అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥
866. అజా
'జ ' అంటే పుట్టుక, 'అజ' అంటే పుట్టుకే లేకపోవడం.ఓం శ్రీ అజాయై నమః
867. క్షయ వినిర్ముక్తా
అమ్మను అజా అన్నాము. అమ్మకు జననము లేదు. జననము లేనప్పుడు మరణమూ లేదు కదా.
కనుక క్షయమూ లేదు. జననమే కాదు, మరణము చేత కూడా విడువబడింది కనుక, శ్రీలలితను
ఈ నామంలో క్షయవినిర్ముక్తా అంటున్నాం.
దేవీ భక్తులు, ముముక్షువులై, గృహత్యాగము చేసి, సన్న్యాసులై ఎక్కడికో పోనవసరం లేదు.
వారికి వారి వారి గృహములందే మోక్షాన్ని ఇస్తాను అని అమ్మ చెప్తున్నది.
భాస్కరరాయలు శివస్తుతిలో, 'త్రిపురసుందరీ దేవీ ఉపాసకులు గృహము నందే మోక్షము
పొందగలరు. గృహపరిత్యాగము, సన్న్యాసాశ్రమము అవసరం లేదు. శివ స్మరణ నిత్యమూ
మనసులో ఉంటే పరమపదమును పొందగలరు,' అని చెప్పారు.
లలితా ఉపాసకులు శ్రీ భాస్కరరాయలవారు, బాలా ఉపాసకులు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ
శాస్త్రిగారు సన్న్యసించకనే, గృహస్థాశ్రమములో వున్నప్పుడే శివసాయుజ్యాన్ని పొందారు కదా.
తన ఉపాసకులకు వారి గృహమందే శివసాయుజ్యపదమును అనుగ్రహిస్తున్న,
ఆ క్షయ వినిర్ముక్త కు వందనం.
ఓం శ్రీ క్షయ వినిర్ముక్తాయై నమః
868. ముగ్ధా
ముగ్ధా అంటే నిఘంటువులో సుందరుడు, మూఢుడు, సౌమ్యుడు అనే అర్ధాలున్నాయి.
ఈ నామంలో ముగ్ధా అంటే సౌందర్యవతి అని అర్ధం. అమ్మ కన్నా సౌందర్యవంతులెవరు.
ఎన్నో నామాలలో ఆ శ్రీలలిత సౌందార్యాతిశయం గురించి చెప్పుకున్నాం.
అద్భుతమైన, నిరుపమ లావణ్యరాశి అయిన, అమ్మను ఈ నామంలో ముగ్ధా అంటున్నాం.
అమ్మ తన భక్తుల పట్ల సౌమ్య స్వభావం కలిగి ఉంటుంది కనుక, ముగ్ధా అనే నామం కలిగింది.
ఈ నామాన్ని, అముగ్ధా అని భావిస్తే మూఢులను భక్తులుగా లేనిది అని అర్ధం వస్తుంది.
అమ్మ భక్తులైన వారికి, అమ్మ జ్ఞానదాయినీ కదా, ఇంకా మూఢత్వానికి తావేదీ.
మూఢులను భక్తులుగా లేనిది కనుక, అముగ్ధా అని పిలువబడుతోంది.
అందమైన అమ్మ, ఆ ముగ్ధ కు వందనం.
ఓం శ్రీ ముగ్ధాయై నమః
ఓం శ్రీ క్షిప్రప్రసాదిన్యై నమః
870. అంతర్ముఖ సమారాధ్యా
అంతర్ముఖుడు అంటే ఆత్మానందాన్ని పొందినవాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు, ఆధ్యాత్మిక
చింతన కలవాడు, యోగి.
నివురు కప్పిన నిప్పు వలె, బయటికి మామూలుగా కనపడుతూ వున్నా, లోనున్న పరమాత్మతో
నిత్యమూ రమించేవాడు అంతర్ముఖుడు.
అంతర్ముఖులు కేవలము ఆత్మ యందు మాత్రమే ఆసక్తి చూపుతూ వుంటారు.
అటువంటి అంతర్ముఖుల చేత సమ్యక్, అంటే చక్కగా, ఆరాధన చేయబడునది కనుక, అమ్మను
ఈ నామంలో అంతర్ముఖ సమారాధ్యా అంటున్నాం.
బ్రహ్మజ్ఞానాన్ని పొందిన యోగులచే ఆరాధింపబడే, ఆ అంతర్ముఖ సమారాధ్య కు వందనం.
ఓం శ్రీ అంతర్ముఖ సమారాధ్యాయై నమః
871. బహిర్ముఖ సుదుర్లభా
బహిర్ముఖ సుదుర్లభా అంటే బహిర్ముఖులకు పూర్తిగా దుర్లభురాలు, తేలికగా వారికి చిక్కదు అని
అర్ధం. పై నామంలో అంతర్ముఖులంటే ఎవరో చెప్పుకున్నాం. వారికి విరుద్ధంగా విషయవాసనల
పట్ల మిక్కిలి ఆసక్తి చూపించేవారు బహిర్ముఖులు. ప్రాపంచిక వాసనల మధ్య జీవించేవారు.
సౌందర్యలహరిలో కూడా ఆదిశంకరుడు, "తరళకరణులకు నువ్వు దొరకవమ్మా",అంటాడు.
తరళకరణులు అంటే, ఇంద్రియ నిగ్రహం లేనివారు, చంచలేంద్రియులు.
ప్రాపంచిక వ్యవహారముల పట్ల ఆసక్తి కలవారికి పొందుటకు కష్టసాధ్యమైన,
ఆ బహిర్ముఖ సుదుర్లభ కు వందనం.
ఓం శ్రీ బహిర్ముఖ సుదుర్లభాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి