9, డిసెంబర్ 2021, గురువారం

139. కులోత్తీర్ణా, భగారాధ్యా, మాయా, మధుమతీ, మహీ గణాంబా, గుహ్యకారాధ్యా, కోమలాంగీ, గురుప్రియా

  

కులోత్తీర్ణా, భగారాధ్యా, మాయా, మధుమతీ, మహీ 
గణాంబా, గుహ్యకారాధ్యా, కోమలాంగీ, గురుప్రియా ॥ 139 ॥

714. కులోత్తీర్ణా

కులము అంటే ఇంద్రియముల సమూహము. ఆ ఇంద్రియముల ప్రభావము నుండి 

ఉత్తీర్ణులను చేయునది కులోత్తీర్ణా. ఉత్తీర్ణులను చేయడమంటే ఉద్ధరించడమే. 

దేవీ తత్త్వము గురుశిష్య పరంపరగా తెలియవలసినదే కానీ, గ్రంథపఠనము వలన అర్ధము కాదు, 

అది పరమగుహ్యము అని ముందు నామాల్లో చెప్పుకున్నాం. 

దేవీ తత్త్వము ఇంద్రియములకు గోచరించదు, అది ఇంద్రియాతీతమైన తత్త్వము. 

ఇంద్రియములు బాహ్యప్రపంచాన్ని మాత్రమే పరిచయం చేస్తాయి. 

ఇంద్రియాలను జయించినప్పుడే దేవీ తత్త్వాన్ని అర్ధం చేసుకునే అర్హత లభిస్తుంది.  

ఇంద్రియాతీతమైన నిగ్రహం కలగాలంటే, మనసుని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడు

సాధకుడు అంతర్ముఖుడౌతాడు. అంతరంగంలోని ఆ పరంజ్యోతిని దర్శించగలుగుతాడు. 

ఆ విధంగా సాధకుడిని ఇంద్రియాలనే అడ్డంకులను దాటించి, ఇంద్రియ కులసమూహము

నుంచి ఉద్ధరించి, ఉత్తీర్ణులను చేసేది పరమేశ్వరి. 

అందుకే అమ్మను ఈ నామంలో కులోత్తీర్ణా అంటున్నాం. 

కులము అంటే తాత తండ్రుల నుంచి పరంపరగా వచ్చేది అనే అర్ధం కూడా వుంది. 

సాధకుడిని ఆ సంసార బంధనాల నుంచి విడిపించి ఉత్తీర్ణత ఇచ్చేది కూడా పరమేశ్వరియే. 

దేహంలోని ప్రతి చక్రము వద్దా ఉపాసనా సంబంధమైన కులములున్నాయని చెప్పుకున్నాం కదా.   
సాధకుడిని కింది చక్రముల స్థాయి నుంచి ఊర్ధ్వానికి తీసుకుని వెళ్ళేది కులోత్తీర్ణా. 

ఉపాసకుల ఊర్ధ్వగమనానికి దోహదపడుతున్న, ఆ కులోత్తీర్ణ కు వందనం. 

ఓం శ్రీ  కులోత్తీర్ణాయై నమః 


715. భగారాధ్యా

భగము అంటే నిఘంటువులో శ్రీ, వీర్యము, యోని, ఆదిత్యుడు అనే అర్ధాలున్నాయి. 

ద్వాదశాదిత్యులలో భగుడు అనే సూర్యుడు వుండే మండలంలో ఉపాసింపబడే దేవత అని అర్ధం. 

రహస్యమైన ఆరాధనలకు సూర్యమండలం ఆధారం. ఆ సూర్యమండలములో 

ఆరాధింపబడునది భగారాధ్యా. సూర్యుని చేత ఆరాధించబడినది భగారాధ్యా. 

వామాచారులు యోనిపూజ చేస్తారు. అట్టి పూజలచే ఆరాధింపబడునది అని ఒక అర్ధం. 

త్రికోణాత్మకమగు పదకొండవ అచ్చు 'ఎ'.  ఏకారమును ఆధారబీజముగా వాడి చేసే ఉపాసనను  

భగారాధన అంటారు. కనుక, ఏకారముచే ఆరాధింపబడునది భగారాధ్యా. 

సూర్యమండలములో రహస్యముగా సేవింపబడు, ఆ భగారాధ్య కు వందనం.  

ఓం శ్రీ భగారాధ్యాయై నమః  


716. మాయా

మాయా స్వరూపురాలు కనుక, ఈ నామంలో మాయా అని అమ్మను పిలుచుకుంటున్నాం. 

మాయ అంటే, కంటికి ఎదురుగా వున్న విషయాన్ని కూడా తెలియనట్లు చేసే శక్తి. 

దేవీ పురాణంలో మాయ అంటే, విచిత్ర కార్యములను చేయునది, ఊహించ శక్యము కాని 

ఫలితములను ఇచ్చునది, గారడీ వలే, స్వప్నము వలే కనుపించునది, అని చెప్పారు. 

వరాహపురాణంలో ఈ మాయారహస్యం గురించి సవివరంగా విష్ణువు భూదేవితో చెప్పినట్లు వున్నది. 

మేఘాలు వర్షించటం, జలప్రళయాలు, అకాలములు రావడం, చంద్రునిలో వృద్ధి, క్షీణతలు, 

మొదలైనవన్నీ తన మాయయే అని విష్ణువు భూదేవితో చెప్తాడు. 

భక్తి తంత్రములో, భగవంతుని శక్తియే మాయ. జడమైన మాయ, భగవచ్ఛక్తి వలన మాత్రమే 

క్రియాకరణ సామర్ధ్యమును పొందింది అని చెప్పబడినది. 

భగవచ్ఛక్తి స్వరూపం అయిన, ఆ మాయ కు వందనం. 

ఓం శ్రీ మాయాయై నమః  


717. మధుమతీ 

మధుమతీ అంటే మధువు కలది. పుష్పాలలో మధువు ఉంటుంది. ఆ మధువు చేత పూజిస్తే, 

అమ్మ తృప్తి చెందుతుంది. మధువు అంటే కల్లు, తేనే, పుష్పరసము అనే అర్ధాలున్నాయి. 

దేవిని వీటితో పూజించినవాడు రూపవంతుడవుతాడని వేదములో చెప్పబడింది. 

మధుమతీ అనేది ఒక వృక్షవిశేషం. మధుమతీ అనేది ఒక వైదిక విద్యాస్వరూపం.

మధుమతీ అనే నదీ స్వరూపురాలు. మధుమతీ అనేది ఒక యోగ విభాగం. 

యోగశాస్త్రములో నాలుగు రకాలైన యోగులను గురించి చెప్పారు. ఆ నాలుగవ యోగికి మధుమతీ 

అని పేరు. మధుమతి అనే యోగి, యోగజ్ఞానం వలన సంసారసాగరం నుండి తరింపబడతాడు. 

కనుక, మధుమతికి సంసార తారిక అని కూడా పేరు. 

చాందోగ్యోపనిషత్తులో మూడవఅధ్యాయంలో, మధు విజ్ఞానం గురించి చెప్పారు. 

వేదములు పుష్పములు, అందలి పుష్పరసములు అమృతములు, సూర్యుడు దేవతలకు 

మధువు వంటివాడు. ఆతని కిరణములు మధునాడులు అని చెప్పారు. 

సూర్యుడికి దేవతలను తృప్తి పరచే శక్తి వుంది. సవితృ శక్తి అయిన సావిత్రియే పరమేశ్వరి. 

అందుకే ఈ నామంలో అమ్మను మధుమతీ అంటున్నాం. 

మధువుతో పూజించేవారికి అమృత యోగాన్నిచ్చే, ఆ మధుమతి కి వందనం. 

ఓం శ్రీ మధుమత్యై నమః   


718. మహీ

భూదేవీ స్వరూపురాలు అని అర్ధం. మహీ అనే నదీ స్వరూపురాలు. 

రహస్యమైన స్వరూపము అయినప్పటికీ, భూమి రూపములో వ్యక్తము అవుతున్నది అమ్మ. 

దేవీ పురాణంలో, మహత్తత్త్వమును అంతటా వ్యాపించి వున్నది కనుక మహీ అనే నామం 

వచ్చిందని, దీనినే ప్రకృతి అంటారనీ చెప్పారు.  

వేదాలలో అదితిని మహీ అనే దేవతగా చెప్పారు. భూదేవిని క్షమా అంటారు. 

పరమేశ్వరి కూడా క్షమా స్వరూపం కనుక, ఈ నామంలో మహీ అని చెప్పబడుతోంది. 

మహత్తత్త్వంగా ప్రకటితమవుతున్న, ఆ మహీ కి వందనం. 

ఓం శ్రీ మహ్యై నమః 


719. గణాంబా

గణాంబా అంటే గణములకు జనని. పరమేశ్వరి గజాననుడికి జనని.

ప్రమథగణాలకు అంబ. దేవగణాలకు అంబ. శక్తి గణాలు, శివగణాలు, కాపాలికా గణాలు  

వంటి అనేక గణాలకు పరమేశ్వరి ఆధారభూతమయినది. 

కనుక, ఆ లలితా పరమేశ్వరిని ఈ నామంలో గణాంబా అంటున్నాం.   

గణములకు తల్లి అయిన, ఆ గణాంబ కు వందనం. 

ఓం శ్రీ గణాంబాయై నమః 


720. గుహ్యకారాధ్యా

గుహ్యకులచే పూజింపబడునది అని ఈ నామార్ధం. 

గుహ్యముగా రహస్యస్థలమున ఆరాధింపబడునది అని ఇంకొక అర్ధం. 

గుహ్యకులు దేవయోనులలో పుట్టినవారు. గుహ్యకులు దేవాంశ సంభూతులు. 

యక్షులలో ఒక తెగ. కుబేరుడు, మణిభద్రుడు ఈ తెగకు చెందినవారు. 

వారిచే ఆరాధింపబడునది కనుక, అమ్మను ఈ నామంలో గుహ్యకారాధ్యా అంటున్నాం. 

గుహ్యమైన అంటే రహస్యమైన స్థలాలలో అర్చింపబడునది కనుక కూడా ఈ నామం వచ్చింది.  

సాధకులచే పంచకోశాలలో, షట్చక్రాలలో, సహస్రారంలో రహస్యంగా ఆరాధింపబడుతున్నది. 

కనుక అమ్మను గుహ్యకారాధ్యా అంటున్నాం. 

దైవాంశ సంభూతులచే రహస్యముగా ఆరాధన చేయబడుతున్న, ఆ గుహ్యకారాధ్య కు వందనం. 

ఓం శ్రీ గుహ్యకారాధ్యాయై నమః


721. కోమలాంగీ

కోమలాంగీ అంటే కోమలమైన, సుకుమారమైన అవయవములు కలది అని అర్ధం. 

అమ్మ నడుము ఎంత సన్నగా, సుకుమారంగా ఉంటుందో చాలాసార్లు చెప్పుకున్నాం. 

అమ్మ అందమైన కపోలాల గురించీ, అధరాలగురించీ, చుబుకం గురించీ చెప్పుకున్నాం. 

అందమైన కన్నులు, పలువరుస గురించి చెప్పుకున్నాం. అమ్మను అణువులో కెల్లా చిన్నది అని 

చెప్పుకున్నాం. ఈ లక్షణాలన్నీ కల దేవి కనుక, అమ్మ కోమలాంగీ. 

అమ్మ వేదస్వరూపం. వేదాంగాలు ఆరు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. 

ఈ షడంగాలతో ఏర్పడిన స్వరూపం కనుక అమ్మను కోమలాంగీ అంటున్నాం. 

న్యాసాంగ దేవతలైన హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అనే

కోమలులను అంగదేవతలుగా కలిగి వుంది కనుక కోమలాంగీ. 

కోమలమైన అంగములు కల, ఆ కోమలాంగి కి వందనం. 

ఓం శ్రీ కోమలాంగ్యై నమః 


722. గురుప్రియా

గురువులను ఇష్టపడునది గురుప్రియా. గురుపత్నీ స్వరూపురాలు అని అర్ధం. 

పరమేశ్వరుడు ఆదిగురువు, ఆదినాధుడు, జగద్గురువు. పరమేశ్వరికి శ్రీవిద్యను బోధించినవాడు. 

సదాశివ సమారంభాం అని గురుస్తుతిని మొదలుపెడతాం. 

ఆ జగద్గురువైన శివుని భార్య కనుక శివానీని ఈ నామంలో గురుప్రియా అంటున్నాం. 

పరమేశ్వరికి గురువులన్నా, శ్రీవిద్యా ఉపాసకులన్నా ప్రీతి. కనుక ఆ జగజ్జనని గురుప్రియా. 

గురువులందు ప్రీతిని చూపే, ఆ గురుప్రియ కు వందనం. 

ఓం శ్రీ గురుప్రియాయై నమః 




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి