18, జనవరి 2022, మంగళవారం

179. దశముద్రాసమారాధ్యా, త్రిపురాశ్రీవశంకరీ జ్ఞానముద్రా, జ్ఞానగమ్యా, జ్ఞానజ్ఞేయస్వరూపిణీ

 

దశముద్రాసమారాధ్యా, త్రిపురాశ్రీవశంకరీ 
జ్ఞానముద్రా, జ్ఞానగమ్యా, జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ ॥ 179 ॥


977. దశముద్రాసమారాధ్యా

దశముద్రలచే సమ్యక్ ఆరాధన పొందునది దశముద్రాసమారాధ్యా. 

శ్రీవిద్యా సంప్రదాయంలో అంతర్యాగార్చనలో, చక్కగా పది విధములైన ముద్రలతో ఆరాధించ 

బడునది ఆ శ్రీచక్రరాజసింహాసనేశ్వరి. 

ఈ దశముద్రారాధానతో శ్రీచక్ర ఉపాసన గురించి నిత్యాహృదయంలో చెప్పారు. 

ఆ దశముద్రలే, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ,

సర్వమహాంకుశ, సర్వఖేచరీ, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండ. 

మొదటి ఆవరణలో భూపురమును సర్వసంక్షోభిణీ ముద్ర తోనూ, 

రెండవ ఆవరణలో షోడశదళమును సర్వవిద్రావిణీ ముద్ర తోనూ, 

మూడవ ఆవరణలో అష్టదళమును సర్వాకర్షిణీ ముద్ర తోనూ, 

నాలుగవ ఆవరణలో మన్వస్రమును సర్వవశంకరీ ముద్రతోనూ, 

అయిదవ ఆవరణలో బహిర్దశారమును సర్వోన్మాదినీ ముద్రతోనూ, 

ఆరవ ఆవరణలో అంతర్దశారమును సర్వమహాంకుశ ముద్ర తోనూ, 

ఏడవ ఆవరణలో అష్టకోణమును సర్వ ఖేచరీ ముద్ర తోనూ, 

ఎనిమిదవ ఆవరణలో త్రికోణమును సర్వబీజ ముద్ర తోనూ, 

తొమ్మిదవ ఆవరణలో బిందువును సర్వయోని ముద్ర తోనూ ఆరాధించాలి. 

శ్రీచక్రాన్నంతా సర్వ త్రిఖండ ముద్ర తోను ఆరాధించాలి. 

ఈ సర్వ త్రిఖండ ముద్ర త్రిపురసుందరీ స్వరూపం. 

కుడి చేతి వేళ్ళు శివతత్త్వానీకీ, ఎడమచేతి వేళ్ళు శక్తితత్త్వానికీ సంకేతాలు. 

ఈ రెండు చేతుల వేళ్ళూ కలిపి ముద్రలు వేయటం శివ శక్త్యైక్య ముద్ర.  

ఈ రెండు చేతుల వేళ్ళతో దశ ముద్రలూ వేస్తూ శ్రీచక్రార్చన చేయటమే శ్రీవిద్యా సంప్రదాయం. 

ఈ ముద్రలూ, ఆరాధనా అన్నీ గురు ముఖతః నేర్చుకోవాలి. 

గురు సంప్రదాయమును అనుసరించే ఈ ఆరాధన చేయాలి. 

పది రకముల ముద్రలతో సమ్యక్ ఆరాధన చేయబడుతున్న శ్రీలలితే దశముద్రాసమారాధ్యా. 

దశ ముద్రలతో ఆరాధింపబడే, ఆ దశముద్రాసమారాధ్యా కు వందనం. 

ఓం శ్రీ దశముద్రాసమారాధ్యాయై నమః   


978. త్రిపురాశ్రీ వశంకరీ

శ్రీచక్రములో పంచమ చక్రాధిష్ఠాన దేవత త్రిపురాశ్రీ. 

ఆ దేవతను వశము చేయునది త్రిపురాశ్రీ వశంకరీ. పంచమావరణ దేవత అయిన త్రిపురాశ్రీను 

భక్తులకు వశము చేసేది అని ఈ నామ భావం. 

ఐశ్వర్యమును, మోక్షమును భక్తులకు వశము చేయునది అని అర్ధం. 

భక్తులకు అతి గొప్ప ఐశ్వర్యమైన మోక్షమును ఆనందముగా ఇచ్చునది. 

భక్తులకు మోక్షము నిచ్చి ఆనందమును కలుగచేయునది అని అర్ధం. 

శివుడు, శక్తి వుండే వారణాసికి ఆనందవనమని పేరు. 

నారాయణుడుండే తిరుమలకు ఆనందనిలయము అని పేరు. 

ఆనందవనము నందుండి, భక్తులకు మోక్షము అనే ఆనందాన్ని వశము చేయు, 

ఆ త్రిపురాశ్రీవశంకరీ కి వందనం.  

ఓం శ్రీ త్రిపురాశ్రీవశంకర్యై నమః  


979. జ్ఞానముద్రా 

లలితాపరమేశ్వరి జ్ఞానముద్రా స్వరూపురాలు అని ఈ నామ భావం. 

చూపుడు వేలును, బొటనవేలును కలిపితే వచ్చే ముద్రను జ్ఞాన ముద్ర, చిన్ముద్ర అంటారు. 

బదరీ నారాయణుడు పద్మాసనంలో జ్ఞానముద్రతో ఉంటాడు. 

ధర్మశాస్త కూడా ఈ ముద్రలోనే ఉంటాడు. 

ధ్యాన సమయంలో శక్తి బయటకు ప్రవహించకుండా ఈ ముద్ర కాపాడుతుంది. 

బొటన వేలు భగవంతునికి, చూపుడు వేలు జీవుడికి సంకేతం. 

జీవాత్మ, పరమాత్మల అనుసంధానానికి సంకేతంగా ఈ జ్ఞానముద్రను వేస్తారు. 

మిగిలిన మూడు వేళ్లనూ విడిచిపెట్టటంలో త్రిగుణాలను విడిచి పెట్టమని సంకేతం. 

జ్ఞానమను, ఆనందమును ఇచ్చేది జ్ఞానముద్రా. 

లేదా చైతన్యమనే ఆనందమును ఇచ్చునది చిన్ముద్రా. 

ముద్ర లన్నింటిలోనూ ఉత్తమమైనది, పర దేవతా స్వరూపము జ్ఞానముద్ర, లేదా చిన్ముద్ర. 

ఈ ముద్రను ఎవరైనా వేయవచ్చు. పద్మాసనములో కానీ, సుఖాసనంలో కానీ కూర్చుని, 

జ్ఞానముద్రను వేసి ధ్యానము చేసుకుంటే, ఆ లలితాపరమేశ్వరి కృప వలన ఆనందము, 

చైతన్యము, జ్ఞానము కలుగుతాయి. 

జ్ఞానమునిచ్చే ముద్ర కనుక జ్ఞానముద్రా అన్నారు. లలితాదేవి ఈ జ్ఞానముద్రా స్వరూపము.  

చైతన్యము, జ్ఞానము, ఆనందము ఇచ్చు, ఆ జ్ఞానముద్రా కు వందనం. 

ఓం శ్రీ జ్ఞానముద్రాయై నమః  


980. జ్ఞానగమ్యా

జ్ఞానము వలన, జ్ఞానము చేత పొందదగినది జ్ఞానగమ్యా. 

జ్ఞానమును ఇస్తుంది కనుక జ్ఞానదా, జ్ఞానము చేత పొందదగినది కనుక జ్ఞానగమ్యా. 

జ్ఞానమునే తన ఆకృతిగా కలిగినది కనుక జ్ఞానవిగ్రహా. 

కూర్మపురాణంలో, "నా నిష్కళమైన రూపము చిన్మాత్రము, అది కేవలం శివము. సర్వ ఉపాధుల 

చేతా విడువబడినది, అనంతమైనది, అమృతమైనది, అదే పరమపదం. కేవలము జ్ఞానము చేత 

మాత్రమే లభించేది, జ్ఞానదృష్టికి మాత్రమే కనిపించేది" అని ఆ దేవియే స్వయంగా చెప్పింది. 

అమ్మ యొక్క నిష్కళా రూపము తెలియబడాలంటే, జ్ఞానం మాత్రమే ఏకైక సాధనం. 

జ్ఞానులకు, జ్ఞానము చేత మాత్రమే తెలియబడు, ఆ జ్ఞానగమ్యా కు వందనం. 

ఓం శ్రీ జ్ఞానగమ్యాయై నమః 


981. జ్ఞానజ్ఞేయస్వరూపిణీ

జ్ఞానము చే పొందదగినది, జ్ఞానమే తానయినది, జ్ఞానజ్ఞేయస్వరూపిణీ. 

జ్ఞానమూ ఆమే, జ్ఞేయమూ ఆమే, ఆ జ్ఞానజ్ఞేయములే తన స్వరూపముగా కలది అని ఈ నామార్దం.

జ్ఞాత భక్తుడు, తెలియదగిన విషయమే జ్ఞేయము పరమేశ్వరి,  తెలుసుకున్న విషయమే జ్ఞానము 

ఈ మూడూ కూడా పరమేశ్వరియే. దృక్కు, దృశ్యము రెండూ ఆ శ్రీమాత స్వరూపమే. 

వేదాంత విచారణ వలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. ఆ బ్రహ్మజ్ఞాన ఫలితంగా పరమపదము 

కలుగుతుంది. ఆ బ్రహ్మజ్ఞానమూ, ఈ పరమపదమూ రెండూ శ్రీలలితే.  

శ్రీమద్భగవద్గీతలో కూడా, "నేనే మార్గము, నేనే గమ్యము", అని పరమాత్మ చెప్పాడు.  

అందుకే అమ్మను ఈ నామంలో జ్ఞానజ్ఞేయస్వరూపిణీ అంటున్నాం. 

జ్ఞానమూ, జ్ఞేయమూ రెండూ తానే అయిన, ఆ జ్ఞానజ్ఞేయస్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ జ్ఞానజ్ఞేయస్వరూపిణ్యై నమః 

  





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి