7, జనవరి 2022, శుక్రవారం

168. తత్త్వాధికా, తత్త్వమయీ, తత్త్వమర్థ స్వరూపిణీ సామగానప్రియా, సౌమ్యా, సదాశివ కుటుంబినీ

 

తత్త్వాధికా, తత్త్వమయీ, తత్త్వమర్థ స్వరూపిణీ 
సామగానప్రియా, సౌమ్యా, సదాశివ కుటుంబినీ ॥ 168 ॥


906. తత్త్వాధికా

ప్రళయపర్యంతమూ వుండే ధాతువులకు తత్త్వములని పేరు. 

తత్త్వములు మొత్తం ముప్పది ఆరు అని ముందే చెప్పుకున్నాం. 

ఈ తత్త్వాలన్నీ ప్రళయకాలము వరకూ ఉంటాయి. శ్రీమాత ప్రళయకాలము లోనూ, ప్రళయము 

తరువాత జరిపే పునఃసృష్టి కార్యములో కూడా ఉంటుంది. కనుక ఈ తత్త్వాలన్నింటి కన్నా 

అధికురాలు శ్రీమాత. అందుకే అమ్మను ఈ నామంలో తత్త్వాధికా అంటున్నాం. 

మన కంటికి కనిపించేవన్నీ ప్రళయము వరకూ నిలువవు. ప్రళయము వరకూ నిలిచేవే తత్త్వాలు. 

మిగిలినవన్నీ భూత శరీరములకు భోగానుభూతులు ఇవ్వటం కోసమే ఉన్నాయి. 

 ఈ శరీరములు, వాటిని కప్పి ఉంచే వస్త్రాదులు ఏవీ శాశ్వతము కావు. ఈ ఘట, పటాదులు అన్నీ 

అశాశ్వతము. ప్రళయము వరకూ కూడా ఉండవు. 

తత్త్వములు కూడా ప్రళయకాలము వరకూ మాత్రమే ఉంటాయి. 

ప్రళయకాలము వరకూ వుండే తత్త్వాలన్నిటి కన్నా అధికురాలైన,  ఆ తత్త్వాధిక కు వందనం. 

ఓం శ్రీ  తత్త్వాధికాయై నమః  


907. తత్త్వమయీ

తత్త్వమయీ అంటే, తత్త్వములతో నిండి వున్నది అని అర్ధం. 

ఆ లలితాపరమేశ్వరిది చిన్మయ స్వరూపము, అందుకే ఈ నామంలో తత్త్వమయీ అంటున్నాం.  

అమ్మను అన్ని తత్త్వముల కన్నా అధికురాలు అని ముందు నామంలో చెప్పుకున్నాం. 

కనుక అమ్మ శివతత్త్వాని కన్నా కూడా అధికురాలు. చైతన్య స్వరూపము కనుక చిన్మయి అన్నాం. 

అమ్మకు కల శివాధిక్యము చేత అమ్మను సంప్రజ్ఞాత సమాధి స్వరూపురాలు అంటున్నాం. 

సంప్రజ్ఞాత సమాధి గురించి పతంజలి తన యోగసూత్రాలలో చెప్పాడు. 

సంప్రజ్ఞాతం అంటే, సమ్యక్ జ్ఞాతం, దేనినైనా చక్కగా, స్పష్టంగా, విపులంగా తెలుసుకోవడమే 

సంప్రజ్ఞాతం. మనసును ఒక  విషయమందు నిలిపితే సమాధి సిద్ధిస్తుంది. 

సవితర్కం, సవిచారం, సానందం, సాస్మిత అనే నాలుగూ సంప్రజ్ఞాత సమాధికి సోపానాలు. 

అంటే ముందుగా తర్కించుకోవాలి, విశ్లేషించుకోవాలి, అలా పొందిన జ్ఞానాన్ని 

ఆనందించాలి, చివరగా అదే నేను అనే భావన పొందాలి. ఇదే సంప్రజ్ఞాత సమాధి. 

ఈ సమాధి స్థితిని చేరితే, ఆత్మతత్త్వం, విద్యాతత్త్వం, శివతత్త్వం బోధపడి, అనేకానేక 

అనుభూతులు కలుగుతాయి. ఈ సమాధిలో వున్నప్పుడు, కొందరు ఏడిస్తే, కొందరు నవ్వుతారు, 

కొందరు కంపిస్తారు, కొందరికి రెప్పపాటు పడదు, కొందరికి రెప్ప తెరుచుకోదు. 

ఈ ప్రక్రియ అంతా గురువుల సమక్షంలో చేయటం శ్రేయస్కరం.  

ఆత్మ-సత్, విద్యా-చిత్, శివ-ఆనంద, అంటే ఆత్మతత్త్వం, విద్యాతత్త్వం, శివతత్త్వం అంటే 

సచ్చిదానంద స్వరూపం. 

కామికాగమములో, 'శరీరములో వున్న ముప్పది ఆరు తత్త్వములకూ కలిపి తత్త్వాధ్వమని పేరు. 

అమ్మ ఆ తత్త్వాధ్వ స్వరూపురాలు', అని చెప్పబడింది.  

సంప్రజ్ఞాత సమాధి స్వరూపురాలైన, ఆ తత్త్వమయీ కి వందనం.  

ఓం శ్రీ తత్వమయ్యై నమః  


908. తత్త్వమర్థ స్వరూపిణీ 

తత్త్వం అంటే, తత్, త్వం అనే జంట పదాల సమష్టి రూపం. 

తత్ అంటే ఈశ్వరుడు, త్వం అంటే జీవుడు. ఈ ఇద్దరి కలయికే తత్త్వం. 

తత్త్వమసి అనే మహావాక్యములో, తత్, త్వం, అసి అంటే జీవేశ్వరులిద్దరూ అభేదము అని 

చెప్తున్నారు.  తత్, త్వం రెండూ ఆ లలితాపరమేశ్వరియే. అందుకే ఈ నామంలో ఆ జగన్మాతను, 

జీవేశ్వర స్వరూపము కనుక, తత్త్వమర్ధస్వరూపిణీ అంటున్నాం. 

అంటే, జీవుడూ, ఈశ్వరుడూ ఇద్దరి స్వరూపమూ ఆ లలితాపరమేశ్వరియే అని అర్ధం.  

అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమైన, ఆ  తత్త్వమర్థ స్వరూపిణి కి వందనం. 

ఓం శ్రీ  తత్త్వమర్థ స్వరూపిణ్యై నమః  


909. సామగానప్రియా

సామగానమంటే ఇష్టపడునది సామగానప్రియా. 

గంధర్వాది గాయక శ్రేష్ఠుల గానములను ప్రీతితో ఆలకించునది సామగానప్రియా. 

సామగుడు అంటే సామవేదం పఠించే పాఠకుడు. సామగులంటే ఇష్టపడేది అని కూడా అర్ధం.  

సామవేదసంహిత దేవతలను ప్రసన్నం చేసుకునే గానవిధిని గురించి చెప్తుంది. 

చాందోగ్యోపనిషత్తులో పంచవిధ సామము, సప్తవిధ సామము లను ఉపాసన చెయ్యటం చెప్పారు. 

దేవీభాగవతంలో సత్యవ్రతుని కథలో సామగానం చేస్తే దేవతలు సంతోషిస్తారని చెప్పారు. 

సంగీతానికి మూలమైన సామవేదమంటే ఆసక్తి, ప్రీతి కలిగినది సామగానప్రియా. 

అమ్మకు కీర్తనలన్నా, వేదపాఠాలన్నా ఇష్టము అని ఈ నామభావం. 

భక్తులు తనను కీర్తనలతో, గానములతో తృప్తి పరిస్తే, అభీష్టములు తీరుస్తుంది. 

రామదాసు, అన్నమయ్య, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి, ఆదిభట్ల వంటి మహాత్ములు 

తమ కీర్తనలతోనే ఆ పరమాత్మను సేవించారు. 

హరికథలు చెప్పినా, హరికీర్తనలు గానం చేసినా ఆనందించేది సామగానప్రియా. 

సామవేద పాఠం పారాయణ పట్ల ప్రీతి  కలిగివుండే, ఆ సామగానప్రియ కు వందనం. 

ఓం శ్రీ సామగానప్రియాయై నమః 

  

910. సౌమ్యా

సౌమ్యా, అంటే సోమ యాగము చేత ఆరాధించబడినది అని అర్ధం. 

సోమలతా స్వరూపురాలు, సోమపానమునకు అర్హురాలు అని కూడా అర్ధం. 

ఈ నామానికి సోమ్యా అనే పాఠాంతరము కూడా వుంది. 

సోమ అంటే చంద్రుడు, కర్పూరము అనే అర్ధాలు వున్నాయి. 

కర్పూరము వలె చల్లగా ఉండునది అనీ, చంద్రుని వలె ఆహ్లాదం కూర్చున్నది అనీ భావం. 

స, ఉమా- సోమ అనే అర్ధంలో, ఉమతో కూడిన శివుడిని సోముడంటారు. 

కనుక శివ శరీరములో సగమైన పార్వతి అనే అర్ధం కూడా వస్తుంది. 

శివ శరీరములో సగమై, ఆహ్లాదాన్నిస్తున్న, ఆ సౌమ్య కు వందనం. 

ఓం శ్రీ సౌమ్యాయై నమః 


911. సదాశివ కుటుంబినీ

సదాశివ కుటుంబినీ అంటే శివుని ఇల్లాలు, పార్వతి అని అర్ధం. 

పంచబ్రహ్మలలో ఒకడు సదాశివుడు. 

ఈ సదాశివునికి శుద్ధవిద్య అయిన శ్యామలాదేవి, అశ్వారూఢా అనే శక్తులు భార్యలు. 

సదాశివునికి సంబంధించిన శక్తులనన్నీ, సాంకేతికంగా సదాశివునికి భార్యలుగా స్వీకరించాలి. 

అన్ని శక్తి స్వరూపాలూ ఆ పరమేశ్వరియే, అన్ని పదార్ధ స్వరూపాలూ ఆ పరమేశ్వరుడే. 

ఈ స్థావరజంగమాత్మకమైన సమస్త సృష్టి అంతా ఆ సదాశివ కుటుంబమే. 

ఆ సదాశివ కుటుంబస్త్రీ సదాశివకుటుంబినీ అయిన పార్వతీదేవి. 

సదాశివుని ఇల్లాలైన, ఆ సదాశివ కుటుంబిని కి వందనం. 

ఓం శ్రీ సదాశివ కుటుంబిన్యై నమః 





------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి