ఓం శ్రీ పంచమ్యై నమః
949. పంచభూతేశీ
పంచభూతములకు అధీశ్వరి కనుక, అమ్మను ఈ నామంలో పంచభూతేశీ అంటున్నాం.
పంచభూతములను వశములో వుంచుకున్న మహాశక్తి పంచభూతేశీ.
విష్ణుమూర్తి ధరించు వైజయంతీమాల స్వరూపురాలు అని ఒక అర్ధం.
విష్ణురహస్యములో, "పృధివి నుంచి నీలము, ఉదకముల నుంచి ముత్యము, అగ్ని నుంచి
కౌస్తుభము (మాణిక్యము), వాయువు నుంచి వైడూర్యము, ఆకాశము నుంచి పుష్యరాగము పుట్టాయి.
ఈ అయిదు రత్నములూ కూర్చి పేర్చిన మాల వైజయంతీమాల", అని వుంది.
కనుక పంచభూతముల నుంచీ వచ్చిన పంచరత్నములతో కూడిన వైజయంతీ మాలా
స్వరూపము పంచభూతేశీ.
పంచభూతములనూ మాల వలె ధరించిన, ఆ పంచభూతేశీ కి వందనం.
950. పంచసంఖ్యోపచారిణీ
పంచ ఉపచారములచే పూజింపబడే లలితాపరమేశ్వరిని ఈ నామంలో పంచసంఖ్యోపచారిణీ
అంటున్నాం. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం వీటిని పంచోపచారములని అంటారు.
నిత్యమూ అరవై నాలుగు ఉపచారములతో పూజించలేనివారు షోడశోపచారములతో పూజిస్తారు.
ఆ షోడశోపచారములనూ కూడా చేయలేనివారు పంచోపచారాలతో పూజిస్తారు. శ్రీలలిత, భక్తిగా
చేస్తే పంచోపచార పూజతో కూడా తృప్తి చెందుతుంది అని ఈ నామం చెప్తోంది.
శ్రీ లలిత పంచగవ్యాలతో సేవిస్తే ఇష్టపడుతుంది.
మానసపూజలో కూడా ఈ పంచ ఉపచారాలూ తప్పక ఉంటాయి.
లం పృథివీ తత్త్వాత్మికాయై నమః శ్రీ లలితాదేవ్యై గంధం పరికల్పయామి
హం ఆకాశ తత్త్వాత్మికాయై నమః శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి
యం వాయు తత్త్వాత్మికాయై నమః శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి
రం వహ్ని తత్త్వాత్మికాయై నమః శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి
వం అమృత తత్త్వాత్మికాయై నమః శ్రీ లలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి
పంచ భూతాత్మికగా పంచోపచారాలతో పూజలందుకునే, ఆ పంచసంఖ్యోపచారిణి కి వందనం.
ఓం శ్రీ పంచసంఖ్యోపచారిణ్యై నమః
951. శాశ్వతీ
శాశ్వతీ అంటే ఎప్పటికీ ఉండునది అని అర్ధం. శ్రీలలిత సృష్టి, స్థితి, లయము అనే మూడు
కాలముల యందూ ఉండునది కనుక, శాశ్వతీ అనబడుతోంది.
శాశ్వతము అంటే నిఘంటువులో స్థిరమైనది, నాశములేనిది, నిత్యమైనది అని అర్ధాలున్నాయి.
ఈ అర్ధములన్నీ పరమేశ్వరికి వర్తిస్తాయి, కనుక శ్రీలలిత శాశ్వతీ.
శ్రీలలిత నిత్యురాలు. ఎప్పుడూ సర్వకాల, సర్వావస్థల యందూ ఉంటుంది.
శ్రీలలిత కల్పాంతములో జరిగే ప్రళయకాలములో కూడా స్థిరముగా ఉంటుంది.
శ్రీలలిత నిత్యముక్త, కనుక ఆ తల్లికి నాశము లేదు. ఆ తల్లిని నిత్యమూ పూజిస్తూనే వుంటారు.
కనుక శ్రీలలితను ఈ నామంలో శాశ్వతీ అంటున్నాం.
నిత్యురాలైన, ఆ శాశ్వతీ కి వందనం.
ఓం శ్రీ శాశ్వత్యై నమః
952. శాశ్వతైశ్వర్యా
మహదైశ్వర్యమును కలిగినది కనుక పరమేశ్వరి శాశ్వతైశ్వర్యా.
ఐశ్వర్యము నిచ్చే దైవము ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని ఇల్లాలు కనుక, శాశ్వతైశ్వర్యా.
పంచబ్రహ్మలు మంచముగా కల ఆసనంపై పవళించు తల్లి కనుక, శాశ్వతైశ్వర్యా.
శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి ఇరువైపులా నిలుచుని వింజామరలు వీస్తూ వుంటారు.
ఆ మహదైశ్వర్యము శ్రీమాత ఒక్కరికే చెల్లు. కనుక అమ్మ శాశ్వతైశ్వర్యా.
కోరికలు లేకపోవటం కన్నా ఐశ్వర్యమేముంటుందీ, అమ్మ నిష్కామా కనుక, శాశ్వతైశ్వర్యా.
సూర్యచంద్రులు తాటంకాలు. ఆ లలితాపరమేశ్వరి ఐశ్వర్యమును ఈశ్వరుడైనా కొలవలేడు.
ఈశ్వరుడైనా కొలవలేని మహదైశ్వర్యం కల, ఆ శాశ్వతైశ్వర్యా కు వందనం.
ఓం శ్రీ శాశ్వతైశ్వర్యాయై నమః
953. శర్మదా
శర్మదా అంటే శర్మమును ఇచ్చునది. శర్మము అంటే సుఖము, ఆనందము అని అర్ధం.
పరమానందా, బ్రహ్మానందా, సుఖప్రదా, సుఖకరీ, సుఖారాధ్యా అనే నామాలు అమ్మకు ఉన్నాయి.
పరమేశ్వరి ఇచ్చే ఆనందం సామాన్యమైనది కాదు, శాశ్వతమైన ఆనందం. మహదానందం,
నిత్యానందం, బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందస్థితి కోసమే యోగులు, ఋషులు, ఉపాసకులు
పరితపిస్తూ వుంటారు. అటువంటి బ్రహ్మానంద స్థితిని సాధకులకు అనుగ్రహించేది కనుక,
అమ్మను ఈ నామంలో శర్మదా అంటున్నాం.
శర్మదా సుఖాన్నిస్తుంది. కోరికలు లేని స్థితి కన్నా సుఖమేమున్నదీ. తనకు శరణాగతి చేసిన
భక్తులను, మహా సుఖ స్థితికి చేరుస్తుంది. ఆ సుఖంలో ఆ ఆనందంలో శ్రీమాతను కొలుస్తూ
భక్తులు ముక్తులవుతారు.
శర్మ అంటే బ్రాహ్మణులని కూడా అర్థముంది. తనను నమ్మి కొలిచిన వారిని బ్రాహ్మణులుగా
ఉత్తీర్ణులను చేసేది శర్మదా. క్షత్రియుడైన విశ్వామిత్రుడిని, శూద్రకన్యక యైన అరుంధతిని
బ్రాహ్మణులను చేసింది కదా. కులోత్తీర్ణా అనే నామంలో కూడా చెప్పుకున్నాం. శ్రద్ధాభక్తులతో
తనను ఉపాసించువారిని కులము నుంచి పైకి ఉత్తీర్ణులను చేయునది కులోత్తీర్ణా అయిన
శ్రీ లలితాపరాభట్టారిక.
సుఖాన్నీ, ఆనందాన్నీ అనుగ్రహించే, ఆ శర్మద కు వందనం.
ఓం శ్రీ శర్మదాయై నమః
954. శంభుమోహినీ
శం అంటే, శుభం, శ్రేయం, స్వర్గం, ఆనందం, మంగళం, కళ్యాణం అనే అర్ధాలున్నాయి
ఈ మంగళములను, శుభములను కలిగించువాడు శంభుడు.
ఆ శంభుడిని మోహించినది శంభుమోహినీ. లేదా శంభుడే మోహించినది శంభుమోహినీ.
జగన్మోహినీ రూపంలో శివుడిని మోహపెట్టినది కనుక, శంభుమోహినీ.
శివుడంటే మోహము కలిగి, శివుని కొరకై తపస్సు చేసి, శివుడిని పెళ్లాడింది కనుక, శంభుమోహినీ.
శంభునితో పరస్పర మోహము కల, ఆ శంభుమోహిని కి వందనం.
ఓం శ్రీ శంభుమోహిన్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి