ప్రత్యగ్రూపా, పరాకాశా, ప్రాణదా, ప్రాణరూపిణీ ॥ 149 ॥
777. వీరారాధ్యా
వీరేంద్రులు' అని వున్నది. ఇంద్రియములను నిగ్రహించు శక్తి కలవారు వీరేంద్రులు.
ఈ విషయాన్ని మహావీరేంద్రవరదా నామంలో కూడా చెప్పుకున్నాం.
నేను, నాది అనే అభిమానమును వీడిన వారిని వీరులని వేదం చెప్పింది.
నేను, నాది అనే దేహాభిమానము వీడిన వీరులచే పూజింపబడు, ఆ వీరారాధ్య కు వందనం.
ఓం శ్రీ వీరారాధ్యాయై నమః
778. విరాడ్రూపా
విరాడ్రూపా అంటే పెద్ద రూపము కలది. విశ్వరూప స్వరూపము. విరాట్ పురుష స్వరూపిణి.
సమస్త దేవతా స్వరూపము. విశ్వమంతా ఆవరించి వున్న తల్లి విశ్వరూపా.
మహతీ అనే నామంలో, విశ్వరూపా అనే నామంలో కూడా ఆ పరమేశ్వరి విరాడ్రూపాన్ని గురించి
చెప్పుకున్నాం. అమ్మకు పరిధులు, పరిమితులు లేవు. చెప్పలేనంత పెద్ద పరిమాణము కలది.
శ్రీమద్భాగవతంలో కూడా వామనావతార ఘట్టంలో వామనుడు త్రివిక్రముడుగా మారితే, ఆ రూపం
ఎలా దిగంతాలను దాటి ఎదిగిందో వ్యాసుడు వర్ణించాడు. పోతన కూడా సూర్యుడు మొదట్లో
ఛత్రముగా కనిపించినా, చివరకు త్రివిక్రముడికి పాదపీఠం అయ్యాడని అంటాడు.
విష్ణువుకు, శ్రీలలితకు అభేదము కనుక, ఆ ఉపమానాలన్నీ శ్రీలలితకూ వర్తిస్తాయి.
బ్రహ్మాండములన్నీ ఆక్రమించి ఎదిగిన, ఆ విరాడ్రూప కు వందనం.
ఓం శ్రీ విరాడ్రూపాయై నమః
779. విరజా
విరజా అంటే పాపములు లేనిది, రజస్సును విడచినది, లోకములను విడచినది అని అర్ధము.
బ్రహ్మాండపురాణంలో, "విరజాదేవి ఉత్కల దేశ మందున్న విరజా క్షేత్రాధిదేవత. బ్రహ్మ చేత
ప్రతిష్టింపబడినది. ఎవరైతే, ఈ క్షేత్రంలో విరజాదేవీ దర్శనం చేస్తారో, వారు తన కులములో
ఏడు తరముల వరకూ పవిత్రులని చేయుచున్నారు" అని వుంది.
ఈ క్షేత్రం ప్రస్తుతం ఒడిస్సాలో, జాజ్ పూర్ అని పిలువబడుతోంది. అక్కడ బ్రహ్మ కూడా ఒక
ఏకశిలా స్తంభంగా దర్శనమిస్తాడు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి.
శంకరాచార్యుడు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో 'ఓఢ్యాణే బిరజాదేవీ' అని చెప్పాడు.
రజోగుణమును విడిచిన, ఆ విరజ కు వందనం.
ఓం శ్రీ విరజసే నమః
ఓం శ్రీ విశ్వతోముఖ్యై నమః
781. ప్రత్యగ్రూపా
ప్రత్యగాత్మ స్వరూపురాలు. పరమాత్మకు ఎదురుగా వున్న స్వరూపమే ప్రత్యగ్రూపా.
ఇవి బింబ ప్రతిబింబాల వంటివి. బహిరింద్రియాలకు వ్యతిరేకముగా నడచునది ప్రత్యగ్రూపా.
ప్రతికూలమైన గతి కలది ప్రత్యగ్రూపా. ఇంద్రియాలు విషయోన్ముఖం కావటం బాహ్యదృష్టి.
అవే ఇంద్రియాలను నిగ్రహించి అంతఃదర్శనం చేస్తే అంతర్ముఖం, పరాన్ముఖం అవుతాయి.
ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని అంతఃదర్శనం చేస్తే, ఆత్మసాక్షాత్కారమవుతుంది.
ఆత్మస్వరూపమే పరమాత్మ, పరమేశ్వరి.
అంతరాత్మకు అభిముఖంగా వున్న స్వరూపము కల, ఆ ప్రత్యగ్రూప కు వందనం.
ఓం శ్రీ ప్రత్యగ్రూపాయై నమః
782. పరాకాశా
పరాకాశమంటే ఉత్కృష్టమైన ఆకాశము అని అర్ధం. సప్తసముద్రముల కావల వున్నది పరాకాశము.
బ్రహ్మాండాకాశ స్వరూపురాలు. పరాకాశము నిర్గుణము కనుక పరబ్రహ్మ స్వరూపము.
ఛాందోగ్యోపనిషత్తులో, ఆకాశమే అన్నిటికన్నా పెద్దది. అదే అన్నింటికీ ఆధారము, అని వుంది.
బ్రహ్మసూత్రములలో, పరాకాశమంటే పరబ్రహ్మమే అనీ, పంచభూతములలో ఒకటైన
భూతాకాశము కాదనీ చెప్పారు.
కూర్మపురాణంలో, "ఆ పరాశక్తియే ఆకాశరూపంలో వున్నది, సర్వ జగత్తులకూ కారణభూతురాలు,
సర్వాత్మకురాలు, అనాది యగు మహేశ్వరశక్తియే ఆకాశనామం ధరించి ప్రకాశిస్తోంది", అని వుంది.
ఈ పరాకాశమే బ్రహ్మాండమందూ, పిండాండమందూ కూడా వున్నది.
శిరస్సు నుంచి రెండు అంగుళాల పైన వున్న ఈ పరాకాశంలో పరబ్రహ్మ ప్రతిష్టితుడై వున్నాడు.
ఆ పరాకాశములో శ్రీలలిత ఎప్పుడూ షోడశ వర్ష కన్య వలె ఉంటుంది.
షోడశ నిత్యలలో ప్రతినిత్యా ఆ షోడశీ స్థానంలో ఒక్కొక్క సంవత్సరం ఉంటుంది.
విశ్వనిఘంటువులో ఆక అంటే పాపము, దుఃఖము అనే అర్ధాలున్నాయి.
పరాకాశా అంటే ఉత్కృష్టమైన పాపమును, దుఃఖమును నశింపచేయునది అని అర్ధం.
పరాకాశమంటే ఒక కష్టమైన వ్రతము అని కూడా అర్ధమున్నది.
కష్టమైన వ్రతము ద్వారా పొందునది పరమేశ్వరి అని అర్ధం.
సప్తసముద్రముల కావలనున్న, ఉత్కృష్టమైన, ఆకాశస్వరూపమైన, ఆ పరాకాశ కు వందనం.
ఓం శ్రీ పరాకాశాయై నమః
783. ప్రాణదా
ప్రాణదా అంటే ప్రాణమును ఇచ్చునది. లేదా ప్రాణములను స్వీకరించునది అని అర్ధం.
పంచప్రాణాలైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులను ఇచ్చునది అని భావం.
ఛాందోగ్యోపనిషత్తులో, "అన్ని ఇంద్రియాలకన్నా, మనసు కన్నా కూడా ప్రాణమే గొప్పది. ప్రాణము
లేకపోతే, జీవికి ఉనికి లేదు. ఒక్క ప్రాణమే పంచేంద్రియాలకు ఆధారమవుతున్నది"అని వున్నది.
కౌషీతక బ్రాహ్మణమందు, 'నేనే ప్రాణమును, నేనే ప్రజ్ఞను, నన్ను ఆయురమృతములుగా భావించి
ఉపాసించండి', అని వున్నది.
కనుక ప్రాణమే ప్రజ్ఞ, ప్రాణమే ఆయుష్షు, ప్రాణమే అమృతము.
జీవుని ఉనికికి సర్వాధారమైన ప్రాణమునిచ్చు, ఆ ప్రాణద కు వందనం.
ఓం శ్రీ ప్రాణదాయై నమః
784. ప్రాణరూపిణీ
ప్రాణరూపిణీ అంటే, ప్రాణాత్మ స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము.
ప్రాణము అంటే పరమాత్మ, ఇంద్రియము, బ్రహ్మము అని వేదములోను, బృహదారణ్యకంలోను
చెప్పారు. దేహములో ప్రాణాలు, ఉపప్రాణాలు అనే రెండు రకాల వాయువులు తిరుగుతూ
ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానవాయువులు ప్రాణాలైతే, నాగ, కూర్మ, కృకుర,
దేవదత్త, ధనంజయములు ఉపప్రాణాలు. ఇవి సంచరిస్తూ ఉండటం వల్లనే దేహములో
ప్రాణమున్నది అంటున్నాం. ఎప్పుడైతే ఈ వాయువుల సంచారం ఆగిపోతుందో,
దేహమునుంచి ప్రాణోత్క్రమణం జరుగుతుంది.
ఈ దశ ప్రాణములూ ఆ శ్రీమాత స్వరూపమే. అందుకే అమ్మను ప్రాణరూపిణీ అంటున్నాం.
దశవిధ వాయు రూపములలో జీవునిలో సంచరిస్తున్న, ఆ ప్రాణరూపిణి కి వందనం.
ఓం శ్రీ ప్రాణరూపిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి