16, డిసెంబర్ 2021, గురువారం

146. క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంబకా, త్రిగుణాత్మికా

 

క్షరాక్షరాత్మికా, సర్వలోకేశీ, విశ్వధారిణీ 
త్రివర్గదాత్రీ, సుభగా, త్ర్యంకా, త్రిగుణాత్మికా ॥ 146 ॥

757. క్షరాక్షరాత్మికా

క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది అని అర్ధం. 

ఈ నామంలో అమ్మను క్షరాక్షరాత్మికా అంటున్నాం. 

క్షరమునకూ, అక్షరమునకూ కూడా ఆత్మస్వరూపము ఆ విశ్వేశ్వరియే అని ఈ నామం చెప్తోంది . 

తాను స్వయంగా పరబ్రహ్మ స్వరూపము, నిత్యముక్తా స్వరూపము కనుక నాశము లేనిది. 

వరాహపురాణంలో, "ఆ విశ్వేశ్వరి ఏకాక్షర, అనేకాక్షర, అమితాక్షర అని ప్రసిద్ధి చెందింది", అని 

వుంది. ఆ విశ్వేశ్వరి లెక్కలేనన్ని అనియత సంఖ్యాక్షర స్వరూపిణి. 

విష్ణుభాగవతంలోనూ, మహాభారతంలోనూ, "అసత్, సత్ లకే, క్షర, అక్షర అనే నామాలున్నాయి", 

అని చెప్పారు. 

శ్రీమద్భగవద్గీతలోని, పురుషోత్తమప్రాప్తి యోగంలో, "ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షరమేవచ, 

క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ముచ్యతే" అనే శ్లోకంలో క్షర, అక్షరముల గురించి చెప్పారు.  

ఆ శ్లోక భావం, "ఈ లోకంలో ఇద్దరు పురుషులున్నారు. వారిలో ఒకడు సర్వభూతముల 

దేహములలో వున్న పురుషుడు. రెండవ పురుషుడు కూటస్థుడగు పరమాత్మ." 

ఆ పరమాత్మే క్షర రూపములో సమస్త భూతములలోనూ ఆత్మ స్వరూపముగా వున్నాడు.     

అక్షరమనగా కూటస్థుడు, ఆ కూటస్థుడే శ్రీమాత. అక్షరము కనుక కూటస్థునిగా నాశము పొందుట 

లేదు. క్షరమైన భూతములలో శ్రీమాత ఆత్మస్వరూపంగా వున్నది. 

సర్వభూతములలో క్షరముగా, కూటస్థునిలో అక్షరముగా వున్న, ఆ క్షరాక్షరాత్మిక కు వందనం. 

ఓం శ్రీ  క్షరాక్షరాత్మికాయై నమః  


758. సర్వలోకేశీ

సర్వలోకేశీ అంటే అన్ని లోకాలకూ ఈశ్వరి, అధిపతి, మహారాజ్ఞి అని అర్ధం. 

భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము ఇవి 

ఏడూ ఊర్ధ్వలోకాలు. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం 

అని నిత్యపూజలో చెప్పుకుంటూ ఉంటాం. అవే ఈ ఏడు ఊర్ధ్వలోకాలు. 

అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు ఏడూ అధోలోకాలు. 

ఈ మొత్తం పదునాలుగు లోకాలకీ, ఆ లోకేశ్వరే అధినాయకి. 

అందుకే ఈ నామంలో అమ్మను సర్వలోకేశీ అంటున్నాం. 

సర్వలోకాలకూ కారణభూతమయిన లోకేశ్వరి, ఆ సర్వలోకేశి కి వందనం.  

ఓం శ్రీ సర్వలోకేశ్యై నమః  


759.  విశ్వధారిణీ 

విశ్వమును ధరించినది కనుక ఈ నామం వచ్చింది. 

సమస్త విశ్వాన్నీ తన కడుపులో సృష్టించింది. 

ప్రళయకాలంలో తిరిగి ఈ సమస్త విశ్వాన్నీ తన లోనికే లయం చేసుకుంటోంది. 

సమస్త విశ్వానికీ తానే అవలీలగా సృష్టి, స్థితి, లయ నిర్వహిస్తున్నది. 

విశ్వరక్షణ భారమంతా ఆ విశ్వేశ్వరిదే. అందుకే అమ్మను ఈ నామంలో విశ్వధారిణీ అంటున్నాం. 

విశ్వ నిర్వహణ భారం వహించిన, ఆ  విశ్వధారిణి కి వందనం. 

ఓం శ్రీ  విశ్వధారిణ్యై నమః  


760. త్రివర్గదాత్రీ 

త్రివర్గములంటే ధర్మార్ధకామములు. ఈ మూడింటినీ ఇచ్చే శక్తి కనుక, 

అమ్మను త్రివర్గదాత్రీ అంటున్నాం. 

ధర్మమార్గంలోనే అర్ధాన్ని, కామాన్ని పొందాలి. అప్పుడే అవి ధర్మార్ధము, ధర్మకామము 

అవుతాయి. కామాన్ని, అంటే కోరికను, ఆ ధర్మార్జన తోనే తీర్చుకోవాలి. అప్పుడే అవి నిజమైన 

శక్తిని ఇస్తాయి. ఈ మూడు వర్గములనూ ఇచ్చేది కనుక అమ్మ త్రివర్గదాత్రీ. 

నాలుగవదైన మోక్షమును కలిపితే ఇవి చతుర్వర్గమవుతాయి.

మోక్షము అందరికీ అందదు. అది సులభసాధ్యము కాదు.  

భక్తులకు ధర్మార్ధకామములను త్రివర్గములనూ ఇచ్చు, ఆ త్రివర్గదాత్రి కి వందనం. 

ఓం శ్రీ త్రివర్గదాత్ర్యై నమః 

  

761. సుభగా

సుభగా అంటే సౌభాగ్యము కలది. ద్వాదశాదిత్యులలో భగుడనే సూర్యుని యొక్క శక్తి

స్వరూపురాలు అని అర్ధం. నిఘంటువులో భగము అనే పదానికి, శ్రీ, వీర్యము, ఇచ్ఛ, జ్ఞానము,

వైరాగ్యము, కీర్తి, మాహాత్మ్యము, ఐశ్వర్యము, యత్నము, ధర్మము, మోక్షము, యోని అనే 

అర్ధాలున్నాయి. ఈ అర్ధాలన్నీ అమ్మకు వర్తిస్తాయి కనుక, ఆ పరమేశ్వరి సుభగా అనబడుతోంది. 

భగుడనే ఆదిత్యునిలో నుండి సర్వకార్యములూ నిర్వహిస్తోంది ఈ సుభగా. 

ఆదిత్యుడు అమ్మవారి శక్తి తోనే సంచరిస్తాడని ముందే చెప్పుకున్నాం. 

ముల్లోకాలలోనూ చర, అచరము లందు సౌభాగ్యరూపంలో ఉండునది అని ఒక అర్ధం. 

పద్మపురాణంలో," సౌభాగ్యాష్టకాల స్వరూపము కనుక, ఈమె సుభగా", అని చెప్పారు. 

సౌభాగ్యాష్టకాలు అంటే, ఇక్షువు, పారిజాతవృక్షం, ధాన్యం, జీలకర్ర, గోక్షీరం, కుంకుమపువ్వు, 

కుసుమాలు, లవణం. ఇవి అన్నీ ఈ సుభగా స్వరూపాలే. 

ఐదు సంవత్సరాల బాలికను ధౌమ్యుడు సుభగా అన్నాడు. 

ముల్లోకాలకూ సౌభాగ్యకారకమైన, ఆ సుభగ కు వందనం. 

ఓం శ్రీ సుభగాయై నమః 


762.  త్ర్యంకా

మూడు నేత్రములు కలది, సూర్యుడు, చంద్రుడు, అగ్ని మూడు నేత్రాలుగా కల దేవి త్ర్యంకా.  
దేవీ పురాణంలో, "సోమసూర్యాగ్ని నేత్రములు కల దేవికి త్ర్యంకా అనే పేరు వచ్చింది" అని 
మునులు చెప్పారని వున్నది. 

తన మూడునేత్రాలతో, బాహ్యదృష్టి, అంతర్దృష్టి, విశ్వదృష్టి కలిగి వున్నది. 

అందుకే శ్రీమాత భూత, వర్తమాన, భవిష్యత్కాల స్వరూపిణి.  

మాండూక్యోపనిషత్తులో కూడా, "భూత, భవిష్యత్, వర్తమానం సర్వం ఓంకారస్వరూపం. 

ఈ మూడింటికీ అతీతమయినది పరమేశ్వర స్వరూపం" అని చెప్పారు. 

త్రిపుటికి ఆధారభూతము కనుక, ఆ పరమేశ్వరిని  త్ర్యంకా అంటున్నాం. 
త్రిమూర్తులకు, త్రిశక్తులకు, త్రిలోకాలకు అంబ కనుక త్ర్యంకా అనే నామం వచ్చింది.  
త్రినేత్రాలతో భూత, భవిష్యత్ , వర్తమానాలను చూస్తున్న, ఆ  త్ర్యం కు వందనం. 

ఓం శ్రీ త్ర్యంకాయై నమః 


763. త్రిగుణాత్మికా

సత్వ, రజో, తమో గుణములనే మూడు గుణములతో సామరస్యం కలిగినది. 

త్రిగుణాలతో సామ్యం కలిగినది కనుక ఈ నామం వచ్చింది. 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ త్రిగుణ ప్రధాన స్వరూపులు. వారి తల్లి కనుక ఆ త్రిపురాంబిక 

త్రిగుణాత్మికా అని పిలువబడుతోంది. 

త్రిగుణ ప్రధాన స్వరూపులైన మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ మాతల సమైక్యస్వరూపము 

కనుక త్రిగుణాత్మికా అని పిలువబడుతోంది. 

ఈ త్రిగుణముల స్వభావ లక్షణములను గురించి శ్రీమద్భగవద్గీతలో గుణత్రయవిభాగయోగంలో 

ఆ భగవానుడే స్వయంగా చెప్పాడు. 

త్రిగుణమయ స్వరూపమయిన, ఆ త్రిగుణాత్మిక కు వందనం. 

ఓం శ్రీ త్రిగుణాత్మికాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి