శ్రీ సౌభాగ్య భాస్కర భాష్యం రచనా వృత్తాంతం
సకుంకుమ విలేపనామ్ అళికచుంబికస్తూరికామ్
సమంద హసితేక్షణామ్ సశరచాప పాశాంకుశామ్
అశేష జనమోహినీమ్ అరుణమాల్య భూషోజ్జ్వలామ్
జపాకుసుమ భాసురామ్ జపవిధౌ స్మరేత్ అంబికామ్
సమంద హసితేక్షణామ్ సశరచాప పాశాంకుశామ్
అశేష జనమోహినీమ్ అరుణమాల్య భూషోజ్జ్వలామ్
జపాకుసుమ భాసురామ్ జపవిధౌ స్మరేత్ అంబికామ్
బ్రహ్మశ్రీ భాస్కరరాయలు రచించిన సౌభాగ్య భాస్కర భాష్యం ఆధారంగా చేసుకుని, నేను ఈ
లలితా సహస్ర నామాల వ్యాఖ్యానం రాయడం జరిగింది. కనుక శ్రీ భాస్కరరాయల వారి గురించి
పాఠకులందరికీ పరిచయం చేయటం, శ్రీ భాస్కరరాయల వారికి కృతజ్ఞతలు చెప్పుకోవటం నా
ధర్మంగా భావిస్తూ ఇక్కడ శ్రీ భాస్కరరాయల వారి చరిత్ర, వారి సౌభాగ్య భాస్కర భాష్యం గురించి
కొన్ని విషయాలు చెపుతాను.
భాస్కరరాయల వారి తండ్రి గంభీరరాయలు, తల్లి కోనమాంబ, కృష్ణా తీరవాసులు. విశ్వామిత్ర
గోత్రీకులు. పారశీ భాషలో మహాభారతాన్ని అనువాదం చేసినందు వలన, భారతుల అనే ఇంటి
పేరు వచ్చింది. ఎన్నెన్నో ప్రాంతాలు తిరుగుతూ భాగ్యనగరం వచ్చినప్పుడు భాస్కరరాయలు
జన్మించారని తెలుస్తోంది. తొలిగురువు తండ్రే. శ్రీ నృసింహయజ్వ వద్ద అష్టాదశ విద్యలూ
నేర్చుకున్నారు. ఆ తరువాత సూరత్ లో శ్రీప్రకాశానంద శివదత్త శుక్లా గారి వద్ద శ్రీవిద్యాదీక్షను
తీసుకున్నారు. ఆ సమయంలో గురువు ఇచ్చిన దీక్షానామము భాసురానంద దీక్షితుడు. వీరి
ధర్మపత్ని నామం ఆనంది అంటారు. వీరు ఎన్నో ప్రదేశాలు తిరిగి కాశీక్షేత్రంలో నివాసం
ఏర్పరచుకున్నారు. వీరి జీవితకాలం సుమారుగా 1700-1785 మధ్యలో అని తెలుస్తోంది.
లలితాపరమేశ్వరీదేవి ఒకసారి భాస్కరరాయలకు దర్శనమిచ్చి, తన సహస్రనామస్తోత్రానికి
నామాలవారీగా భాష్యం, అంటే అర్ధం రచించమని కోరిందట. అప్పుడు భాస్కరరాయలు, తాను
అప్పులో ఉన్నాననీ, రుణగ్రస్తులకు రచన చేసే అర్హత లేదనీ చెప్పారట. మరునాటి కల్లా ఆతని
అప్పు తీరినట్టు, అప్పు ఇచ్చిన ఆసామీ పత్రాన్ని తెచ్చి ఇస్తూ, ఒక దివ్యమైన మహిళ నీ పేరు
మీద వున్న అప్పు తీర్చి వెళ్ళింది, అని చెప్పాడట. అప్పుడు భాస్కరరాయల వారికి అమ్మ
ఆదేశం అర్థమయి సౌభాగ్య భాస్కర భాష్యం అనే పేరుతో శ్రీలలితాసహస్రనామస్తోత్రానికి భాష్యం
వ్రాయటం ప్రారంభించారు. భాస్కరరాయలు ఈ సౌభాగ్య భాస్కర భాష్యం అనే దివ్య గ్రంధాన్ని
సంస్కృతంలో రచించారు. సుమారుగా 400 గ్రంధాలలో కల శాస్త్రాలు, వాటి వివరాలు ఉల్లేఖిస్తూ
చేసిన సంపూర్ణ రచన ఇది. భాస్కరరాయల ముందూ, ఆ తరువాతా కూడా ఇంతటి సమగ్రరచన
ఈ విషయంలో వెలువడలేదు.
ఎంతోమంది పండితులు, ఉపాసకులు, భక్తులు ఈ బృహత్తర కార్యానికి ఉపక్రమించినా పూర్తి
చేయలేకపోయారు. దానికి శంకరభగవత్పాదులు కూడా అతీతులు కాదు. అమ్మ ఆదేశం మేరకు
శ్రీలలితాసహస్రనామస్తోత్రానికి భాష్యం వ్రాయటం విరమించుకుని, శ్రీ లలితా త్రిశతీ కి భాష్యం
వ్రాశారని చెప్తారు. భాస్కరరాయలకు అమ్మ అనుజ్ఞ వున్నది కనుక, అమ్మ ఆదేశానుసారం చేసిన
ఈ రచన జగత్ ప్రసిద్ధమైంది. నేటికీ ఈ విషయంపై ఎవరు రచన చేయాలనుకున్నా, వారిదే
ప్రధాన ప్రమాణ గ్రంధం. కాశీలో ఆయన భాష్య రచన చేసిన గంగాఘాట్ కి లలితా ఘాట్ అనే
పేరు స్థిరపడిపోయింది.
సౌభాగ్య భాస్కర భాష్యం రచనాకాలంలో, తోటి కాశీ పండితులకు అసూయ కలిగి, వేధించడానికి
"చతుష్షష్టి కోటి యోగినీ గణ సేవితా" నామంలో చెప్పిన ఆ యోగినుల నామాలు, ఇతర వివరాలు
చెప్పమని అడిగారు. అప్పుడు భాస్కరరాయలు లలితాదేవిని స్మరించగా, ఆ అరవైనాలుగు కోట్ల
యోగినులూ ఆకాశంలో నిలబడి తమ వివరాలు చెప్పారు. అన్ని కోటానుకోట్ల కంఠాలు ఏకకాలంలో
వినలేక ఆ కాశీ పండితులకు పిచ్చెక్కిపోయింది. ఆ బాధ భరించలేక భాస్కరరాయలవారిని
క్షమించమని వేడుకున్నారు. ఆ సందర్భంలో కుంకుమానందస్వామి అనే సాధువు, కాశీ
పండితులను మందలించినట్లు కూడా చెపుతారు. ఆనాటి నుంచీ కాశీలోని పండితులంతా
భాస్కరరాయలకు దాసోహమని, ఆయన శిష్యులై పోయారు. నేటికీ ఆ సంఘటన జరిగిన
గంగాఘాట్ కి చౌషష్టీఘాట్ అనే పేరునిలిచి పోయింది.
భాస్కరరాయలు తన భాష్య రచన పూర్తి అయిన తరువాత, కాశీ అన్నపూర్ణాలయంలో
చక్రేశ్వరుడిని ప్రతిష్టించి, అక్కడ శ్రీలలితాసహస్రనామస్తోత్రం పారాయణ చేస్తే, అమ్మకృపతో
అన్ని కోరికలు తీరుతాయని చెప్పాడు. చక్రేశ్వరుడంటే, శివలింగం మీద, శ్రీచక్రం లిఖించబడి
ఉన్న లింగం. ఆ శివాశివశక్తైక్యరూపమే చక్రేశ్వరలింగం. కాశీ అన్నపూర్ణాలయంలో నేటికీ ఆ
లింగాన్ని దర్శించి అభిషేకార్చనలు చేసుకోవచ్చు.
ఒకసారి చంద్రసేన్ జాదవ్ అనే మరాఠీ సేనాని, గర్భవతియైన తన భార్యను భాస్కరుని వద్దకు
తీసుకువచ్చి, నమస్కరించి ఏ సంతానం పుడుతుందని అడిగితే, పుత్ర సంతానం కలుగుతుంది,
అని ఆశీర్వదించారు. కొన్ని నెలల తరువాత, ఆ సేనానే భాస్కరుని శిష్యుని వద్దకు వెళ్లి, అదే
విషయం అడిగితే, ఆతడు పుత్రికా సంతానమని చెప్పాడట. అప్పుడు ఆ సేనాని, మీరు మీ
గురువుగారికి విరుద్ధంగా చెప్పారేమిటి అని అడగగా, నిజం తెలుసుకున్న ఆ శిష్యుడు కోపించి, మా
గురువుగారు చెప్పిన దానిని విశ్వసించక, తిరిగి నన్ను అడిగినందుకు, నీకు నపుంసక సంతానం
కలుగుతుందని శపించాడట. నపుంసకుడు పుట్టిన తరువాత ఆ సేనాని భాస్కరరాయల వారి
వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నాడట. భాస్కరరాయలవారు జాలిపడి, ఆ పిల్లవాడికి పుంస్త్వం
వచ్చేలా చేస్తానని ధైర్యం చెప్పి, తనతో పాటు కృష్ణానదీ తీరానికి తీసుకుని వచ్చారు. అక్కడ ఒక
మండలం పాటు సూర్యారాధన చేసి, ఆ పిల్లవాడిని పురుషుడుగా చేశాడు. ఈ సందర్భంగా
నిండువేసవిలో మండుటెండలో, ఇసుకలో నిత్యమూ కృష్ణా తీరానికి వెళ్లలేక సూర్యుని ప్రార్ధించి,
నదీ మార్గాన్ని తన ఆశ్రమం వైపుకు మళ్లించారు. భాస్కరరాయల వారి అనంతరం నది తిరిగి తన
పూర్వ మార్గానికి వెళ్ళిపోయింది. నేటికీ పాలమూరు జిల్లాలో, మూలమల్ల అనే గ్రామంలో ఈ నది
దారి మళ్ళిన ఛాయలు, ఇసుక మేటలు కనిపిస్తాయి.
తమిళనాడు లోని తంజావూరు వద్ద అప్పటి రాజుగారు, ఒక గ్రామాన్ని భాస్కరరాయపురం అని
నిర్మించి భాస్కరరాయలవారికి ఇచ్చాడు. ఆ గ్రామంలో భాస్కరరాయలు ఒక ఆలయాన్ని
నిర్మించి, అక్కడ ఒక పెద్ద శ్రీచక్రాన్ని ప్రతిష్టించి పూజాదికాలు చేసేవారు. నేటికీ ఆ గ్రామంలో
వారు నివసించిన ఇంటిలో ఒక ఆశ్రమం వుంది. అక్కడ భాస్కరరాయ దంపతుల పేరు మీద
ప్రతిష్ట చేసిన భాస్కరేశ్వరుడు, ఆనందవల్లి ఆలయాలు వున్నాయి. స్థూలంగా ఇదీ నాకు తెలిసిన,
నేను సేకరించిన బ్రహ్మశ్రీ భారతుల భాస్కరరాయల వారి చరిత్ర.
చివరగా, అమ్మ ఆజ్ఞ లేకపోతే, అమ్మ అనుమతి లేకపోతే ఎవరూ అమ్మ నామాలకు వ్యాఖ్యానం
వ్రాయలేరు. ఇది ముమ్మాటికీ సత్యం. అమ్మ ఆదేశం మేరకు శ్రీలలితాసహస్రనామస్తోత్రానికి
భాష్యం రచించిన శ్రీ భాస్కరరాయలవారికి వందనం.
శ్రీ భాస్కరరాయాయ నమః
శ్రీ లలితాదేవ్యై నమః
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
బహ్మ శ్రీ భాస్కర రాయల గురించి చక్కటి వివరాలు తెలిపినందులకు హృదయపూర్వక అభినందనలు
రిప్లయితొలగించండిExcellent Vijaya. I have the opportunity of visiting Varanasi and performing Abhishekam to Sri chakreswara swami. It was wonderful experience.
రిప్లయితొలగించండిఅదృష్టవంతులు ఇందిరక్కా.
రిప్లయితొలగించండి