
యోనిముద్రా, త్రిఖండేశీ, త్రిగుణా, అంబా, త్రికోణగా
అనఘా, అద్భుతచారిత్రా, వాంఛితార్థప్రదాయినీ ॥ 180 ॥
982. యోనిముద్రా
ఈ నామంలో అమ్మవారిని యోనిముద్రా స్వరూపురాలు అని అంటున్నాం.
దశముద్రలలో తొమ్మిదవ ముద్ర యోనిముద్ర. కొంతమంది దీనిని నమస్కారముద్రగా కూడా
వ్యవహరిస్తారు. ఈ ముద్ర వేయటం వలన మంత్రదోషాలుంటే నశిస్తాయి.
ఈ ముద్రను వేసే పధ్ధతి గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి.
యోని యందు ఆనందము నిచ్చునది యోనిముద్రా స్వరూపమైన శ్రీలలిత.
గుదము, మేఢ్రము అంటే స్త్రీ పురుష చిహ్నములు వీటికి యోని అని పేరు.
యోని అంటే తల్లకిందులుగా వున్న త్రికోణము. ఆ త్రికోణములో వున్న బిందువు నందు
ఆనందము నిచ్చునది అని అర్ధం.
సర్వానందమయ చక్రము వద్ద వున్న, బిందు స్థానమునకు యోనిముద్రాదేవి అధిదేవత.
కాశ్మీరంలోని శ్రీనగర్ లో హరిపర్వతం అని ఒక శిఖరం వుంది. ఆ శిఖరంపై శ్రీమాత
స్వయంభువుగా వెలసిన ఒక శ్రీచక్రస్వరూపం వుంది. అదే మొట్టమొదటి శ్రీ చక్రం అని చెప్తారు.
ఆ కొండపై శ్రీ చక్రేశ్వరీ మాతా మందిరం వుంది. అక్కడ ఒక పెద్దశిలపై సర్వదేవతా మూర్తులూ
కనిపిస్తాయి. అన్నీ స్వయంభువులే. చెక్కినవి కావు. మనమే పోల్చుకోవాలి. ఆ మహాశిలే
శివశక్త్యైక్య తత్వం బోధపరుస్తున్నట్లు ఉంటుంది. ఆ శ్రీచక్రము స్పష్టంగా కంటికి కనిపిస్తుంది.
ఆ శిల సుమారు 20, 30 అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ మహాశిలలో త్రికోణాకార యోనిముద్ర,
త్రిఖండేశీ గా దర్శనం ఇస్తుంది. ఆ మహాశిలలో కిందభాగాన్ని అమ్మవారిగానూ, పైభాగాన్ని
అయ్యవారి గానూ కొలుస్తారు. శ్రీచక్రనగర సామ్రాజ్ఞి అక్కడ ప్రత్యక్షమైన కారణాన, ఆ నగరానికి
శ్రీనగరమనే పేరు వచ్చింది. తపస్సు చేసుకోవటానికి, నీరు తప్ప నేల లేనప్పుడు, కశ్యపుడు
దేవిని ప్రార్ధించి, కూర్చుని తపస్సు చేసుకోవటానికి కొంత భూమి అడిగాడు. అప్పుడు దేవి
కరుణించి, ఒక శారిక రూపంలో వచ్చి, శబ్దం చేస్తూ ఒక ముత్యాన్ని జారవిడిచిందనీ, ఆ ముత్యం
పడిన చోట నీరు తొలగి, భూమి పైకి వచ్చిందనీ చెప్పారు. కశ్యపుని వలన ఏర్పడిన భూమి కనుక,
కశ్మీర్ అని పేరు. ఆ శారిక పలికిన శబ్దమే తొలి శబ్దమనీ, అదే సరస్వతీ స్వరూపమని అక్కడి వారి
నమ్మిక. అందుకే సర్వజ్ఞపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో సరస్వతీక్షేత్రం కాశ్మీరంలో ఏర్పడ్డాయని
అంటారు. ఆది శంకరాచార్యులు అక్కడ కామేశ్వరీ కామేశ్వరులను కొలిచి, తపస్సు చేశారు.
యోని యందు ఆనందము నిచ్చు, ఆ యోనిముద్రా కు వందనం.
983. త్రిఖండేశీ
త్రిఖండేశీ ముద్ర దశ ముద్రలలో పదవది. త్రిఖండములకూ ఈశ్వరి కనుక ఈ నామం వచ్చింది.
పంచదశీ మంత్రములో మూడు ఖండాలున్నాయి. అవి సూర్యఖండము, సోమఖండము,
అగ్నిఖండము. ఈ త్రిఖండములకూ అధీశ్వరి, కనుక త్రిఖండేశీ అని అంటున్నాం.
పంచదశీ మంత్రములోని మూడు కూటములకూ అధిష్టాత్రి, కనుక త్రిఖండేశీ.
భూ, భువ, సువర్లోకాలనే మూడు ఖండాలకూ ఈశ్వరి, కనుక త్రిఖండేశీ.
త్రిఖండేశీ అంటే సాక్షాత్ త్రిపురసుందరీ స్వరూపం. ఈ త్రిఖండేశీ ముద్రతో శ్రీచక్రాన్నంతా
పూజించవచ్చు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులనే మూడు శక్తుల స్వరూపమే త్రిఖండేశీ.
త్రికోణములోని మూడు భుజములకూ ఈశ్వరియైన, ఆ త్రిఖండేశీ కి వందనం.
984. త్రిగుణా
సత్వ, రజస్, తమో గుణాలనే గుణత్రయము నకు ఈశ్వరి కనుక, త్రిగుణా అంటున్నాం.
ఈ మూడు గుణములకూ మూలప్రకృతి ఆశ్రయమవుతున్నది కనుక, త్రిగుణా అనబడుతోంది.
వాయుపురాణంలో, "యోగీశ్వరి తన లీలచే సమస్త శరీరములను సృష్టిస్తోంది, లయిస్తోంది.
తాను నామ, రూప, క్రియా త్మకములైన మూడు ఆకృతులనూ ధరించుట చేత త్రిగుణా అని
అంటున్నారు", అని వుంది.
విష్ణుపురాణంలో, "దేవీ, నీ శక్తి సర్వత్రా, సర్వభూతములలో గుణాశ్రయమై శాశ్వతముగా వున్నది.
నీకు నమస్కారము", అని వున్నది.
దేవీపురాణంలో, "మూడు పాదములచే బలిచక్రవర్తిని బంధించిన త్రివిక్రముడు, మూడు
లోకములలో ప్రవహించిన త్రిపథగా అయినా గంగ, ఉత్పత్తి, స్థితి, నాశము అనే మూడు
గుణములనూ, సత్వరజస్తమో గుణాలనే మూడింటినీ కలది కనుక త్రిగుణా అని
చెప్పబడుతున్నది", అని వుంది.
త్రివిక్రమ, త్రిపథగా, త్రిగుణా అనే మూడు లక్షణములూ ప్రకృతి యందు వున్నవి కనుక,
త్రిగుణా అంటే ఆ ప్రకృతి స్వరూపురాలు అని అర్ధం. ఆ ప్రకృతియే, త్రిగుణములూ కలిగి,
వామనుడు, గంగా మొదలైన అవతారములను ధరించినదని భావము.
త్రిగుణములకూ ఆశ్రయమైన, ఆ త్రిగుణా కు వందనం.
985. అంబా
అంబా అంటే జనని, తల్లి. అమ్మను ముందే ఆబ్రహ్మకీటజననీ అని చెప్పుకున్నాం.
గుణత్రయమునకు ఆధారభూతురాలు కనుక గుణత్రయమునకూ జనని.
దీనినే తంత్రశాస్త్రములో మంత్రజీవము అంటారు.
తంత్రరాజములో, "తేజోమూర్తులకు, శక్తిమూర్తులకూ, సకలజగత్తుకూ కారణము గుణత్రయము.
ఈ గుణత్రయమునకు కారణమైన శక్తిని, సమ్యక్ స్వరూప అనుసంధాన సిద్ధి, మంత్రవీర్యం,
మంత్రజీవం అని అంటారు", అని చెప్పబడింది. కనుక అంబ సకల జగత్తులకూ జనని.
సకల జగత్తులకూ కారణమైన, ఆ అంబ కు వందనం.
ఓం శ్రీ అంబాయై నమః
986. త్రికోణగా
త్రికోణము రూపములో వున్నది త్రికోణగా. త్రికోణాకృతి దాల్చినది త్రికోణగా.
యోని చక్ర రూపములో త్రిభుజాకృతిలో వున్నది త్రికోణగా.
ఇచ్చా, జ్ఞాన, క్రియా శక్తులు మూడూ కలిసి త్రికోణము వలె ఏర్పడ్డాయి.
ఆ త్రికోణములో వుండు ఆనంద స్వరూపము కనుక త్రికోణగా అనబడుతోంది.
మూడు భుజములతో, త్రికోణములో యోని రూపమున వున్న, ఆ త్రికోణగా కు వందనం.
ఓం శ్రీ త్రికోణగాయై నమః
987. అనఘా
అఘము అంటే పాపము, వ్యసనం, దుఃఖం. అవి ఏవీ లేనిది అనఘా.
అనఘా అంటే, నిర్మలమైనది, పాపములు లేనిది, రమ్యమైనది, దోషములు లేనిది అని అర్ధం.
శ్రీమాతకు మలినములు లేవు, అంటవు. పాపములు లేవు, రావు. దోషములు వుండవు.
వ్యసనములు లేవు. త్రిపురసుందరి రమ్యమైనది, చక్కనైనది.
కనుక పై అర్ధాలన్నీ శ్రీమాతకు అన్వయించుకోవచ్చు. అందువలన త్రిపురసుందరి అనఘా.
ఏ దుఃఖములూ, వ్యసనములూ, పాపములూ లేని, ఆ అనఘా కు వందనం.
ఓం శ్రీ అనఘాయై నమః
988. అద్భుతచారిత్రా
అద్భుతచారిత్రా అంటే ఆశ్చర్యకరమైన చరిత్ర కలది అని అర్ధం.
అమ్మ చరిత్ర, విభూతి అంతా అద్భుతమే. ఎప్పటికప్పుడు భక్తులు ఆశ్చర్యపోయేలా తన శక్తిని
ప్రదర్శిస్తూ ఉంటుంది. అందుకే అమ్మను ఈ నామంలో అద్భుతచారిత్రా అంటున్నాం.
అద్భుతముగా అంటే భూతకాలములో ఎప్పుడూ లేని విధంగా అనే అర్ధం కూడా వుంది.
ఇంతవరకూ ఎవరూ కనీ, వినీ, ఎరగని గొప్ప చరిత్ర, మహత్తు కల దేవి అని ఈ నామార్ధం.
అనుకోకుండా ఆకస్మికముగా జరిగే భూకంపము, ఉల్కాపాతము వంటి సంఘటనలను కూడా
అద్భుతాలని అంటారు. భక్తులను అటువంటి అద్భుత-ఆకస్మికములైన దుష్టఫలముల నుంచి,
చరి-చరిస్తూ, త్రా-కాపాడునది అని కూడా అర్ధం.
కష్టనష్టాల నుంచి భక్తులను కాపాడు మహత్తైన శక్తి కల, ఆ అద్భుతచారిత్ర కు వందనం.
ఓం శ్రీ అద్భుత చారిత్రాయై నమః
989. వాంఛితార్థప్రదాయినీ
వాంఛితార్థములంటే కోరుకునే కోరికలు, ప్రదాయినీ-ఇచ్చునది వాంఛితార్ధప్రదాయినీ.
వాంఛితములంటే కేవలము కోరుకునే కోరికలే కాదు, కోరదగిన కోరికలు.
కోరిన కోరికలను తీర్చు కరుణా స్వభావము కలది కనుక, వాంఛితార్ధప్రదాయినీ అంటున్నాం.
భక్తులు కోరిన కోరికలు తీర్చేది ఆ జగదంబ. పిల్లల కోరికలు తీర్చేది తల్లే కదా.
ఈ శ్రీలలితాసహస్రనామస్తోత్రపారాయణము చేసేవారి కోరికలు నిస్సంశయంగా తీరుస్తాను అని,
ఆ లలితాపరమేశ్వరి ఈ స్తోత్ర పూర్వ పీఠికలో, ఉత్తరపీఠికలో స్పష్టం చేసింది.
కానీ అదే సమయంలో, ఎవరికి ఈ స్తోత్రం చెప్పరాదో కూడా చెప్పింది.
అంటే ధర్మమార్గంలో చరించే వారి, ధర్మబద్ధమైన కోరికలు కోరేవారి వాంఛితములు
అమ్మ తప్పక తీరుస్తుంది. అందుకే అమ్మను ఈ నామంలో వాంఛితార్ధప్రదాయినీ అంటున్నాం.
భక్తుల మనస్సు, అర్హత ఎరిగి వారి వాంఛితములను తీర్చు,
ఆ వాంఛితార్థప్రదాయినీ కి వందనం.
ఓం శ్రీ వాంఛితార్థప్రదాయిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
Very beautiful explanation !
రిప్లయితొలగించండి🙏🙏🙏
రిప్లయితొలగించండిExcellent explanation.
రిప్లయితొలగించండిIt's more attractive with at photo and has given clear idea about the temple. Thank you very much for taking pains and writing for all of us.
రిప్లయితొలగించండిChala baga rashunnaru
రిప్లయితొలగించండి