యజ్ఞప్రియా, యజ్ఞకర్త్రీ, యజమాన స్వరూపిణీ ॥ 164 ॥
880. సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా
ఓం శ్రీ సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితాయై నమః
881. యజ్ఞప్రియా
యజ్ఞము లంటే ప్రీతి కలిగినది యజ్ఞప్రియా.
యజ్ఞమంటే విష్ణువు. విష్ణువుకున్న నామాలలో ఇదీ ఒకటి.
కనుక విష్ణువంటే ఇష్టమైనది అని కూడా ఒక భావం.
అమ్మవారు అన్ని రకములైన యజ్ఞములు, యాగములు అంటే ప్రీతి కలది అని అర్ధం.
చండీ యాగము, రుద్రయాగము, అతిరుద్ర యాగము, నిత్య కర్మానుష్ఠానములో చేసే నైమిత్తిక
యజ్ఞాలు అన్నీ కూడా అమ్మకు ఇష్టం కలిగించేవే.
శ్రీమద్భగవగీతలో, "నేను ప్రాణులందరి శరీరములలో వైశ్వానరుడనే అగ్ని రూపంలో ఉంటూ,
వారు తినే భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పానీయములనే అయిదు విధములైన ఆహారములను జీర్ణం
చేస్తున్నాను", అంటాడు భగవంతుడు.
కనుక, అన్నం తినటం కూడా లోపల వున్న ఆ వైశ్వానరుడనే అగ్నికి ఆహుతులు వెయ్యడమే.
అందుకే ఏది పడితే, అది తినకూడదు. యజ్ఞం చేస్తున్నంత పవిత్రంగా అన్నం తినాలి.
అదే అమ్మకు ప్రీతి.
యజ్ఞమంటే ఇష్టమైన, ఆ యజ్ఞప్రియ కు వందనం.
ఓం శ్రీ యజ్ఞప్రియాయై నమః
882. యజ్ఞకర్త్రీ
యజ్ఞమును చేయునది కూడా ఆ పరమేశ్వరియే. కనుక, ఆ తల్లిని ఈ నామంలో యజ్ఞకర్త్రీ
అంటున్నాం. యజ్ఞములను చేయునది, చేయించునది కూడా ఆ లలితా పరాభట్టారికయే.
శ్రీమద్భగవగీతలో, "అన్ని యజ్ఞ కర్మలలో భోక్తనూ, ప్రభువునూ నేనే", అంటాడు భగవంతుడు.
అంటే, యజ్ఞము చేసే కర్తా, యజ్ఞమును స్వీకరించే భోక్తా, రెండూ నేనే అంటున్నాడు పరబ్రహ్మ.
యజ్ఞము చేసే సోమయాజి పక్కన సోమిదమ్మ కూడా ఉండాలి. భార్యాభర్తలు ఇరువురూ కూర్చుని
చేసేదే యజ్ఞం. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా యజ్ఞం చేయకూడదు.
శ్రీరాముడు కూడా దూరంగా వున్న సీత జ్ఞాపికగా, స్వర్ణసీతను పక్కన పెట్టుకునే అశ్వమేధయాగం
చేశాడు. పరమేశ్వరుడు సోమయాజియై యజ్ఞ కర్తృత్వం వహిస్తుంటే, పరమేశ్వరి సోమిదమ్మయై
యజ్ఞకర్త్రి అవుతుంది.
సోమయాజి, సోమిదమ్మగా యజ్ఞములు చేయు, ఆ యజ్ఞకర్త్రీ కి వందనం.
ఓం శ్రీ యజ్ఞకర్త్ర్యై నమః
ఓం శ్రీ యజమానస్వరూపిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి