24, డిసెంబర్ 2021, శుక్రవారం

154. మూర్తా, అమూర్తా, అనిత్యతృప్తా, ముని మానస హంసికా సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ

 

మూర్తా, అమూర్తా, అనిత్యతృప్తా, ముని మానస హంసికా ।
సత్యవ్రతా, సత్యరూపా, సర్వాంతర్యామినీ, సతీ ॥ 154 ॥

813. మూర్తా

మూర్తము అంటే ఒక స్పష్టమైన రూపములో కంటికి కనిపించేది. 

స్థూల విగ్రహము రూపములో కంటికి కనిపించే వస్తువులన్నీ మూర్తములే. 

పృధ్వి, జలము, అగ్ని, ఇంద్రియాలకు గోచరిస్తాయి. వాటికి నాశనము ఉంటుంది. 

పంచీకరణమైన మహాభూతములే మూర్తములు. అవి క్షరము. అవి మర్త్యరూపము. 

శ్రీమాత స్థూలశరీరము మూర్తము. ఆ రూపంలో సాధకులు అమ్మ ముఖము, కళ్ళు, ముక్కు, 

చెవులు, నోరు, కాళ్ళు, చేతులు, చివరికి కాలివేలి గోళ్ళు కూడా వర్ణిస్తాం. అది సగుణ పూజకు దారి 

చూపిస్తుంది. నామరూపాత్మకమైన సమస్తమూ మూర్తమే. ఈ సమస్త జగత్తంతా మూర్తమే. 

కంటికి కనపడే రూపము, విగ్రహము, అది పటమైనా, పుస్తకమైనా, ఆ మూర్తి నశిస్తుంది. 

అన్నింటా ఉండేది ఆత్మే అయినా, క్షర స్వభావము కల మూర్తి నశించి, అక్షరములో 

కలిసిపోతుంది. కానీ సాధకులు తొలుతగా స్థూలమునకే గౌరవమిచ్చి పూజించి, ఆ తరువాత 

దానిలో వున్న సూక్ష్మ తత్త్వాన్ని అర్ధం చేసుకుని ఆనందం పొందుతారు. 

నామరూపాలతో వ్యక్తమవుతున్న, ఆ మూర్తా కు వందనం. 

ఓం శ్రీ  మూర్తాయై నమః  


814. అమూర్తా

అమూర్తా అంటే అవ్యక్తము, ఇంద్రియాలకు గోచరించనిది, అవినాశమైనది. అక్షర స్వరూపం. 

వాయువు, ఆకాశము కంటికి కనపడవు. అవి ఎన్నటికీ నశించవు. 

పంచీకరణము కాకుండా వున్న మహాభూతముల సూక్ష్మాంశలు అన్నీ అమూర్తములే. 

మనస్సు, ప్రాణము, కాలము వంటివి కంటికి కనబడవు, చేతికి చిక్కవు. 

వాటికి ఉనికి వుంది కానీ, అవి అవ్యక్తరూపంలో ఉంటాయి. 

విష్ణుపురాణంలో, 'పరమాత్మకు మూర్తము, అమూర్తము అనే రెండు రూపాలూ వున్నాయి. 

అవే క్షరము, అక్షరము అనే రూపాలలో వున్నాయి. క్షరరూపంలో వ్యక్తమయ్యేవి నశిస్తాయి. 

అక్షరరూపంలో వున్న దానికి నాశనము లేదు' అని వుంది. 

శ్రీమాత యొక్క సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ రూపాలు అమూర్తాలు. ఈ రూపం నిర్గుణ పూజకు  

సాధకుడికి దారి చూపిస్తుంది. అప్పుడు జీవాత్మా, పరమాత్మా అనే భేదం ఉండదు. 

ప్రతిప్రాణిలో వున్న ఆత్మ స్వరూపమే పరబ్రహ్మ అని తెలిసిననాడు ఆత్మ సాక్షాత్కారమవుతుంది. 

అక్షర పరబ్రహ్మ రూపంలో అవ్యక్తంగా వున్న , ఆ అమూర్తా కు వందనం.  

ఓం శ్రీ అమూర్తాయై నమః  


815.  అనిత్యతృప్తా 

అనిత్యతృప్తా అంటే అనిత్యములైన ఉపచారములతో తృప్తి చెందునది అని అర్ధం. 

భక్తితో ఏ ఉపచారము చేసినా తృప్తి చెందేది అని భావం. 

ఈ అనిత్యతృప్తా లక్షణం వలననే, భక్తిగా శబరి పెట్టిన అడవిపళ్ళను తిన్నా, స్నేహంతో సుదాముడు 

తెచ్చిన అటుకులు తిన్నా, తృప్తి చెందాడు ఆ పరమాత్మ. 

శ్రద్ధ, భక్తి, మనసు, సమర్పణ ముఖ్యం కానీ నియమాలు, నిబంధనలు కావు అని ఈ నామార్ధం. 

అనితి, అతృప్తా అని భావిస్తే, అనితి అంటే శ్వాసించు ప్రాణులు. 

వారిచే తృప్తి పొందనిది అని అర్ధం. తృప్తి పొందటానికి ఏకైక కారణం భక్తి. 

ఆడంబరములగు పూజలు, జపములు చేసినంత మాత్రమున అమ్మ తృప్తి చెందదు అని భావం. 

"గంగిగోవు పాలు గరిటడైనను చాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను 

చాలు, విశ్వదాభిరామ వినుర వేమ" అంటాడు ముందు భోగియై, తరువాత యోగియైన వేమన. 

భక్తితో, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది ఇచ్చినా తృప్తి పడేది శ్రీమాత. 

భక్తితో ఏ సేవ చేసినా తృప్తి చెందే, ఆ  అనిత్యతృప్త కు వందనం. 

ఓం శ్రీ  అనిత్యతృప్తాయై నమః  


816. మునిమానసహంసికా

మునులు అంటే మౌనంగా ఉండేవారు, మననం చేస్తూ ఉండేవారు. ఇక్కడ మౌనం అంటే 

మాట్లాడకుండా ఉండటం అని అర్ధం కాదు. నిత్యమూ శ్రీమాత సేవలో రమిస్తూ ఉండేవారు

మునులు. అటువంటి మునుల మానసములలో హంసవలె తిరుగాడునది అని ఈ నామ భావం. 

హంస అంటే శ్వాస, అజపాజపం. మునుల మనసులలో అజపాజపం జరుగుతూ ఉంటే అమ్మ 

వారి శ్వాసయై, వారిలో తిరుగాడుదితోంది అని అర్ధం. 

మానససరోవరం అనే హిమాలయ సరస్సులోని శుద్ధజలాలలో హంసలు ఎలా హాయిగా  

విహరిస్తూ వుంటాయో, అదే విధంగా శుద్ధాత్మ స్వరూపులైన మునుల మనసులలో అమ్మ శ్వాస 

రూపములో హంసలా తిరుగాడుతుంది అని ఇంకొక భావం. 

మునుల మనస్సులో హంసవలె తిరుగాడు, ఆ మునిమానసహంసిక కు వందనం. 

ఓం శ్రీ మునిమానసహంసికాయై నమః 

  

817. సత్యవ్రతా

సత్యమే వ్రతముగా కలిగినది. సత్యం అంటే పరబ్రహ్మమే అని చెప్పుకున్నాం. 

ఆ పరబ్రహ్మ వ్రతం కలది పరమేశ్వరి అని భావం. సత్యవాక్పరిపాలన చేయువారిని రక్షించునది. 

దేవీ భాగవతంలో ఒక కథ వుంది. సత్యవ్రతుడనే  బుద్ధిహీనుడైన బ్రాహ్మణ బాలుడు ఉండేవాడు. 

బుద్ధిహీనుడైనా, ఎల్లప్పుడూ సత్యమునే పలకటం వలన సత్యవ్రతుడనే నామం వచ్చింది. 

ఒకసారి ఒక వేటగాడు ఒక వరాహమును వేటాడుతుంటే, ఆ వరాహము 'ఐ' అని ఘీంకరించింది. 

అది విని, సత్యవ్రతుడు, 'ఐ' అని జపించడంమొదలుపెట్టాడు. వేటగాడు వచ్చి పంది ఎటు 

పోయింది అని అడిగితే, తన సత్యవ్రతమునకు హాని కలుగకుండా, అదే సమయంలో ఆ 

వరాహమును కూడా రక్షించడానికి, 'చూసిన కళ్ళు చెప్పలేవు, చెప్పగలిగే నోరు చూడలేదు', అని

 చెప్పాడు. ఆతని సత్యవ్రతమునకూ, జీవకారుణ్యానికీ మెచ్చి, శ్రీమాత ఆ సత్యవ్రతుడికి, బుద్ధీ, 

జ్ఞానాన్నిచ్చి, మహాకవిని చేసింది. సత్యవ్రతమును ఆచరించేవారిని కాపాడుతుంది శ్రీమాత. 

శివసూత్రములలో, 'శరీరవృత్తియే వ్రతము' అని చెప్పారు. అంటే శరీరము కలిగి ఉండుటయే 

వ్రతము అని అర్ధం. శరీరము తుచ్ఛము కాదు, శివభక్తి అనే వ్రతం ఆచరించుటకే లభించింది, 

అని భావం. 'శరీరమాద్యం ఖలు ధర్మసాధనం' అన్నాడు కుమారసంభవంలో కాళిదాసు. 

శివవ్రతమన్నా, పరబ్రహ్మ వ్రతమన్నా సత్యవ్రతమే కదా.  

సత్యపాలనే వ్రతముగా కలవారిని ఆదరించు, ఆ సత్యవ్రత కు వందనం. 

ఓం శ్రీ సత్యవ్రతాయై నమః 


818. సత్యరూపా

సత్యమైన రూపము కలది. లేదా సత్యమును రూపవంతముగా చేసి రక్షించునది అని అర్ధం. 

ఎల్లవేళలా ఒకే తీరుగా ఉండేదాన్ని సత్యము అంటారు. కనుక సత్యరూపా అంటే త్రికాలముల

లోనూ ఒకే విధముగా ఉండునది అని కూడా అర్ధం. 

హరిశ్చంద్రుడు తన సత్య వ్రతము వలననే రాజ్యాన్ని తిరిగి పొందాడు. కీర్తినీ, ముక్తినీ కూడా 

పొందాడు. సత్యవ్రతమును ఆచరిస్తూ, ఆ శ్రీమాతను సత్యరూపంలో అర్చించే వారికి అమ్మ 

భోగమూ, మోక్షమూ రెండూ ఇస్తుంది. 

ఒకసారి సత్యమునకూ, అసత్యమునకూ తగవు వచ్చిందట. శంకరుడు రుజువర్తన కలిగిన 

సత్యమునే సంరక్షించాడు అని బహ్వృచులు చెప్పారు. బహ్వృచులు అంటే, అనేక 

ఋక్కులున్న ఋగ్వేదమును అధ్యయనము చేసినవారు. 

ఎల్లప్పుడూ సత్యమనే రూపములో ప్రకాశిస్తున్న, ఆ సత్యరూప కు వందనం. 

ఓం శ్రీ సత్యరూపాయై నమః 


819. సర్వాంతర్యామినీ  

సర్వుల అంతఃకరణములనూ నియమించునది సర్వాంతర్యామిని. జీవులందరి లోనూ వున్నది. 

అంతర్యామి బ్రాహ్మణములో, "ఆత్మ అమృతము, మరణములేనిది, అంతర్యామి" అని వుంది. 

మాండూక్యోపనిషత్తులో, " ఆత్మ అంతర్యామి, అన్నీ తెలిసినది, అన్నిటికీ కారణభూతము, 

అందరి అంతఃకరణముల యందూ వున్నది" అని చెప్పారు. 

వేదములో, 'జీవులందరిలో వారి బ్రహ్మరంధ్రముల ద్వారా  ప్రవేశించిఅంతర్యామిగా ఉంటుంది', 

అని వున్నదిస్మృతులలో, 'సత్యాసత్య రూపమగు, ఈ సమస్తములోనూ సర్వాత్మురాలుగా, 

సర్వజ్ఞతతో వున్నది'  అని  చెప్పారు. 

జీవులందరిలో అంతర్యామిగా వుండు, ఆ సర్వాంతర్యామిని కి వందనం. 

ఓం శ్రీ సర్వాంతర్యామిన్యై నమః 


820. సతీ

సత్యము యొక్క వ్యక్త రూపమే సతీ. సత్ ని అనుసరించునది సతీ. 

సత్ అంటే బ్రహ్మము, పరమాత్మ. ఆ సత్ ను కలిగినది సతీ. సత్యవ్రతమును చేయునది సతీ. 

పాతివ్రత్యమే రూపముగా కలది సతీ. పతిని అనుసరించునది సతీ. 

సత్ అయిన పరమశివుణ్ణి పొందినది కనుక పరమేశ్వరిని ఈ నామంలో సతీ అంటున్నాం. 

దక్షప్రజాపతి  కుమార్తెకు దాక్షాయణి అనీ, సతీదేవి అనీ పేర్లు వున్నాయి. 

బ్రహ్మపురాణంలో కూడా, "ఈ పార్వతి దక్షుని కుమార్తెగా వున్నప్పుడు సతీదేవిగా ఉండేది. 

ఆమె ఇప్పుడు హిమవంతునికి పార్వతిగా పుట్టింది. శంకరుని ధర్మపత్ని, పతివ్రత. శంకరుని తప్ప 

అన్యులను పతిగా పొందదు" అని చెప్పారు.  

సత్యరూపయైన, శంకరపత్ని, ఆ సతి కి వందనం. 

ఓం శ్రీ సత్యై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి