9, జనవరి 2022, ఆదివారం

170. చైతన్యార్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్య పాటలా

 

చైతన్యార్ఘ్య సమారాధ్యా, చైతన్య కుసుమప్రియా 
సదోదితా, సదాతుష్టా, తరుణాదిత్య పాటలా ॥ 170 ॥

918. చైతన్యార్ఘ్య సమారాధ్యా

చైతన్యమనే జ్ఞానామృత రసముచే చక్కగా ఆరాధింపబడుచున్నది అని ఈ నామానికి అర్ధం. 

శివసూత్రాలలో చైతన్యము అంటే ఆత్మ అని చెప్పారు. ఆత్మయే పూజాద్రవ్యము. 

భావనోపనిషత్తులో జ్ఞానము అనేది పూజాద్రవ్యమని చెప్పబడింది. 

చైతన్యము, ఆత్మా, జ్ఞానము అన్నీ ఒక్కటే. అర్ఘ్యమంటే చేతులు కడుగుకునేందుకు ఇచ్చే నీరు.   

చైతన్యము అనే అర్ఘ్యము చేత అంతరంగములో ఆరాధించబడుచున్న దేవి అని ఈ నామార్ధం.   

స్కాందపురాణంలో, "ఆత్మస్వరూపురాలయిన శ్రీదేవిని, చైతన్యమనే పూజా ద్రవ్యముచే, 

జ్ఞానానుభూతితో సేవిస్తే, మోక్షము సిద్ధిస్తుంది", అని వుంది. 

సూతసంహితలో, చైతన్య వాచక మంత్రాన్ని పదివేలసార్లు జపిస్తే మహాపాతకాలు కూడా నశిస్తాయి 

అని చెప్పారు. ఆ సంహితలోనే, చైతన్యమంటే భువనేశ్వరీవిద్య అని చెప్పబడింది. 

కనుక చైతన్య వాచక మంత్రమంటే భువనేశ్వరీ మంత్రం. 

రుద్రయామళంలో అర్ఘ్యమంటే, జ్ఞానము, మద్యము అనే అర్ధాలు చెప్పారు. ఈ నామంలో జ్ఞానము 

అనే అర్ధాన్నే స్వీకరించాలి. 

భువనేశ్వరీ దేవి చైతన్యమనే ఆర్ఘ్యంతో ఆరాధింపదగినది అని భావం. 

అంతర్ముఖంగా, ఆత్మజ్ఞానమనే చైతన్యామృతరసంతో ఆరాధింపబడే, 

ఆ చైతన్యార్ఘ్య సమారాధ్య కు వందనం. 

ఓం శ్రీ చైతన్యార్ఘ్య సమారాధ్యాయై నమః  


919. చైతన్య కుసుమప్రియా

చైతన్యము అనెడు పుష్పాలంటే ప్రీతి కలది చైతన్యకుసుమప్రియా. 

బాహ్యముగా లభించే పువ్వులకన్నా, అంతరంగంలో ఉద్భవించే పుష్పాలంటే ప్రీతి కలది. 

సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుడు, శ్రీమాతను 'ఆత్మజ్ఞానము వలన కలిగే, చైతన్య 

కుసుమముల నుంచి స్రవించే పూదేనెతో' పోల్చాడు.  

అహింస, ఇంద్రియనిగ్రహం, శాంతి, దయ, జ్ఞానము, తపస్సు, సత్యము, ధ్యానము లనేవి 

చైతన్య కుసుమాలు. వీటినే పుష్పాష్టకము లంటారు. 

ఈ పుష్పములతో చేయు సేవ యందు ఇష్టము కలది అని భావం. 

చైతన్యము అనే పుష్పము నుంచి స్రవించిన మకరందం అంటే ప్రియమైనది అని అర్ధం. 

కనుక పరమేశ్వరిని ఇటువంటి చైతన్యకుసుమాలతో అర్చించాలి అని ఈ నామ భావం. 

అంతరంగంలో చేసే చైతన్యకుసుమార్చన అంటే మక్కువ చూపే, 

ఆ చైతన్య కుసుమప్రియ కు వందనం.  

ఓం శ్రీ చైతన్య కుసుమప్రియాయై నమః  


920. సదోదితా

సదా అంటే ఎల్లప్పుడూ ఉదితా ఉదయించునది అని అర్ధం. 

స్వప్రకాశముతో నిత్యమూ ఉదయించునది, ప్రకాశముతో తేజరిల్లునది అని భావం. 

సజ్జనులయందు అతిశయముగా అధివసించి ఉండునది అని కూడా ఒక అర్ధం. 

నిత్యమూ ప్రకాశవంతముగా ఉదయించు, ఆ  సదోదిత కు వందనం. 

ఓం శ్రీ సదోదితాయై నమః  


921. సదాతుష్టా

సదాతుష్టా అంటే, నిత్యమూ సంతోషమును కలిగివుండునది అని అర్ధం. 

తాను సంతోషముగా ఉండునది, తన భక్తులను సంతోషముగా వుంచునది అనే అర్ధాలు 

ఈ నామానికి వర్తిస్తాయి. భక్తుల కోరికలు తీర్చి, వారికి సంతోషమును కలుగచేయునది శ్రీమాత. 

సత్పురుషుల యందు సంతోషమును చూపునది అని భావం. 

నిత్యమూ ఆనందముతో వుండు, ఆ సదాతుష్ట కు వందనం. 

ఓం శ్రీ సదాతుష్టాయై నమః 

  

922. తరుణాదిత్య పాటలా

తరుణము అంటే యౌవనము అని అర్ధం. మధ్యాహ్న సూర్యుడిని తరుణుడు అంటారు.  

ఆ మధ్యాహ్న సమయంలో తరుణాదిత్యుడు శ్వేతరక్తమైన, పాటళవర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు. 

పరమేశ్వరి ఆ పాటల వర్ణ ఆదిత్య స్వరూపిణి అని ఈ నామానికి అర్ధం. 

వేదములో, "మోక్షసిద్ధి కొరకు ధవళవర్ణ శాంతమూర్తిని, వశీకరణము, శృంగారము కొరకు 

పాటళవర్ణమూర్తిని, ధనము కొరకు పీతవర్ణమూర్తిని, శత్రు సంహారమునకు నల్లనిమూర్తిని,

ద్వేషమును కలిగించటానికి బభ్రువర్ణ (సువర్ణ) మూర్తిని, అన్నీ కావాలంటే సర్వవర్ణమూర్తిని, 

పరమాత్మనే కోరితే, జ్యోతిర్మయ స్వరూపమును ధ్యానించాలి", అని చెప్పారు. 

ఆరక్తవర్ణములో ప్రకాశించు, ఆ తరుణాదిత్య పాటల కు వందనం. 

ఓం శ్రీ తరుణాదిత్య పాటలాయై నమః 







------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి