17, జనవరి 2022, సోమవారం

178. సువాసిన్యర్చనప్రీతా, ఆశోభనా, శుద్ధ మానసా బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా

 

సువాసిన్యర్చనప్రీతా, ఆశోభనా, శుద్ధ మానసా 
బిందు తర్పణ సంతుష్టా, పూర్వజా, త్రిపురాంబికా ॥ 178 ॥

971. సువాసిన్యర్చనప్రీతా

లలితాపరమేశ్వరి సువాసినులచే అర్చనలు అందుకుని ప్రీతి చెందునది, సువాసినులను 

అర్చిస్తే ప్రీతి చెందునది అని ఈ నామ భావం. 

సువాసినులందరి లోనూ  ఆ లలితాపరమేశ్వరి మంగళకరముగా శోభిల్లుతూ ఉంటుంది. 

సువాసినులను లలితాపరమేశ్వరిగా భావించి అర్చనలు, సేవలు చేసేవారి పట్ల సంతోషపడునది 

శ్రీలలిత. సువాసినిని ఆహ్వానించి, వారిని లలితా స్వరూపముగా భావించి అన్ని రకములైన 

ఉపచారములతో  సేవిస్తే ఆ పూజ లలితాదేవికి చేరుతుంది. 

లలితాదేవి సంతోషించి అభీష్టసిద్ధిని కలుగచేస్తుంది.  

సువాసినులు చేసే పూజలను ప్రీతిగా స్వీకరించునది అని కూడా భావం. 

సువాసినులను లలితాసమానులుగా భావించి పూజిస్తే ప్రీతి చెందు, 

ఆ సువాసిన్యర్చనప్రీతా కు వందనం. 

ఓం శ్రీ సువాసిన్యర్చనప్రీతాయై నమః  


972. ఆశోభనా

ఆశోభనా అంటే సర్వత్రా శోభాయమానంగా ఉండునది, అంతటా సౌందర్యము కలది అని అర్ధం. 

పరమేశ్వరి సౌందర్యం, లావణ్యం, సౌకుమార్యం, దోషరహితమైన అంగముల కూర్పు, సొగసు, 

ఆకర్షణశక్తి, కరుణ, ప్రీతి గురించి ఎన్నో సార్లు చెప్పుకున్నాం. అమ్మ అన్నింటా సౌందర్యవతి. 

తాంబూలం వేసుకుంటే అందం, నవ్వితే అందం, ఓరకంట చూచినా అందమే. 

తమను వధించటానికి వచ్చిందని తెలిసి కూడా, చండముండులు, శుంభనిశుంభులు వంటి 

వారు అమ్మ అందానికి దాసోహమన్నారు. శివుడిని కూడా మోహపెట్టే సౌందర్యం శివానీది. 

అమ్మను అందుకే సర్వమంగళగా ఆరాధిస్తాం. భక్తులు కూడా ఆ జగన్మోహన రూపానికి ఆశపడే 

ఆ తల్లి సన్నిధిని కోరుకుంటారు. 

అమ్మ ఇచ్చే సుఖము, ఆనందము, శమము, శాంతము వేరెక్కడా లభించవు. 

అందుకే సనకాదులు కూడా బాలుర వలె ఉంటూ, ఆ శ్రీమాతను చక్కగా ఆరాధిస్తున్నారు.  

సూర్యచంద్రులే అమ్మ అందానికి ముచ్చట పడి, అమ్మ చెవుల కెక్కి ఆనందపు 

డోలలూగుతున్నారు. శ్రీలలిత, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు జగన్మోహనులు. 

అంతటి సౌందర్యరాశిని ఈ నామంలో ఆశోభనా అంటున్నాం. 

లావణ్యరాశి అయిన, ఆ ఆశోభనా కు వందనం.  

ఓం శ్రీ ఆశోభనాయై నమః  


973. శుద్ధమానసా 

శుద్ధమానసా అంటే నిర్మలమైన మనసు కలది అని అర్ధం. 

నిర్మలం అంటే ఏ కుత్సితమూ లేని స్వచ్ఛమైన, మనసుని కలిగి ఉండటం. 

ఏ కోరికలూ లేని నిర్మలమైన మనస్సుతో అమ్మను అర్చిస్తే, ప్రీతి చెందుతుంది. 

అజ్ఞానపు మలినములు లేకుండా ఉండటమే శుద్ధత. 

ఏ రాగద్వేషములూ లేకుండా, నిర్మలాంతఃకరణముతో పూజిస్తే అమ్మకు ఇష్టం. 

శుద్ధమనసుతో ఉండేవారు, ఎంతో సౌందర్యంతో భాసిస్తారు. 

దేహసౌందర్యము తక్కువైనా, మనో సౌందర్యము, స్వచ్ఛ సౌందర్యము లతో ప్రకాశిస్తారు. 

అసలైన సౌందర్యం స్వచ్చతయే, శుద్ధమానసమే. 

నిర్మలాంతఃకరణులంటే ఇష్టపడే, ఆ శుద్ధమానస కు వందనం. 

ఓం శ్రీ శుద్ధమానసాయై నమః  


974. బిందుతర్పణసంతుష్టా

బిందువు నందు తర్పణము చేస్తే సంతోషించేది బిందుతర్పణసంతుష్టా. 

శ్రీచక్రంలో సర్వోపరిచక్రం సర్వానందమయ చక్రం. దీనినే బిందువు అంటారని చెప్పుకున్నాం. 

మహాకామేశ్వరి, కామేశ్వరుడు ఆ బైందవాసనంలో సామరస్యంగా కూర్చుని ఉంటారని 

తెలుసుకున్నాం. ఆ బిందువు వద్ద తర్పణం చేస్తే సంతోషించునది లలితాపరమేశ్వరి. 

ఆ సర్వానందమయ చక్రం వద్ద, బ్రాహ్మణులు క్షీర బిందువుల తోనూ, క్షత్రియులు ఆజ్య(నేయి)

బిందువుల తోనూ, వైశ్యులు తేనె బిందువుల తోనూ, శూద్రులు మద్య బిందువుల తోనూ తర్పణం  

చేస్తే సంతసించేది లలితాదేవి. 

బోయ తిన్నడు కల్లు, మాంసముతో సేవిస్తే మెచ్చి మోక్షమివ్వలేదా. 

భక్తితో పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదిచ్చినా అమ్మకు ఇష్టమే. 

అన్నీ తెలిసిన జ్ఞాని తృప్తి చెందితే, తాను కూడా తృప్తి చెందునది అని మరొక భావం. 

బైందవంలో బిందు తర్పణాలు చేస్తే సంతోషపడే, ఆ బిందుతర్పణసంతుష్టా కు వందనం. 

ఓం శ్రీ బిందు తర్పణ సంతుష్టాయై నమః 


975. పూర్వజా

పూర్వజా అంటే, ముందే పుట్టినది అని అర్ధం. అందరికన్నా ముందే పుట్టినది, అన్నింటి కన్నా 

ముందు నుంచే వున్నది అని ఈ నామ భావం. 

పుట్టినది అని అంటున్నాం కానీ, ఆ లలితాపరమేశ్వరీదేవికి జననమరణములు లేవు. 

కల్పాంతంలో కూడా మాహేశ్వరుడు చేసే మహా తాండవ నృత్యానికి ఏకైక సాక్షి శ్రీలలితే. 

ప్రళయానికి ముందూ, ప్రళయానికి తరువాతా కూడా ఉండేది నిత్యముక్త యైన పూర్వజ. 

అమ్మ యొక్క ఈ విభూతి గురించి అగ్రగణ్యా నామంలో కూడా చెప్పుకున్నాం. 

శ్రీలలిత ఈ జగత్తుల కన్నా ముందే ఉన్నదని వేదములో కూడా చెప్పబడింది. 

వేదముల కన్నా పూర్వము నుంచి వున్నది పూర్వజా.

అమ్మ ఇచ్ఛాశక్తి స్వరూపురాలు కనుక, అబుద్ధి పూర్వక ప్రధమ సృష్టి స్వరూపురాలు అని అర్ధము. 

జగత్తుల కన్నా, వేదము కన్నా, బుద్ధి కన్నా, ముందే ప్రభవించిన, ఆ పూర్వజ కు వందనం. 

ఓం శ్రీ పూర్వజాయై నమః


976. త్రిపురాంబికా

త్రిపురాంబికా అంటే త్రిపురములకూ అమ్మ. 

శ్రీచక్రములోని అష్టమావరణ దేవతకు త్రిపురాంబికా అని పేరు. కనుక అమ్మను ఈ నామంలో 

శ్రీచక్ర అష్టమచక్రాభిమానినీ అంటున్నాం. 

జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలకూ త్రిపురములని పేరు. ఈ అవస్థాత్రయ  జననిని 

త్రిపురాంబా అంటాం. 

వేదములో, జీవుడు మూడు పురములందు క్రీడిస్తున్నాడు, అని చెప్పారు. 

ఈ మూడు అవస్థలనే మూడు పురములలో జీవుడు తిరుగుతూ వున్నాడు అని అర్ధం. 

ఆ జీవుల జనని త్రిపురాంబికా. సృష్టి స్థితి లయములన్నీ ఈ జనని నుంచే జరుగుతున్నాయి. 

స్థూల, సూక్ష్మ, కారణ దేహాలనే మూడు పురములకూ అధిష్ఠాత్రి.  

వాగ్భవ, కామరాజ, శక్తి కూటములకు అధినేత్రి. త్రిగుణాలకు అధిపతి. 

శ్రీచక్రంలో నవావరణలకూ మూలదేవత కనుక త్రిపురాంబికా అన్నారు.  

త్రిపురాలకూ, త్రిపురాలలో కల జీవులకూ జనని యైన, ఆ త్రిపురాంబిక కు వందనం. 

ఓం శ్రీ త్రిపురాంబికాయై నమః

  





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

          

2 కామెంట్‌లు: