శ్రీలలితా దివ్య రహస్య సాహస్ర నామ స్తోత్ర ఆవిర్భావం
పూర్వపీఠిక
అరుణామ్ కరుణా తరంగితాక్షీమ్ ధృతపాశాంకుశ పుష్పబాణ చాపామ్
అణిమాదిభిః ఆవృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్
అణిమాదిభిః ఆవృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్
వివరంగా చెప్పాడు. హయగ్రీవుడు అగస్త్యునితో చేసిన సంవాదంలో ఈ కథని వివరించినట్లు
బ్రహ్మాండపురాణంలో వుంది. పురాణాల్లో నలుగురు హయగ్రీవులున్నారు. ఒక హయగ్రీవుడు
గుర్రపుతలతో వున్న అసురుడైతే, మరో హయగ్రీవుడు లలితాదేవి ఆదేశంతో, ఆ అసురుణ్ణి
వధించటానికి, గుర్రపు తలతో వచ్చిన విష్ణువు. మూడవ హయగ్రీవుడు బ్రహ్మాండపురాణంలో
లలితాదేవి గురించి అగస్త్యునితో చెప్పిన దేవఋషి. నాలుగవ హయగ్రీవుడు నారాయణుని
దశమ అవతారమైన కల్కి.
వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరీ, కౌళినీ అనే ఎనమండుగురు
లలితాదేవి పరివార దేవతలు. శ్రీచక్రంలో సప్తమావరణ దేవతలు. వారిపై లలితాదేవి కటాక్షము
వుంది. వీరు వాక్కుచే ప్రకాశించువారు, వాక్కుతో స్తుతించువారు, వాక్సంపదలు కలిగినవారు,
వీరిని వాగ్దేవతలంటారు. వీరు అక్షరములకు అధిదేవతలు.
వర్ణమాలలోని అచ్చులకు అధిష్టానదేవత వశిని,
హల్లుల్లో క-వర్గానికి అధిష్ఠానదేవత కామేశ్వరి,
చ-వర్గానికి అధిష్ఠానదేవత మోదిని,
ట-వర్గానికి అధిష్ఠానదేవత విమల,
త-వర్గానికి అధిష్ఠానదేవత అరుణ,
ప-వర్గానికి అధిష్ఠానదేవత జయిని,
యరలవ లకు అధిష్ఠానదేవత సర్వేశ్వరి,
శషసహ లకు అధిష్ఠానదేవత కౌళిని.
లలితాదేవి తన భక్తులందరికీ తన నామాలు పారాయణ చేస్తే సులభంగా ముక్తి లభించాలనే
కరుణతో, ఈ ఎనిమిదిమంది వాగ్దేవతలనూ పిలిచి, " మీరు నా సహస్రనామాలను సులభంగా
పారాయణ చేసే విధంగా స్తోత్ర రూపంలో రచించండి. నా చక్రరహస్యాలు మీకు తెలుసు. ఆ
నామాలు చదివిన వారికి నేను అన్ని కోరికలనూ తీరుస్తాను. మీకు నా అనుగ్రహముంది", అని
ఆదేశించింది. వశిని మొదలగు ఆ వాగ్దేవతలు అమ్మ కృప వలన, ఈ దివ్య సహస్ర నామ స్తోత్రాన్ని
రచించి అమ్మ వద్దకు వచ్చారు.
ఆనాటి ప్రత్యేక సభకు అన్ని బ్రహ్మాండాల నుంచీ, కోటానుకోట్ల బ్రహ్మలు, సరస్వతులు,
విష్ణువులు, లక్ష్ములు, రుద్రులు, రుద్రాణులు, ఇంద్రులు, ఇంద్రాణులు వంటి దేవతల
సమూహమంతా వచ్చింది. దిక్పాలకులంతా తమ తమ భార్యలతో అమ్మ సభకు వచ్చారు.
శ్యామలా, వారాహీ, సంపత్కరీ, జ్వాలామాలిని, బాలా, బగళా వంటి శక్తులన్నీ కూడా
వచ్చాయి. సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు వంటి సిద్ధులంతా
వచ్చారు. నారదుడు, తుంబురుడు వంటి దేవఋషులంతా వున్నారు. మర్త్య లోకం నుంచి
వ్యాసుడు, వసిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి బ్రహ్మర్షులు వచ్చారు.
అమ్మ అనుజ్ఞతో వాగ్దేవతలు శ్రావ్యంగా తాము రచించిన దివ్యసహస్రనామస్తోత్రాన్ని గానం చేశారు.
ఆ స్తోత్రాన్ని అమ్మకు అంకితం చేశారు. ఆ స్తోత్రం విన్న అందరూ అలౌకిక ఆనందానుభూతిని
పొందారు. ఎక్కడా ఒక్క దోషము లేదు. ఒక్క పునరుక్తి లేదు. తు, చ, ఏవ వంటి నిరర్ధక పదాలు
అసలే లేవు. ఎటువంటి శబ్దార్ధదోషాలూ లేవు. చక్రరహస్యాలు, మంత్రోద్ధారములు గూఢంగా,
చమత్కారంగా చెప్పబడ్డాయి. సభ్యులు అందరూ మంత్రముగ్ధులై పోయారు. ఇటువంటి స్తోత్రము
ఇంతకూ ముందెన్నడూ ఎవరూ వినలేదు. ఆనందము, విస్మయము, పారవశ్యము కలిగాయి.
అప్పుడు అమ్మ చెప్పింది. "ఈ సహస్రనామ స్త్రోత్రం నాకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వశిన్యాది
వాగ్దేవతలు నా ఆజ్ఞ మేరకు మహత్తరమైన ఈ స్తోత్రాన్ని రచించారు. మీరు విస్మయం చెందకండి.
నా ప్రీతి కోసం ఈ నామాలు చదివినవారి కోరికలు నేను తీరుస్తాను. ఈ నామాలతో నన్ను భక్తిగా
సేవిస్తే, నేను తృప్తి చెందుతాను. ఈ స్తోత్రమునే నా స్వరూపముగా భావించండి. శ్రీచక్రార్చన
చేసినా, పంచదశీ మంత్రమును జపించినా, ఈ సహస్రనామాలు పారాయణ చేసినా నా
అనుగ్రహం లభిస్తుంది. భక్తితో ఒక్కసారి పారాయణ చేసినా నాకు ప్రీతి కలుగుతుంది. భక్తి
ముఖ్యం. ఈ నామాలు మీరంతా నాయందు భక్తి, విశ్వాసం వున్న అందరికీ ఉపదేశించండి.
కానీ కుతర్కం చేసేవారికీ, నా యందు విశ్వాసము లేనివారికీ, దుష్టులకూ, శఠులకూ ఈ నామాలు
చెప్పవద్దు. ఈ స్తోత్రము సిద్ధిప్రదము. ఈ విషయములో సంశయము వద్దు", అని చెప్పింది.
సభలోని దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ గణాలన్నీ ఈ శ్రీలలితా దివ్య రహస్య సహస్ర నామ
స్తోత్రాన్ని విని ధన్యులయ్యారు. ఆనాటి నుంచీ అమ్మ ఆదేశం మేరకు ఈ మహత్తరమైన స్తోత్రం
పరంపరగా అందరికీ చేరింది. ఈ స్తోత్రాన్ని ఆ లలితాదేవి ప్రీత్యర్ధం, దేవతలు, సిద్ధులు,
ఋషులు, ఉపాసకులు, భక్తులు అందరూ పారాయణ చేయటం ప్రారంభించారు.
ఈ విశేషమంతా హయగ్రీవుడు అగస్త్యునితో చెప్తున్నట్టు, సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.
నేను కొద్దిగా సరళం చేసి ఇక్కడ వ్రాస్తున్నాను. ఇదీ స్థూలంగా శ్రీలలితాసహస్రనామస్తోత్రం లోని
పూర్వపీఠికలో చెప్పబడ్డ శ్రీలలితాసహస్రనామస్తోత్రం ఆవిర్భావం వృత్తాంతం.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి