31, డిసెంబర్ 2021, శుక్రవారం

161. కార్యకారణనిర్ముక్తా, కామకేళీతరంగితా కనత్కనకతాటంకా, లీలావిగ్రహధారిణీ

 

కార్యకారణనిర్ముక్తా, కామకేళీతరంగితా ।
కనత్కనకతాటంకా, లీలావిగ్రహధారిణీ ॥ 161 ॥

862. కార్యకారణనిర్ముక్తా

కార్యము, కారణము రెండూ లేనిది, రెండూ విడిచినది అని ఈ నామానికి అర్ధం. 

శ్రీలలితకు కార్యమూ, కారణమూ రెండూ కూడా ఉండవు. అన్నీ స్వభావ సిద్ధంగా, సహజంగా 

జరిగిపోతూ వుంటాయి. కార్యములు అంటే, మహత్తత్త్వము మొదలైనవి. వీటన్నింటి కంటే 

ఉత్కృష్టమైనది శ్రీలలిత. కనుక అమ్మకు కార్యములను ఆపాదించలేము. 

కారణము స్వయంగా మూలప్రకృతియే. లలితాదేవి మూలప్రకృతి కన్నా అతీతమైన చైతన్యము. 

కనుక కారణమునకు అమ్మ కట్టుబడదు.  

వేదములో, "పరమాత్మకు కార్యమూ, కారణమూ రెండూ లేవు" అని చెప్పారు. 

కనుక కార్యమూ, కారణమూ రెండింటికీ కట్టుబడనిది, ఆ రెండింటి చేతా విడువబడినది శ్రీలలిత.  

అందుకే ఈ నామంలో అమ్మను కార్యకారణనిర్ముక్తా అంటున్నాం. 

కార్యమూ, కారణమూ రెండింటికీ కట్టుబడని, ఆ కార్యకారణనిర్ముక్త కు వందనం. 

ఓం శ్రీ కార్యకారణనిర్ముక్తాయై నమః  


863. కామకేళీతరంగితా

కామకేళీతరంగితా అంటే కామునితో కేళిలో ఓలలాడునది అని అర్ధం. 

కామేశ్వరి, కామేశ్వరుడు ఇద్దరూ కలసి చేసే కామకేళియే పంచకృత్యాలు. 

సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము, ఈ పంచకృత్యాలనూ కామేశ్వరునితో కూడి 

ఉల్లాసంగా, ఒక క్రీడ వలె, ప్రీతిగా నడుపుతూ, హాయిగా ఆనందించునది మహాకామేశ్వరి. 

అందుకే అమ్మను ఈ నామంలో కామకేళీ తరంగితా అంటున్నాం. 

కామేశ్వరునితో విలాసంగా, కేళీతరంగాలలో ఓలలాడే, ఆ కామకేళీతరంగిత కు వందనం.  

ఓం శ్రీ కామకేళీతరంగితాయై నమః  


864.  కనత్కనకతాటంకా

కనత్ అంటే ప్రకాశించటం. కనక తాటంకా అంటే బంగారు చెవి కమ్మలు. 

ప్రకృష్టంగా ప్రకాశిస్తున్న, బంగరు కర్ణ భూషణాలు ధరించిన దానా అని ఈ నామార్ధం. 

తాటంకాలు అంటే తాటి ఆకులతో చేసిన ఆభరణాలు. ఒకప్పుడు సులభంగా దొరికిన చెట్ల 

ఆకులతో ఆభరణాలు చేసుకుని అవే ధరించేవారు. తరువాతి కాలంలో పసిడి, రజతము వంటి 

శ్రేష్ఠ లోహాలతో చేసిన నగలు ధరిస్తున్నా, ఆనాటి తాటంకము వంటి కొన్ని పాత పేర్లు అలాగే 

నిలిచిపోయాయి. అంతే కానీ అమ్మ తాటియాకులతో చేసిన కమ్మలు ధరించిందని అర్ధం కాదు. 

అమ్మ తాటంకాలు ఎంత మహత్తైనవంటే, స్వయంగా సూర్య చంద్రులే చంటిపిల్లల వలె అమ్మ  

చెవులకెక్కి కూర్చున్నారు. సృష్టిలో అమ్మ తరువాత అంతగా ప్రకాశించేది సూర్య చంద్రులే కదా. 

ఇక ఆ చెవి కమ్మల ప్రకాశం గురించి ఎంత చెప్పుకుంటే వర్ణించగలం. 

అసలే సూర్యుడు, చంద్రుడు, ఆపైన సువర్ణముతో చేసిన కనక తాటంకాలు, కనత్, అంటే 

కన్నులు మిరుమిట్లు గొల్పేలా మెరుస్తున్నాయి. ఆ కనక తాటంకాలు ధరించిన అమ్మను గురించి 

ఈ నామంలో చెప్పుకుంటున్నాం. 

మహత్తరంగా మెరుస్తున్న, బంగారు చెవికమ్మలు ధరించిన, ఆ కనత్కనకతాటంకా కు వందనం. 

ఓం శ్రీ కనత్కనకతాటంకాయై నమః  


865. లీలావిగ్రహధారిణీ

లీలగా, అవలీలగా, కేళిగా, విలాసంగా అనేక అవతారములను ధరిస్తున్నది లీలావిగ్రహధారిణీ. 

ముందే చెప్పుకున్నాం, సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ రూపంలో, స్థితిని సంరక్షిస్తున్నపుడు 

గోవిందుడు వలె, సంహారము చేసే సమయంలో రుద్రుడు వలె, తిరోధానము చెయ్యటానికి  

ఈశ్వరుని రూపంలో, అనుగ్రహము చూపించేటప్పుడు సదాశివునిగా, అమ్మ పంచకృత్యాలను 

చేస్తూనే వుంది. ఒకసారి మోహిని వలె, వేరొకసారి కాళీ వలె రూపము ధరిస్తుంది. 

విద్యా రూపమూ ఆ తల్లే, అందుకే దశమహావిద్యలూ ఆ లలితాపరాభట్టారికయే. 

అవసరమైతే అణువూ తానే, మహత్తూ తానే. లలితామహాశక్తి అనాయాసంగా, క్షణకాలంలో 

ఒక క్రీడగా, సర్వరూపములలో వ్యక్తమవుతుంది. అందుకే ఈ నామం వచ్చింది.  

యోగవాశిష్ఠంలో పద్ముడనే రాజు భార్య పేరు లీలాదేవి అని వుంది. ఆ లీలాదేవి స్వరూపమే 

శ్రీమాత అని కూడా ఒక అర్ధం. 

లీలగా అనేక అవతారములు ధరించు, ఆ లీలావిగ్రహధారిణి కి వందనం. 

ఓం శ్రీ లీలావిగ్రహధారిణ్యై నమః 

  




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి