26, డిసెంబర్ 2021, ఆదివారం

156. ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్పీఠరూపిణీ విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః

 

ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్పీఠరూపిణీ 
విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః ॥ 156 ॥


831. ప్రాణేశ్వరీ

ప్రాణేశ్వరీ అంటే ప్రాణములకు ఈశ్వరి అని అర్ధం. ప్రాణములనగా ఇంద్రియములు. 

ఆ ఇంద్రియములకు అధిష్ఠాత్రి కనుక ప్రాణేశ్వరీ అనే నామం వచ్చింది. 

అయిదు ప్రధాన ప్రాణములకూ ముఖ్యప్రాణమయిన ప్రాణవాయువునకు అధిష్ఠాత్రి ప్రాణేశ్వరీ. 

అయిదు ఉపప్రాణములకూ కూడా అధిష్ఠాత్రి ప్రాణేశ్వరీనే. 

పంచ ప్రాణాలూ, పంచ ఉప ప్రాణాలూ గురించి ముందే చెప్పుకున్నాం. 

వేదములో, 'ప్రాణమునకు కూడా ప్రాణము' అని చెప్పబడింది, కనుక ప్రాణేశ్వరీ. 

ప్రాణము అంటే ప్రకృష్టమైన ప్రణము అని అర్ధం. ప్రణమంటే శబ్దము. శబ్దమంటే వేదము. 

కనుక ప్రాణము అంటే వేదము అని ఒక అర్ధం. ఆ వేదములకు ఈశ్వరి కనుక, ప్రాణేశ్వరీ. 

వేదములో చెప్పబడిన దేవత ప్రాణేశ్వరీ. వేదముచే ప్రతిపాదింపబడిన దేవత ప్రాణేశ్వరీ.  

దశవిధ ప్రాణములకూ ఈశ్వరి అయిన, ఆ ప్రాణేశ్వరి కి వందనం.

ఓం శ్రీ  ప్రాణేశ్వర్యై నమః  


832. ప్రాణదాత్రీ

ప్రాణదాత్రీ అంటే ప్రాణములను ఇచ్చునది. ప్రాణములంటే ఇంద్రియములని చెప్పుకున్నాం. 

పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు కలిసి మొత్తం ఇంద్రియములు 

పదకొండు. ఈ ఏకాదశేంద్రియములనూ ఇచ్చునది ప్రాణదాత్రీ అయిన ఆ జగదీశ్వరి. 

సకల జగత్తులకూ, సకల జీవులకూ జీవదాత్రి ఈ ప్రాణదాత్రి. 

"ప్రాణోత్క్రమణ సమయములో, ప్రాణము శరీరమును వదిలి వెడుతుంటే, మిగిలిన ప్రాణాలన్నీ 

దానిని అనుసరించి వెళ్లిపోతాయి", అని వేదములో చెప్పారు. 

వేదసూత్రాలలో ప్రాణగతులు ఏడు అని చెప్పారు. ఈ ప్రాణములనన్నీ ఇచ్చునది ప్రాణదాత్రీ. 

జీవుడికి ఏకాదశ ప్రాణములనూ ఇచ్చు, ఆ ప్రాణదాత్రి కి వందనం.  

ఓం శ్రీ ప్రాణదాత్ర్యై నమః  


833.  పంచాశత్పీఠరూపిణీ 

సంస్కృత సంఖ్యామానంలో పంచాశత్ అంటే యాభై అని అర్ధం. కానీ ఈ నామంలో పంచాశత్ 

అంటే, యాభై ఒకటి అని అర్ధం చేసుకోవాలి. 

ఎందుకంటే అమ్మ అధివసించిన ముఖ్య పీఠములు యాభైఒకటి. 

కనుక సుమారుగా అంచనా వేసి దగ్గరలోని దశమునకు జోడించి పంచాశత్ అన్నారు, అని అర్ధం 

చేసుకోవాలి. సంస్కృతములో కోటి అంటే ఖచ్చితంగా కోటి కాదు, లక్ష అంటే ఖచ్చితంగా లక్ష 

కాదు, సహస్రమంటే ఖచ్చితంగా వెయ్యి కాదు, అని ముందరే చాలాసార్లు చెప్పుకున్నాం. 

ఇక్కడ పంచాశత్ అనే సంస్కృత సంఖ్యకు యాభై ఒకటి అని అర్ధం చెప్పుకుంటే అమ్మవారి 

శక్తి పీఠాల సంఖ్యకు సరిపోతుంది. 

పంచాశత్ పీఠ రూపిణీ అంటే యాభై ఒక్క పీఠాల స్వరూపం, లేదా ఆ యాభై ఒక్క పీఠాలకు 

అధినేత్రి అని అర్ధం. అమ్మ అవతరించిన యాభై ఒక్క పీఠములూ అమ్మ స్వరూపమే కనుక, 

అమ్మను ఈ నామంలో పంచాశత్పీఠరూపిణీ అంటున్నాం. 

జ్ఞానార్ణవంలో, ఈ యాభై, లేదా యాభై ఒకటి పీఠాలనూ, మాతృకావర్ణాలతో న్యాసం చేయాలి 

అని చెప్పారు. న్యాసం చెయ్యడం అంటే ఒక్కో మాతృకావర్ణంతో, అంటే ఒక్కో అక్షరంతో, 

ఒక్కో పీఠాన్ని అనుసంధానించాలి అని అర్ధం. 

మాతృకావర్ణాలు యాభై. క్షకారమును కూడా కలుపుకుంటే యాభై ఒకటి. 

ఆ యాభై ఒక్క, లేదా యాభై అక్షర స్వరూపాలే శ్రీమాత పీఠాలు. 

ఆ యాభై ఒక్క, లేదా యాభై పీఠాల అధీశ్వరినే ఈ నామంలో పంచాశత్పీఠరూపిణీ అంటున్నాం. 

యాభై ఒక్క పీఠాలకూ స్వరూపాన్నిచ్చిన, ఆ  పంచాశత్పీఠరూపిణి కి వందనం. 

ఓం శ్రీ  పంచాశత్పీఠరూపిణ్యై నమః  


834. విశృంఖలా

విశృంఖలా అంటే శృంఖలములు లేనిది, బంధనములు లేనిది, సంకెలలు లేనిది అని అర్ధం. 

ఎటువంటి కర్మ బంధములూ లేనిది, విధినిషేధములు లేనిది విశృంఖలా. 

ఎటువంటి కర్మ బంధములూ లేనిది అంటే, ఏ కర్మ శేషమూ మిగలనిది. అది పుణ్యకర్మ యైనా, 

పాపకర్మ యైనా అనుభవించి తీరవలసిందే కదా. ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. 

పాపకర్మ అయితే ఇనపసంకెళ్లు, పుణ్యకర్మ అయితే బంగారు సంకెళ్లు. అంతే తేడా. 

సంకెళ్లు ఇనుపవైనా, పసిడివైనా సంకెల సంకెలే, బంధనమే. స్వేచ్ఛా ప్రతిరోధకమే. 

కనుక ముక్తిని పొందాలంటే, కర్మ శేషం వుండకూడదు. 

అన్ని కర్మలనూ తీర్చుకున్న తరువాతే ముక్తి దొరుకుతుంది. అమ్మకు ఏ కర్మలూ అంటవు 

కనుక, ఏ కర్మ శేషమూ ఉండదు. అందుకే అమ్మను విశృంఖలా అనే నామంతో పిలుస్తున్నాం. 

జీవులు మాత్రం అన్ని కర్మలనూ తీర్చుకున్న తరువాతే విశృంఖలలు అవుతారు. 

అప్పటివరకూ శృంఖలాలు తప్పవు. 

విశృంఖలా అంటే కట్టుబట్ట, గొలుసు అనే అర్ధాలు కూడా వున్నాయి. 

కనుక విశృంఖలా అంటే కట్టుబట్ట లేనిది, దిగంబరస్వరూపురాలు అని కూడా అర్ధం. 

అలంపురం క్షేత్రంలో వున్న జోగులాంబాదేవి నగ్నంగా ఉంటుంది. దిగంబరురాలు. 

దిక్కులే అంబరముగా, అంటే వస్త్రముగా కలిగినది దిగంబరా. 

అంటే శరీరమును కప్పేది దిక్కులే కానీ వస్త్రములు కావు అని భావం. 

ఏ కర్మ బంధములూ అంటని, ఆ విశృంఖల కు వందనం. 

ఓం శ్రీ విశ్రృంఖలాయై నమః 

  

835. వివిక్తస్థా

వివిక్తస్థా అంటే ఎవరూ లేని నిర్జన ప్రదేశములలో ఉండునది అని అర్ధం. 

వివిక్తము అంటే విజన ప్రాంతము, జనులు లేని, తిరుగాడని ప్రాంతము. 

అట్టి స్థలములు పవిత్రమైనవి అని హారీత స్మృతిలో చెప్పారు. 

అమరకోశంలో కూడా వివిక్తము అంటే, మనుషులు లేని ప్రదేశము, పవిత్రమైనది అని వుంది. 

మనుషులు చేరి ఆ పవిత్రతను నాశనము చేస్తున్నారు. ఇందుకు తిరుమల కొండలు, కేదారనాథ్ 

కొండలు, వైష్ణోదేవీ కొండలు, అమరనాథ్ కొండలు, శ్రీశైలం కొండలు వంటివి కొన్ని 

ఉదాహరణలు. 

అందుకే పవిత్రమైన ఆలయాలు, దేవస్థానములు దుర్జనారణ్యాలలో గానీ, దుర్గమమైన పర్వత 

ప్రాంతాలలో కానీ ఉండటం చూస్తూ ఉంటాం. అటువంటి పవిత్ర ప్రదేశములలో యోగులు, 

సిద్ధులు, ఉపాసకులు, సాధకులు అపవిత్రత అంటక, ఏ ధ్యానభంగమూ కాక, స్థిర మనస్కులై 

తపస్సు, సాధన, ఉపాసన చేసుకోగలుగుతారు.  

దుర్జన ప్రదేశములలో ఉండు వనదుర్గా స్వరూపమైన పార్వతీదేవియే వివిక్తస్థా.

వివిక్తులు అంటే వివేకము కలవారు అనే అర్ధం కూడా వుంది. 

వివిక్తస్థా అంటే ఆత్మానాత్మవివేకము ఉన్న వారి యందు ఉండునది అని ఇంకొక అర్ధం. 

పవిత్రమైన విజన ప్రదేశములలో వుండు, ఆ వివిక్తస్థా కు వందనం. 

ఓం శ్రీ వివిక్తస్థాయై నమః 


836. వీరమాతా

వీరులకు మాత వీరమాతా. వీరులంటే ఎవరో ముందు నామాలలో చెప్పుకున్నాం. 

ఎల్లప్పుడూ జయమును పొందేవారు వీరులు. యుద్ధములో మరణించిన వారికి వీరస్వర్గంలో 

స్థానముంటుంది. వారు యుద్ధంలో మరణించినా వారు వీరులనబడతారు. 

ఉపాసనలో ఉన్నతస్థితిని సాధించినవారిని కూడా వీరులంటారు. 

ఈ వీరులందరికీ హితము చేకూర్చు మాత కనుక, అమ్మను ఈ నామంలో వీరమాతా అంటున్నాం. 

గణపతికి వీరుడనే నామం వుంది. గణపతి కుమారస్వామిని తన ఉపాసనతో జయించి, 

గణాధిపత్యం సాధించాడు. పద్మ పురాణంలో గణేశుని గురించి ఒక కథ ఉంది.

"వీరకుడైన గణేశుడు తనకు ప్రియమైన వాడనీ, తన గణములచే పూజింపబడుతున్నాడనీ శివుడు

ప్రశంసిస్తే, పార్వతి, "ఈ బాలుడి వంటి పుత్రుడు కావలెనని కోరికగా వుంది", అంటుంది. అందుకు

శివుడు,"ఈ వీరకుణ్ణే నీ పుత్రుడుగా స్వీకరించు, నీ కోరికా తీరుతుంది, ఆ బాలుడూ నీ పుత్రుడుగా 

కృతార్థుడవుతాడు", అంటాడు. అప్పుడు పార్వతి తన చెలికత్తె విజయతో వీరకుణ్ణి తన వద్దకు 

పిలిపించుకుంది" అని సూతుడు పద్మపురాణంలో చెప్తాడు. 

వీరులైన వారందరికీ మాతయై హితము కూర్చు, ఆ వీరమాత కు వందనం. 

ఓం శ్రీ వీరమాత్రే నమః 


837. వియత్ప్రసూః

ఆకాశమును ప్రసవించింది కనుక వియత్ప్రసూ అనే నామం వచ్చింది. 

వేదములో 'అమ్మ నుండి ఆకాశం వచ్చింది', అని చెప్పారు. 

మఠాకాశమైనా, ఘటాకాశమైనా, దహరాకాశమైనా, పరాకాశమైనా, అన్ని ఆకాశాలూ అమ్మ నుంచి 

ఉద్భవించినవే. ఆ ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, 

జలము నుంచి పృధ్వి వచ్చాయి. 

పంచభూతాలే కాదు సమస్తమూ అమ్మ సృష్టించిన ఆకాశము నుంచే వచ్చాయి. 

ఆ ఆకాశమును ప్రసవించిన పరమేశ్వరినే ఈ నామంలో వియత్ప్రసూ అంటున్నాం. 

మహత్తత్త్వమైన ఆకాశమును సృష్టించిన, ఆ వియత్ప్రసూ కు వందనం. 

ఓం శ్రీ వియత్ప్రసువే నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

25, డిసెంబర్ 2021, శనివారం

155. బ్రహ్మాణీ, బ్రహ్మ, జననీ, బహురూపా, బుధార్చితా ప్రసవిత్రీ, ప్రచండా, ఆజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః

 

బ్రహ్మాణీ, బ్రహ్మ, జననీ, బహురూపా, బుధార్చితా 
ప్రసవిత్రీ, ప్రచండా, ఆజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః ॥ 155 ॥


821. బ్రహ్మాణీ

దేవీపురాణంలో చతుర్ముఖ బ్రహ్మను పుట్టించింది కనుక, బ్రహ్మాణీ అని వుంది. 

దేవీపురాణంలోనే బ్రహ్మను బ్రతికించింది కనుక, బ్రహ్మాణీ అయినది అని కూడా వుంది. 

అణీ అంటే పుచ్ఛము, కొన, సీమ, పొలిమేర అనే అర్ధాలున్నాయి. బ్రహ్మ, అణీ అంటే బ్రహ్మమైన 

పుచ్చము కలది అని అర్ధము. మహాభారతంలో శూలాగ్రమున గుచ్చబడిన మాండవ్యమహర్షిని 

అణీమాండవ్యుడని అన్నారు. అణీ అంటే శూలాగ్రము అని కూడా అర్ధం. 

బ్రహ్మమునకు కింది స్థితి ఆనందమయకోశము. పంచకోశాలలో ఆనందమయకోశానిది అగ్రస్థానం. 

అంటే, బ్రహ్మమునకు ఆనందమయకోశము పుచ్చము వంటిది. 

వేదములో ఆనందమయకోశమును బ్రహ్మపుచ్చము అని చెప్పారు. 

కనుక బ్రహ్మానంద స్వరూపమే బ్రహ్మాణీ.  

పితామహుడైన బ్రహ్మ భార్యను కూడా  బ్రహ్మాణీ అంటారు.

బ్రహ్మానంద స్వరూపమైన, ఆ బ్రహ్మాణి కి వందనం. 

ఓం శ్రీ  బ్రహ్మాణ్యై నమః  


822. బ్రహ్మ

బృహత్తమమైన దానిని బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే విశిష్టమైన గొప్ప జ్ఞానము. 

బ్రహ్మ అంటే నలువ, సృష్టికర్త, పరమాత్మ, వేదము, జ్ఞానము, తపము, బ్రాహ్మణుడు, ఋత్విజుడు, 

మూలప్రకృతి, ఆత్మ స్వస్వరూపము, బ్రహ్మము అనే అర్ధాలున్నాయి. 

విష్ణుపురాణంలో, 'స్వాత్మాభిన్నమైన ఆత్మజ్ఞాన స్వరూపమే బ్రహ్మ' అని వుంది. 

బ్రహ్మ అంటే, వాక్కునకు అందనిది, ఇంద్రియములకు గోచరించనిది.  

సృష్టి చేసే శక్తి అమ్మ బ్రహ్మకు ఇచ్చింది కనుక బ్రహ్మ మాత్రమే సృష్టికర్త.

సృష్టి చేస్తున్న ప్రతిప్రాణీ  ఆ సృష్టి చేస్తున్న సమయంలో బ్రహ్మమే. 

బ్రహ్మ కానివాడు ఎవడూ సృష్టి చేయలేడు. 

త్రిమూర్తులలో ఒక్కడైన నలువను కూడా బ్రహ్మ అంటాము. 

యజ్ఞాలు, క్రతువులు చేయించే ఋత్విక్కును కూడా బ్రహ్మ అంటారు. 

కేవలము ఆత్మ చేతనే తెలియబడే జ్ఞానమే బ్రహ్మతత్త్వం, బ్రహ్మము, బ్రహ్మ.  

పరమేశ్వరి నుంచి  వేదాలు బ్రహ్మ ద్వారా పరంపరగా అందినాయి కనుక, బ్రహ్మనే వేదము, 

జ్ఞానము అని కూడా అన్నారు. 

అన్ని జ్ఞానములలో కెల్లా విశిష్టమైన, అద్వితీయమైన, జ్ఞానస్వరూపమైన, ఆ బ్రహ్మ కు వందనం.  

ఓం శ్రీ  బ్రహ్మణే నమః  


823. జననీ 

జననీ అంటే మాత, శ్రీమాత, కన్నతల్లి. 

మహత్తరమైన బ్రహ్మ నుంచీ అత్యల్ప ప్రాణియైన స్తంబము వరకూ అందరికీ జనని. 

ఈ జననినే ఆబ్రహ్మకీటజననీ అనీ, అనేకకోటిబ్రహ్మాండకోటిజననీ అనీ అంటున్నాం. 

ఈ లలితా పరమేశ్వరీ దేవియే బ్రహ్మ జననీ. ఈ దేవియే ముగురమ్మల మూలపుటమ్మ. 

ఈ మాతయే శ్రీమాత, విశ్వమాత, జగన్మాత, లోకమాత, వేదమాత అనే పేర్లతో పిలువబడుతోంది. 

సిద్ధమాత, వీరమాత, గోమాత అనే రూపాలలో, సర్వ ప్రాణులకూ తల్లి రూపంలో వుంది. 

సర్వులనూ, సమస్తమునూ, సకలలోకములనూ కన్నతల్లి, ఆ  జనని కి వందనం. 

ఓం శ్రీ  జనన్యై నమః  


824. బహురూపా

బహురూపాలను ధరించినది బహురూపా. 

"ఆ లలితాపరమేశ్వరి భండాసుర వధ కోసం ఒక్క లలితాదేవియే అనేక రూపాలు ధరించింది" 

అని బ్రహ్మాండపురాణంలోనూ, దేవీపురాణంలోనూ కూడా చెప్పారు. 

శక్తి సైన్యం, భైరవ సైన్యం సమస్తం అమ్మ తన నుంచే సృష్టించింది. 

లలితయే శ్యామల, వారాహి, సంపత్కరీ, అశ్వారూఢా, దండనాథా, జ్వాలామాలిని, బాలా వంటి  

రూపాలన్నీ ధరించింది. దశమహావిద్యారూపాలూ లలితాదేవియే. 

వశిన్యాది అష్ట వాగ్దేవతలూ అమ్మ అంశా రూపాలే. 

దేవీపురాణంలో, "సమస్త స్థావరజంగమాలూ, దేవ, మానుష, తిర్యక్కులూ కూడా ఆ దేవియే కనుక 

బహురూపా అనే నామం వచ్చింది" అని చెప్పారు. 

అకారాది అచ్చు రూపములూ, కకారాది హల్లు రూపములూ ఆ తల్లివే. 

ఈ విషయాన్నే, సూతసంహితలో,"ఏ దేవి ఒకటిగా, రెండుగా, పదహారుగా, ముప్పదిరెండు 

విధములుగా వున్నదో, ఆ పరాత్పరురాలికి వందనం", అని చెప్పారు. 

భాగవతములో, "ఒక్క నర్తకియే ఏవిధముగా లక్ష్మీ, వాణీ రూపములు దాల్చిందో, అదేవిధముగా, 

దేవి అనేక రూపములు దాల్చింది" అని వుంది. 

వేదములో, "రుద్రులు అనేకులు, కనుక రుద్రాణులూ బహురూపులు", అని వుంది. 

వామనపురాణంలో,"విశ్వము బహువిధములు, ఆ బహువిధ విశ్వములలో బహురూపములలో 

వ్యక్తం అవుతున్న పార్వతి బహురూపా", అని వున్నది. 

లింగపురాణంలో, "లోకంలోని పురుషులందరూ శివ స్వరూపాలు, స్త్రీలందరూ శక్తి స్వరూపాలు", 

అని వుంది. 

వరాహపురాణంలో, "ఒక ఆదిశక్తియే, సాత్విక శక్తిగా బ్రాహ్మీ వలె, రాజస శక్తిగా వైష్ణవీ వలె, తామస 

శక్తిగా రౌద్రీ అనీ, చాముండా అనీ అనంత రూపములలో వున్నది" అని చెప్పారు. 

త్రిపురా సిద్ధాంతములో, "లోపాముద్రా, సౌభాగ్య, షోడశీ పరమశివుని భార్యలు. శ్యామల, శుద్ధవిద్య, 

అశ్వారూఢా, పరా సదాశివుని ప్రియభార్యలు. మహార్థ, ద్వాదశార్థా, వారాహీ, బగళాముఖీ, తురీయా, 

భువనేశీ, శ్రీపరా, శాంభవీ, శివా రుద్రుని భార్యలు. శ్రీ, తిరస్కరిణీ, లక్ష్మీ, మిశ్రా, కామకళా, వీరు 

విష్ణుని ప్రియభార్యలు. అన్నపూర్ణ శివుని భార్య. వాగ్వాదినీ, బాలా బ్రహ్మ పత్నులు. హసంతి,  

నవదూతికలు, నవ సిద్ధదేవతలు, మొదలైన రూపములన్నీ నీవే", అని దేవిని కీర్తించినట్లు 

ఉన్నది. ఇన్ని రూపములతో వ్యక్తమవుతున్న పార్వతి బహురూపా అయింది. 
  
సర్వ దేవతల రూపములూ తానే అయిన, ఆ బహురూప కు వందనం. 

ఓం శ్రీ బహురూపాయై నమః 

  

825. బుధార్చితా

బుధులచే అర్చింపబడుతున్నది కనుక ఆ పరమేశ్వరిని ఈ నామంలో బుధార్చితా అంటున్నాం. 

బుధులంటే జ్ఞానులు, బుద్ధి వికసించినవారు, పండితులు. 

శ్రీమద్భగవద్గీతలో కూడా, "ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్ధులు, జ్ఞానులూ నన్ను భజిస్తున్నారు" 

అంటాడు భగవానుడు. కనుక జ్ఞానులు కూడా భగవంతుని సేవిస్తారు అని తెలుస్తోంది. 

పండితవర్గము చేత అర్చింపబడుతున్న, ఆ బుధార్చిత కు వందనం. 

ఓం శ్రీ బుధార్చితాయై నమః 


826.  ప్రసవిత్రీ

సమస్తమునూ ప్రసవిస్తున్నది కనుక అమ్మను ఈ నామంలో ప్రసవిత్రీ అన్నారు. 

ఆకాశము మొదలైన పంచ భూతములనూ, వాటితో ఈ ప్రపంచమునూ కూడా ప్రసవించినది 

కనుక, ప్రసవిత్రీ అనే నామం వచ్చింది. 

విష్ణు ధర్మోత్తరంలో, "ప్రజలను ప్రసవిస్తున్నది కనుక 'సవితా' అన్నారు"  అని వుంది.  

భగవతీ పురాణంలో, "బ్రహ్మనుంచి స్థావరం వరకూ ఏ దేవి నుంచి ఉద్భవించిందో, మహత్తత్వము 

మొదలు అన్ని విశేషముల తోనూ నిండిన ఈ జగత్తు ఎవరి నుంచి వచ్చిందో, ఆ పరదేవతకు 

వందనం", అని వుంది.  

అతిశయముగా సమస్తమునూ ప్రసవించిన, ఆ  ప్రసవిత్రీ కి వందనం. 

ఓం శ్రీ ప్రసవిత్ర్యై నమః 


827. ప్రచండా

ప్రచండా అంటే మిక్కిలి కోపము కలది అనీ, మిక్కిలి కోపము కల దూతలు కలది అనీ అర్ధము. 

గొప్ప ప్రతాపము కలది ప్రచండా. 

నిఘంటువులో చండా అంటే తెల్లగన్నేరు, శంఖపుష్పి, ప్రతాపము అనే అర్ధాలు కూడా వున్నాయి. 

కనుక, ప్రచండా అంటే, తెల్లగన్నేరునీ, శంఖపుష్పినీ ఇష్టపడునది, మహా ప్రతాపమును కలిగినది  

అనే అర్ధాలు కూడా వున్నాయి. 

గుప్తుల కాలంనాటి కామందకుడు తన నీతిసారమనే గ్రంధంలో, "రాజుకు కోపం లేకపోతే ప్రజలు 

భయపడరు. అప్పుడు పాలన సాగదు. ధర్మము కాపాడబడదు. వేదములో 'వజ్రము అంటే 

మహాభయకారకము, పరబ్రహ్మము' అనే అర్ధాలున్నాయి. కనుక పాలన చేయువాడికి భయము 

కలిగించే కోపము ఉండాలి", అని చెప్పాడు. 

అమ్మ మహారాజ్ఞీ  కదా, కనుక, అమ్మ కోపము కలది. 

మిక్కిలి కోపము కల, ఆ ప్రచండ కు వందనం. 

ఓం శ్రీ ప్రచండాయై నమః 


828. ఆజ్ఞా

వేదములు విహితములు, నిషిద్ధములు గురించి చెప్తున్నాయి. అవి అమ్మ ఆజ్ఞలు.  

అమ్మ భగవదాజ్ఞా స్వరూపురాలు. వేదములో చెప్పిన విధి విధాన స్వరూపురాలు కనుక, అమ్మను 

ఆజ్ఞా అంటున్నాం. వేదమంతా అమ్మ ఆజ్ఞలే. ఆ ఆజ్ఞా స్వరూపురాలు పరమేశ్వరి. 

ఆ ఆజ్ఞల ననుసరించి నడుస్తున్న వారిని కాపాడునది ఆజ్ఞాస్వరూపురాలైన వేదమాత అని అర్ధం. 

లింగపురాణంలో, "ఈ దేవి ప్రకృతి, వికృతి కాదు, జీవుడూ కాదు. సృష్ట్యాది నందు నా ముఖము 

నుంచి వెలువడిన పంచావక్త్ర, మహాభాగ, జగములకు అభయప్రదాత, నా ఆజ్ఞా స్వరూపురాలు", 

అని శివుడు చెప్పినట్లు వున్నది.   

శివపురాణంలో, "ఈ దేవి రుద్రుని ఆజ్ఞా స్వరూపురాలు, ఈమె వలన అందరికీ ముక్తి కలుగుతుంది" 

అని వుంది. 

ప్రచండా, జ్ఞా అని పద విభజన చేస్తే, ఈ నామం 'జ్ఞా' అనే ఏకాక్షర నామం అవుతుంది. 

'జ్ఞా' అనే ఏకాక్షరముగా భావించినా, 'జ్ఞా' అంటే జ్ఞానము కలిగిన బుధుడు, బ్రహ్మ అని అర్ధము. 

కనుక బ్రహ్మ స్వరూపురాలు, బుధస్వరూపురాలు అని అర్ధం. 

వేదములో, 'జ్ఞ' అంటే మృత్యువును జయించే కాలకాలుడు అనీ, గుణి అనీ, గుణి అంటే అన్ని 

విద్యలూ తెలిసినవాడు అనీ అర్ధం చెప్పారు. 

లలితాపరమేశ్వరి సర్వ విద్యా స్వరూపురాలు, కాలహంత్రీ కనుక ఈ 'జ్ఞా' అనే నామం కలిగింది. 

వేదముల ద్వారా విహితములు, నిషిద్ధములు అను ఆజ్ఞలు ఇచ్చిన, ఆ ఆజ్ఞ కు వందనం. 

ఓం శ్రీ ఆజ్ఞాయై నమః 


829. ప్రతిష్ఠా

సర్వ జగత్తులనూ అధిష్టించినది, ఆధారభూతమయినది కనుక ప్రతిష్ఠా అనబడింది. 

వేదములో, "విశ్వమంతా అధివసించి వున్నది కనుక, ప్రతిష్ఠా" అన్నారు. 

బ్రహ్మగీతలో, "ప్రజ్ఞ రూపములో అన్ని వస్తువులలో వున్నది కనుక ప్రతిష్ఠా" అని వుంది. 

ఛందస్సుల లో పదహారు అక్షరముల ఒక ఛందస్సుకు ప్రతిష్ఠా అని పేరు. 

జలకళకు ప్రతిష్ఠా అని పేరు. కనుక, జలతత్త్వము లోని కళావిశేషము ప్రతిష్ఠా.  

శైవాగమము ప్రకారము, "శివుని యందు అనురాగమును పొందిన దేవికి ప్రతిష్ఠా అని పేరు. శివుని 

అష్టమూర్తులలో ఒకరైన భవుడు జలతత్త్వానికి ప్రతీక. ఆ భవుని పత్ని భవానియే ప్రతిష్ఠ అనే 

పేరున్న పార్వతి" అని తెలుస్తోంది. 

విశ్వమంతా ప్రతిష్ఠితురాలైన, ఆ ప్రతిష్ఠ కు వందనం. 

ఓం శ్రీ ప్రతిష్ఠాయై నమః 


830. ప్రకటాకృతిః

ప్రకటితమైన రూపము కలది ప్రకటాకృతి అనే పేరు కల పార్వతి. 

శ్రీచక్ర ప్రథమావరణ దేవతయైన త్రైలోక్యమోహనచక్రస్వామినికే ప్రకటయోగినీ అని పేరు. 

సమ్మోహనాకారంతో ప్రకటితమవుతున్న రాజరాజేశ్వరీ దేవతయే ప్రకటాకృతి అనబడుతోంది. 

సూతసంహితలో, "అందరిలోనూ పరమాత్మ రూపంలో వున్నది నేను అని భావిస్తున్నారు. 

కానీ అది పరమశివుడు అని తెలుసుకోలేని మాయ వారిని చుట్టేసింది", అని వుంది.  

ప్రతిష్ఠ, అప్రకటాకృతి అని నామాలను విభజించుకుంటే అప్పుడు ఈ నామం 

అప్రకటాకృతి అవుతుంది. 

అప్రకటాకృతి అంటే ప్రకటితము కాని ఆకృతి, అంటే రహస్యమయ స్వరూపురాలు అని అర్ధం. 

అమ్మ వ్యక్తమూ, అవ్యక్తమూ రెండూ కదా. కనుక, ఈ నామాన్ని ప్రకటాకృతి అన్నా, అప్రకటాకృతి 

అన్నా సమంజసమే. రెండూ అమ్మతత్త్వాన్ని వివరించేవే. 

అప్రకటాకృతి అనే నామాన్ని అప్, ప్రకటాకృతి అని విభజిస్తే, నీటిలో వ్యక్తమయ్యే స్వరూపము 

అని అర్ధం. 

వేదములో, "ఈ జగమంతా ఉదకస్వరూపం. ఒక శక్తి ఉదక మహిమలను భరించుచున్నది" అని 

చెప్పారు.  

త్రైలోక్యమోహనస్వామినిగా ప్రకటితమవుతున్న, ఆ ప్రకటాకృతి కి వందనం. 

ఓం శ్రీ ప్రకటాకృతయే నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

24, డిసెంబర్ 2021, శుక్రవారం

154. మూర్తా, అమూర్తా, అనిత్యతృప్తా, ముని మానస హంసికా సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ

 

మూర్తా, అమూర్తా, అనిత్యతృప్తా, ముని మానస హంసికా ।
సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ ॥ 154 ॥

813. మూర్తా

మూర్తము అంటే ఒక స్పష్టమైన రూపములో కంటికి కనిపించేది. 

స్థూల విగ్రహము రూపములో కంటికి కనిపించే వస్తువులన్నీ మూర్తములే. 

పృధ్వి, జలము, అగ్ని, ఇంద్రియాలకు గోచరిస్తాయి. వాటికి నాశనము ఉంటుంది. 

పంచీకరణమైన మహాభూతములే మూర్తములు. అవి క్షరము. అవి మర్త్యరూపము. 

శ్రీమాత స్థూలశరీరము మూర్తము. ఆ రూపంలో సాధకులు అమ్మ ముఖము, కళ్ళు, ముక్కు, 

చెవులు, నోరు, కాళ్ళు, చేతులు, చివరికి కాలివేలి గోళ్ళు కూడా వర్ణిస్తాం. అది సగుణ పూజకు దారి 

చూపిస్తుంది. నామరూపాత్మకమైన సమస్తమూ మూర్తమే. ఈ సమస్త జగత్తంతా మూర్తమే. 

కంటికి కనపడే రూపము, విగ్రహము, అది పటమైనా, పుస్తకమైనా, ఆ మూర్తి నశిస్తుంది. 

అన్నింటా ఉండేది ఆత్మే అయినా, క్షర స్వభావము కల మూర్తి నశించి, అక్షరములో 

కలిసిపోతుంది. కానీ సాధకులు తొలుతగా స్థూలమునకే గౌరవమిచ్చి పూజించి, ఆ తరువాత 

దానిలో వున్న సూక్ష్మ తత్త్వాన్ని అర్ధం చేసుకుని ఆనందం పొందుతారు. 

నామరూపాలతో వ్యక్తమవుతున్న, ఆ మూర్తా కు వందనం. 

ఓం శ్రీ  మూర్తాయై నమః  


814. అమూర్తా

అమూర్తా అంటే అవ్యక్తము, ఇంద్రియాలకు గోచరించనిది, అవినాశమైనది. అక్షర స్వరూపం. 

వాయువు, ఆకాశము కంటికి కనపడవు. అవి ఎన్నటికీ నశించవు. 

పంచీకరణము కాకుండా వున్న మహాభూతముల సూక్ష్మాంశలు అన్నీ అమూర్తములే. 

మనస్సు, ప్రాణము, కాలము వంటివి కంటికి కనబడవు, చేతికి చిక్కవు. 

వాటికి ఉనికి వుంది కానీ, అవి అవ్యక్తరూపంలో ఉంటాయి. 

విష్ణుపురాణంలో, 'పరమాత్మకు మూర్తము, అమూర్తము అనే రెండు రూపాలూ వున్నాయి. 

అవే క్షరము, అక్షరము అనే రూపాలలో వున్నాయి. క్షరరూపంలో వ్యక్తమయ్యేవి నశిస్తాయి. 

అక్షరరూపంలో వున్న దానికి నాశనము లేదు' అని వుంది. 

శ్రీమాత యొక్క సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ రూపాలు అమూర్తాలు. ఈ రూపం నిర్గుణ పూజకు  

సాధకుడికి దారి చూపిస్తుంది. అప్పుడు జీవాత్మా, పరమాత్మా అనే భేదం ఉండదు. 

ప్రతిప్రాణిలో వున్న ఆత్మ స్వరూపమే పరబ్రహ్మ అని తెలిసిననాడు ఆత్మ సాక్షాత్కారమవుతుంది. 

అక్షర పరబ్రహ్మ రూపంలో అవ్యక్తంగా వున్న , ఆ అమూర్తా కు వందనం.  

ఓం శ్రీ అమూర్తాయై నమః  


815.  అనిత్యతృప్తా 

అనిత్యతృప్తా అంటే అనిత్యములైన ఉపచారములతో తృప్తి చెందునది అని అర్ధం. 

భక్తితో ఏ ఉపచారము చేసినా తృప్తి చెందేది అని భావం. 

ఈ అనిత్యతృప్తా లక్షణం వలననే, భక్తిగా శబరి పెట్టిన అడవిపళ్ళను తిన్నా, స్నేహంతో సుదాముడు 

తెచ్చిన అటుకులు తిన్నా, తృప్తి చెందాడు ఆ పరమాత్మ. 

శ్రద్ధ, భక్తి, మనసు, సమర్పణ ముఖ్యం కానీ నియమాలు, నిబంధనలు కావు అని ఈ నామార్ధం. 

అనితి, అతృప్తా అని భావిస్తే, అనితి అంటే శ్వాసించు ప్రాణులు. 

వారిచే తృప్తి పొందనిది అని అర్ధం. తృప్తి పొందటానికి ఏకైక కారణం భక్తి. 

ఆడంబరములగు పూజలు, జపములు చేసినంత మాత్రమున అమ్మ తృప్తి చెందదు అని భావం. 

"గంగిగోవు పాలు గరిటడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను 

చాలు, విశ్వదాభిరామ వినుర వేమ" అంటాడు ముందు భోగియై, తరువాత యోగియైన వేమన. 

భక్తితో, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది ఇచ్చినా తృప్తి పడేది శ్రీమాత. 

భక్తితో ఏ సేవ చేసినా తృప్తి చెందే, ఆ  అనిత్యతృప్త కు వందనం. 

ఓం శ్రీ  అనిత్యతృప్తాయై నమః  


816. మునిమానసహంసికా

మునులు అంటే మౌనంగా ఉండేవారు, మననం చేస్తూ ఉండేవారు. ఇక్కడ మౌనం అంటే 

మాట్లాడకుండా ఉండటం అని అర్ధం కాదు. నిత్యమూ శ్రీమాత సేవలో రమిస్తూ ఉండేవారు

మునులు. అటువంటి మునుల మానసములలో హంసవలె తిరుగాడునది అని ఈ నామ భావం. 

హంస అంటే శ్వాస, అజపాజపం. మునుల మనసులలో అజపాజపం జరుగుతూ ఉంటే అమ్మ 

వారి శ్వాసయై, వారిలో తిరుగాడుదితోంది అని అర్ధం. 

మానససరోవరం అనే హిమాలయ సరస్సులోని శుద్ధజలాలలో హంసలు ఎలా హాయిగా  

విహరిస్తూ వుంటాయో, అదే విధంగా శుద్ధాత్మ స్వరూపులైన మునుల మనసులలో అమ్మ శ్వాస 

రూపములో హంసలా తిరుగాడుతుంది అని ఇంకొక భావం. 

మునుల మనస్సులో హంసవలె తిరుగాడు, ఆ మునిమానసహంసిక కు వందనం. 

ఓం శ్రీ మునిమానసహంసికాయై నమః 

  

817. సత్యవ్రతా

సత్యమే వ్రతముగా కలిగినది. సత్యం అంటే పరబ్రహ్మమే అని చెప్పుకున్నాం. 

ఆ పరబ్రహ్మ వ్రతం కలది పరమేశ్వరి అని భావం. సత్యవాక్పరిపాలన చేయువారిని రక్షించునది. 

దేవీ భాగవతంలో ఒక కథ వుంది. సత్యవ్రతుడనే  బుద్ధిహీనుడైన బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు. 

బుద్ధిహీనుడైనా, ఎల్లప్పుడూ సత్యమునే పలకటం వలన సత్యవ్రతుడనే నామం వచ్చింది. 

ఒకసారి ఒక వేటగాడు ఒక వరాహమును వేటాడుతుంటే, ఆ వరాహము 'ఐ' అని ఘీంకరించింది. 

అది విని, సత్యవ్రతుడు, 'ఐ' అని జపించడంమొదలుపెట్టాడు. వేటగాడు వచ్చి పంది ఎటు 

పోయింది అని అడిగితే, తన సత్యవ్రతమునకు హాని కలుగకుండా, అదే సమయంలో ఆ 

వరాహమును కూడా రక్షించడానికి, 'చూసిన కళ్ళు చెప్పలేవు, చెప్పగలిగే నోరు చూడలేదు', అని

 చెప్పాడు. ఆతని సత్యవ్రతమునకూ, జీవకారుణ్యానికీ మెచ్చి, శ్రీమాత ఆ సత్యవ్రతుడికి, బుద్ధీ, 

జ్ఞానాన్నిచ్చి, మహాకవిని చేసింది. సత్యవ్రతమును ఆచరించేవారిని కాపాడుతుంది శ్రీమాత. 

శివసూత్రములలో, 'శరీరవృత్తియే వ్రతము' అని చెప్పారు. అంటే శరీరము కలిగి ఉండుటయే 

వ్రతము అని అర్ధం. శరీరము తుచ్ఛము కాదు, శివభక్తి అనే వ్రతం ఆచరించుటకే లభించింది, 

అని భావం. 'శరీరమాద్యం ఖలు ధర్మసాధనం' అన్నాడు కుమారసంభవంలో కాళిదాసు. 

శివవ్రతమన్నా, పరబ్రహ్మ వ్రతమన్నా సత్యవ్రతమే కదా.  

సత్యపాలనే వ్రతముగా కలవారిని ఆదరించు, ఆ సత్యవ్రత కు వందనం. 

ఓం శ్రీ సత్యవ్రతాయై నమః 


818. సత్యరూపా

సత్యమైన రూపము కలది. లేదా సత్యమును రూపవంతముగా చేసి రక్షించునది అని అర్ధం. 

ఎల్లవేళలా ఒకే తీరుగా ఉండేదాన్ని సత్యము అంటారు. కనుక సత్యరూపా అంటే త్రికాలముల

లోనూ ఒకే విధముగా ఉండునది అని కూడా అర్ధం. 

హరిశ్చంద్రుడు తన సత్య వ్రతము వలననే రాజ్యాన్ని తిరిగి పొందాడు. కీర్తినీ, ముక్తినీ కూడా 

పొందాడు. సత్యవ్రతమును ఆచరిస్తూ, ఆ శ్రీమాతను సత్యరూపంలో అర్చించే వారికి అమ్మ 

భోగమూ, మోక్షమూ రెండూ ఇస్తుంది. 

ఒకసారి సత్యమునకూ, అసత్యమునకూ తగవు వచ్చిందట. శంకరుడు రుజువర్తన కలిగిన 

సత్యమునే సంరక్షించాడు అని బహ్వృచులు చెప్పారు. బహ్వృచులు అంటే, అనేక 

ఋక్కులున్న ఋగ్వేదమును అధ్యయనము చేసినవారు. 

ఎల్లప్పుడూ సత్యమనే రూపములో ప్రకాశిస్తున్న, ఆ సత్యరూప కు వందనం. 

ఓం శ్రీ సత్యరూపాయై నమః 


819. సర్వాంతర్యామినీ  

సర్వుల అంతఃకరణములనూ నియమించునది సర్వాంతర్యామిని. జీవులందరి లోనూ వున్నది. 

అంతర్యామి బ్రాహ్మణములో, "ఆత్మ అమృతము, మరణములేనిది, అంతర్యామి" అని వుంది. 

మాండూక్యోపనిషత్తులో, " ఆత్మ అంతర్యామి, అన్నీ తెలిసినది, అన్నిటికీ కారణభూతము, 

అందరి అంతఃకరణముల యందూ వున్నది" అని చెప్పారు. 

వేదములో, 'జీవులందరిలో వారి బ్రహ్మరంధ్రముల ద్వారా  ప్రవేశించి, అంతర్యామిగా ఉంటుంది', 

అని వున్నది. స్మృతులలో, 'సత్యాసత్య రూపమగు, ఈ సమస్తములోనూ సర్వాత్మురాలుగా, 

సర్వజ్ఞతతో వున్నది'  అని  చెప్పారు. 

జీవులందరిలో అంతర్యామిగా వుండు, ఆ సర్వాంతర్యామిని కి వందనం. 

ఓం శ్రీ సర్వాంతర్యామిన్యై నమః 


820. సతీ

సత్యము యొక్క వ్యక్త రూపమే సతీ. సత్ ని అనుసరించునది సతీ. 

సత్ అంటే బ్రహ్మము, పరమాత్మ. ఆ సత్ ను కలిగినది సతీ. సత్యవ్రతమును చేయునది సతీ. 

పాతివ్రత్యమే రూపముగా కలది సతీ. పతిని అనుసరించునది సతీ. 

సత్ అయిన పరమశివుణ్ణి పొందినది కనుక పరమేశ్వరిని ఈ నామంలో సతీ అంటున్నాం. 

దక్షప్రజాపతి  కుమార్తెకు దాక్షాయణి అనీ, సతీదేవి అనీ పేర్లు వున్నాయి. 

బ్రహ్మపురాణంలో కూడా, "ఈ పార్వతి దక్షుని కుమార్తెగా వున్నప్పుడు సతీదేవిగా ఉండేది. 

ఆమె ఇప్పుడు హిమవంతునికి పార్వతిగా పుట్టింది. శంకరుని ధర్మపత్ని, పతివ్రత. శంకరుని తప్ప 

అన్యులను పతిగా పొందదు" అని చెప్పారు.  

సత్యరూపయైన, శంకరపత్ని, ఆ సతి కి వందనం. 

ఓం శ్రీ సత్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650