పుష్టా, పురాతనా, పూజ్యా, పుష్కరా, పుష్కరేక్షణా ॥ 152 ॥
797. కళానిధిః
కళలు, కర్మలకు గని వంటి, ఆ కళానిధి కి వందనం.
ఓం శ్రీ కళానిధయే నమః
798. కావ్యకళా
కావ్యకళా స్వరూపురాలు అని అర్ధం. కవి చేసే కర్మయే కావ్యం.
కవి లోని రచనా ప్రతిభా స్వరూపురాలు అని అర్ధం. కవి చేసే కావ్యరచనా స్వరూపురాలు.
కవిత్వము ఒక కళ. కావ్యములను రచించు ప్రతిభను కావ్యకళ అంటారు.
ఆ కావ్యకళా స్వరూపమే కళానిధి అయిన పరమేశ్వరి.
కావ్యములలో నాటకం, భాణం, డిమం, ప్రహసనం, అంకం, ప్రకరణం అనే భేదాలున్నాయని
అగ్నిపురాణం చెప్తుంది. ఆ కళారూపాలన్నీ ఆ పరమేశ్వరీ స్వరూపాలే.
విష్ణుపురాణంలో, లోకములోని అన్ని రకాల కావ్యాలు, గీతాలు శబ్దరూపము ధరించిన విష్ణుమూర్తి
స్వరూపాలని చెప్పారు.
తంత్ర గ్రంధములలో, 'కావ్య నిర్మాణ సామర్ధ్యము దేవతా ధ్యానము వలన కలుగుతుంది', అని
అనేకసార్లు చెప్పబడింది.
విద్యలన్నింటిలో తారకమైన విద్య మృతసంజీవనీవిద్య. ఈ విద్యను పరమేశ్వరి, కవి అయిన
శుక్రాచార్యునికి ఇచ్చింది. శుక్రాచార్యునికి తెలిసిన ఆ మృతసంజీవనీవిద్యను కావ్యకళ అంటారు.
కనుక కావ్యకళా అంటే మృతసంజీవనీవిద్యా స్వరూపురాలు అని ఒక అర్ధం.
కావ్య రచనా ప్రతిభా స్వరూపమయిన, ఆ కావ్యకళ కు వందనం.
ఓం శ్రీ కావ్యకళాయై నమః
799. రసజ్ఞా
దశవిధ రసముల జ్ఞానము కలిగినది రసజ్ఞా. సాధారణంగా నవరసములు అంటాం.
అవి శృంగారము, హాస్యము, కరుణము, రౌద్రము, వీరము, భయానకము, భీభత్సము,
అద్భుతము, శాంతము. వీటితో పాటు పదవ రసం భక్తి.
రసజ్ఞా అంటే, ఈ పది రసములు గురించి తెలిసినది అని ఈ నామార్ధం.
రసన, అంటే నాలుక ద్వారా రుచులను గ్రహించునది అని ఒక అర్ధం.
అంటే, పరమేశ్వరి జిహ్వేంద్రియ స్వరూపురాలు అని భావం.
అన్ని రసముల జ్ఞానమునూ కలిగిన, ఆ రసజ్ఞ కు వందనం.
ఓం శ్రీ రసజ్ఞాయై నమః
ఓం శ్రీ రసశేవధయే నమః
ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని
శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల
ఎనిమిదవ వంద నామాల వివరణ
801. పుష్టా
ముప్ఫయి ఆరు తత్త్వములతో నిండిన విగ్రహము కలది కనుక, ఈ నామంలో పుష్టా అంటున్నాం.
పరమేశ్వరి త్రిగుణాత్మిక, సకలగుణములూ ఆ తల్లి నుంచి ఉద్భవించాయి. ఆ గుణములన్నిటి
స్వరూపము శ్రీమాత. సకలగుణములచే పుష్టిని పొందినది కనుక, పుష్టా అంటున్నాం.
బ్రహ్మమనగా వేదము. గురువులైన బ్రాహ్మణులు, ఆ బ్రహ్మమును ఉపాసించి,
తమ శిష్యులకు పరంపరగా ఈ జ్ఞానాన్ని ఇచ్చారు.
అటువంటి బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులచే పోషించబడినది కనుక, పుష్టా అనబడింది.
వేదములో 'బ్రాహ్మణులచే బ్రహ్మము ఆయుష్మంతమైనది', అని వుంది.
కనుక శ్రుతులన్నీ గురుశిష్య పరంపర ద్వారా ఆయుష్మంతులవుతున్నాయి అని అర్ధం.
కనుక బ్రాహ్మణులచే పోషింపబడుతున్నది పుష్టా.
అన్ని ఉపాసనల, ధ్యానముల, సాధనల ఫలితమే బ్రహ్మానందం.
అనవరతము బ్రహ్మానందరసంతో పోషింపబడుచున్నది కనుక, పుష్టా.
బ్రహ్మమును ఉపాసించు బ్రాహ్మణులచే పోషింపబడు, ఆ పుష్టా కు వందనం.
ఓం శ్రీ పుష్టాయై నమః
802. పురాతనా
అన్నిటికన్నా ముందు నుంచే వున్న ఆదిపరాశక్తి కనుక, ఈ నామంలో పురాతనా అంటున్నాం.
సనాతనమైన ఛాందస లక్షణములు కలిగినది కనుక పురాతనా.
పరమేశ్వరి అన్ని శక్తుల కన్నా ముందు నుంచే వున్న ఆదిశక్తి అని ఇంతకు ముందు కూడా
చెప్పుకున్నాం. మొట్టమొదటి ప్రమాణ గ్రంథమైన వేదము కన్నా పూర్వమే వున్నది అమ్మ.
వేదమును చెప్పినదే అమ్మ. అందుకే వేదాలను అపౌరుషేయాలు అన్నారు.
అంత పురాతనీ కనుక అమ్మను ఈ నామంలో పురాతనా అంటున్నాం.
లోకాలు, లోకస్థులు అందరి కన్నా ముందు నుంచే వున్న, ఆ పురాతన కు వందనం.
ఓం శ్రీ పురాతనాయై నమః
803. పూజ్యా
అందరి చేతా పూజింపదగినది కనుక, పూజ్యా అనబడుతోంది.
అమ్మ పురాతనా కదా, కనుక తన తరువాత వచ్చిన వారందరి కన్నా పెద్దది, కనుక, పూజనీయ.
పూజ ఎవరికి చేసినా చెందేది అమ్మకే. "సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి" అని కదా
శాస్త్రవాక్యం. కేశవుడన్నా, కౌశికి అన్నా ఒకటే కదా.
దేవతలు, దానవులు, మానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ
పూజించేది అమ్మనే. ఆ జగన్మాత పూజ్యా కనుక, అన్ని ప్రాణుల చేతా పూజింపబడుతోంది.
సర్వ ప్రాణులచేతా పూజింపబడే, ఆ పూజ్యా కు వందనం.
ఓం శ్రీ పూజ్యాయై నమః
804. పుష్కరా
పుష్కరా అంటే పుష్టిని కలుగచేయునది. పరమేశ్వరి సమస్త లోకాలకూ పుష్టినిచ్చే దేవత కనుక
ఈ నామంలో పుష్కరా అని పిలుస్తున్నాం. పోషణనిచ్చేది పుష్కరా.
అమ్మే సూర్య, చంద్ర, అగ్ని రూపంలో సకల జీవులకూ పోషణని అందిస్తున్నది, కనుక పుష్కరా.
సర్వత్రా పుష్కలముగా వ్యాపించి వున్నది కనుక, పుష్కరా.
పన్నెండు సంవత్సరముల కాలాన్ని కూడా పుష్కరమంటారు. ఆ కాల అవధి స్వరూపురాలు.
పన్నెండు సంవత్సరములకు ఒకసారి నదులకు వచ్చే పర్వమును కూడా పుష్కరమంటారు.
ఆ పుష్కర పర్వ స్వరూపిణి. పుష్కరమనే తీర్థ స్వరూపురాలు అని ఇంకొక అర్ధం.
అందరికీ పోషణను సమకూర్చే, ఆ పుష్కర కు వందనం.
ఓం శ్రీ పుష్కరాయై నమః
805. పుష్కరేక్షణా
పుష్కరము అంటే తామరపూవు అనే అర్ధం వుంది. పుష్కరేక్షణా అంటే పద్మనయనా అని అర్ధం.
పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే అయిదు అంగాలతో కూడి వున్నది.
ఆ యోగములలో ఒక యోగమునకు పుష్కరమని పేరు. ఆ పుష్కర యోగ స్వరూపిణి.
సూర్యుడు విశాఖా నక్షత్రంలో వున్నప్పుడు, చంద్రుడు కృత్తికా నక్షత్రంలో వున్నప్పుడు కలిగే
యోగాన్ని పుష్కరయోగము అంటారు. ఇవి దుర్లభమైన యోగాలు.
పుష్కరమంటే భూమి అనే అర్ధం కూడా వుంది. పద్మపురాణంలో,"పద్మము యొక్క కర్ణిక భూమి,
పద్మములోని సారభాగములు పర్వతములు, రేకులు మ్లేచ్ఛదేశములు, కిందకు వున్న రేకులు
సర్పభూములు. శ్రీమన్నారాయణుని కొరకు భూమి పుష్కర రూపంలో పుట్టింది", అని వున్నది.
పుష్కరమంటే మర్రిచెట్టు. మర్రిచెట్టు ఉన్నందు వలననే పుష్కర ద్వీపానికి ఆ పేరు వచ్చిందని
మత్స్యపురాణంలో, విష్ణుపురాణంలో చెప్పబడింది.
వేదములో కూడా విష్ణువును వటపత్రశాయి అన్నారు.
తామర పూవుల వంటి కన్నులు కల, ఆ పుష్కరేక్షణ కు వందనం.
ఓం శ్రీ పుష్కరేక్షణాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి