6, డిసెంబర్ 2021, సోమవారం

136. దీక్షితా, దైత్యశమనీ, సర్వలోకవశంకరీ సర్వార్థదాత్రీ, సావిత్రీ, సచ్చిదానందరూపిణీ

  

దీక్షితా, దైత్యశమనీ, సర్వలోకవశంకరీ 
సర్వార్థదాత్రీ, సావిత్రీ, సచ్చిదానంద రూపిణీ ॥ 136 ॥

695. దీక్షితా

జ్ఞానమును కలిగించుట దీక్ష. మంత్రం ఉపదేశము చేసి పాపమును పోగొట్టుట దీక్ష. 

దీక్షితుడు, దీక్షిత అంటే దీక్ష తీసుకున్నవారు. దీక్షిత, దీక్షితుడు అంటే యజ్ఞము, క్రతువులను 

చేయు యజమాని, గురుగృహములో వుండు శిష్యుడు అని నిఘంటువులో వుంది.  

దీక్ష అంటే నిఘంటువులో ఉపనయనము, వివాహము, యజ్ఞ యాగాదులు, వ్రతములు వంటి 

క్రతువులలో ఆచరించు నియమము అనీ, మంత్రోపదేశము పొందుట అనీ వుంది. 

మంత్రదీక్షను కానీ, మరే ఇతర దీక్షను కానీ ఎవరికైనా ఇవ్వాలంటే, ముందుగా 

గురువు దీక్షితుడై ఉండాలి. అంటే ఆ మంత్రాన్ని సిద్ధింపచేసుకున్న వాడై ఉండాలి. 

అప్పుడే ఆ దీక్ష సిద్ధిస్తుంది. శ్రీమాతను గురుమూర్తీ అని ముందరి నామాల్లో చెప్పుకున్నాం. 

గురువు రూపంలో యోగ్యుడైన శిష్యుడికి మంత్రదీక్షను ఇచ్చి, పాపములను పోగొట్టునది శ్రీలలిత. 

అందుకే శ్రీమాతను ఈనామంలో దీక్షితా అని చెప్పుకుంటున్నాం. 

అధర్వణ బ్రాహ్మణములో, గురువు వద్ద విద్యను అభ్యసించినవారిని దీక్షితుడు అని చెప్పారు. 

పరానందతంత్రములో, పాపమును నశింప చేయుటకై శిష్యుని యందు దయతో 

మంత్రోపదేశమును చేయుటయే దీక్ష అని వున్నది. ఆ దీక్ష స్వీకరించిన వాడు దీక్షితుడు, దీక్షిత. 

భక్తుల యందు దయతో, గురు రూపములో దీక్షను అనుగ్రహించు, ఆ దీక్షిత కు వందనం. 

ఓం శ్రీ  దీక్షితాయై నమః  

696.  దైత్యశమనీ 

శమనము అంటే శాంతింపచేయటం, వధించటం అని అర్ధం. శమనీ అంటే శమింపచేయునది. 

దైత్యశమనీ అంటే దైత్యులను సంహరించునది అని అర్ధం. భండుడు, మహిషుడు వంటి 

రాక్షసులను సంహరించి లోకాలను ఉద్ధరించునది పరమేశ్వరి. 

దేవదానవులిద్దరూ కశ్యపప్రజాపతి సంతానమే. అదితి పుత్రులు ఆదిత్యులు,సత్వగుణప్రధానులు. 

దితి పుత్రులు దైత్యులు. దైత్యులు అధర్మపరులు. రజో, తమో గుణ ప్రధానులు. 

రావణుడు బ్రాహ్మణుడైనప్పటికీ రజోగుణం వలన అసురుడైతే, ప్రహ్లాదుడు రాక్షసుడైనప్పటికీ 

సత్త్వగుణం కలిగి భక్తుడైనాడు. సత్వగుణ ప్రధానులను అనుగ్రహించి, రజో, తమో గుణాల చేత 

పీడింపబడే దైత్యులను వధించి, శాంతింపచేసేది పరమేశ్వరి. 

దండనీతిస్థా అనే నామంలో కూడా చెప్పుకున్నాం. పరమేశ్వరి దుష్టులను కూడా ముందుగా 

సామ, దాన, భేద ఉపాయముల చేత, సరియైన ధర్మమార్గము, సత్యమార్గము, జ్ఞానమార్గములకు  

మార్చాడానికి ప్రయత్నిస్తుంది. అప్పటికీ లొంగని దైత్యులను సంహరించి ఉద్ధరిస్తుంది.

అధర్మపరులైన దైత్యులను శిక్షించే, ఆ  దైత్యశమని కి వందనం.  

ఓం శ్రీ  దైత్యశమన్యై నమః  

697. సర్వలోకవశంకరీ

సర్వలోకములనూ వశము చేసుకొనునది, తన ఉపాసకులకు సర్వలోకములనూ వశము 

చేయునది అని భావం. సర్వలోకాలనూ సృష్టించింది శ్రీదేవియే. కనుక సర్వ లోకాలూ ఆ తల్లి 

అధీనంలోనే ఉంటాయి. తన ఉపాసకులకు లోకవశీకరణ శక్తి నిచ్చునది శ్రీమాత. 

ఉపాసన సిద్ధించిన వారిని చూసి లోకమంతా నమస్కరిస్తుంది. వారి ప్రజ్ఞను గుర్తించి గౌరవిస్తుంది. 

దీక్షితుడైన గురువు వద్ద మంత్రదీక్ష తీసుకుని, ఆ దీక్షను ఫలింపచేసుకున్న శిష్యుడు కూడా 

దీక్షితుడౌతాడు. ఆ రాజత్కృప వలన అట్టి దీక్షితులకు లోకాలన్నీ దాసోహమంటాయి. 

అందుకే ఈ నామంలో అమ్మను సర్వలోకవశంకరీ అంటున్నాం. 

పదునాలుగు భువన భాండాలనూ తన వశంలో ఉంచుకున్న, ఆ సర్వలోకవశంకరి కి వందనం. 

ఓం శ్రీ సర్వలోకవంశకర్యై నమః  

698. సర్వార్థదాత్రీ 

ధర్మ, అర్ధ, కామ, మోక్షములను ఇచ్చునది సర్వార్థదాత్రీ. సమస్త కామ్యములనూ తీర్చునది 

అని కూడా అర్ధం. యోగ్యులైన భక్తులకు చతుర్విధ పురుషార్ధములనూ అనుగ్రహించేది శ్రీదేవి. 

దేవీపురాణంలో, అన్ని లోకములలో నాలుగు పురుషార్ధములనూ, కోరిన కోరికలనూ ఇస్తుంది 

కనుక సర్వార్ధసాధనీ అనే నామం వచ్చిందని వున్నది. సర్వార్ధ సాధనీ అన్నా, సర్వార్ధదాత్రీ 

అన్నా, వాంఛితార్ధప్రదాయినీ అన్నా, ఆ పరమేశ్వరియే. 

భక్తులకు చతుర్విధ పురుషార్ధాలనూ కటాక్షిస్తుంది కనుక ఈ నామం వచ్చింది. 

కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, ఆ సర్వార్థదాత్రి కి వందనం.

ఓం శ్రీ సర్వార్థదాత్ర్యై నమః   

699. సావిత్రీ

సూర్యునికి ప్రకాశము కలిగించే సవితృ శక్తి సావిత్రీ. లోకములను సృజించునది సావిత్రీ. 

సవిత్రం అంటే నిఘంటువులో ప్రసవకరణం అని వుంది. శంకరాచార్యుడు కూడా అమ్మను 

జగత్ప్రసూత్యై అన్నాడు. లోకములని ప్రసవించే శక్తి స్వరూపమే సావిత్రీ అని పిలువబడుతోంది.  

విష్ణుధర్మోత్తరములో, ప్రజలను ప్రసవించుటచే, సవిత అనే నామం వచ్చింది అని వుంది. 

భరద్వాజస్మృతిలో సవితకు(సూర్యుడు) ప్రకాశము అందించుట వలన, సావిత్రి అనే నామం 

వచ్చింది అని వుంది. 

దేవీపురాణంలో మాత్రం, దేవి పరిశుద్ధమైన భావములు కలది, దేవతలందరూ వేదశబ్దములతో 

అమ్మను పూజిస్తారు, కనుక అమ్మకు సావిత్రీ అనే నామం వచ్చిందని వుంది. 

దేవీభాగవతంలో, ప్రసవించే, అంటే కిందకి జారే, సమయంలో తేజస్సుగా పుట్టినది

కనుక సావిత్రీ అనే నామం కలిగిందని వుంది.  

పద్మపురాణంలో పుష్కర తీర్ధంలో వున్న దేవత సావిత్రీ అని చెప్పబడింది. 

సూర్యునికే ప్రకాశాన్నిస్తూ, జగత్తులను ప్రసవిస్తున్న, ఆ సావిత్రి కి వందనం. 

ఓం శ్రీ సావిత్ర్యై నమః 

700. సచ్చిదానందరూపిణీ

సత్, చిత్, ఆనందములనే స్వరూపంగా కలది సచ్చిదానందరూపిణీ. 

ఈ మూడు లక్షణాలూ పరబ్రహ్మవి. కనుక అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణీ అయింది. 

అన్ని మంత్ర దేవతల రూపాలలోనూ కర చరణాలు, ఆయుధాలూ వర్ణింపబడి ఉంటాయి. 

కానీ ఏ మంత్రాధిదేవత రూపంలోనూ ఈ సచ్చిదానందస్వరూపం కనపడదు. 

ఈ సచ్చిదానందస్వరూపం అనుభవించి తెలుసుకోవలసినదే కానీ వర్ణింపలేనిది. 

చైతన్యము, సత్యము, ఆనందము కలబోసిన శాంతస్వరూపం ఇది. 

జీవాత్మ, పరమాత్మ లోకి లయం అయినప్పుడు కలిగే ఆనంద భావన అది. 

ఈ నామంతో అమ్మను సేవించిన వారికి పరమ ఆనందమూ, సుఖమూ కలుగుతాయి.  

సత్యమైన చైతన్యముతో ఆనందాన్ని అనుగ్రహించే, ఆ సచ్చిదానందరూపిణి కి వందనం. 

ఓం శ్రీ సచ్చిదానందరూపిణ్యై నమః 


ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని 

శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల 

ఏడవ వంద నామాల వివరణ


------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి