12, డిసెంబర్ 2021, ఆదివారం

142. మిథ్యా జగదధిష్ఠానా, ముక్తిదా, ముక్తిరూపిణీ లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా

  

మిథ్యా జగదధిష్ఠానా, ముక్తిదా, ముక్తిరూపిణీ 
లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా ॥ 142 ॥

735. మిథ్యాజగదధిష్ఠానా

మిథ్య అంటే లేనిదాన్ని ఉన్నట్టుగా భావించటం. మిథ్య అంటే, అసత్యం, భ్రాంతి. 

జగత్తు మిథ్య. కానీ అందరూ ఈ మిథ్యా జగత్తును నిజమని భావించి ఈ మాయా మోహములో 

మునిగి వుంటారు. అసత్తు అయిన ఈ జగత్తును, సత్యముగా భ్రమింపచేస్తున్నది కనుక, 

అమ్మను ఈ నామంలో మిథ్యాజగదధిష్ఠానా అంటున్నాం. 

అద్వైతం "పరమాత్మ కంటే వేరైన జగత్తు ఏదీ లేదు. ఈ జగత్తంతా పరమాత్మ స్వరూపమే" అని

చెప్తుంది. అయినా, ఈ జగత్తు అనేది ఒకటి ఉందని నమ్మేదే మిథ్యావాదం.  

అద్వైతం "బ్రహ్మ సత్యం, జగన్మిథ్య" అని చెప్తుంది. 

తాడుని చూసి పాము అనుకోవడం కూడా ఇటువంటి భ్రాంతే. ఈ భ్రాంతులన్నీ కల్పించింది 

ఆ పరమేశ్వరి కనుక, ఈ మిథ్యాజగత్తుకి అధిష్టాన దేవత ఆ పరమేశ్వరియే. 

వేదములో,  "ద్వైతమంతయూ మాయే, యదార్ధము అద్వైతమే" అని చెప్పారు. 

దేవీభాగవతంలో, " కనిపించే జగత్తంతా ఆత్మే, ఆ ఆత్మే అన్నిటికన్నా సనాతనమైనది" అన్నారు. 

శ్రీమద్భాగవతంలో, "పరమాత్మ యొక్క త్రిగుణాత్మకమైన సృష్టి అంతా మిథ్యే" అని వుంది. 

వేదంలో, 'ఏకామేవాద్వితీయం బ్రహ్మ' అని వుంది. అంటే బ్రహ్మము అద్వితీయము, 

రెండవది అంటూ ఏదీ లేదు. ఉన్నదొక్కటే, అదే బ్రహ్మం అని అర్ధం. 

కనుక అంతా బ్రహ్మమే, పరమాత్మయే, ఇక ఇతరమంతా మిథ్యామాత్రము అని అర్ధం. 

ఈ మిథ్యాజగత్తుకి అధిష్టాన దేవత అయిన, ఆ మిథ్యాజగదధిష్ఠాన కు వందనం. 

ఓం శ్రీ  మిథ్యాజగదధిష్ఠానాయై నమః  


736. ముక్తిదా

ముక్తిని ఇచ్చేది ముక్తిదా. మోక్షమును  ఇచ్చేది మోక్షదాయిని అయిన ఆ లలితా పరమేశ్వరి. 

శ్రీకూర్మపురాణంలో, 'ముక్తిని కోరేవారు పార్వతీదేవిని ప్రార్ధించాలి. ఆ తల్లి అన్ని ప్రాణులలో 

అంతర్యామిగా ఉంటుంది. మంగళస్వరూపురాలు', అని వుంది. 

శివపురాణంలో, 'తన నామాలను అర్ధం తెలియకుండా పారాయణ చేసినా ముక్తి నిచ్చువాడు 

శివుడు. ముక్తి కన్నా పెద్ద కోరిక లేదు', అని చెప్పారు. 

నామాలకు అర్ధం తెలియకుండా పారాయణ చేస్తేనే ముక్తినిచ్చే దేవత, అర్ధం తెలిసి పారాయణ 

చేస్తే, ఇంకెంత తృప్తి చెందుతుందో కదా. 

బ్రహ్మాండపురాణంలో, 'విధివిధానంగా కానీ, మరొక విధంగా గానీ, ఆ పరాశక్తిని పూజించినవారు 

నిస్సంశయముగా మోక్షాన్ని పొందుతారు', అని చెప్పారు. 

దేవీ పూజాఫలితంగా మోక్షాన్నిచ్చే, ఆ ముక్తిద కు వందనం.  

ఓం శ్రీ ముక్తిదాయై నమః  


737.  ముక్తిరూపిణీ 

ఈ నామంలో 'మోక్షమే నా స్వరూపము' అని ఆ పరమేశ్వరి తెలియచేస్తోంది. 

కేవలము అవిద్యా నాశనమే మోక్షము అనుకోరాదు, ఎందుకంటే, మోక్షమంటే, ఆత్మానందం. 

ఏ బంధనములూ లేని స్థితి మోక్షము, ముక్తి. 

సౌరసంహితలో,"జ్ఞానమొక్కటే మోక్షకారణము కాదు. జ్ఞానము వలన స్వాత్మానందం 

కలుగుతుంది. దేనివలన ఆత్మానుభూతి కలుగుతుందో, అది ముక్తికి కారణమవుతోంది. 

సచ్చిదానంద స్వరూపుడైన ఆ పరమాత్మ, ఆత్మ స్వరూపుడు కనుక, ఆ ఆత్మానందమే మోక్షము" 

అని చెప్పబడింది. ఆనందస్వరూపమే మోక్షము. 

మోక్షమే స్వరూపముగా కల, ఆ  ముక్తిరూపిణి కి వందనం. 

ఓం శ్రీ  ముక్తిరూపిణ్యై నమః  


738. లాస్యప్రియా

లాస్యమంటే నృత్యవిశేషము. లాస్యాన్ని ఇష్టపడునది కనుక, 

అమ్మను ఈ నామంలో లాస్యప్రియా అంటున్నాం. 

నటరాజుతో కలిసి అమ్మ నటేశ్వరీ రూపంలో నృత్యం చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. 

అమ్మకు నర్తనం అంటే ఇష్టం. అందునా శివునితో చేరి నృత్యం చేయటం మరింత ఇష్టం. 

కళలో లీనమయి నృత్యం చేస్తుంటే, కలిగే ఆత్మానందానుభూతే మోక్షానికి మార్గము. 

ఆ విధంగా నర్తనమంటే, ప్రేమగా, ఇష్టంగా, భక్తిగా, ఆ నాట్యంలో లీనమయి నృత్యం చేసేవారిని 

ప్రీతిగా చూస్తుంది, ఆ లాస్యప్రియా అయిన అమ్మ. 

లాస్యమంటే మక్కువ కల, ఆ లాస్యప్రియ కు వందనం. 

ఓం శ్రీ లాస్యప్రియాయై నమః   


739. లయకరీ

లయింపచేయునది లయకరీ. చిత్తాన్ని పూర్తిగా తమ కళ మీద ఉంచి, దానిలో 

లయమైపోయి,  కళాప్రదర్శన చేసేవారంటే అమ్మకు ఇష్టం. 

ఏ పని చేసినా, ఆ పని మీద, ఆ వృత్తి మీద సంపూర్ణమైన శ్రద్ధా భక్తులతో ఉండేవారంటే 

అమ్మ ఇష్టపడుతుంది. 

ఆ ప్రదర్శనా సమయంలో ఆ కళలో లీనమై, దానిలో లయించిపోయేవారంటే, ఆ తల్లికి ప్రీతి. 

కొంతమంది కళాకారులు ప్రదర్శనా సమయం లోనే, ఆ పరమాత్మలో లీనమయిపోవటం చూస్తూ 

ఉంటాం. పది ధ్యానములతో సమానమయినది లయము. అంత ఏకాగ్రతతో కళను సేవించుకునే

వారిని అమ్మ తన లోనికి లయం చేసుకుంటుంది. సంపూర్ణంగా తమ కళలో లీనమై పోయి, 

గాయకులు గానం చేస్తున్నా, నర్తకులు నృత్యం చేస్తున్నా, శిల్పకారులు శిల్పాలను చెక్కుతున్నా, 

గురువులు శిష్యులకు బోధను చేస్తున్నా, రచయితలు  రచనలు చేస్తున్నా, అంతా ఆ అమ్మ 

పూజతో సమానం. ఇవి అన్నీ కూడా ఆత్మానందాన్ని కలుగచేస్తాయి కనుక, ఇవి కూడా శ్రీవిద్యయే. 

"ఏ ఫలమూ ఆశించకుండా, ఏ పని అయితే, కేవలము ఆత్మానందం కోసమే  చేస్తామో, అదే

శ్రీవిద్య" అని జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అనేవారు. 

ఆనందం పొందుతూ, చేసే పనిలో లయమై పోయి ఉండేవారిని ఇష్టపడే, ఆ లయకరి కి వందనం. 

ఓం శ్రీ లయకర్యై నమః 


740. లజ్జా

లజ్జాస్వరూపురాలు ఆ లలితాపరమేశ్వరి. హ్రీమ్ బీజ స్వరూపురాలు. 

మార్కండేయ పురాణంలో, దేవీ స్తుతిలో, 'యా దేవీ సర్వభూతేషు, లజ్జా రూపేణా సంస్థితా, 

నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై, నమోనమః' అని వుంది. 

ప్రాణులన్నిటిలో ఆ పరమేశ్వరీదేవి లజ్జా రూపంలో ఉంటుంది. 

రేణుక, ఏకవీరికా, ఎల్లమ్మ, మాతంగి, జోగులాంబ అనే పేర్లతో పిలువబడే దేవతే లజ్జాగౌరి. 

ఈ లజ్జాగౌరీ దేవత ప్రసవిస్తున్న మాతృమూర్తి భంగిమలో, నగ్నంగా ఉంటుంది. శిరస్సు ఉండదు. 

ఆ శిరస్సు స్థానంలో ఒక పూర్తిగా వికసించిన కమలం ఉంటుంది. 

అలా పూర్తిగా వికసించిన కమలం సహస్రారానికి సంకేతం. 

ఈ లజ్జాగౌరి భారతదేశంలోనే కాక, మరెన్నో ఇతరదేశాలలో కూడా పూజింపబడింది అనటానికి

గుర్తుగా ఎన్నో దేశాల్లో ఈ లజ్జాగౌరీ విగ్రహాలు దొరికాయి. 

తెలంగాణాలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో వున్న, జోగులాంబ ఆలయంలో, నేటికీ 

లజ్జాగౌరి విగ్రహం పూజలందుకుంటోంది. ఆ లలితా పరమేశ్వరిని జగత్ప్రసూత్యై అన్నాం కదా. 

పూర్తిగా చైతన్యస్వరూపంలో వికసిత కమలమే శిరస్సుగా, నగ్నంగా వుండి, 

ప్రసవిస్తున్న భంగిమలో ఉన్న మాతృమూర్తి యొక్క యోని రూపమే లజ్జాగౌరీ.  

ఈ రూపంలో వున్న లజ్జాగౌరీదేవిని 'లజ్జాయై  నమః', అనే నామంతో పూజిస్తే సంతానం లేనివారికి 

సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం. 

ప్రాణులన్నిటిలో లజ్జ రూపంలో ప్రకటితమవుతున్న, ఆ లజ్జ కు వందనం. 

ఓం శ్రీ లజ్జాయై  నమః 


741. రంభాదివందితా

రంభ మున్నగు అప్సర స్త్రీలచే పూజింపబడునది అని ఈ నామానికి అర్ధం. 

సముద్ర మథన సమయంలో అప్సరలు కూడా ఉద్భవించారు. 

సాగర మథనం జరుగుతున్నప్పుడు, కామధేనువు, కల్పవృక్షము, ధన్వంతరి, చంద్రుడు, 

శ్రీమహాలక్ష్మి, ఉచ్చైశ్రవం, ఐరావతం, కౌస్తుభం, పారిజాతవృక్షం, వారుణి(కల్లు), గరళం, 

అమృతం మొదలైన వాటితో పాటు ఈ రంభాది అప్సర లందరూ కూడా ఉద్భవించారు.  

ఈ అప్సరలు తపస్సు చేసుకునే తాపసుల ఇంద్రియ నిగ్రహాన్ని, ఇంద్రుని 

పర్యవేక్షణలో పరీక్షిస్తూ వుంటారు. వీరంతా ఇంద్రియ పరీక్షాధికారులు. 

ఈ అప్సరల చేత పూజింపబడుతోంది కనుక, అమ్మను రంభాదివందితా అంటున్నాం. 

రంభ మొదలైన అౘ్చరల చేత పూజింపబడు, ఆ రంభాదివందిత కు వందనం. 

ఓం శ్రీ రంభాదివందితాయై నమః 



------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి