శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ ॥ 182 ॥
ఓం శ్రీ ఆబాలగోప విదితాయై నమః
995. సర్వానుల్లంఘ్య శాసనా
సర్వానుల్లంఘ్యశాసనా అంటే, సర్వ అనుల్లంఘ్య శాసనా అని అర్ధం.
అంటే ఎవరూ ఉల్లంఘించలేని శాసనములు చేయునది, లేదా శాసనములు కలది అని భావం.
బ్రహ్మాదులకైనా అమ్మ శాసనం ఉల్లంఘించటం అసాధ్యం.
అందరికీ అమ్మే కదా అని, చులకన భావంతో కానీ, అతి పరిచయమైనది కదా అనే చనువు చేత
కానీ అమ్మమాటను నిరాకరిస్తే, నిరాదరణ చేస్తే అమ్మ ఊరుకోదు.
తాను చేసిన శాసనములను ఎవరూ ఉల్లంఘించకుండా పరిపాలన చేస్తున్న శ్రీమహారాజ్ఞి శ్రీమాత.
రాజ్యపాలన సవ్యంగా నడవాలంటే, శాసననియమాలను పాటించవలసిందే.
అలా శాసన నియమాలను పాటించకుండా తనది కాని, అమ్మ తనకు అప్పగించని స్వర్గాధిపత్యం
వంటివి ఆశించిన అసురుల గతి ఏమయ్యిందో అందరికీ తెలుసు.
కనుక అమ్మ సర్వానుల్లంఘ్య శాసనా.
సౌందర్యలహరిలో శంకరభగవత్పాదులు, 'బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు తమకు
అప్పగించిన పంచకృత్యములనూ, నీ ఆజ్ఞ ననుసరించి నీ కనుసన్నలలో చేస్తున్నారు"
అంటాడు. కనుక ఎవరికైన అమ్మ శాసనమే శిరోధార్యము.
మన అమ్మే కదా అని తేలికగా చూడరాదు, అని ఈ నామం చెప్తున్నది.
కానీ అమ్మకు ఏ నియమములూ, శాసనములూ లేవు. ఆమె సర్వానుల్లంఘ్యశాసనా, అంటే అన్ని
శాసనములూ ఉల్లంఘించ గల ఏకైక శక్తి స్వరూపిణి శ్రీమాత.
తన భక్తులకోసం అమ్మ తన శాసనాలను తానే ఉల్లంఘిస్తుంది.
మిగిలిన అవతారాలలో తప్పులు చేసిన వారిని హననం చేసిన పరమేశ్వరి,
త్రివిక్రముడిగా బలిని కరుణించలేదా.
ఆయుష్షు తీరిన మార్కండేయుడిని యమపాశం నుంచి రక్షించి, చిరంజీవిగా చెయ్యలేదా.
భక్తుల కోసం, తన శాసనాలను తానే ఉల్లంఘించగల మహాశక్తి ఆ త్రిపురసుందరి.
శాసనం చేసినా, శాసనోల్లంఘనం చేసినా, శాసనోల్లంఘనం చేసిన వారిని దండించినా అమ్మకే
చెల్లు. శాసనమూ, పాలనమూ రెండూ అమ్మ బాధ్యతే కదా.
అన్యులెవరూ ఉల్లంఘించలేని శాసనములు గల, ఆ సర్వానుల్లంఘ్య శాసన కు వందనం.
ఓం శ్రీ సర్వానుల్లంఘ్య శాసనాయై నమః
996. శ్రీ చక్రరాజనిలయా
శ్రీ చక్రరాజమే ఆవాసముగా గల చక్రేశ్వరి అని ఈ నామానికి అర్ధం.
శ్రీచక్రాన్ని చక్రరాజము అంటారు.
ఆ చక్రరాజములో నివసించేది కనుక, ఆ శ్రీ రాజరాజేశ్వరిని శ్రీచక్రరాజనిలయా అంటున్నాం.
శ్రీ చక్రంలో వున్న శివ, శక్తి త్రికోణాలు, శ్రీ చక్రమే శివశక్తుల నివాసమని తెలియచేస్తున్నాయి.
పంచప్రేతముల మంచము పైన, బిందుస్థానములో, కామేశ్వరునితో కూడి పవ్వళించే తల్లి
కామేశ్వరి. శ్రీచక్రమంతా ఆవరించుకుని వున్న శక్తిస్వరూపమే శ్రీలలిత.
శ్రీచక్రంలో భూప్రస్తారమనీ, మేరుప్రస్తారమనీ, కైలాసప్రస్తారమనీ అనేక రకాలున్నాయని కూడా
చెప్పుకున్నాం. అన్ని రకములైన ప్రస్తారముల లోనూ కొలువై వున్నది కామేశ్వరీకామేశ్వరులే.
శ్రీచక్రమే వారి గృహము. కనుక అమ్మకు శ్రీచక్రరాజనిలయా అనే పేరు వచ్చింది.
శ్రీచక్రమనే ఇంటిలో నివసిస్తున్న, ఆ శ్రీ చక్రరాజనిలయ కు వందనం.
ఓం శ్రీ శ్రీ చక్రరాజనిలయాయై నమః
ఓం శ్రీ శ్రీమత్త్రిపురసుందర్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
ఈ లలితా సహస్ర నామావళి commentary ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు విజయఅక్కయ్యకి శుభాకాంక్షలు!! అలాగే దీన్ని పుస్తక రూపంలో తీసుకువస్తే బాగుంటుంది. దేవాలయాలకి వెళ్ళినపుడు అక్కడ కూర్చుని పారాయణ చేసుకోవడానికి, చదువుకోవడానికి బాగుంటుంది.
రిప్లయితొలగించండిThank you Mahalakshmi.
రిప్లయితొలగించండిChala baaga. Vivarana yechharu maaku tealiyani vivaraalu chala meevalla tealisaayr thankyou very much
రిప్లయితొలగించండి