3, డిసెంబర్ 2021, శుక్రవారం

133. భాషారూపా, బృహత్సేనా, భావాభావ వివర్జితా సుఖారాధ్యా, శుభకరీ, శోభనాసులభాగతిః

   

భాషారూపా, బృహత్సేనా, భావాభావ వివర్జితా 
సుఖారాధ్యా, శుభకరీ, శోభనా సులభాగతిః ॥ 133 ॥

678. భాషారూపా

సంస్కృతము, ప్రాకృతము మొదలైన భాషలే తన స్వరూపముగా కలిగినది అని అర్ధం. 

అన్ని భాషలూ ఆ దేవీ స్వరూపాలే అని ఈ నామం చెప్తోంది. 

పరమేశ్వరి మాతృకావర్ణ స్వరూపిణి. అక్షమాలను ధరిస్తుంది. 

అ నుండి క్ష వరకూ కల అక్షర దేవతా శక్తులచే పూజింపబడునది అని చెప్పుకున్నాం.   

అది సంస్కృతమైనా, ప్రాకృతమైనా, మ్లేచ్ఛభాష అయినా, సాధారణ వ్యావహారిక భాష అయినా, 

భాషలన్నీ అమ్మను వర్ణిస్తున్నాయి కనుక, ఆ భాషలన్నీ కూడా శ్రీదేవీ రూపాలే అని ఈ నామార్ధం.  

భాష రూపములో భక్తులకు వ్యక్తం అవుతున్న, ఆ భాషారూప కు వందనం. 

ఓం శ్రీ  భాషారూపాయై నమః  

679. బృహత్సేనా

పెద్దసేనను కలిగినది అని ఈ నామార్ధం. బృహత్ సేన, అంటే, లెక్కపెట్టలేనంత సేనావాహిని

కలది, ఆ చక్రరాజరథారూఢ అయిన లలితాపరమేశ్వరి. 

భండాసుర యుద్ధంలో కోటానుకోట్ల మందిని అమ్మ తన సైన్యంగా సృష్టించింది అని 

చెప్పుకున్నాం. లెక్కించలేనంత అశ్వసేన, గజసేన, భైరవసేన, శక్తిసేన కలిగినది అని ఒక అర్ధం. 

ఆ శక్తిసేన యోజనాల వైశాల్యమున్న యుద్ధభూమినంతా ఆక్రమించింది అని చెప్పుకున్నాం 

కూడా. ఎన్నో యోజనాల దూరం వరకూ విస్తరించగల బృహత్తరమైన శక్తి సేనను కలిగిన మహాశక్తి 

కనుక ఈ బృహత్సేనా అనే నామం ఏర్పడింది. 

శ్రీకృష్ణుడికీ, అష్టమహిషుల్లో ఒక్కర్తె అయిన భద్రాదేవికీ జన్మించినవాడు బృహత్సేనుడు. 

బృహత్సేనుడు అనే రాజ స్వరూపురాలు అని మరియొక అర్ధం. 

హద్దులు లేనంత చతురంగబలాలు కలిగిన, ఆ బృహత్సేన కు వందనం.  

ఓం శ్రీ బృహత్సేనాయై నమః  

680. భావాభావవిర్జితా

భావములను, అభావములను కూడా వర్జించింది ఆ శ్రీమాత అని ఈ నామార్ధం. 

భావములంటే, ద్రవ్యభావము, గుణభావము, కర్మభావము, సామాన్యభావము, విశేషభావము,

సమవాయ (సమూహము) భావములు. 

అభావములంటే, ప్రాగభావ, ప్రధ్వంసాభావ, అత్యంతాభావ, అన్యోన్యాభావములు.  

ఒక వస్తువు సిద్ధం కావడానికి ముందు ఆ వస్తువు గురించిన భావం లేకపోవడం ప్రాగభావం. 

ఆ వస్తువు ధ్వంసమైపోయినప్పుడు ఆ వస్తువు రూపం కనిపించకపోవడం ప్రధ్వంసాభావం. 

ఒక వస్తువును గురించిన రూపం ఎప్పుడూ లేకపోవడం (ఉదాహరణకు గాలి) అత్యంతాభావం.

రెండు విభిన్న వస్తువులు ఉన్నప్పుడు ‘అది ఇది కాదు, ఇది అది కాదు’ అనే తేడా తెలియడం 

అన్యోన్యాభావం. ఈ భావ, అభావములు రెండింటినీ విడిచినది ఆ జగదీశ్వరి. 

అంటే, ఆ జగదాంబిక ఈ భావాభావములు రెండింటికన్నా వేరైనది అని అర్ధం. 

కంటికి కనిపించేవి భావములు. కంటికి కనిపించనివి అభావములు. 

ఈ భావమునే స్కాందపురాణంలో, 'కల్పింపబడిన వస్తువు' అని చెప్పారు. 

ఈ కల్పిత వస్తువు, భావవస్తువూకాదు. అభావవస్తువూ కాదు. 

భావమునకూ, అభావమునకూ కట్టుబడని, ఆ భావాభావవిర్జిత కు వందనం. 

ఓం శ్రీ భావాభావవిర్జితాయై నమః 

681. సుఖారాధ్యా

ఉపవాసము మొదలైన శరీరమును కష్టపెట్టే, బాధపెట్టే, పద్ధతులలో కాకుండా సుఖముగా 

ఆరాధింపతగినది అని ఈ నామ భావం.  శరీరమును కష్టపెట్టి, కృశింపచేసి, చేసే ఆరాధన 

జ్ఞానమునకు దారి చూపదని బుద్ధుడు కూడా చెప్పాడు. 

లలితాపరమేశ్వరి జగన్మాత. ఈ తల్లిని ఎటువంటి నియమనిష్టలు లేకుండా సుఖంగా

పూజించుకోవచ్చునని ఈ నామం చెప్తోంది. అమ్మపూజకు ఆడంబరములు అవసరం లేదు. 

మానసపూజ శ్రేష్టం. చేయలేని నిస్సహాయస్థితిలో వున్నా కూడా ఆనందంగా మానసపూజ 

చేసుకోవచ్చును. అర్పింపవలసినది హృదయకుసుమం. చూడవలసినది మనోనేత్రంతో. 

అమ్మ ధ్యానగమ్యా, కనుక మనసుని ధ్యానముపై కేంద్రీకరించి మనసులో ఆరాధన చేసుకోవచ్చు. 

కూర్మపురాణంలో స్వయముగా శ్రీమాతే హిమవంతునితో, "ధ్యేయమగు నా నిర్గుణ స్వరూపమును

ధ్యానించుకోవచ్చు. లేదా నా సగుణ రూపమును ధ్యానం చేసుకోవచ్చు. అది కూడా చేయలేకపోతే 

మానసిక విధానమున నన్ను ఆరాధించుకోవచ్చు." అని అనేక సులభ ఉపాయములు చెప్పింది.  

ఈ నామంలో, శరీరమును కష్టపెట్టుకుని పూజలు చేయనవసరం లేదని, ఉపవాసాదులు 

చేయనక్కరలేదని, సుఖముగా తనను ఆరాధిస్తే కూడా తాను సంతృప్తి చెందుతాననీ చెప్తోంది.    

ఎటువంటి కష్టమైన నియమ నిబంధనలూ లేక సుఖముగా ఆరాధించుకోగలిగే, 

ఆ సుఖారాధ్య కు వందనం. 

ఓం శ్రీ సుఖారాధ్యాయై నమః   

682. శుభకరీ 

శుభములను కలుగచేయునది శుభకరీ. శుభము అంటే పుణ్యము అనే అర్ధం కూడా వుంది. 

శుభములను, పుణ్యములను ఇచ్చునది లలితాపరమేశ్వరి అని ఈ నామానికి అర్ధం. 

పరమేశ్వరిని తృప్తిగా, శ్రద్ధగా, భక్తిగా అర్చించినవారికి, 

శుభములు ఇస్తుంది. మంగళకరమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. మోక్షమును కలుగచేస్తుంది. 

శుభములు చేకూర్చే, ఆ శుభకరి కి వందనం. 

ఓం శ్రీ శుభకర్యై నమః 

683. శోభనాసులభాగతిః

శోభనము, సులభము అయిన గతులను ప్రసాదించేది మహేశ్వరీ అని ఈ నామానికి అర్ధం. 

శోభనం అంటే మంగళకరం అని అర్ధం. మంగళకరములైన శుభాలను ఇచ్చేది పరమేశ్వరి. 

చతుర్విధ పురుషార్ధములైన, ధర్మ, అర్థ, కామ, మోక్షములను తన భక్తులకు అనుగ్రహించేది 

అని ఈ నామానికి ఒక అర్ధం. 

సులభముగా, అంటే సుఖముగా అమ్మవారిని చేరుకోగలిగే మార్గం కూడా సూచిస్తోంది ఈ నామం. 

శోభనము, సులభము అగు ఉపాయములు సూచించు జగదీశ్వరి అని కూడా భావం. 

బ్రహ్మాండపురాణంలో, ఎవరికైతే పంచదశి లభిస్తుందో, వారికి పునర్జన్మ లేదు, జన్మరాహిత్యము 

వస్తుంది అని చెప్పారు. 

దేవీభాగవతములో, ఎవరు భాగవతమును వినరో, ఎవరు దేవిని ఆరాధించరో,  వారి జన్మ వ్యర్ధము, 

అని చెప్పారు. 

దేవీ ఆరాధన చేస్తే సులభముగా శోభనమైన గతులు ప్రాప్తిస్తాయి అని ఈ నామం చెప్తోంది.  

మంగళకరమైన శుభములు సులభముగా కలుగచేయు, ఆ శోభనాసులభాగతి కి వందనం. 

ఓం శ్రీ శోభనాసులభాగత్యై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి