10, జనవరి 2022, సోమవారం

171. దక్షిణాదక్షిణారాధ్యా, దరస్మేర ముఖాంబుజా కౌళినీ కేవలా, అనర్ఘ్య కైవల్య పదదాయినీ

 

దక్షిణాదక్షిణారాధ్యా, దరస్మేరముఖాంబుజా 
కౌళినీ కేవలా, అనర్ఘ్య కైవల్యపదదాయినీ ॥ 171 ॥

923. దక్షిణాదక్షిణారాధ్యా

దక్షిణ అదక్షిణ ఆరాధ్యా అంటే దక్షిణులైన పండితుల చేతను, అదక్షిణులైన మూర్ఖుల చేతను 

కూడా ఆరాధింపబడునది అని అర్ధం. 

దక్షిణలతో పూజింపదగినది. బుద్ధి కుశలురైన వారు ధన, ద్రవ్య దక్షిణలతో దేవిని ఆరాధిస్తారు,

కనుక దేవి దక్షిణారాధ్యా అనబడుతోంది. 

దక్షిణాచారముచే పూజింపబడుతోంది కనుక దక్షిణారాధ్యా. 

వామాచారముచే పూజింపబడుతోంది కనుక అదక్షిణారాధ్యా. 

వేదములో, "ఏ విద్యను పొందితే, కోరికలు నశిస్తాయో, జ్ఞానులు ఆ పరమపదమును పొందుతారు", 

అని వుంది. శ్రీమద్భగవగీతలో కూడా, "ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్ధీ, జ్ఞానీ కూడా నన్ను సేవిస్తారు", 

అని వుంది. జ్ఞానుల చేత కూడా పూజింపబడునది శ్రీమాత. 

కనుక ఆ శ్రీ రాజరాజేశ్వరి కర్మఠులైన దక్షిణుల చేతా, మూర్ఖులైన అదక్షిణుల చేతా కూడా 

ఆరాధింపబడుతున్నది, అని ఈ నామార్ధం. 

జ్ఞానుల చేతా, అజ్ఞానుల చేతా కూడా ఆరాధింపబడు, ఆ దక్షిణాదక్షిణారాధ్య కు వందనం. 

ఓం శ్రీ దక్షిణాదక్షిణారాధ్యాయై నమః  


924. దరస్మేరముఖాంబుజా

చిరునగవుతో వున్న పద్మము వంటి ముఖము కలది అని ఈ నామానికి అర్ధం. 

అమ్మ ముఖము ఎప్పుడూ చక్కని ప్రసన్నమైన చిరునవ్వుతోనే ఉంటుంది. అమ్మ ముఖం మీద 

నవ్వు చివరకు ప్రళయకాలంలో కూడా అలాగే నిలిచి ఉంటుంది. ఆ దరహాస ముఖారవిందాన్ని 

చూసి, తలచి భక్తులు పులకితులవుతూ వుంటారు. 

ఆపదలో వున్న వారికి కూడా ధైర్యాన్నిచ్చేది అమ్మ నవ్వు.  

దరం అంటే భయము అనే అర్ధం కూడా వుంది. దుష్టులకు భయాన్ని కలుగచేసేది అమ్మ 

వికసిత వదనం, అని కూడా ఈ నామానికి అర్ధం.  

దరం అంటే శంఖం అనీ, స్మేర అంటే వికసించిన అనీ అర్ధం వుంది. 

దరస్మేరముఖాంబుజా అంటే, శంఖం వలె ప్రకాశించు కంఠము కలది అని ఒక భావం. 

చక్కని మందహాసంతో భక్తులను కటాక్షించు జగజ్జనని, ఆ దరస్మేర ముఖాంబుజ కు వందనం.  

ఓం శ్రీ దరస్మేర ముఖాంబుజాయై నమః  


925. కౌళినీ కేవలా 

కౌళినీ అంటే కులదేవత. దేవతలు ఎందరు వున్నా కులదేవత ప్రధమ పూజ్యార్హత కలది. 

కనుక ఆ కులదేవత స్థానంలో కౌళిని ప్రత్యేకముగా ఉంటుంది. ఆ స్థానము ఇతరులకు ఉండదు. 

కులదేవత ఒక్కరే కనుక, ఆ కౌళిని కేవలా. కేవలా అంటే ఒక్కరే అని అర్ధం. 

కులదేవత స్థానంలో కౌళిని ఒంటరిది కనుక, కేవలా అని భావము.   

జైనతంత్రములో ఈశ్వరజ్ఞానమునకు కేవలమని పేరు. 

శివసూత్రములలో, కేవలా అంటే సుఖదుఃఖముల నుండి విముక్త అయినది అని అర్ధం చెప్పారు. 

కౌళినీ కేవలా అంటే సుఖదుఃఖములు నుండి విముక్తుల్ని చేసే ఈశ్వరజ్ఞానమిచ్చే కులదేవత 

అని అర్ధం. 

కేవలమైన, ఈశ్వరజ్ఞానాన్నిచ్చే కులదేవత, ఆ కౌళినీ కేవల కు వందనం. 

ఓం శ్రీ కౌళినీ కేవలాయై నమః  


926. అనర్ఘ్య కైవల్యపదదాయినీ

అనర్ఘ్యం అంటే అమూల్యము, అపరిమితము, అపరిచ్చిన్నము అని అర్ధం.  

సామీప్య, సాలోక్య, సారూప్య, సాయుజ్య, కైవల్యము లనేవి పంచవిధ ముక్తులు.  

ఈ ఐదింటిలోనూ కైవల్యమనేది ఉత్కృష్టమైనది. కేవలమంటే ఈశ్వరజ్ఞానమని చెప్పుకున్నాం. 

ఆ ఈశ్వరజ్ఞానమే కైవల్యముక్తిని ఇస్తుంది. అటువంటి అమూల్యమైన, ఉత్కృష్టమైన, 

అసమానమైన, కైవల్యముక్తిపదాన్ని అనుగ్రహించేది అనర్ఘ్య కైవల్య పదదాయినీ శ్రీమాత.  

అమూల్యమైన కైవల్య ముక్తినిచ్చే, ఆ అనర్ఘ్య కైవల్య పదదాయిని కి వందనం. 

ఓం శ్రీ అనర్ఘ్య కైవల్యపదదాయిన్యై నమః 

  




------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి