అయోనిః, యోనినిలయా, కూటస్థా, కులరూపిణీ ॥ 166 ॥
890. విశ్వగ్రాసా
ప్రళయకాలంలో తాను పోషించి పెంచిన సృష్టిని తానే కబళిస్తున్న, ఆ విశ్వగ్రాసా కు వందనం.
ఓం శ్రీ విశ్వగ్రాసాయై నమః
891. విద్రుమాభా
విద్రుమము అంటే పగడము. విద్రుమమంత ఎర్రగా మెరిసే కాంతితో ప్రకాశించేది విద్రుమాభా.
అమ్మను ఈ నామంలో ఎర్రని పగడాల చెట్టుకి వచ్చే పగడాలతో పోలుస్తున్నారు.
స్వచ్ఛమైన పగడానికి కాంతి ఎక్కువ. ఎర్రదనమూ ఎక్కువే.
శ్రీలలిత అరుణవర్ణ కదా, అందుకే ఈ నామంలో అమ్మను 'పగడపు కాంతితో ప్రకాశించే తల్లీ' అని
కీర్తిస్తున్నాం. పగడపు చెట్టు శాఖోపశాఖలుగా ఎదుగుతుంది. జ్ఞానమనే వృక్షం కూడా ఇదే విధంగా
చిలవలు పలవలుగా పెరుగుతుంది. జ్ఞానమనే పగడపు చెట్టు వంటి ఎర్రని ప్రభలతో వెలుగుతూ
ఉంటుంది అమ్మ.
పగడపు కాంతిని పోలిన జ్ఞానకాంతితో మెరిసిపోతున్న, ఆ విద్రుమాభా కు వందనం.
ఓం శ్రీ విద్రుమాభాయై నమః
892. వైష్ణవీ
వైష్ణవీ అంటే విష్ణు శక్తి, విష్ణువుకు సంబంధించినది అని భావం.
దేవీపురాణంలో, వైష్ణవీ అంటే, నాలుగు రకాలుగా చెప్పారు.
విష్ణువు వలె శంఖ, చక్ర, గదాయుధాలను ధరించి ఉంటుంది, కనుక వైష్ణవీ అన్నారు.
విష్ణువుకు జన్మ ఇచ్చిన జగన్మాత, కనుక వైష్ణవీ అన్నారు.
విష్ణువు వలె శత్రువులను సంహరించింది, కనుక వైష్ణవీ అన్నారు.
స్వయంగా విష్ణుస్వరూపురాలు, కనుక వైష్ణవీ అన్నారు.
విష్ణు సమాన శక్తి స్వరూపురాలయిన, ఆ వైష్ణవి కి వందనం.
ఓం శ్రీ వైష్ణవ్యై నమః
ఓం శ్రీ విష్ణురూపిణ్యై నమః
894. అయోనిః
అయోని అంటే కారణము లేనిది అని అర్ధం. తాను పుట్టుటకు ఏ కారణమూ లేనిది అయోని.
యోని అంటే స్థానము అని కూడా అర్ధం.
అయోని అంటే పరిమిత స్థానములో కాక విశ్వమంతా కూడా విస్తరించునది అని భావం.
కనుక అయోని అంటే అపరిచ్ఛిన్న స్వరూపురాలు అనే అర్ధం కూడా వుంది.
విష్ణువును కన్న తల్లి అయోని అని చెప్పబడింది.
ఇంత అని చెప్పలేని అపరిమిత వ్యాప్తి కల, ఆ అయోని కి వందనం.
ఓం శ్రీ అయోన్యై నమః
895. యోనినిలయా
జగత్తంతా దేనిలో లయిస్తుందో అది నిలయము. యోని అంటే ప్రకృతి స్వరూపము అని అర్ధం.
యోని నిలయా అంటే, ప్రకృతి యందు లయించునది, పరబ్రహ్మ అని అర్ధం.
వేదములో యోని అంటే, కర్త, ఈశ్వరుడు, పురుషుడు, బ్రహ్మ, ప్రకృతి, మాయ అనే అర్ధాలలో
వాడబడింది.
జగత్కారణులైన బ్రహ్మాదులు లయించు త్రికోణ చక్రమునకు యోని అని పేరు.
ఆ త్రికోణచక్రమే నివాసముగా కలది శ్రీమాత.
శ్రీచక్రమధ్యమంలో యోనిద్వారము వలె ఉన్న త్రికోణమును యోని అంటారు.
ఆ యోని మధ్యములో బిందురూపములో సుఖముగా నివసించునది శ్రీమాత.
త్రికోణచక్రం మధ్యలో గల బిందు రూపములో సుఖముగా వుండు, ఆ యోనినిలయ కు వందనం.
ఓం శ్రీ యోనినిలయాయై నమః
896. కూటస్థా
కూట అంటే అజ్ఞానం. అజ్ఞానంలో అధ్యక్షురాలై ఉండేది కూటస్థా.
కూటస్థా అంటే అజ్ఞానమునకు నివాసము. కదలక మెదలక ఉండేది కూటస్థా.
కమ్మరివాళ్ళు ఇనుమును కొట్టటానికి ఒక ఇనుపదిమ్మెను, కూటాన్ని, భూమిలో పాతి, దాని మీద
కాల్చిన కమ్మీని వుంచి సుత్తెతో కొడతారు. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత వేడి కమ్మీని ఉంచినా
ఆ కూటం కదలదు. నిర్వికారంగా ఉంటుంది.
ఆ కూటము వలె, దేనికీ చలించక స్థిరంగా ఉండేదే కూటస్థా.
'కూటస్థమచలం ధృవం' అని గీతలో కూడా చెప్పారు.
అంటే, కదలకుండా గిరిశృంగము వలె ఉండునది కూటస్థా.
వాగ్భవాది మూడు కూటములలో ఉండునది కూటస్థా.
కూటము అంటే యంత్రము, యంత్రము అంటే శ్రీయంత్రము.
శ్రీచక్రంలో అయిదు శక్తి త్రికోణాలు అధోముఖంగా ఉంటాయి. నాలుగు శివ త్రికోణాలు ఊర్ధ్వ
ముఖంగా ఉంటాయి. ఈ చక్రాలన్నీ ఒక దానిమీద ఒకటి పేర్చబడినట్టుగా ఏర్పడి ఉంటాయి.
శివ శక్తి త్రికోణాల కలయికను సూచించేదే శ్రీచక్రం. ఈ శివ శక్తి చక్రాల పరస్పర అవినాభావ
సంబంధాన్ని తెలిసినవాడే చక్ర విదుడు, అంటే శ్రీ చక్ర రహస్యములను తెలిసినవాడు అని
లలితా త్రిశతి చెప్తోంది. ఆ శ్రీచక్రాంతర్గత త్రికోణచక్రములలో నివసించునదే కూటస్థా.
శ్రీచక్రయంత్రములో నివసించు, ఆ కూటస్థ కు వందనం.
ఓం శ్రీ కూటస్థాయై నమః
897. కులరూపిణీ
కులము అనగా జాతి, సమూహము, వంశము అని చెప్పుకున్నాం.
కౌలమార్గము అంటే, కులాచారము ప్రకారము చేసే బాహ్యపూజ.
ఆ బాహ్యపూజా స్వరూపురాలు అని కులరూపిణీ నామానికి అర్ధం.
పరంపరానుగతంగా వస్తున్న వంశాచార స్వరూపురాలు కులరూపిణీ.
కనుక వంశాచారాన్ని చిన్నచూపు చూడకూడదు. ఆ ఆచారమే శ్రీమాత.
వంశాచార స్వరూపురాలైన, ఆ కులరూపిణి కి వందనం.
ఓం శ్రీ కులరూపిణ్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి