5, డిసెంబర్ 2021, ఆదివారం

135. రాజ్యలక్ష్మీః, కోశనాథా, చతురంగ బలేశ్వరీ సామ్రాజ్యదాయినీ, సత్యసంధా, సాగరమేఖలా

  

రాజ్యలక్ష్మీః, కోశనాథా, చతురంగ బలేశ్వరీ 
సామ్రాజ్యదాయినీ, సత్యసంధా, సాగరమేఖలా ॥ 135 ॥

689. రాజ్యలక్ష్మీః

రాజ్యలక్ష్మి అంటే, రాజ్యమునందు అభిమానము కల లక్ష్మి. రాజ్యానికే లక్ష్మి. 

తంత్రరాజములో రాజ్యలక్ష్మీ మంత్రము ఒక ప్రసిద్ధమైన మంత్రము. 

రాజ్యములను ఆశ్రయించి, రాజ్యములను కళ్యాణమయం చేసే కరుణామయి రాజ్యలక్ష్మి. 

కొందరు అష్టలక్ష్ములలో రాజ్యలక్ష్మిని కూడా కలిపి చెపుతారు. 

రాజ్యములంటే క్షేత్రములు. క్షేత్రములను కాపాడే శక్తి ఈ రాజ్యలక్ష్మి. 

క్షేత్రములంటే దేహములు అని కూడా చెప్పుకున్నాం. దేహములో వుండే కళే రాజ్యలక్ష్మి. 

రాజ్యములను రక్షించే లక్ష్మీశక్తి అయిన, ఆ రాజ్యలక్ష్మి కి వందనం. 

ఓం శ్రీ  రాజ్యలక్ష్మ్యై నమః  

690. కోశనాథా

కోశములకు స్వామిని కనుక అమ్మను ఈ నామంలో కోశనాథా అంటున్నాం. 

కోశము అంటే ధనాగారము. ధనాగారమునకు ఈ శ్రీదేవియే అధిపతి, రక్షకురాలు. 

రాజరాజేశ్వరీదేవి మణిద్వీపంలో, నవరత్నమయ ప్రాకారాలు వున్న చింతామణీ 

గృహంలో ఉంటుంది. ఆ నిధులన్నీ ఆ శ్రీ లలిత అధికారం లోనే ఉంటాయి. 

కుబేరుడు నవనిధులకీ అధిపతి. కుబేరుడు అమ్మను ఉపాసించే, ఆ నవనిధులకీ అధికారి 

అయ్యాడు. అమ్మ ఆజ్ఞను అనుసరించే కుబేరుడు ఆ నిధులకు రక్షణగా ఉన్నాడు. 

ఆ పరమేశ్వరి యోగ్యులైన అర్హులకు ఆ నిధులని ఇస్తుంది. 

నిధులన్నింటిలోనూ గొప్ప నిధులైన శంఖ, పద్మ నిధులు అమ్మ వద్దే వున్నాయి.

ఆ నిధులన్నింటికీ అధిపతి శ్రీదేవి. అందుకే అమ్మను ఈ నామంలో కోశానాథా అంటున్నాం. 

అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనే 

దివ్యమైన పంచకోశాలు మనలోనే వున్నాయి. ఆ కోశాలన్నింటికీ అధిపతి ఆ శ్రీలలితే. 

అందుకే ఆ లలితాపరమేశ్వరిని కోశనాథా అంటున్నాం. 

దివ్యమైన కోశములకూ, మణిమయ ప్రాకారాలకి నిలయమైన చింతామణీ గృహంలో 

అందరిచేతా సుఖముగా ఆరాధింపబడే, ఆ కోశనాథ కు వందనం.  

ఓం శ్రీ కోశనాథాయై నమః  

691. చతురంగబలేశ్వరీ

చతురంగములూ కలిగిన సేనకు అధిపతి లలితాపరమేశ్వరి అని ఈ నామార్ధం. 

చతురంగములు అంటే, రథ, గజ, తురగ, పదాతి దళములు. 

ఈ నాలుగు అంగములూ కల సేనకు అమ్మ స్వామిని. ఈ దళములను శ్రీమాత వ్యూహములుగా 

రచిస్తుంది. చతురంగబలేశ్వరీ అంటే, నాలుగు రకములైన వ్యూహములు కలది అని అర్ధం. 

విష్ణుపురాణంలోనూ, భాగవతపురాణంలోనూ ఆ వ్యూహములను 

వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ వ్యూహములని చెప్పారు. 

శివపురాణంలో శివ వ్యూహములు, శాక్తేయపురాణాలలో శక్తి వ్యూహాల గురించి చెప్పారు.  

కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు అమ్మవారి కాల వ్యూహములు. 

పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అమ్మవారి వాగ్వ్యూహములు. 

రథ, గజ, తురగ, పదాతులు అమ్మవారి సేనా వ్యూహములు. 

ఋక్, యజుర్, సామ, అధర్వణ వేదములు అమ్మవారి వేదవిద్యా వ్యూహములు. 

బృహచోపనిషత్తులో శరీరపురుషుడు, ఛందఃపురుషుడు, వేదపురుషుడు, మహాపురుషుడు 

అని అమ్మవారిని చతుర్విధ పురుషస్వరూపముగా చెప్పారు. 

నాలుగు రకముల వ్యూహములకు ఈశ్వరి అయిన, ఆ చతురంగబలేశ్వరి కి వందనం. 

ఓం శ్రీ చతురంగబలేశ్వర్యై నమః   

692. సామ్రాజ్యదాయినీ 

రాజ్యాలను పాలించేవారు రాజులు. సామ్రాజ్యాలను పాలించేవారిని సామ్రాట్టులంటారు. 

కొన్ని రాజ్యాల సమూహాన్ని సామ్రాజ్యం అంటాం. సామ్రాట్టులకు సామ్రాజ్యాలను ఇచ్చే 

పరమేశ్వరినే ఈ నామంలో సామ్రాజ్యదాయినీ అంటున్నాం.
 
రాజసూయయాగము చేసిన వారినీ, మండలేశ్వరులనీ, రాజాధిరాజులనూ సామ్రాట్టులంటారు. 

అగ్నిపురాణంలో, 'రాజసూయయాగము చేసినవాడు మండలేశ్వరుడు. రాజులను తన ఆజ్ఞతో 

శాసించేవాడే సామ్రాట్' అని చెప్పారు. 

సామ్రాట్టులకు సామ్రాజ్యాలను అనుగ్రహించే, ఆ సామ్రాజ్యదాయిని కి వందనం. 

ఓం శ్రీ సామ్రాజ్యదాయిన్యై నమః   

693. సత్యసంధా

సత్యసంధా అంటే సత్యమును ప్రతిజ్ఞ వలే పాటించునది. ఆ ప్రతిజ్ఞా మర్యాదను నిలబెట్టునది 

అని అర్ధం. ప్రతిజ్ఞ చేత సత్యము అనే నియమాన్ని పాటించునది పరమేశ్వరి. 

సత్యము అంటే పరబ్రహ్మ. సత్యమును పాటించి ఆ పరబ్రహ్మను సేవించాలి. 

సత్యమునకు మర్యాద ఇచ్చువారిని అనుగ్రహించునది. సత్యదూరులను శిక్షించునది. 

అసత్యములు ఆడువారిని, సత్యము పట్ల మర్యాద లేని వారిని దండించునది. 

సత్యమునే ప్రతిజ్ఞ వలె స్వీకరించి పాటించువారి పట్ల కృపతో ఉండునది. 

సత్యపాలన చేసే వారి పట్ల అనుగ్రహమును చూపు, ఆ సత్యసంధ కు వందనం. 

ఓం శ్రీ సత్యసంధాయై నమః

694. సాగరమేఖలా

సాగరమేఖలా అంటే సముద్రములను తన వడ్డాణము వలె ధరించినది అని అర్ధం. 

మేఖలా అంటే మొలనూలు, నడుముకట్టు. భూమికి చుట్టూ సముద్రాలు ఉంటాయి. 

మధ్యలో భూమి ఉండి, చుట్టూ సముద్రాలు వుండే భూ స్వరూపమే పరమేశ్వరి అని ఈ నామార్ధం. 

దేవీభాగవతంలో, సప్తమస్కంధంలో అమ్మవారి విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తూ, 

సముద్రములు కుక్షి, భూమి కటి అనీ చెప్పారు. అమ్మవారి కడుపు సముద్రాలైతే, నడుము భూమి. 

నడుము చుట్టూ సముద్రాలూ ఉన్నవని ఆ విరాట్ స్వరూప వర్ణనలో తెలుస్తున్నది. 

కనుక అమ్మకు సాగరమేఖలా అనే నామం వచ్చింది. 

సముద్రాలను తన నడుము చుట్టూ కట్టేసుకున్న, ఆ సాగరమేఖల కు వందనం. 

ఓం శ్రీ సాగరమేఖలాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి