వ్యోమము అంటే ఆకాశము. వ్యోమకేశీ అంటే ఆకాశమే కేశములుగా కలది అని అర్ధం.
శివుడికి వ్యోమకేశుడనే పేరు వుంది. ఆ వ్యోమకేశుని భార్య కనుక వ్యోమకేశీ అనే నామం వచ్చింది.
ఓం శ్రీ వ్యోమకేశ్యై నమః
943. విమానస్థా
విమానస్థా అంటే విమానము నందు వుండే దేవతాస్వరూపము అని అర్ధం.
వ్యోమయానం చేసే దేవత అని కూడా అర్ధం.
వి-విశేషముగా, మాన-భక్తులను కాపాడటంలో, స్థా-వున్నది అని భావం.
వి-విశేషంగా, మాన-యదార్థజ్ఞానమైన వేదంలో, స్థా-వున్నది, వేదంలో కీర్తించబడినది అని భావం.
వి-విశేషముగా, మాన-గణించదగిన విద్యల యందు, స్థా-వున్నది అని ఒక భావం.
నాలుగు వేదములు, ఆరు వేదాంగములు, మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము
ఈ పదునాలుగింటినీ విద్యలు అంటాం. ఆ విద్యల యందు ఉండునది అని అర్ధం.
దశమహావిద్యాస్వరూపం అని కూడా భావం.
విశేషమైన కాంతి కల కిరిచక్రరథమును అధిష్టించినది అని కూడా అర్ధం
వి, మాన, స్థా అంటే, కొలతలు లేని పరిమాణము కలది, అపరిచ్చిన్నమైన పరబ్రహ్మ యందు
వున్నది అని అర్ధం.
విశేషమైన వ్యోమయానం చేసే, ఆ విమానస్థా కు వందనం.
944. వజ్రిణీ
వజ్రాయుధమును కలిగినది వజ్రిణీ. పదునైన అంచులు కలది వజ్రాయుధం.
వజ్రము ఇంద్రుని ఆయుధం. ఈ వజ్రాయుధంతోనే ఇంద్రుడు పర్వతముల రెక్కలను కత్తిరించి
పర్వతములను స్థాణువులుగా చేసాడు. ఈ వజ్రాయుధంతోనే ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపాడు.
ఇంద్రుని పత్ని కనుక శచీదేవికి వజ్రిణీ అనే నామం వచ్చింది. శచీదేవీ స్వరూపురాలు అని అర్ధం.
సప్తమాతృకలలోనూ, అష్టమాతృకలలోనూ వున్న ఇంద్రాణియే వజ్రిణీ అని పిలువబడుతోంది.
వేదములో, వజ్రము అంటే పరబ్రహ్మ అని చెప్పారు.
నవరత్నాలలో వజ్రము ఒక విశేషమైన రత్నము. ఆ వజ్రములను ధరించునది వజ్రిణీ.
వజ్రాభరణములను విశేషముగా ధరించునది వజ్రిణీ.
ఇంద్రాణీ శక్తిగా కొలవబడుతున్న, ఆ వజ్రిణీ కి వందనం.
945. వామకేశ్వరీ
వామకులు అంటే వామాచారం పాటించేవారు. వారు ఉపాసించే దేవత కనుక, వామకేశ్వరీ అనే
నామం వచ్చింది. వామమార్గంలో చేసిన పూజలు స్వీకరిస్తున్న దేవి వామకేశ్వరీ.
వామకేశ్వరమనే తంత్రములో ప్రతిపాదించబడిన శక్తి కనుక, వామకేశ్వరీ అనే నామం వచ్చింది.
ఆ వామకేశ్వర తంత్ర స్వరూపురాలు అని ఒక అర్ధం.
కుత్సితులై, పంచయజ్ఞములు చేయని వామాచారులకు ఈశ్వరి కనుక, వామకేశ్వరీ.
సృష్టిని చేసే దక్షుడు మొదలగు వారికి వాములు అని పేరు.
ఆ వాములకు ఈశ్వరి కనుక, వామకేశ్వరీ అని అంటున్నాం.
వామకేశ్వర తంత్రములో ఆరాధించబడిన, ఆ వామకేశ్వరి కి వందనం.
ఓం శ్రీ వామకేశ్వర్యై నమః
946. పంచయజ్ఞప్రియా
పంచ యజ్ఞములంటే ఇష్టపడునది పంచయజ్ఞప్రియా. ఏ పంచ విధ పూజలన్నా ఇష్టము కలది.
వేదములో, అగ్నిహోత్రము, దర్శపూర్ణ మాసములు, చాతుర్మాస్యములు, పశుయజ్ఞము,
సోమయజ్ఞములను పంచయజ్ఞములుగా చెప్పారు.
వ్యవహారములో, దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము,
మనుష్యయజ్ఞములు పంచపాక యజ్ఞములని ప్రసిద్ధి.
పాంచరాత్రాగమములో, అభిగమనము, ఉపాదానము, ఇజ్యా, స్వాధ్యాయము, యోగము లను
పంచవిధ పూజలుగా చెప్పారు.
కులాగమంలో, కేవలము, యామళము, మిశ్రము, చక్రయాగము, వీరసంగ్రహము లను
పంచ పూజలుగా చెప్పారు.
నిత్యా తంత్రము, బృహత్తంత్ర కౌముది, మంత్ర మహోదధి లలో కూడా వివిధ పంచ యజ్ఞాల
గురించి వివరించారు.
ఏ విధమయిన పంచవిధ పూజల నయినా ఇష్టముగా స్వీకరించేది పంచయజ్ఞప్రియా.
అయిదు విధములైన యజ్ఞములంటే ప్రీతి కల, ఆ పంచయజ్ఞప్రియ కు వందనం.
ఓం శ్రీ పంచయజ్ఞప్రియాయై నమః
947. పంచప్రేతమంచాధిశాయినీ
పంచప్రేతములనే మంచముగా చేసుకుని దానిపై అతిశయముగా అధివసించినది శ్రీలలిత.
అందుకే ఈ నామంలో ఆ లలితాపరమేశ్వరిని పంచప్రేతమంచాధిశాయినీ అంటున్నాం.
ఆ పంచప్రేతములే పంచబ్రహ్మలుగా చెప్తున్న, బ్రహ్మ, గోవింద, రుద్ర, మహేశ్వర, సదాశివులు.
బ్రహ్మ, గోవింద, రుద్ర, మహేశ్వరులు ఆ మంచానికి నాలుగు కాళ్ళు, సదాశివుడు ఫలకము,
మహేశానుడు తలగడ. అటువంటి మహత్తరమైన మంచముపై త్రిపురసుందరి శయనించి
వున్నది అని అర్ధం.
ఈ విషయం భైరవ యామళంలోనూ, బహు రూపాష్టక ప్రస్తారంలోనూ, సౌందర్యలహరిలోనూ
కూడా చెప్పబడింది.
ఈ ఐదుగురూ లలితాపరమేశ్వరి శక్తి లేనిదే శక్తిహీనులు కనుక ప్రేతములని చెప్పబడ్డారు.
ఈ వివరాలన్నీ పంచప్రేతాసనాసీనా నామంలో కూడా చెప్పుకున్నాం.
మహాకామేశ్వరి ఆ పంచప్రేతములచే ఏర్పడ్డ మంచముపై ఆసీనురాలై ఉంటుంది.
పక్కనే దక్షిణభాగంలో మహాకామేశ్వరుడు కూర్చుని ఉంటాడు.
ఇక్కడ చెప్పుకుంటున్న ఈ శివ స్వరూపాలన్నీ వివిధ స్థాయిలలో వుండే పరమేశ్వరరూపాలే.
సాంకేతికంగా బ్రహ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంధి, ఈశ్వరగ్రంథి అనే నాలుగు గ్రంధులూ
మంచమునకు పాదములుగా, సహస్రార స్థానంలో సదాశివుణ్ణి ఊహిస్తే, ఆ బైందవస్థానంలో
మహాకామేశుడు, మహాకామేశ్వరి సామరస్యంగా కూర్చుని వుంటారు.
అదే ఈ పంచప్రేతమంచము. దానిని అధివసించి శయనించువారే కామేశ్వరీకామేశ్వరులు.
పంచప్రేతములనే మంచముగా చేసుకుని శయనించిన,
ఆ పంచప్రేతమంచాధిశాయిని కి వందనం.
ఓం శ్రీ పంచప్రేతమంచాధిశాయిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి