భావజ్ఞా, భవరోగఘ్నీ, భవచక్రప్రవర్తినీ ॥ 157 ॥
838. ముకుందా
మోక్షమునిచ్చే, ఆ ముకుంద కు వందనం.
ఓం శ్రీ ముకుందాయై నమః
839. ముక్తి నిలయా
ముక్తి అనగా మోక్షమే నివాసస్థానముగా కలది ముక్తినిలయా.
సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుజ్య, కైవల్యములని ముక్తులు అయిదు విధములు.
ఈ అయిదు విధములైన ముక్తులకూ నిలయమైన లలితాపరమేశ్వరియే ముక్తినిలయా.
అందుకే అమ్మను ఈ నామంలో ముక్తినిలయా అంటున్నాం.
ముముక్షువులు కోరే ముక్తిని ఇచ్చే, ఆ ముక్తి నిలయ కు వందనం.
ఓం శ్రీ ముక్తి నిలయాయై నమః
840. మూలవిగ్రహరూపిణీ
రాజరాజేశ్వరీదేవియే మూలవిగ్రహరూపిణి.
శ్రీచక్రంలో అగ్రభాగమైన బిందువులో స్థితమైనది ఈ తల్లే.
బాలా, బగళా, తారా, కాళీ మొదలైన శక్తులన్నింటికీ మూలమైన విగ్రహము కనుక,
మూలవిగ్రహరూపిణీ అనే నామం వచ్చింది. శరీరమే స్వరూపముగా కలది అని కూడా అర్ధం.
ఈ విషయము గౌడపాద సూత్రముల ద్వారా తెలుస్తోంది.
"ఒక్క విద్య నుంచి, శాంభవీ, విద్యా, శ్యామా అనే మూడు విధములైన శక్తులు ఏర్పడ్డాయి.
ఈ శక్తుల నుంచి ప్రత్యేకమైన అనేక శక్తులు పుట్టాయి." అని గౌడపాదుడు చెప్పాడు.
దీనిని బట్టీ, ఒక్క శక్తియే అనేక శక్తులకు మూలమైనది అని తెలుస్తోంది.
ఆ శక్తులన్నింటి జనకశక్తియే మూలవిగ్రహరూపిణి అయిన రాజరాజేశ్వరీ రూపమైన లలితాదేవి.
అనేక ప్రత్యేక శక్తులకు మూల శక్తియైన, ఆ మూలవిగ్రహరూపిణి కి వందనం.
ఓం శ్రీ మూలవిగ్రహరూపిణ్యై నమః
ఓం శ్రీ భావజ్ఞాయై నమః
842. భవరోగఘ్నీ
భవము అంటే సంసారము, జననమరణ చక్రము. భవరోగఘ్నీ అంటే ఈ జనన మరణాదులకు
సంబంధించిన ఆధివ్యాధులను పోగొట్టునది అని అర్ధం.
రామాయణములో, "వృషధ్వజుడైన శంకరుని కంటే గొప్ప భిషక్కు కనబడడు", అని ఉంది.
శివపురాణంలో, "సంసారమనే వ్యాధి వలన బాధపడువారికి, శివుడే ఔషధము" అని చెప్పారు.
అంటే, ఈశ్వరుని సేవిస్తే, జననమరణ బాధలుండవు అని భావం.
జననమరణ చక్రమైన భవరోగములకు, శివుడనే ఔషధమును ఇచ్చు, ఆ భవరోగఘ్ని కి వందనం.
ఓం శ్రీ భవరోగఘ్న్యై నమః
843. భవచక్రప్రవర్తినీ
భవచక్రమనే సంసార మండలాన్ని నడుపుతున్నది అని అర్ధం.
మనుస్మృతిలో, "పంచభూతములతో కలిసి, అన్ని ప్రాణులయందూ వుంది, వారిని జనన మరణ
చక్రములో తిప్పునది భవచక్రప్రవర్తినీ అయిన ఆ లలితాదేవి" అని ఉన్నది.
విష్ణుభాగవతంలో, "పరమాత్మ సర్వజగత్తులకూ బంధనము, మోక్షము కలిగించువాడు, శరణన్న
వారి కష్టములు తీర్చువాడు, అని తెలిసిన భక్తులు ఆ పరమాత్మనే అర్చిస్తున్నారు" అని చెప్పారు.
భవచక్రం అంటే శివుడు అధిపతి అయిన అనాహతచక్రం అనే అర్ధం కూడా ఉన్నది.
విష్ణుపురాణంలో, చక్రము అంటే మనస్సు అని చెప్పబడింది.
కనుక, భవచక్రప్రవర్తిని అంటే, శివుని మనస్సును ప్రవర్తించేయునది అని భావం.
ఈ సంసారచక్రమును నడుపుతున్న, ఆ భవచక్రప్రవర్తిని కి వందనం.
ఓం శ్రీ భవచక్రప్రవర్తిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి