుండి, భక్తులకు సాయుజ్యముక్తిని కటాక్షిస్తున్న, 

ఆ లలితా పరాభట్టారిక, ఆ యాకిన్యంబాస్వరూపిణి కి వందనం.  

ఓం శ్రీ యాకిన్యంబాస్వరూపిణ్యై నమః  


535. స్వాహా

ఇంతవరకూ అమ్మవారి  యోగినీ రూపాల గురించి తెలుసుకున్నాం. 

ఇక ముందు అమ్మవారి మిగిలిన రూపాల గురించి కూడా తెలుసుకుందాం. 

అన్ని రూపాలూ తెలిస్తేనే ఆ లలితాత్రిపురసుందరి విరాడ్రూపం కొద్దిగా అయినా 

బోధపడుతుంది. ఈ నామంలో అమ్మవారిని స్వాహా అంటున్నాం.  

స్వాహాదేవి శివుని అష్టమూర్తులలో ఒకటైన వహ్నిమూర్తి అర్ధాంగి. 

వీరి పుత్రుడే కుమారస్వామి అని లింగాపురాణంలోనూ, వాయుపురాణంలోనూ కూడా చెప్పబడింది. 

స్వః అంటే, స్వర్గము, ఆత్మ అనే అర్ధాలున్నాయి. హః అంటే హవిస్సు, గతి అని అర్ధాలున్నాయి. 

స్వాహా అంటే, ఆత్మ గతి తెలిసినది, స్వర్గ గతి తెలిసినది అని అర్ధం. 

స్వాత్మజ్ఞానం కలిగినది స్వాహా. హోమాలలో "స్వాహా, స్వధా, వౌషట్, వషట్" అను శబ్దముల 

ద్వారా హవిస్సులను స్వీకరించి దేవతలకు అందించునది అని భావం. 

దేవీ భాగవతం ప్రకారం, స్వాహాదేవి అగ్నిదేవుని భార్య. వారికి ముగ్గురు పుత్రులు, ఆవహనీయాగ్ని, 

గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని. యజ్ఞాలు, యాగాలు జరిగేటప్పుడు, హోమంలో వేస్తున్న హవిస్సులు

 దేవతలకు అందకుండా రాక్షసులు అపహరిస్తుంటే, దేవతలు ఆకలికి బాధపడి 

బ్రహ్మ, విష్ణువులను ప్రార్ధిస్తారు. అపుడు విష్ణువు స్వాహాదేవిని, 'అగ్నిదేవుడిని వివాహమాడి, 

ఆ హవిస్సులను దేవతలకు అందించమని' చెబుతాడు. ఆ విధంగా యజ్ఞయాగాదులు 

జరిగేటప్పుడు హవిస్సులు స్వాహాదేవి ద్వారా  దేవతలకు అందుతాయి. 

పద్మపురాణంలో మాహేశ్వరీ పీఠాధిష్ఠాన దేవత మాహేశ్వరీదేవియే స్వాహా అని చెప్పబడింది.  

అగ్నిదేవుని పత్ని రూపములో దేవతలకు హవిస్సులను అందిస్తున్న, ఆ స్వాహా కు వందనం. 

ఓం శ్రీ స్వాహాయై నమః  


536.  స్వధా

స్వధా దేవి కూడా అగ్ని భార్యయే. ఈ స్వధా దేవి ద్వారా పితృ యజ్ఞాలు చేసేటప్పుడు, 

హోమ ద్రవ్యాలు పితృదేవతలకు అందుతూ ఉంటాయి. స్వధా అంటే సృష్టిని ధరించి 

పోషించునది అని అర్ధం. అగ్నిదేవుడికి స్వాహా కుడివైపు, స్వధా ఎడమవైపు వుంటారు. 

దేవీ భాగవతం ప్రకారం, పితృదేవతలకు ఆహారం సరిగ్గా అందనపుడు, వారు బ్రహ్మ, విష్ణువులను 

ప్రార్ధించారు. అపుడు వారు స్వధా అనే చక్కని సౌందర్యరాశిని సృష్టించి, 'అగ్నిదేవుడిని 

వివాహమాడి, పితృయజ్ఞాల ద్వారా ఆహారాన్ని పితరులకు అందించమని' కోరారు. 

స్వధా నామం చెప్పనిదే, పితృదేవతలకు చేసే ఏ శ్రాద్ధమైనా, ఏ తర్పణమైనా వారికి చేరదు. 

శ్రాద్ధములప్పుడు చెప్పే మంత్రాలన్నీ స్వధాంతము గానే ఉంటాయి. 

శ్రాద్ధముల ద్వారా, తర్పణముల ద్వారా, పితరులకు ఆహారాన్నందించే ఆ  స్వధా కు వందనం. 

ఓం శ్రీ  స్వధాయై నమః 

  

537.  అమతిః

అమతి అంటే అవిద్యా స్వరూపురాలు అని అర్ధం. స్వల్పమగు స్వాత్మజ్ఞానము, వృత్తిజ్ఞానము  

కూడా అమతి, అవిద్య అని దుర్గభట్టుడు నిరుక్తంలో చెప్పాడు. 

మతి అంటే బుద్ధి. దీనిని సృష్టించింది శ్రీమాత. ఈ నామంలో అమ్మవారిని అమతి అని

చెప్పుకుంటున్నాం. మతీ, అమతీ రెండూ ఆ శ్రీదేవియే. ఆ శ్రీదేవి విద్యావిద్యా స్వరూపిణి కదా. 

ప్రధమ సృష్టికి ముందు బుద్ధి సృష్టి జరగలేదు. క్రమేపీ ఈ బుద్ధి సృష్టి, ఆ శ్రీవిద్య ద్వారా జరిగి, 

అర్హులకు శుద్ధవిద్య అందింది. ఈ విద్య అందని వారూ వుంటారు. 

వారు అమతి యందు ఉంటారు. అంటే అవిద్యా స్వరూపులుగా వుంటారు. 

అవిద్యాస్వరూపముగా జీవులయందు వున్న, ఆ అమతి కి వందనం. 

ఓం శ్రీ అమత్యై నమః 


538. మేధా 

మేధా అంటే, బుద్ధి స్వరూపిణి అని అర్ధం. చక్కని ధారణాశక్తి కలవారిని మేధావులు అంటాం. 

అగ్నిపురాణంలో 'బుద్ధి యొక్క విశేషరూపమే శ్రీదేవి' అని చెప్పబడింది. 

పద్మపురాణంలో 'కాశ్మీరమండలంలో వున్న దేవత మేధా' అని చెప్పారు. 

మార్కండేయ పురాణంలో దేవీ స్తుతిలో, సర్వభూతములలో బుద్ధి (మేధ) రూపములో వున్న 

ఆ దేవికి నమస్కారము అని వున్నది. బుద్ధి రూపములో అందరి లోనూ వున్నది ఈ మేధాదేవియే. 

"యా దేవీ సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః". 

బుద్ధి వికసనము చేయు, ఆ  మేధా కు వందనం. 

ఓం శ్రీ  మేధాయై నమః 


539. శ్రుతిః

శ్రుతులంటే వేదాలు. ఈ నామంలో అమ్మవారిని 'వేదమే రూపముగా కలది' అని కీర్తిస్తున్నాం. 

వినబడేదాన్ని కూడా శ్రుతి అంటాం. కనుక ఆ శ్రీదేవిని ఈ నామంలో శ్రవణజ్ఞానస్వరూపురాలు 

అని కూడా చెప్పుకుంటున్నాం. శ్రీవిద్యా స్వరూపిణి యైన లలితాదేవి చేత చెప్పబడినవే 

శ్రుతులు. అమ్మ ద్వారా బ్రహ్మకు, బ్రహ్మ ద్వారా ఋషులకు, వినడం ద్వారా అందినవే 

వేదములు. అందుకే వీటిని శృతులు అన్నారు. సృష్ట్యాదిలో లిపి లేదు. 

వేదములన్నీ గురుముఖతః చెప్పబడినవే. విద్ అనే ధాతువు నుండే వేదము, విద్య అనే పదాలు 

వచ్చాయి. మొదట, ఋక్, యజుర్, సామ వేదములు అన్నీ కలిపి ఉండేవి. 

వాటిని క్రమబద్ధంగా విభజించిన వాడు వేదవ్యాసుడు. వ్యాసుని ద్వారా ఈ వేదములు, 

ఆతని శిష్యులైన, పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు మొదలైన వారికి అందాయి. 

ఆ తరువాత వారి ద్వారా, వారి శిష్యులకు పరంపరగా అందాయి. 

ఇవి అన్నీ గురుముఖతః చెప్పబడినవే.  

గురువు ఉచ్చరిస్తుంటే, వాటిని విని,  అదే పద్ధతిలో శిష్యులు కూడా వాటిని ఉచ్ఛరించేవారు. 

విని నేర్చుకునేవి కనుక ఇవి శ్రుతులు. ఈ నామంలో ఆ పరమేశ్వరిని శ్రుతీ అని అంటున్నాం. 

వేదములను మనకు అందించిన ఆ వేద స్వరూపిణి, ఆ శ్రుతి కి వందనం. 

ఓం శ్రీ శ్రుత్యై నమః 


540.  స్మృతిః

స్మృతి అనే నామంతో ఆ మాహేశ్వరిని సంబోధిస్తున్నాం. స్మరించుకునేది స్మృతి. 

శ్రుతి శ్రవణ జ్ఞాన రూపమైతే, స్మృతిది స్మరణ జ్ఞాన రూపం. 

దేవీ భాగవతంలో సంస్మరించబడునది కనుక స్మృతీ అని చెప్పారు. 

వేదార్ధాలను వివరించడానికి చెప్పినవే స్మృతులు. 

పద్దెనిమిది మంది ఋషులు పద్దెనిమిది స్మృతులను చెప్పారు. 

వీటితో పాటు పద్దెనిమిది ఉప స్మృతులు కూడా వున్నాయి.

అన్నింటిలో చెప్పినది ధర్మ పద్ధతిలో జీవించటం ఎలా అనేదే. 

ఈ స్మృతుల ఆధారంగానే ధర్మ సింధు, నిర్ణయసింధు వంటి గ్రంధాలు కూడా రచించబడ్డాయి. 

మనుస్మృతి, పారాశర స్మృతి, యాజ్ఞ్యవల్క్య స్మృతి వంటివి కొన్ని బాగా ప్రాచుర్యం లోకి వచ్చాయి. 

జరిగినది, జరగబోవునది కూడా, ఈ స్మృతుల ద్వారా స్మరిస్తాము కనుక వీటికి స్మృతులు అని 

పేరు వచ్చిందని వాయుపురాణంలో చెప్పారు. 

స్మరణ జ్ఞాన రూపములో వున్న, ఆ స్మృతి కి వందనం. 

ఓం శ్రీ  స్మృత్యై నమః


541.  అనుత్తమా

అన్నింటి కన్నా ఉత్తమమైనది అనుత్తమా. లలితాదేవి కన్నా ఉత్తమమైన స్వరూపము 

మరియొకటి లేదు కనుక, అమ్మవారిని ఈ నామములో అనుత్తమా అంటున్నాం. 

అమ్మను సమానాధికా వర్జితా అని చెప్పుకున్నాం. ఆ మహాశక్తితో సమానులు ఎవరూ లేరు, 

అధికులూ ఎవరూ లేరు, కనుక ఆ తల్లి అనుత్తమా. అందరికన్నా శ్రేష్టమైనది అని భావం. 

దేవీభాగవతంలోని తృతీయ స్కంధంలో, రుద్రాంశ లేకున్నా, విష్ణ్వంశ లేకున్నా నరాధములు 

అనబడరు, కానీ శక్తి అంశ లేనివాడు నరాధముడు అని స్పష్టంగా చెప్పబడింది. 

కనుక అన్నింటికన్నా ఉత్కృష్టమైనది, శక్తి అంశను కలిగివుండటం అనేది తెలుస్తోంది. 

అనుత్తమా అంటే, స్వతంత్ర బుద్ధి కలది అని ఒక అర్ధం. 

అనుత్తమా అంటే, సహజ సిద్ధమైన ఐశ్వర్యమును కలిగివున్నది అని మరియొక అర్ధం. 

అందరిలోనూ, అన్నింటిలోనూ శ్రేష్ఠురాలయిన, ఆ అనుత్తమ కి వందనం. 

ఓం శ్రీ అనుత్తమాయై నమః




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

9, నవంబర్ 2021, మంగళవారం

109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ

 

సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా 
సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥

528. సహస్రదళపద్మస్థా

సహస్రదళపద్మస్ధా అంటే, సహస్రదళపద్మములో ఉండునది అని అర్ధం. 

రాబోయే నామాలలో సహస్రారములో వున్న శ్రీలలిత విశేషణముల గురించి చెప్పుకుందాం. 

ఆజ్ఞకి పైనా, బ్రహ్మరంధ్రముకి కిందా,  గల మధ్యభాగంలో  సహస్రదళపద్మమున్నది. 

ఈ సహస్రదళపద్మమునకు అధిపతులు పరమేశ్వరీ, పరమేశ్వరులు. 

ఈ సహస్రారము శరీరమునకు కొద్దిగా పైన ఉంటుంది. బ్రహ్మ రంధ్రము కానీ 

సహస్రారము కానీ శరీరమునకు పైన వున్న కేంద్రములు. బాహ్యముగా వున్నప్పటికీ,

ఆ రెండూ కూడా జీవి యొక్క ప్రజ్ఞాశరీరము లేదా జ్యోతిశ్చక్రము లోపలే ఉంటాయి.

కొలనులో నీరు ఎంత వున్నా, నీరు కొలది తామెరలు కనుక, కమలాలు ఎప్పుడూ నీటిని 

తాకకుండా కొలను పైభాగాన ఎలా తేలియాడుతూ వుంటాయో, అదేవిధంగా సహస్రార కమలం 

కూడా శరీరానికి తాకకుండా బాహ్యంగా, ఊర్ధ్వంగానే ఉంటుంది. 

 ఆ చక్రములో వున్న పద్మముపై కొలువున్న శ్రీదేవియే సహస్రదళపద్మస్థా. 

 చక్ర పద్మమునకు వెయ్యి దళములు. ఆ పద్మము కర్ణిక పై కొలువున్నదే సహస్రదళపద్మస్థా. 

సహస్రారానిది సత్యలోకం, పరమాత్మ స్థానం, ముదురు ఊదా రంగు, ఆత్మ ప్రధానము. 

సహస్రారము వద్ద పద్మములో అధిష్ఠించిన, ఆ సహస్రదళపద్మస్థ కు వందనం. 

ఓం శ్రీ సహస్రదళపద్మస్థాయై నమః  


529. సర్వవర్ణోపశోభితా

ఇప్పటివరకూ చెప్పుకున్న దేవతల మేని చాయలు, డాకినీ పాటల వర్ణము, రాకినీ చామనచాయ, 

లాకినీ ఎరుపు, కాకినీ పసిమి, సాకినీ ధూమ్రము, హాకినీ తెలుపు. 

అదేవిధంగా ఇప్పటివరకూ చెప్పుకున్న చక్రముల రంగులు, విశుద్ధి నీలము, 

అనాహతము ఆకుపచ్చ, మణిపూరము పసుపు, స్వాధిష్ఠానము సిందూరం, మూలాధారం ఎరుపు, 

ఆజ్ఞ లేత నీలి, లేదా ఊదా, సహస్రారము ముదురు వూదా రంగులు. గమనించి చూస్తే 

ఇవే మనం వరుసగా చెప్పుకునే ఇంద్రధనుస్సు రంగులు. ఇదే మన శరీరంలో వున్న హరివిల్లు. 

ఈ సహస్రార పద్మములో వున్న శ్రీదేవి ఈ పై చెప్పిన రంగులన్నీ కలబోసిన 

సర్వ వర్ణ ఉప శోభితా, అంటే, నానావిధ వర్ణములతో ప్రకాశించు పరమేశ్వరి. 

డాకినీ అ నుండి అః వరకూ, రాకినీ క నుండి ఠ వరకూ, లాకినీ డ నుండి ఫ వరకూ, 

కాకినీ బ నుండి ల వరకూ, సాకినీ వ నుండి స వరకూ, హాకినీ హ, క్ష వరకూ కల వర్ణాక్షర 

దేవతా శక్తులచే సేవింపబడుతున్నాయి. మాతృకా వర్ణమాలలో వున్న ఈ యాభై ఒక్క వర్ణములతో 

అలరారు దేవత సహస్రదళపద్మస్థ. వర్ణము అంటే వన్నె అనీ, అక్షరమనీ అర్ధాలున్నాయి. 

శబ్దములన్నీ ఇక్కడి నుంచే పుడుతున్నాయి. అన్నింటికీ సహస్రారము మాతృస్థానము. 

అనేకానేక వర్ణములతో శోభిల్లు, ఆ సర్వవర్ణోపశోభిత కు వందనం.  

ఓం శ్రీ సర్వవర్ణోపశోభితాయై నమః  


530. సర్వాయుధధరా

ఆయుధములూ అంతే. సర్వ దేవతల ఆయుధములూ ఈ సహస్రదళపద్మస్థవే. 

సహస్రము అంటే వెయ్యి అనే పరిమిత సంఖ్య కాదు. వేనవేలు, కోటానుకోట్లు. 

సహస్ర హస్తములలో, సహస్ర ఆయుధములతో, తేజరిల్లే మహాశక్తి ఈ సహస్రదళపద్మస్థా. 

అనేకానేక ఆయుధములను ధరించి మహా తేజోరూపముతో, ప్రకాశిస్తున్న, 

ఆ సర్వాయుధధర కు వందనం. 

ఓం శ్రీ సర్వాయుధధరాయై నమః  


531. శుక్లసంస్థితా

ప్రతి చక్రములోనూ ఏదో ఒక ధాతువుని ఆవరించి వున్నది లలితాపరమేశ్వరి. 

విశుద్ధిలో చర్మములో, అనాహతములో రక్తములో, మణిపూరములో మాంసములో, 

స్వాధిష్ఠానములో మేదస్సులో, మూలాధారములో ఎముకలలో, ఆజ్ఞలో మజ్జలో, వున్న దేవి 

సహస్రారములో శుక్లరూపములో వున్నది. శుక్లమంటే వీర్యము. 

శుక్లములో వున్నది, వీర్యము నందు అభిమానము కలది అని ఈ నామానికి అర్ధం. 

భవిష్యోత్తర పురాణంలో 'రమణ కాలమందలి ధ్యానములో ఉండునది శుక్లము' అని వున్నది. 

ప్రతిజీవి లోనూ వున్న, శుక్లము లో వుండే, ఆ శుక్లసంస్థిత కు వందనం. 

ఓం శ్రీ శుక్లసంస్థితాయై నమః 

  

532. సర్వతోముఖీ

సర్వతోముఖీ అంటే అన్నివైపులా ముఖములు కలిగి ఏకకాలములో సర్వమూ చూడకలిగిన 

శక్తి కలది అని అర్ధం. అన్ని జీవుల ముఖములూ ఆ పరమేశ్వరివే. 

సహస్ర శీర్షా అనే నామంలో కూడా చెప్పుకున్నాం. ఆ  జగజ్జనని ఎన్నో శిరములతో, 

ముఖములతో, సర్వసాక్షియై, సర్వమూ చూస్తున్న మహాశక్తి. 

అనేకానేక ముఖములు కలిగిన, ఆ సర్వతోముఖి కి వందనం. 

ఓం శ్రీ సర్వతోముఖ్యై  నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

   

8, నవంబర్ 2021, సోమవారం

108. మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ

 

మజ్జాసంస్థా, హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా 
హరిద్రాన్నైక రసికా, హాకినీ రూపధారిణీ ॥ 108 ॥

524.మజ్జాసంస్థా

ఈ దేవత ఎముకలలో మజ్జ అనే ధాతువులో ఉంటుంది. ఈ మజ్జ అనే ధాతువు వలననే 

రక్తము ఎప్పటికప్పుడు శరీరములో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. 

ఈ మజ్జలో లోపము ఉంటే రక్త దోషములు కలుగుతాయి. 

మజ్జలో లోపాలుంటే కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వస్తాయి. 

ఇటువంటి ఆరోగ్య సమస్యలుంటే, ఈ నామ జపం మేలు చేస్తుంది.  

అమ్మవారు కరుణామయి, మాతృస్వరూపము. అందుకే జీవుల ఎముకలలో కల మజ్జ అనే 

ధాతు రూపములో, మాతృకణముల రూపములో ఉంటూ, జీవులకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోంది. 
 
మజ్జ ధాతువులో ఉంటూ ఆరోగ్యాన్నిస్తున్న, ఆ మజ్జాసంస్థ కు వందనం. 

ఓం శ్రీ మజ్జాసంస్థాయై నమః  


525. హంసవతీముఖ్యశక్తిసమన్వితా 

ఆజ్ఞాచక్రము లోని పద్మమునకు రెండు దళములు అని చెప్పుకున్నాం కదా. 

ఆ రెండు దళములు ఇడా పింగళా నాడులకు సంకేతం. 

హ, క్ష, అను రెండు హల్లు అక్షరములచే సూచించబడే హంసవతీ, క్షమావతీ అనే దేవతాశక్తులు, 

ఈ రెండు దళములలో వుంటూ, మధ్యలో వున్న ఆజ్ఞాచక్రాబ్జ నిలయను సేవిస్తూ ఉంటాయి. 

హ, క్ష అనే అక్షర దేవతా శక్తులచే పూజింపబడే, ఆ హంసవతీముఖ్యశక్తిసమన్విత కు వందనం.  

ఓం శ్రీ హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః  


526. హరిద్రాన్నైక రసికా

హరిద్రాన్నమంటే ఇష్టమైన దేవత. హరిద్రాన్నము అంటే పసుపు కలిపి వండిన పులిహోర, 

లేదా చిత్రాన్నము. పచ్చని అన్నమంటే రసజ్ఞత చూపునది ఈ దేవత. 

బియ్యము, పసుపు, పులుపు కలిపి అన్నము వండి అమ్మకు నైవేద్యం పెడితే సంతోషిస్తుంది. 

పులిహోర అన్నం అంటే ప్రీతి చూపే, ఆ హరిద్రాన్నైక రసిక కు వందనం. 

ఓం శ్రీ హరిద్రాన్నైక రసికాయై నమః  


527. హాకినీరూపధారిణీ

ఆజ్ఞాచక్రపద్మ మధ్యములో, భ్రూమధ్యములో వున్న దేవత పేరే హాకినీ. 

అందుకే ఈ నామంలో ఆ తల్లిని హాకినీరూపధారిణీ అంటున్నాం. 

ఇడా పింగళా నాడులు సుషుమ్నలో కలిసేది ఈ  భ్రూమధ్యము వద్దనే. 

గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ స్థానం ఆఙ్ఞయే. 

కూటత్రయముల సంగమస్థానమైన త్రికూటమూ ఆఙ్ఞయే. 

సూర్య, చంద్ర, అగ్ని మండలములు కలిసే స్థానం కూడా ఆఙ్ఞయే. 

త్రిపురములూ కలిసే స్థానము ఆఙ్ఞ. 

రెండు భావనలు, మూడవ భావనతో ఐక్యమయ్యే, సంగమస్థానమే ఆజ్ఞ. 

ఈ స్థానము నుంచే ఆజ్ఞలు వస్తాయి. కనుకనే దీనిని ఆజ్ఞా చక్రమని అంటారు. 

మూలప్రకృతిని 'హం' అనే బీజాక్షరం తోనూ, మూల పురుషుడిని 'సం' అనే బీజాక్షరం తోనూ

జపిస్తే ఆ జపం సోహం లేదా హంస జపమవుతుంది. 

భృకుటి వద్ద ధ్యానమును కేంద్రీకరించి ఓంకారంతో జపం చేస్తే ఫలితం ఉంటుంది. 

జ్ఞా చక్ర పద్మములో ఉంటూ, వజ్రము వంటి ధవళవర్ణములో, ఆరు ముఖములతో 

వుండే తల్లి హాకినీ రూపధారిణీ. జీవుల ఎముకలలో వుండే మజ్జ అనే ధాతువులో ఉంటూ, 

పులిహోర వంటి చిత్రాన్నమును ఇష్టపడుతూ ఉంటుంది. 

హంసవతీ, క్షమావతీ అనే అక్షరదేవతా శక్తులచే పూజింపబడుతూ ఉంటుంది. 

ఆజ్ఞా చక్రములో ఉంటూ ఆజ్ఞల నిస్తున్న, ఆ హాకినీరూపధారిణి కి వందనం. 

ఓం శ్రీ హాకినీరూపధారిణ్యై నమః 


  


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650