సరస్వతీ, శాస్త్రమయీ, గుహాంబా, గుహ్యరూపిణీ ॥ 137 ॥
701. దేశకాలాపరిచ్ఛిన్నా
బ్రహ్మాది దేవతలకు కూడా ఒక ఆయుఃప్రమాణముంటుంది కానీ, పరమేశ్వరికి ఉండదు.
ఏ కొలతలకూ పట్టుబడని, ఆ దేశకాలాపరిచ్ఛిన్న కు వందనం.
ఓం శ్రీ దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః
702. సర్వగా
వరాహపురాణంలో ఒక ఉదంతం వుంది. సృష్టి అనే దేవి శ్వేతపర్వతంపై తపస్సు చేస్తుంటే,
అన్ని రూపాలలో, అందరిలోనూ వుండాలని వరం అడిగింది.
దేవీ పురాణంలో, ' వేదము, యజ్ఞము, స్వర్గము అన్నీ దేవీస్వరూపాలే. ఈ స్థావరజంగమమైన
సమస్త జగత్తూ దేవీ స్వరూపమే. దేవి అంతర్యామి, అన్నపాన స్వరూపురాలైన శాకంబరీదేవి.
వృక్షము, భూమి, వాయువు, ఆకాశము, నీరు, అగ్ని మొదలైన అన్ని నామ రూపాలతో ఆ దేవియే
ప్రకటితమవుతున్నది. ఎవరైతే ఆ దేవి యొక్క ఈ సర్వరూపా తత్త్వాన్ని తెలుసుకుంటున్నారో,
వారు ఆ దేవిలోనే లయమై పోతున్నారు.' అని చెప్పారు.
ఆ దేవి, అన్నిటా, అన్ని కాలాలలో, అన్ని రూపాలలో, అన్ని వేళలలో ఉంటుంది కనుక,
ఆ తల్లిని ఈ నామంలో సర్వగా అంటున్నాం.
ఒక్క పరమేశ్వరీ తత్త్వమే బహురూపాలుగా ప్రకటితమవుతోంది, కనుక ఆ తల్లి సర్వగా.
సర్వ ఉపాధులలో వ్యక్తమవుతున్న, ఆ సర్వగ కు వందనం.
ఓం శ్రీ సర్వగాయై నమః
703. సర్వమోహినీ
అందరినీ మోహములో ముంచెత్తే స్వరూపము కనుక, ఆ శ్రీదేవిని ఈ నామంలో సర్వమోహినీ
అంటున్నాం. ఆ జగన్మాత మోహినీ తత్త్వాన్ని గురించి ముందే చెప్పుకున్నాం.
అమ్మది ఎంత సమ్మోహన రూపమో వర్ణించలేము. ఆ మోహపు మాయలో పడని వారు ఎవరూ లేరు.
త్రిమూర్తులూ, దేవేంద్రాదులూ కూడా ఆ మోహాబ్ధిలో మునిగి ఆనందమును అనుభవిస్తున్న వారే.
నారదాది మహర్షులు కూడా ఆ మోహపు సముద్రంలో మునిగి తేలినవారే.
అమ్మ త్రైలోక్యమోహనచక్రస్వామిని. ముల్లోకాలలోనూ అమ్మ మోహానికి లొంగని వారు లేరు.
ఘటము, పటము కానీ, బ్రహ్మము, జగత్తు కానీ వేరు వేరు అనుకోవడం అజ్ఞానం.
అన్ని స్వరూపాలూ ఒక్కటే అని తెలిసి కూడా ఆ అజ్ఞానములో మునిగి ఉండటమే మోహము.
కూర్మపురాణంలో, " ఈమె నా పరాశక్తి స్వరూపం. మహామాయ, బ్రహ్మరూపిణి. ఈమె వలననే నేను
సమస్త జగత్తులనీ మోహపెట్టి సృష్టి, స్థితి, లయ కార్యములు చేస్తున్నాను" అంటాడు శంకరుడు.
ఆ కూర్మపురాణం లోనే, దేవి హిమవంతునితో చెప్తుంది, "లోకములో శ్రుతిస్మృతులకు విరుద్ధమైన
కాపాల, భైరవ, శాకల, గౌతమ వంటి అనేక మతాలున్నాయి. ఈ మతాలన్నీ జనులను అజ్ఞానంతో
మోహపెడుతూనే ఉంటాయి. దానివలన జనులు మరల మరల జన్మలు ఎత్తుతూనే వుంటారు."
సూతసంహితలో, 'దైవానుగ్రహం లేని పాపాత్ములు, మాయ వలన మోహితులై, జననమరణ
చక్రంలో పరిభ్రమిస్తూనే వుంటారు. ఆ మాయామోహితులు బ్రహ్మమును తెలుసుకోలేరు' అని
వుంది. సాగరమథన సమయంలో జగన్మోహినీ అవతారంలో ఆ మహాకామేశుడిని కూడా
సమ్మోహన పరిచింది ఈ సర్వమోహినీ తత్త్వమే.
సర్వమోహినీ రూపంలో జగత్తులనన్నీ తన మోహనాస్త్రంతో కట్టి వుంచింది ఆ మహాలావణ్యశేవధి.
త్రైలోక్యమోహన శక్తిగా అందరినీ మోహింపచేస్తున్న, ఆ సర్వమోహిని కి వందనం.
ఓం శ్రీ సర్వమోహిన్యై నమః
ఓం శ్రీ సరస్వత్యై నమః
705. శాస్త్రమయీ
శాస్త్రమంటే వేదము. శాస్త్రముల చేత బోధింపబడునది శాస్త్రమయీ.
అంటే, వేదము వలన తెలియబడుచున్నది శాస్త్రమయీ అని అర్ధం.
శ్రుతులు, స్మృతులు అన్నీ శాస్త్రాలు. వేదాంగాలైన శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం,
జ్యోతిషం, కల్పం, ఇవి అన్నీ కూడా శాస్త్రాలు. ఈ శాస్త్రముల ద్వారా తెలియబడుతున్నది
శాస్త్రమయీ అయిన ఆ సరస్వతి. న్యాయము, తర్కము, మీమాంస, పురాణము, ధర్మము వంటి
శాస్త్రములన్నీ ఆ సరస్వతీ స్వరూపమే.
బ్రహ్మపురాణంలో శాస్త్రాలన్నీ ఆ పరమేశ్వరి అంగాలు అని చెప్పారు. అన్ని శాస్త్రాలూ అమ్మ
నుంచే ఆవిర్భవించాయి. శాస్త్రమునకు విరుద్ధముగా ఏది వున్నా అది అజ్ఞానమే, భ్రమే.
భూమి మీద నుంచి చూస్తే చంద్రుడు ప్రాదేశమాత్రంగానే (బొటనవేలు నుండి చూపుడువేలు
వరకూ గల దూర ప్రమాణాన్ని ప్రాదేశము అంటారు) కనిపిస్తాడు. కానీ జ్యోతిషశాస్త్రములో
చంద్రుడిని పెద్దదిగా వర్ణించారు. శాస్త్రములో చెప్పినదే సత్యము కనుక, చంద్రుడిని పెద్దదిగానే
గ్రహించాలి. కంటికి చిన్నగా అగుపడినంత మాత్రమున చంద్రుడు చిన్నది కాదు.
కన్ను చూసిన దానికన్నా శాస్త్రవాక్యమే సత్యము అని తెలుసుకోవాలి.
బ్రహ్మాండపురాణంలో, "జడశక్తి రూపంలో ఆ పరమేశ్వరి వేదమంత్రాలను, వివిధ శాస్త్రములను
తన పంచదశీ స్వరూపమైన శరీరం లోని వివిధ అంగములతో సృష్టించింది" అని చెప్పారు.
వేదమంత్రముల రూపంలో శాస్త్రములుగా వ్యక్తమయిన, ఆ శాస్త్రమయీ కి వందనం.
ఓం శ్రీ శాస్త్రమయ్యై నమః
706. గుహాంబా
గుహాంబా అంటే గుహుడికి తల్లి. కుమారస్వామికి గుహుడనే నామం వుంది.
ఈ నామంలో ఆ పరమేశ్వరిని కుమారస్వామికి జననిగా చెప్పుకుంటున్నాం.
గుహ అంటే హృదయం. హృదయమనే గుహలో వున్న అంబ అని అర్ధం.
ఛాయా రూపంలో హృదయకుహరంలో నివసించే జగన్మాతే గుహాంబా అని చెప్పబడుతోంది.
గుహలో ఉంటుంది. అందరికీ వ్యక్తము కాదు. పంచకోశముల లోపల వుండే గుహలో వున్న
పరమేశ్వరీ స్వరూపమే గుహాంబా.
గుహ్యముగా హృదయ గుహలో ఛాయా రూపములో వున్న, ఆ గుహాంబ కు వందనం.
ఓం శ్రీ గుహాంబాయై నమః
707. గుహ్యరూపిణీ
గుహ్యరూపిణీ అంటే రహస్యమైన జ్ఞాన స్వరూపము కలది అని అర్ధం.
దహరము నందు గుహ్యముగా వుండే జ్ఞాన స్వరూపము గుహ్యరూపిణీ. జ్ఞానము కంటికి కనిపించదు
కదా. చర్మచక్షువులకు కనిపించని రహస్య జ్ఞానరూపిణి గుహ్యరూపిణీ రూపంలో వున్న అమ్మ.
సూతసంహితలో," గురురూపమును ధరించినది, గుహ్యము. గుహ్యజ్ఞానమే రూపముగా కలది.
ఆ గుహలో రహస్యముగా వున్న దేవిని స్తుతిస్తున్నాము" అని వుంది.
కూర్మపురాణంలో, అన్ని ఉపనిషత్తులలో గుహ్యోపనిషత్తు దేవీ స్వరూపము అని చెప్పారు.
శ్రీమాత నిజస్వరూపము గుహ్యాతిగుహ్యము. ఆ గుహ్య రూపమే ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపములో
కొద్దికొద్దిగా వ్యక్తం అవుతూ ఉంటుంది. నేటికీ నేపాల్ లో అతి పురాతన శక్తిక్షేత్రమైన
గుహ్యేశ్వరీదేవి మందిరం వుంది. అక్కడ వున్న శిలాజాన్నే గుహ్యేశ్వరీ మాత రూపంగా పూజిస్తారు.
గుహ్యాతిగుహ్యమైన దహరకుహరంలో దాగున్న, ఆ గుహ్యరూపిణి కి వందనం.
ఓం శ్రీ గుహ్యరూపిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
🙏🙏🙏
రిప్లయితొలగించండి