17, డిసెంబర్ 2021, శుక్రవారం

147. స్వర్గాపవర్గదా, శుద్ధా, జపాపుష్ప నిభాకృతిః ఓజోవతీ, ద్యుతిధరా, యజ్ఞరూపా, ప్రియవ్రతా

స్వర్గాపవర్గదా, శుద్ధా, జపాపుష్ప నిభాకృతిః 
ఓజోవతీ, ద్యుతిధరా, యజ్ఞరూపా, ప్రియవ్రతా ॥ 147 ॥


764. స్వర్గాపవర్గదా

స్వర్గమును, అపవర్గమును ఇచ్చునది స్వర్గాపవర్గదా అయిన జగదీశ్వరి.  

ఎడతెరిపి లేనిది, ఎప్పటికీ దుఃఖము కానిది, ఇంతకు ముందు ఎన్నడూ అనుభవించనిది,  

కోరుకున్నది, అయిన గొప్ప సుఖాన్ని స్వర్గము అని వేదములో చెప్పారు. 

కనుక స్వర్గమంటే ఎప్పుడూ అనుభవించని, ఎప్పుడూ చూడని, ఎప్పటికీ తెగని, 

ఎప్పటికీ దుఃఖము కానిది. కానీ ఈ స్వర్గసుఖము నిత్యమూ, శాశ్వతము కాదు. 

చేసుకున్న పుణ్యఫలం ఎన్నాళ్ళు ఉంటే, అన్నాళ్లు మాత్రమే ఉంటుంది. 

కానీ మోక్షము అలా కాదు. ఎప్పటికీ ఉంటుంది. అది ప్రళయకాలం వరకూ కూడా ఉంటుంది. 

అది శాశ్వతము. అపవర్గము అంటే మోక్షము. 

సుఖమునూ, మోక్షమునూ రెండింటినీ ఇచ్చేది ఆ శ్రీదేవి. లలితాపరమేశ్వరిని ధ్యానించిన వారికి 

భోగమోక్షములు రెండూ లభిస్తాయని ముందే చెప్పుకున్నాం. 

తన భక్తులకు స్వర్గమునూ, మోక్షమునూ ఇచ్చు, ఆ స్వర్గాపవర్గద కు వందనం. 

ఓం శ్రీ  స్వర్గాపవర్గదాయై నమః  


765. శుద్ధా

శ్రీమాత కన్నా శుద్ధులెవరు. ముందు కూడా అమ్మను నిర్మలా, నిత్యశుద్ధా, నిష్కళంకా, విమలా అనే 

నామాల్లో కూడా ఈ విశేషాన్నే చెప్పుకున్నాం. శుద్ధజ్ఞానస్వరూపిణి, శుద్ధవిద్యాస్వరూపిణి అయిన,  

ఆ జగన్మాత ఎంత శుద్ధాత్మ స్వరూపమో చెప్పుకున్నాం. 

అవిద్య చేత మలినములు పొందనిది శ్రీమాత. 

అందుకే ఈ నామంలో ఆ జగజ్జననిని శుద్ధా అంటున్నాం. 

ఎటువంటి అవిద్యామలినములూ లేని, ఆ శుద్ధ కు వందనం.  

ఓం శ్రీ శుద్ధాయై నమః  


766.  జపాపుష్ప నిభాకృతిః 

జపాపుష్ప, నిభాకృతిః అంటే, జపాపుష్పము వలె ప్రకాశించు ఆకృతి కలది అని ఈ నామానికి 

అర్ధం. జపాపుష్పము ఎర్రని పుష్పం. ఎర్రని కాంతితో మెరిసిపోతున్న అరుణారుణ లలితాదేవి. 

ధ్యానశ్లోకంలో కూడా అమ్మను అరుణాం, కరుణాతరంగితాక్షీం అంటాం. 

అమ్మ ఎర్రని దేహకాంతితో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుందని ఈ నామానికి అర్ధం. 

మరొక విధంగా జప, పుష్ప, నిభ, ఆకృతి అని పదవిభజన చేసుకుంటే జపము, పుష్పము వలె 

ప్రకాశించు ఆకారము కలది అని అర్ధం వస్తుంది. 

ఏ జపమూ చెయ్యకపోయినా శ్వాసతో  చేసే జపాన్ని అజపాజపం అంటారు. 

ఈ విషయం కూడా ముందే చెప్పుకున్నాం. దక్షిణామూర్తి సంహితలో, "ఓ దేవీ, ఎటువంటి జపమూ 

చెయ్యకపోయినా, ఏది జపమవుతోందో ఆ జపాన్ని అజపా జపమంటారు. ఆ అజపాజపము 

సాధకుని సంసార పాశములను నరికేస్తుంది." అని వుంది. 

పుష్పము అంటే నిఘంటువులో కుబేరుని విమానం, పువ్వు, స్త్రీరజస్సు అనే అర్ధాలున్నాయి. 

ఎర్రని కాంతితో వెలిగిపోతున్న, ఆ  జపాపుష్ప నిభాకృతి కి వందనం. 

ఓం శ్రీ  జపాపుష్పనిభాకృతయే నమః  


767. ఓజోవతీ 

ఓజస్సు అంటే, తేజము, బలము, ఉత్సాహము, ధాతుపుష్టి, దీప్తి, వెలుగు అనే అర్ధాలున్నాయి. 

శరీరములోని ఎనిమిదవ ధాతువును ఓజస్సు అంటారు. 

చక్రాల గురించి చెప్పుకున్నప్పుడు మిగిలిన ఏడు ధాతువుల గురించీ చెప్పుకున్నాం. 

ఓజస్సనగా ఇంద్రియ సామర్ధ్యం. 

ఈ ఎనిమిది ధాతువులూ కలిగిన ఆ లలితాపరమేశ్వరీదేవిని ఈ నామంలో ఓజోవతీ అంటున్నాం. 

తేజోరాశి అయిన, ఆ ఓజోవతి కి వందనం. 

ఓం శ్రీ ఓజోవత్యై నమః 

  

768. ద్యుతిధరా

ద్యుతి అంటే కాంతి, తేజస్సు, ఎండ అని అర్ధాలు. కాంతిని ధరించునది కనుక ద్యుతిధరా.  

తేజస్సు కలిగినది కనుక ద్యుతిధరా. సూర్యుని ద్వారా ఆతపమును కలిగించునది కనుక 

ద్యుతిధరా. ఈ అర్ధాలన్నీ అమ్మకు సరిపోతాయి. 

అందుకే ఆ లలితాపరమేశ్వరీదేవిని ఈ నామంలో ద్యుతిధరా అంటున్నాం. 

సూర్యుని వలన ఆతపము, ఆతపము వలన ప్రకృతి పోషణా, జగత్పోషణా కూడా అమ్మ 

చేస్తున్నది. ద్యుతిని ధరించిన అమ్మ ద్యుతిధరా. 

తన కాంతులతో జగత్తులను ధరిస్తున్న, ఆ ద్యుతిధర కు వందనం. 

ఓం శ్రీ ద్యుతిధరాయై నమః 


769. యజ్ఞరూపా

ఈ నామంలో ఆ లలితాపరమేశ్వరీదేవిని యజ్ఞరూపా అంటున్నాం. 

వేదములో విష్ణువే యజ్ఞమని చెప్పబడినది. ఈ నారాయణికీ విష్ణువుకీ అభేదం కనుక అమ్మ 

కూడా విష్ణుస్వరూపురాలు. కనుక శ్రీలలితను ఈ నామంలో యజ్ఞరూపా అంటున్నాం

హరివంశం లోనూ, పద్మ పురాణంలోనూ ఈశ్వరుని గురించి ఈ విధంగా చెప్పారు. 

యజ్ఞ అంగములే, ఈశ్వరుని దేహ అంగములని చెప్తూ, వేదములే పాదములు, క్రతువే హస్తము, 

మహా తాపసులైన బ్రాహ్మణులే శిరస్సు, పశువే జానువు, హోమమే లింగము, వేదియే స్కంధము, 

దక్షిణే హృదయము, యజ్ఞయాగములే దేహాంగములు, గుహ్యోపనిషత్తు ఆసనము, అని ఇంకా 

ఎన్నో ఇతర అంగాల గురించి కూడా పోల్చి చెప్పారు. 

ఈశ్వరుడు యజ్ఞ రూపములో  మేరుశృంగము వలె ఉన్నతుడుగా భాసిస్తున్నాడు అని చెప్పారు.  

ముఖామ్నాయరహస్యములో, "ఇంద్రియద్వారములని జయించి, భక్తితో ఆత్మను సేవించడమే 

మహాయజ్ఞము", అని చెప్పబడింది. కనుక ఆత్మారాధనే యజ్ఞము. 

ముందు నామాల్లో కూడా అంతర్యాగ, బహిర్యాగములు ఆ పరమేశ్వరి స్వరూపమని చెప్పుకున్నాం.

యజ్ఞమే తన స్వరూపమైన, ఆ యజ్ఞరూప కు వందనం. 

ఓం శ్రీ యజ్ఞరూపాయై నమః 


770. ప్రియవ్రతా

ప్రియమైన వ్రతములు కలది, ఆ వ్రతములు ఆచరించువారి పట్ల మక్కువ చూపునది అని అర్ధం. 

అమ్మవారు సకలదేవతా స్వరూపురాలు కనుక, ఏ దేవత యొక్క వ్రతము చేసినా సంతోషిస్తుంది. 

వ్రతకథలన్నీ కూడా, ఆ జగత్పితరులైన పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో నుంచే వచ్చాయి. 

ఆ పరమేశ్వరీ, పరమేశ్వరులు, లోక హితార్థం అనేక వ్రతములను గురించి చెప్పారు. 

తనకు ప్రియమైన  వ్రతములు చేసే వారి పట్ల అనుగ్రహమును చూపించునది అని భావం.  

ప్రియవ్రతుడనే రాజస్వరూపురాలు. ప్రియవ్రతుడు స్వాయంభువమనువు పుత్రుడు. 

బాల్యం నుంచి నారద మహర్షి శిష్యుడై పరబ్రహ్మను ఉపాసించినవాడు. 

ప్రియమైన వ్రతములు చేయువారిని ప్రియముగా చూచు, ఆ ప్రియవ్రత కు వందనం. 

ఓం శ్రీ  ప్రియవ్రతాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి