25, డిసెంబర్ 2021, శనివారం

155. బ్రహ్మాణీ, బ్రహ్మ, జననీ, బహురూపా, బుధార్చితా ప్రసవిత్రీ, ప్రచండా, ఆజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః

 

బ్రహ్మాణీ, బ్రహ్మ, జననీ, బహురూపా, బుధార్చితా 
ప్రసవిత్రీ, ప్రచండా, ఆజ్ఞా, ప్రతిష్ఠా, ప్రకటాకృతిః ॥ 155 ॥


821. బ్రహ్మాణీ

దేవీపురాణంలో చతుర్ముఖ బ్రహ్మను పుట్టించింది కనుక, బ్రహ్మాణీ అని వుంది. 

దేవీపురాణంలోనే బ్రహ్మను బ్రతికించింది కనుక, బ్రహ్మాణీ అయినది అని కూడా వుంది. 

అణీ అంటే పుచ్ఛము, కొన, సీమ, పొలిమేర అనే అర్ధాలున్నాయి. బ్రహ్మ, అణీ అంటే బ్రహ్మమైన 

పుచ్చము కలది అని అర్ధము. మహాభారతంలో శూలాగ్రమున గుచ్చబడిన మాండవ్యమహర్షిని 

అణీమాండవ్యుడని అన్నారు. అణీ అంటే శూలాగ్రము అని కూడా అర్ధం. 

బ్రహ్మమునకు కింది స్థితి ఆనందమయకోశము. పంచకోశాలలో ఆనందమయకోశానిది అగ్రస్థానం. 

అంటే, బ్రహ్మమునకు ఆనందమయకోశము పుచ్చము వంటిది. 

వేదములో ఆనందమయకోశమును బ్రహ్మపుచ్చము అని చెప్పారు. 

కనుక బ్రహ్మానంద స్వరూపమే బ్రహ్మాణీ.  

పితామహుడైన బ్రహ్మ భార్యను కూడా  బ్రహ్మాణీ అంటారు.

బ్రహ్మానంద స్వరూపమైన, ఆ బ్రహ్మాణి కి వందనం. 

ఓం శ్రీ  బ్రహ్మాణ్యై నమః  


822. బ్రహ్మ

బృహత్తమమైన దానిని బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటే విశిష్టమైన గొప్ప జ్ఞానము. 

బ్రహ్మ అంటే నలువ, సృష్టికర్త, పరమాత్మ, వేదము, జ్ఞానము, తపము, బ్రాహ్మణుడు, ఋత్విజుడు, 

మూలప్రకృతి, ఆత్మ స్వస్వరూపము, బ్రహ్మము అనే అర్ధాలున్నాయి. 

విష్ణుపురాణంలో, 'స్వాత్మాభిన్నమైన ఆత్మజ్ఞాన స్వరూపమే బ్రహ్మ' అని వుంది. 

బ్రహ్మ అంటే, వాక్కునకు అందనిది, ఇంద్రియములకు గోచరించనిది.  

సృష్టి చేసే శక్తి అమ్మ బ్రహ్మకు ఇచ్చింది కనుక బ్రహ్మ మాత్రమే సృష్టికర్త.

సృష్టి చేస్తున్న ప్రతిప్రాణీ  ఆ సృష్టి చేస్తున్న సమయంలో బ్రహ్మమే. 

బ్రహ్మ కానివాడు ఎవడూ సృష్టి చేయలేడు. 

త్రిమూర్తులలో ఒక్కడైన నలువను కూడా బ్రహ్మ అంటాము. 

యజ్ఞాలు, క్రతువులు చేయించే ఋత్విక్కును కూడా బ్రహ్మ అంటారు. 

కేవలము ఆత్మ చేతనే తెలియబడే జ్ఞానమే బ్రహ్మతత్త్వం, బ్రహ్మము, బ్రహ్మ.  

పరమేశ్వరి నుంచి  వేదాలు బ్రహ్మ ద్వారా పరంపరగా అందినాయి కనుక, బ్రహ్మనే వేదము, 

జ్ఞానము అని కూడా అన్నారు. 

అన్ని జ్ఞానములలో కెల్లా విశిష్టమైన, అద్వితీయమైన, జ్ఞానస్వరూపమైన, ఆ బ్రహ్మ కు వందనం.  

ఓం శ్రీ  బ్రహ్మణే నమః  


823. జననీ 

జననీ అంటే మాత, శ్రీమాత, కన్నతల్లి. 

మహత్తరమైన బ్రహ్మ నుంచీ అత్యల్ప ప్రాణియైన స్తంబము వరకూ అందరికీ జనని. 

ఈ జననినే ఆబ్రహ్మకీటజననీ అనీ, అనేకకోటిబ్రహ్మాండకోటిజననీ అనీ అంటున్నాం. 

ఈ లలితా పరమేశ్వరీ దేవియే బ్రహ్మ జననీ. ఈ దేవియే ముగురమ్మల మూలపుటమ్మ. 

ఈ మాతయే శ్రీమాత, విశ్వమాత, జగన్మాత, లోకమాత, వేదమాత అనే పేర్లతో పిలువబడుతోంది. 

సిద్ధమాత, వీరమాత, గోమాత అనే రూపాలలో, సర్వ ప్రాణులకూ తల్లి రూపంలో వుంది. 

సర్వులనూ, సమస్తమునూ, సకలలోకములనూ కన్నతల్లి, ఆ  జనని కి వందనం. 

ఓం శ్రీ  జనన్యై నమః  


824. బహురూపా

బహురూపాలను ధరించినది బహురూపా. 

"ఆ లలితాపరమేశ్వరి భండాసుర వధ కోసం ఒక్క లలితాదేవియే అనేక రూపాలు ధరించింది" 

అని బ్రహ్మాండపురాణంలోనూ, దేవీపురాణంలోనూ కూడా చెప్పారు. 

శక్తి సైన్యం, భైరవ సైన్యం సమస్తం అమ్మ తన నుంచే సృష్టించింది. 

లలితయే శ్యామల, వారాహి, సంపత్కరీ, అశ్వారూఢా, దండనాథా, జ్వాలామాలిని, బాలా వంటి  

రూపాలన్నీ ధరించింది. దశమహావిద్యారూపాలూ లలితాదేవియే. 

వశిన్యాది అష్ట వాగ్దేవతలూ అమ్మ అంశా రూపాలే. 

దేవీపురాణంలో, "సమస్త స్థావరజంగమాలూ, దేవ, మానుష, తిర్యక్కులూ కూడా ఆ దేవియే కనుక 

బహురూపా అనే నామం వచ్చింది" అని చెప్పారు. 

అకారాది అచ్చు రూపములూ, కకారాది హల్లు రూపములూ ఆ తల్లివే. 

ఈ విషయాన్నే, సూతసంహితలో,"ఏ దేవి ఒకటిగా, రెండుగా, పదహారుగా, ముప్పదిరెండు 

విధములుగా వున్నదో, ఆ పరాత్పరురాలికి వందనం", అని చెప్పారు. 

భాగవతములో, "ఒక్క నర్తకియే ఏవిధముగా లక్ష్మీ, వాణీ రూపములు దాల్చిందో, అదేవిధముగా, 

దేవి అనేక రూపములు దాల్చింది" అని వుంది. 

వేదములో, "రుద్రులు అనేకులు, కనుక రుద్రాణులూ బహురూపులు", అని వుంది. 

వామనపురాణంలో,"విశ్వము బహువిధములు, ఆ బహువిధ విశ్వములలో బహురూపములలో 

వ్యక్తం అవుతున్న పార్వతి బహురూపా", అని వున్నది. 

లింగపురాణంలో, "లోకంలోని పురుషులందరూ శివ స్వరూపాలు, స్త్రీలందరూ శక్తి స్వరూపాలు", 

అని వుంది. 

వరాహపురాణంలో, "ఒక ఆదిశక్తియే, సాత్విక శక్తిగా బ్రాహ్మీ వలె, రాజస శక్తిగా వైష్ణవీ వలె, తామస 

శక్తిగా రౌద్రీ అనీ, చాముండా అనీ అనంత రూపములలో వున్నది" అని చెప్పారు. 

త్రిపురా సిద్ధాంతములో, "లోపాముద్రా, సౌభాగ్య, షోడశీ పరమశివుని భార్యలు. శ్యామల, శుద్ధవిద్య, 

అశ్వారూఢా, పరా సదాశివుని ప్రియభార్యలు. మహార్థ, ద్వాదశార్థా, వారాహీ, బగళాముఖీ, తురీయా, 

భువనేశీ, శ్రీపరా, శాంభవీ, శివా రుద్రుని భార్యలు. శ్రీ, తిరస్కరిణీ, లక్ష్మీ, మిశ్రా, కామకళా, వీరు 

విష్ణుని ప్రియభార్యలు. అన్నపూర్ణ శివుని భార్య. వాగ్వాదినీ, బాలా బ్రహ్మ పత్నులు. హసంతి,  

నవదూతికలు, నవ సిద్ధదేవతలు, మొదలైన రూపములన్నీ నీవే", అని దేవిని కీర్తించినట్లు 

ఉన్నది. ఇన్ని రూపములతో వ్యక్తమవుతున్న పార్వతి బహురూపా అయింది. 
  
సర్వ దేవతల రూపములూ తానే అయిన, ఆ బహురూప కు వందనం. 

ఓం శ్రీ బహురూపాయై నమః 

  

825. బుధార్చితా

బుధులచే అర్చింపబడుతున్నది కనుక ఆ పరమేశ్వరిని ఈ నామంలో బుధార్చితా అంటున్నాం. 

బుధులంటే జ్ఞానులు, బుద్ధి వికసించినవారు, పండితులు. 

శ్రీమద్భగవద్గీతలో కూడా, "ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్ధులు, జ్ఞానులూ నన్ను భజిస్తున్నారు" 

అంటాడు భగవానుడు. కనుక జ్ఞానులు కూడా భగవంతుని సేవిస్తారు అని తెలుస్తోంది. 

పండితవర్గము చేత అర్చింపబడుతున్న, ఆ బుధార్చిత కు వందనం. 

ఓం శ్రీ బుధార్చితాయై నమః 


826.  ప్రసవిత్రీ

సమస్తమునూ ప్రసవిస్తున్నది కనుక అమ్మను ఈ నామంలో ప్రసవిత్రీ అన్నారు. 

ఆకాశము మొదలైన పంచ భూతములనూ, వాటితో ఈ ప్రపంచమునూ కూడా ప్రసవించినది 

కనుక, ప్రసవిత్రీ అనే నామం వచ్చింది. 

విష్ణు ధర్మోత్తరంలో, "ప్రజలను ప్రసవిస్తున్నది కనుక 'సవితా' అన్నారు"  అని వుంది.  

భగవతీ పురాణంలో, "బ్రహ్మనుంచి స్థావరం వరకూ ఏ దేవి నుంచి ఉద్భవించిందో, మహత్తత్వము 

మొదలు అన్ని విశేషముల తోనూ నిండిన ఈ జగత్తు ఎవరి నుంచి వచ్చిందో, ఆ పరదేవతకు 

వందనం", అని వుంది.  

అతిశయముగా సమస్తమునూ ప్రసవించిన, ఆ  ప్రసవిత్రీ కి వందనం. 

ఓం శ్రీ ప్రసవిత్ర్యై నమః 


827. ప్రచండా

ప్రచండా అంటే మిక్కిలి కోపము కలది అనీ, మిక్కిలి కోపము కల దూతలు కలది అనీ అర్ధము. 

గొప్ప ప్రతాపము కలది ప్రచండా. 

నిఘంటువులో చండా అంటే తెల్లగన్నేరు, శంఖపుష్పి, ప్రతాపము అనే అర్ధాలు కూడా వున్నాయి. 

కనుక, ప్రచండా అంటే, తెల్లగన్నేరునీ, శంఖపుష్పినీ ఇష్టపడునది, మహా ప్రతాపమును కలిగినది  

అనే అర్ధాలు కూడా వున్నాయి. 

గుప్తుల కాలంనాటి కామందకుడు తన నీతిసారమనే గ్రంధంలో, "రాజుకు కోపం లేకపోతే ప్రజలు 

భయపడరు. అప్పుడు పాలన సాగదు. ధర్మము కాపాడబడదు. వేదములో 'వజ్రము అంటే 

మహాభయకారకము, పరబ్రహ్మము' అనే అర్ధాలున్నాయి. కనుక పాలన చేయువాడికి భయము 

కలిగించే కోపము ఉండాలి", అని చెప్పాడు. 

అమ్మ మహారాజ్ఞీ  కదా, కనుక, అమ్మ కోపము కలది. 

మిక్కిలి కోపము కల, ఆ ప్రచండ కు వందనం. 

ఓం శ్రీ ప్రచండాయై నమః 


828. ఆజ్ఞా

వేదములు విహితములు, నిషిద్ధములు గురించి చెప్తున్నాయి. అవి అమ్మ ఆజ్ఞలు.  

అమ్మ భగవదాజ్ఞా స్వరూపురాలు. వేదములో చెప్పిన విధి విధాన స్వరూపురాలు కనుక, అమ్మను 

ఆజ్ఞా అంటున్నాం. వేదమంతా అమ్మ ఆజ్ఞలే. ఆ ఆజ్ఞా స్వరూపురాలు పరమేశ్వరి. 

ఆ ఆజ్ఞల ననుసరించి నడుస్తున్న వారిని కాపాడునది ఆజ్ఞాస్వరూపురాలైన వేదమాత అని అర్ధం. 

లింగపురాణంలో, "ఈ దేవి ప్రకృతి, వికృతి కాదు, జీవుడూ కాదు. సృష్ట్యాది నందు నా ముఖము 

నుంచి వెలువడిన పంచావక్త్ర, మహాభాగ, జగములకు అభయప్రదాత, నా ఆజ్ఞా స్వరూపురాలు", 

అని శివుడు చెప్పినట్లు వున్నది.   

శివపురాణంలో, "ఈ దేవి రుద్రుని ఆజ్ఞా స్వరూపురాలు, ఈమె వలన అందరికీ ముక్తి కలుగుతుంది" 

అని వుంది. 

ప్రచండా, జ్ఞా అని పద విభజన చేస్తే, ఈ నామం 'జ్ఞా' అనే ఏకాక్షర నామం అవుతుంది. 

'జ్ఞా' అనే ఏకాక్షరముగా భావించినా, 'జ్ఞా' అంటే జ్ఞానము కలిగిన బుధుడు, బ్రహ్మ అని అర్ధము. 

కనుక బ్రహ్మ స్వరూపురాలు, బుధస్వరూపురాలు అని అర్ధం. 

వేదములో, 'జ్ఞ' అంటే మృత్యువును జయించే కాలకాలుడు అనీ, గుణి అనీ, గుణి అంటే అన్ని 

విద్యలూ తెలిసినవాడు అనీ అర్ధం చెప్పారు. 

లలితాపరమేశ్వరి సర్వ విద్యా స్వరూపురాలు, కాలహంత్రీ కనుక ఈ 'జ్ఞా' అనే నామం కలిగింది. 

వేదముల ద్వారా విహితములు, నిషిద్ధములు అను ఆజ్ఞలు ఇచ్చిన, ఆ ఆజ్ఞ కు వందనం. 

ఓం శ్రీ ఆజ్ఞాయై నమః 


829. ప్రతిష్ఠా

సర్వ జగత్తులనూ అధిష్టించినది, ఆధారభూతమయినది కనుక ప్రతిష్ఠా అనబడింది. 

వేదములో, "విశ్వమంతా అధివసించి వున్నది కనుక, ప్రతిష్ఠా" అన్నారు. 

బ్రహ్మగీతలో, "ప్రజ్ఞ రూపములో అన్ని వస్తువులలో వున్నది కనుక ప్రతిష్ఠా" అని వుంది. 

ఛందస్సుల లో పదహారు అక్షరముల ఒక ఛందస్సుకు ప్రతిష్ఠా అని పేరు. 

జలకళకు ప్రతిష్ఠా అని పేరు. కనుక, జలతత్త్వము లోని కళావిశేషము ప్రతిష్ఠా.  

శైవాగమము ప్రకారము, "శివుని యందు అనురాగమును పొందిన దేవికి ప్రతిష్ఠా అని పేరు. శివుని 

అష్టమూర్తులలో ఒకరైన భవుడు జలతత్త్వానికి ప్రతీక. ఆ భవుని పత్ని భవానియే ప్రతిష్ఠ అనే 

పేరున్న పార్వతి" అని తెలుస్తోంది. 

విశ్వమంతా ప్రతిష్ఠితురాలైన, ఆ ప్రతిష్ఠ కు వందనం. 

ఓం శ్రీ ప్రతిష్ఠాయై నమః 


830. ప్రకటాకృతిః

ప్రకటితమైన రూపము కలది ప్రకటాకృతి అనే పేరు కల పార్వతి. 

శ్రీచక్ర ప్రథమావరణ దేవతయైన త్రైలోక్యమోహనచక్రస్వామినికే ప్రకటయోగినీ అని పేరు. 

సమ్మోహనాకారంతో ప్రకటితమవుతున్న రాజరాజేశ్వరీ దేవతయే ప్రకటాకృతి అనబడుతోంది. 

సూతసంహితలో, "అందరిలోనూ పరమాత్మ రూపంలో వున్నది నేను అని భావిస్తున్నారు. 

కానీ అది పరమశివుడు అని తెలుసుకోలేని మాయ వారిని చుట్టేసింది", అని వుంది.  

ప్రతిష్ఠ, అప్రకటాకృతి అని నామాలను విభజించుకుంటే అప్పుడు ఈ నామం 

అప్రకటాకృతి అవుతుంది. 

అప్రకటాకృతి అంటే ప్రకటితము కాని ఆకృతి, అంటే రహస్యమయ స్వరూపురాలు అని అర్ధం. 

అమ్మ వ్యక్తమూ, అవ్యక్తమూ రెండూ కదా. కనుక, ఈ నామాన్ని ప్రకటాకృతి అన్నా, అప్రకటాకృతి 

అన్నా సమంజసమే. రెండూ అమ్మతత్త్వాన్ని వివరించేవే. 

అప్రకటాకృతి అనే నామాన్ని అప్, ప్రకటాకృతి అని విభజిస్తే, నీటిలో వ్యక్తమయ్యే స్వరూపము 

అని అర్ధం. 

వేదములో, "ఈ జగమంతా ఉదకస్వరూపం. ఒక శక్తి ఉదక మహిమలను భరించుచున్నది" అని 

చెప్పారు.  

త్రైలోక్యమోహనస్వామినిగా ప్రకటితమవుతున్న, ఆ ప్రకటాకృతి కి వందనం. 

ఓం శ్రీ ప్రకటాకృతయే నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి