పాశహస్తా, పాశహంత్రీ, పరమంత్ర విభేదినీ ॥ 153 ॥
806. పరంజ్యోతిః
ఓం శ్రీ పరంజ్యోతిషే నమః
807. పరంధామ
ధామము అంటే గృహము. పరంధామము అంటే, ఆ పరమాత్మ వుండే గృహము లేదా ప్రదేశము.
ఆ పరంధామము అన్నిటికన్నా పరమైన, ఉత్కృష్టమైన స్థానము, అదే పరమపదము.
శ్రీమద్భగవగీతలో కూడా పంచదశోధ్యాయములో, "దేనినయితే సూర్యుడు, చంద్రుడు,
పావకుడు కూడా ప్రకాశింపచేయలేరో, ఏ స్థానమును పొందిన తరువాత ఎవరూ వెనుకకు
తిరిగిరారో, ఆ పరంధామము నాది", అని భగవంతుడు చెప్పాడు.
ఆ పరమాత్మ స్థానమే ఉత్కృష్టమైన పరంధామము. ఆ పరమపద తేజోరూపిణి పరమేశ్వరి.
ఆ పరంధామంలో ఉండేది తురీయాతీతావస్ధ స్వరూపురాలైన లలితా పరా భట్టారిక.
యజ్ఞవైభవఖండమందు, "స్వప్నజాగ్రత్సుషుప్తి అవస్థలనెడు మూడు ధామములను ఎవడైతే
తెలుసుకుంటున్నాడో, వాడు ఆత్మ స్వరూపుడు. ఆత్మకు దృశ్యము లేదు, ఆత్మ యందే దృశ్యము
కల్పించబడింది అని తెలుసుకున్న వాడే ఆత్మస్వరూపుడు. వాడు ఈ మూడు ధామములకు
సాక్షీభూతుడు", అని వుంది.
కూర్మపురాణంలో,"నా శక్తియే మహేశ్వరీ, గౌరీ. నిరంజనము, శాంతము, సత్యము, సదానందము,
అయిన పరమపదము నా స్థానము", అని చెప్పినట్టు వుంది.
వేదము కూడా విష్ణుస్థానమే పరమపదము అని చెప్పింది.
అన్ని ధామములకన్నా ఉత్కృష్టమైన పరంధామమును నివాసముగా చేసుకున్న,
ఆ పరంధామ కు వందనం.
ఓం శ్రీ పరంధామ్నే నమః
808. పరమాణుః
'అణో రణీయాం, మహతో మహీయాం', అని అమ్మను గురించి అణువుల్లో కెల్లా అతి చిన్న అణువు,
మహాత్తుల్లో కెల్లా అతి గొప్ప మహత్తు అని చెప్పుకుంటూనే వున్నాం.
పరమేశ్వరి అతి సూక్ష్మ స్వరూపురాలు అని ఈ నామం చెప్తోంది.
పరమాణువు కన్నా చిన్నదైన కొలమానము ఈ జగత్తులో లేదు. సూక్ష్మమైన వాటన్నింటి కన్నా
సూక్ష్మమైనది అని అర్ధం. అతి చిన్న పీలిక స్వరూపము అని భావం.
అమ్మది అంతటి సూక్ష్మ తత్త్వము అని ఈ పరమాణు నామం యొక్క భావం.
ఆ పరమాణువే జగత్తులన్నిటికీ కారణభూతమయినది.
పరమాణు అనే ఉత్కృష్ట మంత్రస్వరూపురాలు అని ఒక అర్ధం.
అణోరణీయాం అని కీర్తింపబడే, ఆ పరమాణు కు వందనం.
ఓం శ్రీ పరమాణవే నమః
ఓం శ్రీ పరాత్పరాయై నమః
810. పాశహస్తా
పాశహస్తా అంటే హస్తములో పాశమును ధరించినది అని అర్ధం.
రాగస్వరూపమనే పాశమును ఎడమచేతిలో ధరించినది పరమేశ్వరి అని ముందే చెప్పుకున్నాం.
తన పాశముతో రాగ, ద్వేష, మమకారాలనే బంధనాలను కట్టివేస్తుంది.
భక్తులను ఆ బంధనాలనుంచి విముక్తులను చేస్తుంది.
తన హస్తములతో పాశములను ద్రుంచునది ఒక భావం.
ఎడమచేతితో పాశమును ధరించి భక్తులను బంధనముల నుంచి వేరుచేస్తున్న,
ఆ పాశహస్త కు వందనం.
ఓం శ్రీ పాశహస్తాయై నమః
811. పాశహంత్రీ
పాశహంత్రీ అంటే, పాశములను నశింపచేయునది అని భావం.
జీవుడు మమకార పాశములతో, రాగ పాశములతో, ద్వేష పాశములతో తనను తాను బంధించుకుని
ఉంటాడు. ఆ పాశముల వలన సుఖముగా వుండలేడు, ఉపాసనను కొనసాగించలేడు.
అటువంటి భక్తులకు పాశములను పటాపంచలు చేసి విముక్తిని ప్రసాదించేది పాశహంత్రీ.
హరివంశములో ఒక కథ వుంది. "అనిరుద్ధుడు బాణుని నాగపాశములతో బంధితుడై వున్నప్పుడు,
శ్రీదేవి, అనిరుద్ధునిపై కృపతో, ఆ నాగపాశములను చేతితో తీసివేసింది." అని వుంది.
శ్రీదేవి కృప ఉంటే ఎంతటి పాశాలనయినా ఛేదించుకోగలుగుతాం.
పాశములను త్రుంచి జీవులను ఉద్ధరించే, ఆ పాశహంత్రీ కి వందనం.
ఓం శ్రీ పాశహంత్ర్యై నమః
812. పరమంత్ర విభేదినీ
పరమంత్రవిభేదినీ, అంటే పరుల మంత్రములను భేదించునది అని భావం. పరులు అంటే,
శత్రువులు, శత్రురాజులు. శత్రురాజుల శక్తులను, వారి శస్త్రాస్త్రములను భేదించునది అని అర్ధం.
శత్రువులు చేయు చేతబడి, బాణామతి వంటి మంత్రప్రయోగములను తిప్పికొట్టునది.
పరమంత్రమయిన పంచదశీ మంత్రమును పన్నెండు విధములుగా మార్చి, ప్రధమ ద్వాదశ
శ్రీవిద్యోపాసకులైన, మనువు, చంద్రుడు, కుబేరుడు, లోపాముద్రా, మన్మథుడు, అగస్త్యుడు, అగ్ని,
సూర్యుడు, నంది, స్కందుడు, శివుడు, పరశురాముడు లకు ఇచ్చినది. కనుక పరమంత్రాన్ని
పన్నెండుగురికీ పన్నెండు రకాలుగా విభేదము చేసి ఇచ్చినది కనుక పరమంత్రవిభేదినీ అనే
లింగపురాణంలో, 'అవిముక్త అంటే పాపములను విడచినది అని అర్ధం', అని చెప్పారు.
కనుక అవి అంటే, పాపము అని అర్ధం.
పరమంత్ర, అవి, భేదినీ అని భావిస్తే, పర మంత్రమును చక్కగా మననము చేయువారి
పాపములను పోగొట్టునది అని అర్ధం.
శత్రువుల మంత్రములను భేదించి ఉపాసకులను రక్షించు, ఆ పరమంత్ర విభేదిని కి వందనం.
ఓం శ్రీ పరమంత్రవిభేదిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి