13, డిసెంబర్ 2021, సోమవారం

143. భవదావ సుధావృష్టిః, పాపారణ్య దవానలా దౌర్భాగ్యతూల వాతూలా, జరాధ్వాంత రవిప్రభా

  

భవ దావ సుధా వృష్టిః, పాపారణ్య దవానలా 
దౌర్భాగ్యతూల వాతూలా, జరాధ్వాంత రవిప్రభా ॥ 143 ॥

742. భవదావసుధావృష్టిః

భవ దావ సుధా వృష్టిః, అంటే భవమనే సంసారంలో చెలరేగే, దావ అనే దావాగ్నిని (అరణ్యంలో 

పుట్టే అగ్నిని దావాగ్ని అంటారు), సుధా అనే అమృతపు, వృష్టిః అంటే వాన కురిపించేది అని 

ఈ నామానికి అర్ధం. ఆ లలితాపరమేశ్వరి ఈ సంసారమనే అరణ్యంలో పుట్టిన దావాగ్నిలో 

బాధింపబడుతున్నవారి పట్ల కృపతో అమృతపు వర్షాన్ని కురిపించి సంరక్షిస్తుంది. 

అమ్మవారు తన భక్తులను, సంసారపు ఈతిబాధల నుంచి రక్షిస్తుంది. 

వారికి భోగమూ, మోక్షమూ కలుగచేస్తుంది. 

లేదా సంసారమును రక్షించుటకు, అరణ్యముపై వానజల్లు వలె అమృతమును 

పుంఖానుపుంఖాలుగా వర్షించి, వంశ పరంపరను నిలిపి రక్షించునది అని కూడా అర్ధం. 

భవదా, వసు, ధా, వృష్టిః, అని పదవిభజన చేస్తే, రత్న్యైశ్వ ర్యాలను, భోగభాగ్యాలను 

కురిపిస్తుంది అని భావం. 

భవదా, వసుధా, వృష్టిః, అని పదవిభజన చేస్తే, పరమశివుణ్ణి ఇచ్చునది అని భావం. 

రుద్రయామళ గ్రంధంలో, మంగళరాజ స్తవంలో, "ఎక్కడ భోగము ఉంటుందో, అక్కడ మోక్షము 

ఉండదు. ఎక్కడ మోక్షము ఉంటుందో, అక్కడ భోగము ఉండదు. కానీ ఆ లలితాత్రిపురసుందరీ 

ఉపాసకులకు భోగమోక్షములు రెండూ లభిస్తాయి" అని చెప్పారు. 

భక్తులకు భోగ మోక్షములను సుధావర్షముగా అనుగ్రహించు, ఆ భవదావసుధావృష్టి కి వందనం. 

ఓం శ్రీ  భవదావసుధావృష్ట్యై నమః  


743. పాపారణ్యదవానలా

పాప, అరణ్య, దవ, అనలా, అంటే పాపములనే అరణ్యానికి దావాగ్ని వంటిది శ్రీలలిత అని అర్ధం. 

బృహన్నారదీయంలో, "దేవీ నామ పారాయణము పాపపు అరణ్యములను దావాగ్ని వలె భస్మం 

చేస్తుంది.  గంగాదేవి పరమపావని, గంగా సేవ చేసిన వారిని పాపముల నుండి ఉద్ధరిస్తుంది. 

గంగా నామము, గంగా పానము, గంగా స్నానము పాపహరణం. కష్టపడి యైనా గంగను సేవించాలి" 

అని చెప్పబడింది. 

బ్రహ్మాండపురాణంలో, "తెలిసి కానీ, తెలియక కానీ చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము ఆ దేవీ 

పాద సేవ, పాద స్మరణ" అని చెప్పారు. అదే పురాణంలో, "భక్తి శ్రద్ధలతో, స్నానానంతరం నీళ్ళల్లో 

నిలబడి, పంచదశీ మంత్రాన్ని, అష్టోత్తర సహస్రం అంటే, వెయ్యి ఎనిమిది సార్లు, జపించి 

ఆ పరాశక్తిని ఆరాధిస్తే, సకలపాపాలూ నశిస్తాయి" అని చెప్పారు. 

సకలపాపహారిణి అయిన, ఆ పాపారణ్యదవానల కు వందనం.  

ఓం శ్రీ పాపారణ్యదవానలాయై నమః  


744.  దౌర్భాగ్యతూలవాతూలా

తన ఉపాసకుల యొక్క దౌర్భాగ్యములను, సుడిగాలితో దూదిపింజ వలె పారద్రోలునది అని 

అర్ధం. తూలము అంటే దూది. వాతూలము అంటే సుడిగాలి. 

అష్ట ఐశ్వర్యాలు వలెనే, దౌర్భాగ్యాలు కూడా ఎనిమిది. అవి ఋణము, యాచన,ముసలితనము,

జారత్వము, చోరత్వము, దరిద్రము, రోగము, భుక్తశేష భోజనము. 

ఈ దౌర్భాగ్యాలను దూదిపింజ వలె ఎగరగొట్టి దూరము చేసేది ఆ పరమేశ్వరి. 

ఎంత భయంకరమైన దౌర్భాగ్యస్థితి యైనా, అమ్మకు అది దూదిపింజతో సమానం. 

తన భక్తుల దౌర్భాగ్యాలనే దూదిపింజల పాలిట సుడిగాలి వంటిది అమ్మ. 

భక్తుల దౌర్భాగ్యాలను సుడిగాలి వలె ఎగరకొట్టేసే, ఆ  దౌర్భాగ్యతూలవాతూల కు వందనం. 

ఓం శ్రీ  దౌర్భాగ్యతూలవాతూలాయై నమః  


745. జరాధ్వాంతరవిప్రభా 

జర, ధ్వాంత, రవి, ప్రభా అంటే ముసలితనము అనే చీకటిని చీల్చి, రవి కాంతులతో 

ప్రకాశింపచేసేది అని అర్ధం. ధ్వాంతము అంటే చీకటి. 

పరమేశ్వరి కృప ఉంటే, ముసలితనము బాధించదు. 

ఆ ముసలితనంలో కూడా చక్కని వెలుగులతో, సూర్యుడు ప్రకాశించినట్లు ప్రకాశించగలరు. 

సౌందర్యలహరిలో కూడా శంకరాచార్యుడు,"అమ్మా, నీ కృప ఉంటే ముసలివాడైనా, కురూపి 

అయినా, చక్కగా రాణించగలుగుతాడు" అంటాడు. 

ఉపాసకులకు అమ్మ కృప వలన, ముసలితనపు ఇక్కట్లు వేధించవు. 

సూర్యుడు చీకటిని ఎలా చెండాడుతాడో, అలా అమ్మ తన భక్తులకు జరాబాధలు నిర్మూలిస్తుంది. 

తన భక్తులను ముసలితనపు వేదనల నుంచి కాపాడే, ఆ జరాధ్వాంతరవిప్రభ కు వందనం. 

ఓం శ్రీ జరాధ్వాంతరవిప్రభాయై నమః 

  



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి