శ్రీలలితా దివ్య రహస్య సాహస్ర నామ స్తోత్ర ఫలశ్రుతి
ఉత్తరపీఠిక
సింధూరారుణ విగ్రహామ్ త్రినయనామ్ మాణిక్య మౌళిస్ఫురత్
తారానాయక శేఖరామ్ స్మితముఖీమ్ ఆపీన వక్షోరుహామ్
పాణిభ్యామ్ అలిపూర్ణ రత్నచషకమ్ రక్తోత్పలమ్ బిభ్రతీమ్
సౌమ్యామ్ రత్నఘటస్థ రక్తచరణామ్ ధ్యాయేత్ పరామ్ అంబికామ్
తారానాయక శేఖరామ్ స్మితముఖీమ్ ఆపీన వక్షోరుహామ్
పాణిభ్యామ్ అలిపూర్ణ రత్నచషకమ్ రక్తోత్పలమ్ బిభ్రతీమ్
సౌమ్యామ్ రత్నఘటస్థ రక్తచరణామ్ ధ్యాయేత్ పరామ్ అంబికామ్
ఈ స్తోత్ర పఠనం, లేదా పారాయణం విశేష ఫలితాలనిస్తుంది. తెలిసి చేసినా, తెలియక చేసినా
ఫలితాలను ఇస్తుంది. అందుకే శ్రీలలిత ఈ స్తోత్రాన్ని శఠులకు, దుర్మార్గులకు, కుతర్కం చేసే
వారికి చెప్పకూడదని ఆంక్ష పెట్టింది. ఒక్క నామం శ్రద్ధాభక్తులతో పఠించినా, పాపాలు హరించి
కోరికలు తీరుస్తుంది. ఈ స్తోత్రాన్ని పఠిస్తే, కలిగే ఫలితాల గురించి ఉత్తరపీఠికలో చాలా విపులంగా
చెప్పారు. నేను వీలైనంత సులువుగా ఆ ఫలశ్రుతి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.
ఈ శ్రీ లలితా దివ్య రహస్య సహస్ర నామ స్తోత్రం పారాయణ చేస్తే,
సర్వ రోగాలూ శమిస్తాయి. సంపదలు వృద్ధి చెందుతాయి. అపమృత్యువును, కాలమృత్యువును
కూడా నివారిస్తుంది. అన్నిరకాల జ్వరాలను తగ్గించి ఆయుష్షును పెంచుతుంది.
పుత్రులు లేని వారికి పుత్రులను ఇస్తుంది. ధర్మార్ధకామమోక్షాలను ప్రసాదిస్తుంది.
కోటి జన్మల పాటు గంగాస్నానం చేసిన ఫలము, కాశీ క్షేత్రంలో కోటి శివలింగాల ప్రతిష్ట చేసిన
ఫలము లభిస్తుంది.
కురుక్షేత్రంలో శ్రోత్రియులకు కోటిసార్లు సువర్ణదానం చేసిన ఫలితం కలుగుతుంది.
గంగ ఒడ్డున కోటి అశ్వమేథయాగాలు చేసిన ఫలితం కలుగుతుంది.
నిర్జలమైన ఎడారి ప్రాంతాలలో కోటి నీటి బావులు తవ్వించిన పుణ్యం వస్తుంది.
కరువు కాలంలో కోటిమంది బ్రాహ్మణులకు వెయ్యేళ్ళు భోజనం పెట్టిన పుణ్యం దక్కుతుంది.
నిత్య కర్మానుష్ఠానములు చేయని పాపము, నిషేధములైన పనులు చేసిన పాపము నశిస్తుంది.
నిత్యమూ ఈ పారాయణ చేసే వారికి లలితాదేవి ప్రీతితో వారి అభీష్టములు తీరుస్తుంది.
నిత్యమూ చేయలేని నాడు, కనీసము జన్మదినము నాడు, ఇతర ముఖ్య దినాల్లో, కర్కాటక, మకర,
మేష, తులా సంక్రమణ కాలాల్లో చేయాలి.
శుక్ల పక్షము నందు వచ్చే నవమి, చతుర్దశి, లేదా శుక్రవారం నాడు పారాయణ చేయాలి.
పౌర్ణమి నాడు చంద్రబింబంలో లలితాంబికను పంచోపచారాలతో సేవించి, పారాయణ చేయాలి.
బాధితుని తలపై చేయి వేసి, ఈ నామాలను పఠిస్తే, జ్వరము, తలనొప్పి తగ్గిపోతాయి.
భస్మం చేతిలో వుంచుకుని పారాయణం చేసి, ఆ భస్మాన్ని ధరిస్తే సకలవ్యాధులూ శమిస్తాయి.
ఒకరి కొరకు మరొకరు కూడా ఈ ప్రయోగాలు చేయవచ్చు.
ఈ నామాలతో నీటిని మంత్రించి గ్రహదోష బాధితుడికి అభిషేకం చేస్తే, గ్రహదోషాలు పోతాయి.
ఈ నామాలతో నవనీతం మంత్రించి ఇస్తే, సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది.
రాజగృహం వైపుకు తిరిగి, లలితాంబికను ధ్యానిస్తూ, మూడు రాత్రింబవళ్ళు పారాయణ చేస్తే
రాజానుగ్రహం కలుగుతుంది.
ఈ నామాలను పారాయణ చేస్తున్న వారి తేజస్సు పెరిగి లోకములన్నీ గౌరవిస్తాయి.
వీరి శత్రువులను శివుడు శరభేశ్వర రూపంలో సంహరిస్తాడు. శత్రుభయం ఉండదు అని అర్ధం.
ఎవరైనా వీరిపై క్షుద్ర ప్రయోగము చేస్తే, ప్రత్యంగిరా దేవత మహిమచే, ఆ ప్రయోగం చేసినవారికే
ఆ కీడు మళ్ళుతుంది.
వీరిని క్రూరదృష్టితో చూస్తే, మార్తాండభైరవుడు వారిని అంధులుగా చేస్తాడు.
వీరి ధనం దొంగిలిస్తే, క్షేత్రపాలకుడు వారిని శిక్షిస్తాడు.
వీరితో వితండ వాదం చేస్తే, నకులీశ్వరి వారికి వాక్స్తంభనం చేస్తుంది.
రాజు వీరిని దండించాలని, హాని చేయాలని చూస్తే, దండినీదేవి స్వయంగా ఆ రాజును, ఆ రాజు
సేననూ సంహరిస్తుంది.
ఆరుమాసములు శ్రద్ధగా నిత్యమూ పఠిస్తే, లక్ష్మీదేవి ఆ ఇంట స్థిరముగా ఉంటుంది.
ఒక్క మాసము, దినమునకు మూడు సార్లు పఠిస్తే, సరస్వతీ దేవి ఆ నాలుకపై నాట్యం చేస్తుంది.
నిద్ర, బద్ధకం మాని, ఒక పక్షం, ప్రతిదినమూ ఈ పారాయణ చేస్తే వశీకరణశక్తి కలుగుతుంది.
జీవితకాలం ఈ పారాయణ చేసే వారిని, ఒక్కసారి చూచిన వారి పాపాలు కూడా నశిస్తాయి.
లలితా సహస్రనామ పారాయణ చేసేవారు లలితాదేవికి ప్రీతి కనుక, వీరికి ఇచ్చే దానాలు అమ్మకు
ప్రీతిని కలిగిస్తాయి. లలితోపాసకులు లలితోపాసకులకే దానం ఇవ్వటం శ్రేష్టం.
విద్యలలో శ్రీవిద్య, దేవతలలో శ్రీలలిత, స్తోత్రాలలో శ్రీలలితాసహస్రనామస్తోత్రము ఉత్తమమైనవి.
ఈ నామములను పుస్తకంలో వ్రాసి, లలితాదేవిని పూజిస్తే, ఆ త్రిపురసుందరి సంతోషిస్తుంది.
శ్రీచక్రమును సహస్రనామాలతో, పద్మములు, తులసీదళములు, గులాబీరంగు కలువపూలు,
కదంబపుష్పాలు, సంపెంగలు, మాలతీ, మల్లె, గన్నేరు, నీలి కలువలు, బిల్వపత్రాలు, మొల్లలు,
పొగడలు, పున్నాగలు, పాటలీపుష్పాలు, మొగలి, గురివిందలతో కానీ, సుగంధ భరితమైన జాజి,
విరజాజి వంటి పుష్పాలతో కానీ అర్చిస్తే, వారి పుణ్యఫలాన్ని లెక్కించుటకు పరమేశ్వరుడికి కూడా
శక్యము కాదు.
ఎవరైతే పున్నమినాటి రాత్రి ఈ విధంగా శ్రీచక్రాన్ని అర్చిస్తారో, వారు స్వయంగా లలితా స్వరూప
సమానులు అవుతారు. మహానవమి నాడు అర్చిస్తే మోక్షము కలుగుతుంది.
శుక్రవారం నాడు ఈ విధంగా అర్చించిన వారు పుత్రులు, పౌత్రులను కలిగి, సకల భోగములూ
అనుభవించి, మరణించిన తరువాత లలితా సాయుజ్యాన్ని పొందుతారు. ఇది నిస్సంశయము.
వెయ్యిమంది ఉపాసకులైన వారిని పూజించి, షడ్రసోపేతమైన భోజనాన్ని పెడితే లలితాదేవి
వారికి తన లలితా సామ్రాజ్యమునే ఇచ్చేస్తుంది.
ఎవరైతే నిష్కామంగా, ఏ కోరికా లేకుండా లలితా సహస్రనామ పారాయణము చేస్తారో, వారికి
సంసార బంధనములు తొలగిపోయి, బ్రహ్మజ్ఞానం లభిస్తుంది.
ధనార్థికి ధనమూ, కీర్తిని కోరుకున్న వారికి కీర్తీ, విద్యను కోరుకున్న వారికి విద్యా లభిస్తుంది.
భోగ మోక్షములు కోరేవారు ఈ లలితా సహస్రనామ పారాయణము చేస్తే అవి రెండూ లభిస్తాయి.
నాలుగు ఆశ్రమములవారూ, నిత్యానుష్టానంలో ఏదైనా లోపం జరిగితే, ఈ పారాయణ చేయవచ్చు.
ఈ కలియుగములో ముక్తి కలగాలంటే లలితా సహస్రనామ పారాయణమే శరణ్యము.
వెయ్యి విష్ణు నామాల కన్నా, ఒక్క శివనామం, వెయ్యి శివ నామాల కన్నా ఒక్క లలితానామం శ్రేష్టం.
గంగా, భవానీ, గాయత్రీ, కాళీ, లక్ష్మీ, సరస్వతీ, రాజరాజేశ్వరీ, బాలా, శ్యామలా, లలితా వంటి పది
మంది దేవతల సహస్రనామస్తోత్రములు ముఖ్యమైనవి అని చెప్తారు. కానీ ఈ పది సహస్రనామ
స్తోత్రములలో ఈ శ్రీ లలితా దివ్య రహస్య సహస్ర నామ స్తోత్రం అత్యంత ప్రశస్తమయినది.
ఎవరైనా ఈ లలితానామాలు కేవలం ఆ లలితాదేవి ప్రేరణ వలన మాత్రమే చెప్పగలుగుతారు.
హయగ్రీవుడు అగస్త్యునితో, ఈ పూర్వపీఠిక, సహస్రనామస్తోత్రం, ఉత్తరపీఠికలను ఆనందముతో
పులకితుడై చెప్పాడు, అని సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.
వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన స్తోత్రాన్ని, హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పాడు. భాస్కరరాయలవారు
అమ్మ ఆదేశంతో, భాష్యం వ్రాసారు. నేను నా శక్తి మేరకు సరళ భాషలో చెప్పే ప్రయత్నం చేశాను.
ధర్మస్య జయోస్తు! అధర్మస్య నాశోస్తు!
ప్రాణిషు సద్భావనాస్తు! విశ్వస్య కళ్యాణమస్తు!
ఓం శాంతిః శాంతిః శాంతిః
మంగళం మహత్
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Congratulations Vijaya. Goddess Lalitha will always be with you .Stay blessed.
రిప్లయితొలగించండిThank you akkaa.
రిప్లయితొలగించండిBy 22 Jan 22 all slokas willbe published,by the grace of Maa Lalita.