విశ్వం అంటే విష్ణువు కూడా. విశ్వమాత అంటే విష్ణుమాత అని కూడా అర్ధం.
వేదములో, విష్ణువును కన్నతల్లి అని స్పష్టంగా చెప్పారు. ఈ శ్రీమాత అదితీ తానే, దితీ తానే.
ఓం శ్రీ విశ్వమాత్రే నమః
935. జగద్ధాత్రీ
జగత్తులనన్నీ ధరించినది కనుక, ఈ నామంలో జగద్ధాత్రీ అని అంటున్నాం.
ధాత్రి అంటే దాది అంటే పెంపుడు తల్లి వలె లోకాలను పోషించునది అని అర్ధం.
కాణ్వశ్రుతిలో, "పరమాత్మ లోకాలన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోకుండా, ఒక సేతువు వలె,
అడ్డుగోడగా ఈ లోకములనన్నీ ధరిస్తున్నాడు", అని చెప్పారు.
దేవీపురాణంలో, జగత్తులను ధరించుట వలన, జగత్తులలో జీవనము కల్పించుట వలన,
పండితులు ఈ తల్లిని జగద్ధాత్రీ అంటున్నారు, అని వుంది.
ధాత్రీ అంటే భూమి, జగత్తులన్నింటికీ భూమి వలె ఆధారభూతమైనది కనుక, లలితాపరమేశ్వరి
ఈ నామంలో జగద్ధాత్రీ అనబడుతోంది.
జగత్తులనన్నీ దాది వలె సాకుతున్న, ఆ జగద్ధాత్రీ కి వందనం.
936. విశాలాక్షీ
విశాలమైన కన్నులు కలది విశాలాక్షీ. అమ్మ కన్నుల గురించి ఎన్నో నామాలలో చెప్పుకున్నాం.
ఆకర్ణాంతమూ విశాలంగా వుంటాయని ఈ నామంలో విశాలాక్షీ అంటున్నాం.
ఆ కళ్ళకు ఎన్ని ఉపమానాలో, దరాందోళిత దీర్ఘాక్షీ, మదఘూర్ణితరక్తాక్షీ, మృగాక్షీ, మీనాక్షీ,
సహస్రాక్షీ, రాజీవలోచనా, వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభాలోచనా, పద్మనయనా, త్రినయనీ,
వామనాయనా ఇలా ఎన్నో నామాలలో అమ్మ కళ్ళ గురించి చెప్పుకున్నాం.
విశ్వాన్నంతా గమనిస్తూ ఉండాలి కనుక, అమ్మకు విశాలనయనాలు వున్నాయి.
అష్టాదశ శక్తి పీఠాలలో వారణాసి లోని దేవత విశాలాక్షి. విశాలాక్షిగా బిడ్డల అవసరాలు గ్రహించి,
అన్నపూర్ణగా ఆకలి తీరుస్తూ ఉంటుంది.
నేటి నేపాల్ ప్రాంతానికి ఒకప్పుడు విశాలనగరమనే పేరు ఉండేది. ఆ విశాలపీఠమే నేత్ర స్థానమై
వున్నది అని ఒక అర్ధం.
హిమాలయాలలోని బదరికారణ్యానికి కూడా విశాల అనే పేరుంది. అక్కడ అక్షిస్థానము కల దేవత
అని కూడా భావం. బదరీ నారాయణుడిని బదరీ విశాల్ అని కూడా పిలుస్తారు.
జగత్తులనన్నీ వీక్షించటానికి ఆకర్ణాంతదీర్ఘనయనాలు కల, ఆ విశాలాక్షి కి వందనం.
937. విరాగిణీ
దేని యందూ రాగము కానీ, ద్వేషము కానీ లేనిది విరాగిణీ. వైరాగ్యము కలది విరాగిణీ.
ఏ కోరికలూ లేనిది నీరాగా, ఏ రాగానుబంధనములూ లేనిది అని అర్ధం.
దానవులనూ, మానవులనూ, దేవతలనూ, తిర్యక్కులనూ కూడా సమానంగా చూసేదే శ్రీమాత.
ఏ ఒక్కరి పట్లా ప్రత్యేకంగా అనురాగము లేనిది కనుక, విరాగిణీ అంటున్నాం.
ఏ విషయవాంఛలూ లేని అరిషడ్వర్గాలను జయించినవారిని సర్వసంగపరిత్యాగులు, విరాగులు
అంటాం. లలితాపరాభట్టారిక గుణాతీత, గుణరహిత, నిర్గుణ, నిర్మమ, నిరహంకార, నిష్కామా,
నిష్క్రోధా, నిర్లోభా, నిర్మోహా, నిర్మదా కనుక ఈ నామం వచ్చింది.
ఏ రాగమూ లేని, ఆ విరాగిణి కి వందనం.
ఓం శ్రీ విరాగిణ్యై నమః
938. ప్రగల్భా
ప్రతిభాన్వితులను ప్రగల్భా అంటారు. సృష్టి నిర్వహణ మొదలైన కర్మల యందు అసమాన
ప్రతిభ కలది కనుక, పరమేశ్వరి ఈ నామం వచ్చింది.
నేర్పరి అయిన ప్రౌఢను కూడా ప్రగల్భా అంటాం.
అమ్మ ప్రతిభా, నేర్పూ అనన్య సామాన్యమైనవి. పంచకృత్యాలను అవలీలగా నిర్వహించే
నైపుణ్యము కలది కనుక, ఆ పరమేశ్వరి ప్రగల్భా అనబడుతోంది.
దుష్ట శిక్షణలో, శిష్టరక్షణలో సాటిలేని కౌశలము కలది అని అర్ధం.
బ్రహ్మాండములన్నీ ప్రతిభాన్వితముగా నడిపించు, ఆ ప్రగల్భ కు వందనం.
ఓం శ్రీ ప్రగల్భాయై నమః
939. పరమోదారా
పరమ ఉదారతను చూపునది పరమోదారా. మహత్తైన ఉదారతను కలిగినది పరమోదారా.
ఉదారత అంటే నిఘంటువులో దాత, గొప్పవాడు అని అర్ధాలు చెప్పారు.
అసమాన దాతృత్వమును చూపునది పరమోదారా. తన భక్తులకు ఉదారంగా అడిగినవన్నీ
ఇచ్చునది పరమోదారా.
ఎవరైతే ఈ లలితా సహస్రనామస్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠిస్తారో, వారికి అన్ని కోరికలూ
నిస్సంశయంగా నెరవేరుస్తానని అమ్మ ఉదారమైన మనస్సుతో ప్రకటించింది.
అందుకే అమ్మను పరమోదారా అంటున్నాం.
పర-శ్రేష్టమైన, మోద-ఆనందాన్ని, రా-ఇచ్చునది అని ఒక అర్ధం.
అనంతమైన సంసారసముద్రమును నాశము చేసి ఉద్ధరించునది అనే భావం కూడా వుంది.
అప, రమా, ఉదార అంటే అప రమా అంటే లక్ష్మి లేని దరిద్రులకు ఐశ్వర్యమును ఇచ్చునది
అని భావం. వేదములో, ఆకాశమంతా నిండినవాడు, నిత్యుడు అని అర్ధం చెప్పారు.
పరమోత్కృష్టమైన ఉదారతను కలిగిన, ఆ పరమోదారా కు వందనం.
ఓం శ్రీ పరమోదారాయై నమః
940. పరామోదా
పరమైన, అంటే ఉత్కృష్టమైన మోదమును కలిగినది అని అర్ధం.
ఆమోదం అంటే పరిమళము, కీర్తి అని అర్ధాలు కూడా వున్నాయి
పరామోదా అంటే అంతటా విశేషంగా వ్యాపించిన కీర్తి కలది అని ఒక అర్ధం.
పరామోదా అంటే దివ్యమైన పరిమళాన్ని విస్తారముగా వ్యాపనము చేయునది అని అర్ధం.
ఈ విశేషం గురించి కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా అనే నామంలో కూడా చెప్పుకున్నాం.
తన దివ్య గంధ పరిమళాన్ని దశదిశలా వ్యాప్తి చేయునది అని అర్ధం.
అమ్మ తన ఘనమైన కీర్తినీ, ప్రకృష్టమైన సంతోషాన్నీ, దివ్యమైన పరిమళాన్నీ అన్నివైపులా
ప్రసరింపచేస్తోంది అని ఈ నామ భావం.
ఉత్కృష్టమైన మోదమును కలిగిన, ఆ పరామోదా కు వందనం.
ఓం శ్రీ పరామోదాయై నమః
941. మనోమయీ
మనఃస్వరూపురాలు మనోమయీ.
శుద్ధబ్రహ్మను ఉపాసించటానికి మనస్సు ప్రధానము కనుక, ఆ మనస్సునే తన్మయముగా
చేసుకున్నది మనోమయీ. మనస్సులో సంకల్పములను పుట్టించునది మనోమయీ.
వాశిష్ఠ రామాయణంలో, భైరవుడే చిదాకాశము, దానికే శివుడని పేరు. ఆ శివుని యొక్క స్పందన
శక్తియే మనోమయీ, అని చెప్పారు.
వేదంలో, జ్ఞానమును పొందాలంటే మనస్సే ప్రధానం, అని చెప్పారు.
జ్ఞానం పొందటానికి ఆధారమైన మనఃస్వరూపురాలు, ఆ మనోమయీ కి వందనం.
ఓం శ్రీ మనోమయ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి