28, డిసెంబర్ 2021, మంగళవారం

158. ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ ఉదారకీర్తిః, ఉద్దామవైభవా, వర్ణరూపిణీ

 

ఛందస్సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ ।
ఉదారకీర్తిః, ఉద్దామవైభవా, వర్ణరూపిణీ ॥ 158 ॥

844. ఛందఃస్సారా

 
ఆ పరమేశ్వరి ఛందస్సు లోని సారవంతమైన భాగము అని ఛందస్సారా అనే నామానికి అర్ధం.

ఛందస్సు అంటే వేదము, పద్యలక్షణము, ఇచ్ఛ, స్వేచ్చావిహారి అనే అర్ధాలున్నాయి. 

సారము అంటే బలము, చేవ, మజ్జ, జలము, ధనము, న్యాయము అనే అర్ధాలున్నాయి. 

ఛందస్సారా అంటే వేదసారమైన ఉపనిషత్ స్వరూపము అని భావించాలి. 

ఆరు వేదాంగాలలో ఛందస్సు కూడా ఒకటి. 

ఛందోశాస్త్రాన్ని పింగళుడనే గణితశాత్రవేత్త తొలిసారిగా చెప్పాడు. 

పింగళుడి ప్రకారము, ఛందస్సులు మొత్తం ఇరవై ఆరు. ఆ ఛందస్సుల స్వరూపసారమే 

ఛందస్సారా. గాయత్రి, అనుష్టుప్, త్రిష్టుప్, బృహతీ, ప్రకృతీ మొదలైనవి ఛందస్సులు. 

ఆ ఛందస్సులన్నింటి లోకీ గాయత్రీ ఛందస్సు సారవంతమైనది. 

ఆ గాయత్రీ ఛందస్సులో మిక్కిలి సారవంతమైనది పంచదశి. 

ఈ విషయాన్ని భాస్కరరాయలవారు తన వరివస్యారహస్యం అనే గ్రంధంలో చెప్పారు. 

గాయత్రికి రెండు ముఖ్యమైన రూపాలున్నాయి. 

మొదటిది ప్రకటగాయత్రి, దీనిని అందరూ పఠిస్తారు, ఉపాసిస్తారు. మరొకటి గుప్తగాయత్రి. 

హంసగాయత్రి, ఇతర దేవతా గాయత్రీ మంత్రాలు కూడా వున్నాయి.  

గుప్తగాయత్రిని వేదము కూడా స్పష్టంగా చెప్పకుండా, సంకేతాలతో మాత్రమే చెప్పింది. 

అధర్వణవేదములోని, త్రిపురాసూక్తములో, పదునారవ ఋక్కులో, కేవలము సంజ్ఞలతో 

కాదివిద్యా రహస్యము చెప్పబడింది. అదే పంచదశీ మంత్రము. 

క అనే బీజాక్షరముతో మొదలయ్యే మంత్రస్వరూపం కాదివిద్యా. 

హ అనే  బీజాక్షరముతో మొదలయ్యే మంత్రస్వరూపం హాదివిద్యా. 

శ్రీలలిత శ్రీవిద్యను అనేక విధాలుగా బీజాక్షరాలను కూర్చి పేర్చి, వివిధ ఉపాసకులకు ఇచ్చింది. 

ఛందస్సు అంటే న్యాయ మార్గములో సంచరించే స్వేచ్చావిహారిణి అనే అర్ధం కూడా వుంది. 

పద్యలక్షణాన్ని సూచించటానికి కూడా ఛందస్సుని వాడతారు. 

ఛందస్సును ఇచ్చాశక్తి స్వరూపిణిగా వర్ణించటం కూడా ఆనవాయితీలో వున్నది. 

ధర్మాధర్మ విచక్షణ చేస్తున్నప్పుడు ఏదైనా సందేహం కలిగితే, మనసు యథేచ్ఛగా ఏ ధర్మం 

చెప్తుందో, అదే ధర్మం అనే భావం వాడుకలో వుంది. 

కానీ ఒక్కొక్కసారి ధర్మం అధర్మం అవుతుంది, అధర్మం ధర్మం అవుతుంది. 

ఉదాహరణకి సిద్ధులైన వారు చేసే అన్ని పనులూ సిద్ధులు కాని వారు చేయలేరు, చేయకూడదు. 

దత్తాత్రేయుడు సుధాపానం చేశాడని సాధారణ మానవులు చేస్తే దోషమవుతుంది కదా. 

వారు చేసే సుధాపానము వేరు, సామాన్యులు చేసే సుధాపానము వేరు. 

కనుక కొన్నిసార్లు ధర్మం అధర్మం అవుతుంది, అధర్మం ధర్మం అవుతుంది. 

పరమాత్మ చేసేది వేరు, సిద్ధులు చేసేది వేరు, సామాన్యులు చేసేది వేరు. 

అటువంటి ధర్మాధర్మవిచక్షణ చేసే ఇచ్ఛాశక్తి  స్వరూపిణి ఛందస్సారా. 

ఆ ధర్మ అధర్మ ద్వంద్వమైన కామకళా రూపమే ఛందస్సారా. 

గుప్తముగా వున్న శ్రీవిద్యయే ఛందస్సారా అయిన పంచదశి. 

ఉపనిషత్సార రూపమైన, ఆ ఛందఃస్సారా కు వందనం. 

ఓం శ్రీ  ఛందఃసారాయై నమః  


845. శాస్త్రసారా

శాసించేది శాస్త్రము. ఏవి విహితములో, ఏవి నిషేధములో నిర్ణయించేది శాస్త్రం.  

కనుక శాస్త్రమంటే వేదము. ఆ శాస్త్రముల సారమే శాస్త్రసారా అని చెప్పబడే లలితా పరాభట్టారిక. 

ముఖ్యముగా శాస్త్రములు నాలుగు, వ్యాకరణము, తర్కము, మీమాంస, ధర్మము. 

కానీ శాస్త్రాల సంఖ్యను ఒక్కొక్కరు ఒక్కో విధముగా నాలుగనీ, ఆరనీ, ఇరవై ఏడనీ, 

అరవై నాలుగనీ రకరకాలుగా చెప్పారు. ఆ శాస్త్రాలన్నిటి సారమే శాస్త్రసారా అనబడుతోంది. 

అన్ని శాస్త్రాలూ అమ్మ చేత చెప్పబడినవే. ఆ శాస్త్రముల లోని శాసనముల సారమే పరమేశ్వరి. 

ఆ పరమేశ్వరి మనుష్యుల ప్రవృత్తి, నివృత్తులను వేదం ద్వారా నిర్దేశిస్తోంది. 

ఆవిధంగా వేదం ద్వారా జీవులకు నిర్దేశనము చేస్తున్న, ఆ శాస్త్రసారా కు వందనం.  

ఓం శ్రీ శాస్త్రసారాయై నమః  


846.  మంత్రసారా 

దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం తు దైవతం అని శాస్త్రవాక్యం. 

జగత్తులన్నీ దైవం అధీనంలో ఉంటే, ఆ దైవం మంత్రం అధీనంలో ఉంటాడు అని అర్ధం. 

మంత్రమంటే శాస్త్రం, శాస్త్రమంటే వేదం, కనుక మంత్రమంటే వేదం. 

మంత్రాలన్నీ వేదాల నుంచే వచ్చాయి. తంత్రములన్నింటిలో మంత్రముల గురించి చెప్పారు.  

మంత్రం రహస్యం కూడా. గురు ముఖతః స్వీకరించవలసినదే. బీజాక్షరాల కూర్పే మంత్రం. 

మంత్రద్రష్టలైన ఋషులు, మంత్రాలను దర్శించి, వాటిని ఉపాసన చేసి, సిద్ధింపచేసుకుని, 

తమ శిష్య పరంపర ద్వారా ఆ మంత్రాలను ఉపాసకులకు అందించారు. 

మంత్రం అంటే, మననాత్ త్రాయతే ఇతి మంత్రః, మననము చేస్తూ ఉంటే రక్షించేది మంత్రము. 

మంత్రము అంటే సాక్షాత్ మంత్రదేవతా స్వరూపమే. మంత్రసారమే ఆ మంత్ర దేవతస్వరూపం.    

బాలా మంత్రమంటే బాలా రూపమే, బగళా మంత్రమంటే, బగళా రూపమే. 

దేవతలకే కాకుండా పంచ భూతాలకు కూడా బీజాక్షరాలున్నాయి. 

మంత్రసారా అంటే, మంత్రములో చెప్పబడిన నిర్దుష్ట స్వరూపమైన ఆ మంత్రదేవతా రూపమే. 

సకల మంత్రాల సారమైన, ఆ మంత్రసార కు వందనం. 

ఓం శ్రీ  మంత్రసారాయై నమః  


847. తలోదరీ

తలము అంటే బల్లపరుపుగా వున్న ప్రదేశం. తలోదరీ అంటే తలముగా వున్న ఉదరము కలది. 

కృశించిన ఉదరభాగము కలది ఆ మహేశ్వరీ అని తలోదరీ నామం చెప్తోంది. 

ఒక విధంగా చూస్తే, ఉదరం బానలాగా పెంచకండి అని అమ్మ హెచ్చరిస్తోంది కూడా. 

తలము అంటే లోకము. లోకాలన్నీ ఉదరంలో దాచుకున్న జగన్మాత కనుక, తలోదరీ అని 

అంటున్నాం. భూ, భువ, సువ, మహ, జన, తప, సత్య లోకాలకు ఊర్ధ్వలోకాలని పేరు. 

అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలకు అధోలోకాలని పేరు. 

ఈ పదునాలుగు లోకాలు ఆ పరమేశ్వరీ స్వరూపమే. 

ఈ తలాలన్నీ ఉదరభాగంలో కల ఆ జగజ్జననిని ఈ నామంలో తలోదరీ అంటున్నాం. 

ఈ నామాన్ని అతలోదరీ అని భావిస్తే, ఉదరము వద్ద అతలలోకము కల జగదీశ్వరి అని అర్ధం.  

పదునాలుగు భువనభాండాలనీ కడుపులో భరిస్తున్న, ఆ తలోదరి కి వందనం. 

ఓం శ్రీ తలోదర్యై నమః 

  

848. ఉదారకీర్తిః

ఉత్-అర-కీర్తి అంటే  ఉత్-ఉత్కృష్టమైన, అర-శీఘ్రముగా, కీర్తిని ఇచ్చునది అని అర్ధం.

ఉదారకీర్తి అంటే ఉత్కృష్టమైన కీర్తి కలది, ఇచ్చునది అని భావం. 

అమ్మను ఉపాసించేవారికి శీఘ్రంగా గొప్ప కీర్తి లభిస్తుంది, ఆ కీర్తి అంతటా వ్యాపిస్తుంది అని 

అర్ధం.  

అర అంటే దేవమాత సంతానం అనే అర్ధం వేదంలో వున్నది. 

కనుక ఉత్-అర-కీర్తి అంటే, దేవతలకు మించిన కీర్తి కలది అని ఒక అర్ధం. 

ఆరుడు అంటే మంగళుడు. కనుక లలితాదేవిని స్తుతిస్తే, కుజ దోషములు పోతాయని విశ్వాసం. 

ఉత్-ఆ-అర-కీర్తి అని పదవిభజన చేస్తే, అంతటనూ వ్యాపించిన అమృత సరస్సు లాగా 

గొప్ప కీర్తి కలది అని అర్ధం. 

వేదములో, "పరబ్రహ్మను సగుణోపాసన చేసిన వారికి అపరాజితమనే నగరం లభిస్తుంది. 

ఆ నగరమే పరబ్రహ్మ నగరము. ఆ నగరంలో అర, ణ్యము అనే రెండు అమృతసరస్సులు

వున్నాయి. అవి సముద్రమంత విశాలమైనవి. ఆ అమృత సరస్సు లంత గొప్ప కీర్తి కలది 

ఉదారకీర్తి", అని చెప్పబడింది. 

సూర్యమండలంలో హిరణ్మయపురుషుడుంటాడు. 

ఆ హిరణ్మయపురుషునిలో 'అర' అనే దబ్బనం వంటి ఆయుధం ఉంచిన కీర్తి కలది పరమేశ్వరి. 

దాని వలన అమ్మకు హిరణ్మయపురుషుని కన్నా ఘనమైన కీర్తి కలిగింది. 

కనుక ఆ హిరణ్మయపురుషునికి దుఃఖం కలిగించేంత ఉత్కృష్టమైన కీర్తి కలది అని ఒక అర్ధం. 

ఉదారకీర్తి అంటే, గొప్ప కీర్తి కలది, శీఘ్రముగా వ్యాపించే కీర్తి కలది, దేవతల కన్నా ఎక్కువ కీర్తి 

కలది, కుజ దోషములు పోగొట్టునది అనే కీర్తి కలది, అపరాజితా నగరంలో వున్న రెండు 

అమృతసరస్సుల కన్నా గొప్ప కీర్తి కలది, సూర్యమండలంలోని హిరణ్మయపురుషుడికి 

దుఃఖం కలిగించేటంత కీర్తి కలది, తన ఉపాసకులకు శీఘ్రముగా వ్యాపించే గొప్ప కీర్తిని ఇచ్చేది, 

వంటి అనేక అర్ధాలున్నాయి.  

శీఘ్రంగా వ్యాపించే ఉత్కృష్టమైన కీర్తి కల, ఆ ఉదారకీర్తి కి వందనం. 

ఓం శ్రీ ఉదారకీర్తయే నమః 


849. ఉద్దామవైభవా

దామము అంటే రజ్జువు, తాడు. దేనినైనా బంధించటానికి తాడును వాడతాం. 

ఆ తాడు మందాన్ని బట్టీ, పొడవును బట్టీ ఆ వస్తువు యొక్క పరిమాణాన్ని చెప్పగలం. 

అమ్మ వైభవం ఆ తాడును అతిక్రమించినది. 

అంటే కట్టులు కట్టలేనంత వైభవము కలది ఆ లలితాపరమేశ్వరి అని ఈ నామానికి అర్ధం. 

అమ్మ వైభవాన్ని చుట్టేటంత తాడు లేనే లేదు. అమ్మ వైభవాన్ని కట్ట కట్టి ఇంత అని చెప్పటం 

అసాధ్యం. అంతటి గొప్ప వైభవం కల తల్లి శ్రీలలిత. 

అందుకే అమ్మను ఈ నామంలో ఉద్దామవైభవా అంటున్నాం. 

బంధించే తాడు యొక్క కొలతలను అతిక్రమించేటంత విభవము కలది అని ఈ నామార్ధం. 

ఉత్కృష్టమైన విభవము కల, ఆ ఉద్దామవైభవ కు వందనం. 

ఓం శ్రీ ఉద్దామవైభవాయై నమః 


850. వర్ణరూపిణీ

వర్ణాలు అంటే అక్షరాలూ, రంగులు, జాతులు అనే అర్ధాలున్నాయి. 

సంస్కృతంలో యాభై అక్షరాలున్నాయి. క్షకారంతో కలిపితే అవి యాభై ఒకటి అక్షరాలు. 

ఆ వర్ణమాల లోని అక్షరముల స్వరూపమే వర్ణరూపిణీ అయిన పరమేశ్వరి. 

ఎన్ని అక్షరాలున్నాయో, అన్ని శబ్దాలున్నాయి, అన్ని రంగులున్నాయి. 

ప్రతి అక్షరానికీ ఓ రంగు వుంది. ఆ రంగులన్నీ శ్రీమాత స్వరూపాలే. 

శ్రీమాత ఆ వర్ణ స్వరూపిణి అని ఒక అర్ధం.   

పాణిని, మంత్రశాస్త్రంలో అక్షరముల సంఖ్య అరవై మూడు లేదా క్షకారంతో కలిపి అరవై నాలుగు,

అని చెప్పాడు. అమ్మ ఆ మంత్రశాస్త్రములు చెప్పిన బీజాక్షరముల స్వరూపిణి అని ఒక అర్ధం.  

వర్ణము అంటే, భగవద్గీతలో చెప్పిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే చాతుర్వర్ణాల వారు 

అనే అర్ధం కూడా వుంది. ఆ నాలుగు వర్ణాల వారూ కూడా నేనే అని అమ్మ ఈ నామంలో చెప్తోంది. 

"ఆ నాలుగు వర్ణాల వారూ నా స్వరూపమే. బ్రాహ్మణులు ముఖము, క్షత్రియులు భుజములు, 

వైశ్యులు ఊరువులు, శూద్రులు పాదములు", అని వేదములో పురుషసూక్తం చెప్తోంది. 

ఏ వర్ణము వారైనా అందరూ అమ్మ స్వరూపమే అని ఈ నామానికి అర్ధం. 

సమస్త వర్ణముల రూపమూ తానే అయిన, ఆ వర్ణరూపిణి కి వందనం. 

ఓం శ్రీ వర్ణరూపిణ్యై నమః 






------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి