దేశంలో ఉంటాయి. అందంగా ఎర్రని కాంతితో ప్రకాశించే ఈ పుష్పాలను లలితాపరమేశ్వరితో
పోల్చి, ఆ పువ్వులు అమ్మ వలె ఎర్రని కాంతితో శోభాయమానంగా ఉన్నవని ఈ నామం చెప్తోంది.
శ్రద్ధాభక్తులతో, నిశ్చల మనస్సుతో అమ్మను ధ్యానిస్తే, కన్నులకు సింధూర వర్ణం కనిపిస్తుంటే,
అమ్మ కరుణిస్తున్నట్లు సంకేతం.
ఓం శ్రీ బంధూకకుసుమప్రఖ్యాయై నమః
965. బాలా
బాలా రూపంలో వున్నది ఆ శ్రీలలితే. కుమారీ స్వరూపురాలు.
బాలగా భండాసురుని ముప్పది మంది పుత్రులనూ అనాయాసంగా వధించింది.
బాల ఇంతమంది రాక్షసులను తన విక్రమంతో చంపిందని విన్న లలితాపరమేశ్వరి ఎంతో
ఆనందాన్ని పొందిందని ముందు నామాలలో చెప్పుకున్నాం.
పిల్లలాట వలె భండ పుత్రులను కేళిగా, విలాసంగా వధించినది బాల.
నవరాత్రులలో చేసే కుమారీ పూజలో ప్రతిదినమూ ఒక బాలను పూజించాలని శ్రీవిద్యా
సంప్రదాయంలో వున్నది.
రెండు సంవత్సరముల కన్నా చిన్నదైన బాలకు కానీ, పది సంవత్సరముల కన్నా పెద్దదైన
బాలకు కానీ, కుమారీ పూజకు అర్హత లేదని శాస్త్రంలో వున్నది.
నవరాత్రులలో మొదటినాడు రెండు సంవత్సరముల బాలను కుమారిగా, రెండవనాడు మూడు
సంవత్సరముల బాలను త్రిమూర్తిగా, మూడవనాడు నాలుగు సంవత్సరముల బాలను కల్యాణిగా,
నాలుగవనాడు అయిదు సంవత్సరముల బాలను రోహిణిగా, అయిదవనాడు ఆరు
సంవత్సరముల బాలను కాళికగా, ఆరవనాడు ఏడు సంవత్సరముల బాలను చండికగా,
ఏడవనాడు ఎనిమిది సంవత్సరముల బాలను శాంభవిగా, ఎనిమిదవనాడు తొమ్మిది
సంవత్సరముల బాలను దుర్గగా, తొమ్మిదవనాడు పది సంవత్సరముల బాలను సుభద్రగా
పూజించాలి. ఇది నవరాత్రులలో కుమారీపూజా చేసే విధానం.
ఈ విధంగా కుమారీపూజ చేస్తే, పరమేశ్వరి తృప్తి చెందుతుందని శ్రీవిద్యాసంప్రదాయంలో వుంది.
శరన్నవరాత్రులలో కుమారిగా పూజలందుకునే, ఆ బాల కు వందనం.
966. లీలావినోదినీ
వినోదంగా లీలలు చేయునది లీలా వినోదినీ. లీలలు చేస్తూ వినోదించేది అని భావం.
దేవీ పురాణంలో, లక్ష్మీదేవిని లాలన చేసినందుకు లీల అనే పేరు వచ్చిందని చెప్పారు.
యోగవాశిష్ఠంలో, పద్ముడను రాజు, ఆతని భార్య లీలావతుల కథ చతుర్ధ సర్గలో చెప్పబడింది.
లీలాదేవి సరస్వతీదేవికై తపస్సు చేసి, తనకు జ్ఞానాన్ని, తన భర్తకు ఆయుష్షును పొందింది అని
యోగవాశిష్ఠంలో చెప్పారు. ఆ లీలాదేవీ స్వరూపురాలు అని ఈ నామానికి అర్ధం.
బాలకృష్ణుడి రూపంలో కూడా బాల్యక్రీడలు, లీలావినోదాలు చేసినా, బాలాత్రిపురసుందరి
రూపంలో అసురులతో యుద్ధాలు చేసినా, అన్నీ ఆ శ్రీలలితకు కేళీ విలాసాలే.
మహత్ కార్యాలను లీలావినోదంగా చేసి క్రీడిస్తున్న, ఆ లీలావినోదినీ కి వందనం.
ఓం శ్రీ లీలావినోదిన్యై నమః
967. సుమంగళీ
సువాసినులను సుమంగళీ అంటారు. పంచ మాంగళ్యాలనూ ధరించి మంగళకరమైన
వేషభూషలతో, మంగళప్రదంగా వుండే ముత్తైదువులను సుమంగళీ అంటారు.
పరమశివుడు మృత్యుంజయుడు, నిత్యుడు, శాశ్వతుడు, జననమరణములకు అతీతుడు.
ఆతని ఇల్లాలు పరమేశ్వరి నిత్యసుమంగళి. పరబ్రహ్మము ఎప్పటికీ సుమంగళియే.
విష్ణుపురాణంలో, "పరబ్రహ్మను గురించి విన్నంత మాత్రముననే, శుభములు కలుగుతాయి,
అమంగళములు నశిస్తాయి", అని వుంది. కనుక, బ్రహ్మమే మంగళము.
కనుక సుమంగళీ అంటే బ్రహ్మ స్వరూపురాలు అని అర్ధము.
అత్రిస్మృతిలో, "ప్రశస్తమయిన వాటిని ఆచరించటం, అప్రశస్తమయిన వాటిని వదిలివేయడం,
ఈ రెండు కలిపి చేస్తే మంగళం, అని బ్రహ్మవాదులైన ఋషులు చెప్తున్నారు", అని వుంది.
మంగళస్వరూపురాలైన సువాసిని, ఆ సుమంగళి కి వందనం.
ఓం శ్రీ సుమంగళ్యై నమః
968. సుఖకరీ
సుఖమును కలుగచేసేది సుఖకరీ. సుఖము అంటే నిశ్చింత, ఏ చింతా లేకుండా ఉండటం.
లోకములో తాత్కాలిక సుఖముల నిచ్చేవి కొల్లలు. ఆ సుఖభావన శాశ్వతము కాదు.
కానీ ముక్తి వలన కలిగేది నిత్యసుఖము, శాశ్వతసుఖము. అది ప్రళయకాలము వరకూ నశించదు.
సువాసినులను అర్చించినా, కుమారీ పూజలు చేసినా, పరమేశ్వరి సంతోషించి సుఖములను
ఇస్తుంది. శ్రద్ధాభక్తులతో ఈ సేవలు చేసేవారి కోరికలు తీర్చి, వారికి ఆనందాన్నిస్తుంది.
మోక్షము వలన కలిగే సుఖము నిచ్చే, ఆ సుఖకరీ కి వందనం.
ఓం శ్రీ సుఖకర్యై నమః
969. సువేషాఢ్యా
సువేషాఢ్యా అంటే శోభనమైన వేషభూషలతో ఉండునది, చక్కని ఆహార్యము కలది అని అర్ధం.
చక్కని వస్త్రములు, చక్కని ఆభరణములు, పుష్పములు ధరించి కనులకు మనోహరంగా,
మనసుకు దివ్యంగా కనిపించే స్త్రీలను సువేషాఢ్యా అంటారు.
సువాసినులైతే, పంచ మాంగల్యములనూ కూడా ధరించి మంగళప్రదంగా ఉండాలి.
స్త్రీ పురుషులు ఎవరైనా జుట్టుని సంస్కరించుకుని ఉండాలి. విరబోసుకున్న కేశముల ద్వారా
అసురభావనలు ప్రవేశించి, మనసులో అలజడి కలుగచేస్తాయి.
నెమ్మదిగా వారి ప్రవర్తన కూడా మారిపోతుంది.
కట్టు, బొట్టు, జుట్టు ఈ మూడింటినీ సంస్కరించుకుంటే లలితాపరమేశ్వరి ఇష్టపడుతుంది.
శోభనమైన ఆహార్యముతో మంగళప్రదంగా వుండు, ఆ సువేషాఢ్యా కు వందనం.
ఓం శ్రీ సువేషాఢ్యాయై నమః
970. సువాసినీ
సువాసినీ అంటే సభర్తృక. సజీవుడైన పతితో జీవించునది సువాసినీ. అయిదవతనము కల స్త్రీ.
భర్త బ్రతికి వున్న ప్రతి స్త్రీ సువాసిని.
ఆ పరమేశ్వరుడు మృత్యుంజయుడు కనుక, లలితాపరమేశ్వరి నిత్యసువాసిని.
ప్రతి సువాసిని లోనూ మంగళకరముగా ఉంటుంది ఆ లలితాపరమేశ్వరి.
మాంగళ్య తంతువుతో భర్తతో ముడిపడి వున్నవారిని సువాసినులంటారు.
ఆ తంతువు లేనప్పుడు వారు వి-తంతువులవుతారు. లోకంలో అమ్మ లేని స్థానము లేదు కనుక,
ఆ వితంతువుల లోనూ ధూమావతీ రూపంలో లలితాదేవి ఉంటుంది.
లలితాపరమేశ్వరి సువాసినులలో నిత్యమూ శోభస్కరంగా ఉంటుంది.
సువాసినులు మంగళసూత్రము, నల్లపూసలు, తాటంకములు, ముక్కెర, కంకణములు, మెట్టెలు,
కడియములు, మంజీరములు, పువ్వులు, గంధము, కుంకుమ, పసుపు, కాటుక ధరిస్తే,
శ్రీలలితకు ప్రీతికరము.
ఈ విధమైన వేషభూషలతో మంగళప్రదంగా వున్న సువాసినులకు కోరిన కోరికలు తీర్చి, సుఖాన్నీ
ఆనందాన్నీ, అష్టైశ్వర్యాలనూ ఇస్తుంది పరమేశ్వరి.
మాంగళ్య చిహ్నములతో శోభనముగా వున్న, ఆ సువాసినీ కి వందనం.
ఓం శ్రీ సువాసిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి