2, డిసెంబర్ 2021, గురువారం

132. అన్నదా, వసుదా, వృద్ధా, బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ బృహతీ, బ్రాహ్మణీ, బ్రాహ్మీ, బ్రహ్మానందా, బలిప్రియా

  

అన్నదా, వసుదా, వృద్ధా, బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ 
బృహతీ, బ్రాహ్మణీ, బ్రాహ్మీ, బ్రహ్మానందా, బలిప్రియా ॥ 132 ॥

669. అన్నదా

అందరికీ అన్నమును ఇచ్చునది అన్నదా. అన్నమంటే తినదగు పదార్ధాలన్నీ. 

'అన్నం బ్రహ్మేతి వ్యజానాత్' అని తైత్తిరీయంలో, భృగువల్లిలో వుంది. అంటే అన్నమే బ్రహ్మము. 

ఆ అన్నము వలననే ప్రాణులు పుడుతున్నారు, జీవిస్తున్నారు, లయిస్తున్నారు. 

కనుక అన్నమును అమర్యాద చేయకూడదు. వ్యర్ధము చేయకూడదు. 

అన్నదానానికి ఆకలి మాత్రమే అర్హత. లోకములోని జీవరాశికంతటికీ అన్నాన్నిస్తోంది కనుక, 

ఆ పరమేశ్వరిని ఈ నామంలో అన్నదా అంటున్నాం. 

పోతన ఈ అమ్మలగన్నయమ్మను కీర్తిస్తూ, 'కడుపాఱడి బుచ్చినయమ్మ' అంటాడు. 

సకల ప్రాణులకూ అన్నము అందిస్తున్న, ఆ అన్నద కు వందనం. 

ఓం శ్రీ  అన్నదాయై నమః  

670. వసుదా

వసుదా అంటే ధనమును ఇచ్చునది అని అర్ధం. నిఘంటువులో వసు అంటే ధనము, సువర్ణము, 

రత్నము అనే అర్ధాలున్నాయి. 

బృహదారణ్యకంలో, ఆత్మే అన్నాదుడు, వసుదానుడు అని తెలుసుకున్నవాడు వసువును 

పొందుతున్నాడు అని చెప్పారు. 

అన్నాదుడు అంటే, అన్నివిధముల అన్నమునూ తినువాడు అని శంకర భాష్యంలో వుంది. 

కొందరు 'అన్న, ఆ, ద' అని విభజిస్తూ, అన్నమును అందరికీ ఇచ్చువాడు అని కూడా చెప్పారు. 

ఆత్మయే అన్నాదుడు, వసుదానుడు కనుక, ఆత్మయే ప్రాణుల కర్మఫలాన్ని బట్టీ, యోగ్యతను 

బట్టీ, అన్నమును, వసువును ఇస్తున్నది. 

ఆ లలితాపరమేశ్వరియే ఆత్మశక్తి, కనుక వసుదా అన్న నామం వచ్చింది. 

అందరికీ కావలసిన ధనములను ఇచ్చు, ఆ వసుద కు వందనం.  

ఓం శ్రీ వసుదాయై నమః  

671. వృద్ధా

అమ్మవారు సనాతని, అగ్రగణ్య అని చెప్పుకున్నాం. సృష్టిలో అందరికన్నా పెద్దది. 

వేదము చెప్పినది కనుక, వేదము కన్నా ముందు నుంచే ఉన్నది. 

అందువలన, ఆ మాహేశ్వరి అందరికన్నా జ్యేష్ఠురాలు, వృద్ధురాలు. 

ఈ  త్రిశక్తుల కన్నా, త్రిమూర్తుల కన్నా, త్రిభువనాల కన్నా ముందే వున్నది.

కనుక ఈ నామంలో అమ్మను వృద్ధా అంటున్నాం. 

పోతన ఈ మూలపుటమ్మను వర్ణిస్తూ, 'చాలఁ బెద్దమ్మ' అంటాడు. 

అందరిలోకీ పెద్దది అయిన, ఆ వృద్ధ కు వందనం. 

ఓం శ్రీ వృద్ధాయై నమః  

672. బ్రహ్మాత్మైక్య స్వరూపిణీ

బ్రహ్మము, ఆత్మా ఇద్దరూ ఐక్యమైన స్వరూపమును కలిగిన జగన్మాత కనుక, 

అమ్మను ఈ నామంలో బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ అంటున్నాం. 

చైతన్యమనే బ్రహ్మముతో జీవులందరూ ఐక్యమగుటయే అమ్మ నిజరూపం. 

సః అహం అంటే, సోహం మంత్ర స్వరూపురాలు అని అర్ధం. 

సః అంటే ఈశ్వరుడు, అహం అంటే జీవుడు, ఈ రెండూ ఐక్యమయితే ఏర్పడేది సోహం. 

అదే బ్రహ్మాత్మైక్యస్వరూపం. ఈ విషయం స్కాందంలో చెప్పబడింది. 

అదే పరబ్రహ్మ. పరబ్రహ్మ కానిదేదీ ఈ విశ్వంలో కనిపించదు. 

ప్రజ్ఞానం బ్రహ్మ, తత్త్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ అనే 

నాలుగు మహావాక్యాలు చెప్పేది కూడా ఈ విషయమే. 

సమస్త సృష్టితోనూ అభేదమును పొందిన, ఆ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ  బ్రహ్మాత్మైక్యస్వరూపిణ్యై నమః   

673. బృహతీ

బృహత్ అంటే చాలా గొప్పది అని అర్ధం. అమ్మను బృహతీ అంటున్నామంటే, ఆ మాహేశ్వరిని 

అత్యంత మహత్తైనది అని చెప్పుకుంటున్నాము అని తెలుస్తోంది.  

బృహతీ అంటే, ములక అనే పేరున్న ముళ్లపొద. విశ్వావసు అనే గంధర్వుని వీణ పేరు బృహతీ. 

బృహతీ అనేది ఒక ముప్పది ఆరు అక్షరముల ఛందస్సు. అన్ని ఛందస్సులలో కెల్లా, పెద్ద 

ఛందస్సు కనుక, ఈ బృహత్తరమైన ఛందస్సుని బృహతీ అన్నారు. గాయత్రీ ఛందస్సు, 

బృహతీ ఛందస్సు రెండింటినీ కూడా అమ్మ స్వరూపమే అని భావించవచ్చు. 

బృహతీ అనే పేరున్న మొక్క ఒక ఔషధం, గణపతి పూజలో వాడే ఏకవింశతి పత్రాలలో ఒకటి. 

విశ్వావసు ఈ బృహతీ వీణపై గంధర్వ గానం ఆలపించే ఆ గౌరీదేవిని కొలుస్తూ ఉంటాడు.

ఇక్కడ ముఖ్యమైన అర్ధం, అమ్మను ఈ నామం ద్వారా మహత్తైనది అని చెప్పుకోవడం. 

భగవద్గీత విభూతియోగంలో, భగవానుడే స్వయంగా, నేను వేదాలలో సామవేదాన్ని, 

సామవేద గానములలో బృహత్సామాన్ని అని చెప్పాడు. 

కఠోపనిషత్ లో ఆత్మని గురించి చెప్తూ, ఆత్మను మహతో మహీయాన్ అన్నారు. 

అంటే మహత్తైన వాటన్నింటి లోనూ మహత్తైనది అని అర్ధం. 

మహాత్స్వరూపమైన, ఆ బృహతీ కి వందనం. 

ఓం శ్రీ బృహత్యై నమః 

674.  బ్రాహ్మణీ

బ్రాహ్మణీ అంటే బ్రాహ్మణ స్త్రీ అని అర్ధం. అమ్మవారిని ఈ నామంలో బ్రాహ్మణీ అంటున్నాం. 

తెల్లని పువ్వులు కల సంవిత్తు అనే ఓషధిని బ్రాహ్మణీ  అంటారని సమయాచారస్మృతిలో వున్నది.  

పరాశర, ఆదిత్య, కూర్మ, వాసిష్ఠ, లింగ పురాణాలలో శంకరుడిని బ్రాహ్మణుడు అని చెప్పారు. 

శంకర పత్ని కనుక,  శాంకరి బ్రాహ్మణి అయినది. 

చాందోగ్యోపనిషత్తులో కూడా శివుడిని బ్రాహ్మణుడని చెప్పారు. 

శివతత్త్వవివేకములోనూ, విష్ణు భాగవతంలోనూ, శివునికోపమును చూసి, 

ఆతడు బ్రాహ్మణుడు అని తెలిసి ఆదిత్యులు భయపడ్డారు అని వుంది.  

శివుడు బ్రాహ్మణుడు కనుక, శివపత్ని యైన, శివానిని ఈ నామంలో బ్రాహ్మణీ అని అంటున్నాం. 

బ్రాహ్మణుడైన శంకరుని భార్య, ఆ బ్రాహ్మణి కి వందనం. 

ఓం శ్రీ  బ్రాహ్మణ్యై నమః 

675. బ్రాహ్మీ

బ్రాహ్మీ అంటే జ్ఞానస్వరూపము, వాక్స్వరూపము అని అర్ధము. 

బ్రహ్మము యొక్క శక్తి కనుక బ్రాహ్మి, సప్తమాతృకలలో మొదటిది. 

అవిద్యను జడజాతికి సంబంధించినదని సూచిస్తున్న జ్ఞాన స్వరూపురాలు. 

అమరంలో బ్రాహ్మీ అంటే భారతీ అని అర్ధం. "నేను బ్రహ్మము నుండి పుట్టినదానిని కనుక,

'బ్రాహ్మో జాతౌ' అని, అవిద్య మొదలైన అజ్ఞానములను కిందకు తోసినది" అని చెప్పారు. 

తెల్లవారుజాము మూడు గంటల సమయమును బ్రాహ్మీ ముహూర్తము అంటారు. 

ఈ సమయములో బ్రహ్మమును గురించి ఉపాసన చేయువారికి బ్రహ్మము సిద్ధిస్తుంది. 

ఈ సమయములో బ్రహ్మమును గురించి సాధన చేసేవారికి, ఈ బ్రాహ్మీశక్తి సహకరించి వారికి 

బ్రహ్మ్యైక్యతానుభూతిని ఇస్తుంది. 

బ్రహ్మము యొక్క మొదటి శక్తి అయిన, ఆ బ్రాహ్మీ కి వందనం. 

ఓం శ్రీ బ్రాహ్మ్యై నమః 

676. బ్రహ్మానందా

నిత్యమూ బ్రహ్మానందములో ఉండేది ఆ లలితాపరమేశ్వరి. 

తన భక్తులకు ఆ బ్రహ్మానందానుభవమును కలుగచేయునది కూడా ఆ జగన్మాతే. 

తైత్తిరీయంలోని, బ్రహ్మానందవల్లిలో ఆనందపు కొలతలను ఈ విధంగా చెప్పారు. 

ఒక ఆరోగ్యమైన, బలిష్టమైన, అందమైన యువకునికి ప్రపంచ సంపద మొత్తం లభిస్తే కలిగేది 

మానవానందం. 

నూరు మానవానందాలు ఒక మానవ గంధర్వానందం.  

నూరు మానవ గంధర్వానందాలు ఒక దేవ గంధర్వానందం.  

 నూరు దేవ గంధర్వానందాలు ఒక  చిరలోక పితర ఆనందం. 

నూరు చిరలోక పితర ఆనందాలు ఒక అజానజానాం దేవానందం.  

నూరు అజానజానాం దేవానందాలు ఒక కర్మ దేవతానందం.

నూరు కర్మ దేవతానందాలు ఒక దేవ ఆనందం.

నూరు దేవ ఆనందాలు ఒక ఇంద్ర ఆనందం. 

నూరు ఇంద్ర ఆనందాలు ఒక బృహస్పతి ఆనందం.

నూరు బృహస్పతి నందాలు ఒక ప్రజాపతి నందం.

నూరు ప్రజాపతి ఆనందాలు ఒక బ్రహ్మానందం. 

ఇటువంటి బ్రహ్మానందాన్ని పొందగలిగేవాడు కేవలము నిష్కామకర్మను ఆచరించే శ్రోత్రియుడు. 

అట్టి నిష్కామ శ్రోత్రియులకు బ్రహ్మానందాన్ని ఇచ్చేది, 

బ్రహ్మానందా అనే నామంతో వ్యక్తమయే, శ్రీలలితాపరాభట్టారిక.   

నిష్కామ శ్రోత్రియులకు బ్రహ్మానందాన్ని అనుగ్రహించే, ఆ బ్రహ్మానందా కు వందనం. 

ఓం శ్రీ బ్రహ్మానందాయై నమః 

677. బలిప్రియా

బలి అంటే ఇష్టపడునది బలిప్రియా. బలి అంటే మహాబలుడు అని అర్ధం. 

కామక్రోధాది శత్రువర్గాలను జయించిన వారిని కూడా బలి అంటారు. 

ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. 

బలిచక్రవర్తి దానశీలి. తన దానగుణంతో వామనుడిగా వచ్చిన విష్ణువును మెప్పించాడు. 

బలి దానగుణాన్ని మెచ్చిన విష్ణువు బలిని చంపలేదు. కానీ దేవేంద్రాదులను హింసించాడు 

కనుక, భూలోకం నుంచి కిందకు అణగదొక్కాడు. బలికి జ్ఞానమిచ్చి, అధోలోకమైన 

సుతలలోక సామ్రాజ్యానికి అధిపతిని చేసాడు. తాను స్వయంగా బలికి ద్వారపాలకుడైనాడు. 

ఆ బలిని మెచ్చిన వామన స్వరూపమే బలిప్రియా. బలిచక్రవర్తి అంటే ఇష్టపడునది బలిప్రియా. 

బలి అంటే పూజాద్రవ్యాలని కూడా అర్ధం. పూజాద్రవ్యములను ఇష్టపడునది బలిప్రియా. 

పూజా సమయాల్లో, జంతు బలులే కాకుండా, కూష్మాండ, నారికేళ,  నింబ బలులు కూడా 

ఆచారంలో వున్నది. అంటే, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలని బలిగా అర్పించటం.  

అరిషట్ వర్గాలను జయించిన బలవంతులంటే ప్రీతి కలిగిన, ఆ బలిప్రియా కు వందనం. 

ఓం శ్రీ బలిప్రియాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి