4, జనవరి 2022, మంగళవారం

165. ధర్మాధారా, ధనాధ్యక్షా, ధనధాన్య వివర్ధినీ విప్రప్రియా, విప్రరూపా, విశ్వభ్రమణ కారిణీ

 

ధర్మాధారా, ధనాధ్యక్షా, ధనధాన్య వివర్ధినీ 
విప్రప్రియా, విప్రరూపా, విశ్వభ్రమణ కారిణీ ॥ 165 ॥

884. ధర్మాధారా

ధర్మమునకు ఆధారమైనది ధర్మాధారా. 

వేద విహితములైనవి, గురువులనుంచి శిష్యులకు, తాత తండ్రుల నుంచి పుత్రులకు పరంపరగా 

వచ్చే కర్మములను ధర్మములంటారు. ఇవి కాలాన్ని బట్టీ, ప్రాంతాలను బట్టీ మారుతూ ఉంటాయి.  

వీటికే ఆచారములని పేరు. ఆచరించేవే ఆచారములు. 

సంవర్తస్మృతిలో, 'ఏదేశమందు ఏ ఆచారము శిష్య పరంపరగా వచ్చిందో, ఏది వేద విరుద్ధము 

కాదో, అదే ధర్మము', అని వుంది. 

దేవి ఈ ధర్మములనన్నీ ఆ యా దేశములందు నిరర్గళముగా, ఏ ఆటంకమూ లేకుండా, 

ఆచరించబడేటట్లు చూస్తుంది. 

ఆ ధర్మములను నిలబెడుతుంది. ఆ ధర్మములకు తాను ఆధారభూతమవుతున్నది. 

'సమస్తమూ ధర్మము నందే వుంది' అని వేదం అంటోంది. కనుక దేవి ఆ ధర్మము నందే వున్నది. 

ధర్మము మీదే సర్వమూ ఆధారపడే విధంగా, అమ్మ ఈ జగత్తులను సృష్టించింది. 

ధర్మము లన్నింటికీ ఆధారమైన, ఆ ధర్మాధార కు వందనం. 

ఓం శ్రీ ధర్మాధారాయై నమః  


885. ధనాధ్యక్షా

ధనమునకు స్వామిని ఆ లలితా పరమేశ్వరి. 

ధనాధ్యక్షుడు కుబేరుడు, కుబేరుడు శ్రీవిద్యోపాసకుడు. శ్రీవిద్య అంటే అమ్మే కదా. 

శ్రీవిద్యను ఉపాసించే కుబేరుడు ధనాధిపతి అయ్యాడు. అది కేవలము అమ్మ అనుగ్రహం. 

భగవంతుడు, భక్తుడు ఒకటే అంటుంది అద్వైతం. కనుక కుబేరుడూ, శ్రీవిద్యా ఒక్కరే. 

ధనమంటే లక్ష్మి. పరమేశ్వరి శ్రీ మహాలక్ష్మీ స్వరూపమని మహాలక్ష్మీ నామంలో చెప్పుకున్నాం. 

నవనిధులకీ, నవరత్నాలకీ నిలయమైన శ్రీపురంలో ఉంటున్న, ఆ శ్రీదేవిని ఈ నామంలో 

ధనాధ్యక్షా అంటున్నాం. 

ధనమునకు అధ్యక్షురాలైన ధనాధీశ్వరి, ఆ ధనాధ్యక్ష కు వందనం.  

ఓం శ్రీ ధనాధ్యక్షాయై నమః  


886. ధనధాన్య వివర్ధినీ

వివర్ధనం అంటే విశేషంగా వృద్ధి చెందించటం. ధనమునూ, ధాన్యమునూ విశేషంగా వృద్ధి 

చెందించే  శ్రీదేవినే ఈ నామంలో ధనధాన్యవివర్ధినీ అంటున్నాం. 

భూమిలో ఒక్క గింజ వేస్తే, పుట్టెడు గింజలిస్తుంది, శ్రీమాత అటువంటి పృధ్వీ స్వరూపం. 

హోమాదులలో ఆహుతిగా ఏమిచ్చినా తిరిగి అనేక రెట్లుగా యజమానికి చేరుతుందనేది విశ్వాసం. 

తిలతండులాలు వేసి హోమం చేస్తాం, ఆ యజ్ఞ ధూమానికి మేఘం వర్షిస్తుంది. 

భూమి తడుస్తుంది, పంట పండుతుంది. వేసిన గుప్పెడు గింజలు పుట్టెడు గింజలవుతాయి. 

అది భూదేవియైన శ్రీమాత యొక్క ధాన్య వివర్ధినీ రూపం.  

బ్రహ్మ, విష్ణువు దక్షిణాదేవిని సృష్టించి యజ్ఞపురుషుడికి ఇచ్చారు. యజ్ఞఫలం ఆ దక్షిణాదేవి 

ద్వారా కర్తకు చేరుతుంది. యజ్ఞంలో ఇచ్చిన దక్షిణ యజ్ఞఫలాన్నిస్తుంది. దక్షిణ లేని పూజ, 

యజ్ఞం ఫలించవు. యజ్ఞం చేసినప్పుడు దక్షిణాదేవి రూపంలో లక్ష్మీ దేవి యజ్ఞ కర్తకు ఫలం 

ఇస్తుంది. కనుక ఆ దక్షిణాదేవి ధన వివర్ధినీ రూపం. 

శ్రీదేవీ రూపంలో ధనాన్నీ, భూదేవీ రూపంలో ధాన్యాన్నీ, ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చే, 

ఆ  ధనధాన్య వివర్ధిని కి వందనం. 

ఓం శ్రీ ధనధాన్యవివర్ధిన్యై నమః  


887. విప్రప్రియా

విప్రులంటే ఇష్ట పడునది విప్రప్రియా. విప్రులంటే వేద విద్యా పారంగతులైన బ్రాహ్మణులు.  

బ్రహ్మ వైవర్త పురాణంలో, " జన్మచే బ్రాహ్మణుడని, సంస్కారములచే ద్విజుడని, వేదవిద్యచే 

విప్రుడని, ఈ మూడూ గలవాడిని శ్రోత్రియుడనీ చెప్పబడుతున్నాడు.విద్వాంసుడైనా, కాకున్నా,  

బ్రాహ్మణుడు నా స్వరూపము", అని వుంది. 

కనుక అమ్మ విప్రప్రియా అనబడుతోంది. 

విప్రులంటే ప్రియమైన, ఆ విప్రప్రియ కు వందనం. 

ఓం శ్రీ విప్రప్రియాయై నమః 

  

888. విప్రరూపా

విప్రరూపా అంటే, విప్రులు తన స్వరూపముగా కలది అని అర్ధం. 

ముందు నామంలో విప్రులంటే ఎవరో చెప్పుకున్నాం. వేదవిద్యా పారంగతుడు విప్రుడు. 

పరాశరస్మృతిలో, "బ్రాహ్మణుడు జంగమతీర్థ స్వరూపుడని మూడు లోకాలలోనూ ప్రతీతి. అట్టివారి 

వాక్యోదకముచే, అంటే ప్రవచనామృతముచే, మాలిన్యము కలవారందరూ శుద్ధులగుచున్నారు",

అని చెప్పారు. పూర్వకాలంలో  పురాణాలు చెప్పే బ్రాహ్మణులు ఊరూరా తిరుగుతూ పురాణ 

ప్రవచనం చేసేవారు. హరికథలు చెప్పేవారూ అంతే.  సహజంగా పుణ్యతీర్థములు సంచరింప లేవు కదా. కానీ పుణ్యతీర్థము వంటి, వేదవిద్యా పారంగతుడైన బ్రాహ్మణుడు మాత్రం 

తాను సంచరిస్తూ, అందరికీ తన ప్రవచనామృతముతో మలినములు కడిగి, శుద్ధులని 

చేస్తున్నాడు అని ఇక్కడ భావం. 

ఆపస్తంబుడు, "బ్రాహ్మణునకు అహంకారము కూడదు, అహంకరించిన బ్రాహ్మణుడు, పూజలు 

స్వీకరిస్తూ, పాలు పితకబడ్డ గోవు వలె నీరసించి పోతాడు. తిరిగి పూర్వరూపమును పొందాలంటే 

దేవీ మంత్రజపము, తపస్సు అవసరము", అని చెప్పాడు.  

విప్రరూపంలో తన ప్రవచనామృతంతో భక్తులను శుద్ధులను చేస్తున్న, ఆ విప్రరూప కు వందనం.

ఓం శ్రీ విప్రరూపాయై నమః 


889. విశ్వభ్రమణ కారిణీ

విశ్వమును సృష్టి, స్థితి, లయ అనే భ్రమణమును చేయించునది విశ్వభ్రమణకారిణీ. 

వేదములో, ఈ బ్రహ్మాండములన్నీ భగవంతుని మహిమ చేత పరిభ్రమిస్తున్నాయి, అని చెప్పారు. 

స్మృతులలో, యంత్రములవలె సర్వభూతములను భగవంతుడు తిప్పుతున్నాడు, అన్నారు. 

విశ్వం అన్నా, విష్ణువు అన్నా ఒక్కటే అని విష్ణు సహస్రనామాలు చెప్తున్నాయి, కనుక విష్ణువును 

పరిభ్రమింపచేసేది అనే అర్ధం కూడా వుంది. 

కాళికా పురాణంలో ఒక కథ వుంది. ఒకసారి గరుడారూఢుడై విష్ణువు నీలాచలపర్వతాలపై నుంచి 

వెళ్తున్నాడు. నీలాచలం మీద కామాఖ్యా దేవి కొలువై వుంది. విష్ణువు కామాఖ్యాదేవిని లెక్కచేయక, 

ఆమెకు నమస్కరించకుండా సాగిపోతున్నాడు. ఆగ్రహించిన కామదేవి విష్ణువును సముద్రంలో

పడి, అక్కడే తిరుగుతూ ఉండేలా చేసింది. వైకుంఠంలో లక్ష్మీదేవి భర్త కనిపించక వెతుకుతూ 

నారదుడి ద్వారా నిజం తెలుసుకుని, నీలాచలం వచ్చింది. కామదేవి అనుగ్రహం కోసం తపస్సు 

చేసి, అమ్మను ప్రసన్నం చేసుకుని, విష్ణువును తిరిగి దక్కించుకుంది. 

కామాఖ్యాదేవి విష్ణువుకు భ్రమణం కల్పించింది కనుక, విశ్వభ్రమణకారిణీ అనే నామం వచ్చింది. 

విశ్వము, విష్ణువుల భ్రమణానికి కారణమైన, ఆ విశ్వభ్రమణ కారిణి కి వందనం. 

ఓం శ్రీ విశ్వభ్రమణకారిణ్యై నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి