
స్తోత్రప్రియా, స్తుతిమతీ, శ్రుతిసంస్తుత వైభవా
మనస్వినీ, మానవతీ, మహేశీ, మంగళాకృతిః ॥ 172 ॥
927. స్తోత్రప్రియా
స్తోత్రములంటే ప్రీతి కలది స్త్రోత్రప్రియా. స్తుతులంటే మక్కువ చూపించేది స్తోత్రప్రియా.
స్తోత్రములంటే అమ్మ గుణములను భాషారూపములో వ్యక్తము చేయటమే.
స్తోత్రములు ఆరు విధములు. నమస్కారము, ఆశీర్వచనము, సిద్ధాంతవచనము, పరాక్రమము,
విభూతి, ప్రార్ధన అనునవి ఆరూ స్తుతులలో వివిధ రీతులు.
అమ్మకు ఈ ఆరు స్తుతులూ సహస్రనామ స్తోత్రంలో వున్నాయి.
త్రిజగద్వంద్యా అనే నామంలో నమస్కార స్తుతి, స్తుతిమతీ అనే నామంలో ఆశీర్వచన స్తుతి,
మిధ్యాజగదధిష్ఠానా అనే నామంలో సిద్ధాంత స్తుతి, భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ
నామంలో పరాక్రమ స్తుతి, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ అనే నామంలో విభూతి స్తుతి,
సామ్రాజ్యదాయినీ నామంలో ప్రార్ధనా స్తుతి వున్నాయి.
ఈ విధంగా తన గుణగణాల కీర్తనలంటే ఇష్టము కలది అని ఈ నామ భావం.
ఆ స్తుతులు చేయువారి పట్ల ప్రీతిని,ఆసక్తిని చూపించునది అని కూడా భావం.
స్తోత్ర, అప్, ప్రియా అని పదవిభజన చేసుకంటే, స్తోత్రములైన ఉదకములు ఇష్టముగా కలది అని
అర్ధం. వేదములో దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు, ఈ నలుగురికీ అప్పులని పేరు.
అప్పులంటే ఉదకములు. వేదములోనే ఈ సమస్త దృశ్యాదృశ్య ప్రపంచమంతా నీరే అన్నారు.
తన గుణగణములను కీర్తించే స్త్రోత్రములంటే ఇష్టము కల, ఆ స్తోత్రప్రియా కు వందనం.
ఓం శ్రీ స్తోత్రప్రియాయై నమః
928. స్తుతిమతీ
తనపై రచించిన, గానం చేయబడుతున్న స్తుతులు, స్తోత్రములు కలది అని ఈ నామ భావం.
స్తుతులన్నీ అమ్మతో కర్మతాసంబంధమున్నవి కనుక, అమ్మను ఈ నామంలో స్తుతిమతీ
అంటున్నాం. అమ్మ గుణగణగానమే కదా స్తుతులు.
అమ్మను స్తుతిస్తే జ్ఞానమనే ఐశ్వర్యం లభిస్తుంది. కనుక అమ్మ స్తుతిమతీ.
తనను స్తుతించే భక్తులకు జ్ఞానమనే ఐశ్వర్యాన్నిచ్చే, ఆ స్తుతిమతి కి వందనం.
929. శ్రుతిసంస్తుతవైభవా
శ్రుతులచే స్తుతింపబడిన వైభవము కలది శ్రుతిసంస్తుతవైభవా.
వేదములలో చక్కగా పరిచయము చేయబడ్డ జగదీశ్వరి ఈ శ్రుతిసంస్తుతవైభవా.
నాలుగు వేదములలోనూ పరిచయము చేయబడ్డది అని భావం.
నాలుగు వేదవ్యూహముల యొక్క వైభవము కలది అని ఒక అర్ధం.
ఛందస్సారమనే గ్రంధంలో నాలుగు అంటే, నాలుగు యుగాలు, నాలుగు సముద్రాలు,
నాలుగు పురుషార్ధాలు, నాలుగు శ్రుతులు అని అర్ధం చెప్పారు.
కనుక ఈ నాలుగు విధములుగా పరిచితమవుతున్న మహాశక్తి శ్రుతిసంస్తుతవైభవా.
బృహదారణ్యకోపనిషత్తులో, శివునకు, పార్వతికి నాలుగు వ్యూహములున్నవని చెప్పబడింది.
శరీరపురుషుడు, ఛందఃపురుషుడు, వేదపురుషుడు, మహాపురుషుడు అను నాలుగు మూర్తుల
గురించి చెప్పారు. ఆ నాలుగు వ్యూహముల వైభవము కలది అని ఒక అర్ధం.
కూర్మపురాణంలో, పరమాత్మ సంబంధముచే దేవికి నాలుగు శక్తులు నాలుగు స్వరూపములుగా
ఏర్పడ్డాయని వుంది. ఆ నాలుగు స్వరూపములూ నాలుగు వ్యూహములుగా కల దేవి అని అర్ధం.
ఆ నాలుగు మూర్తులే, శాంతి, విద్య, ప్రతిష్ట, నివృత్తి.
ఈ నాలుగు వ్యూహములచే పరమేశ్వరుడు స్వాత్మానందాన్ని పొందుతున్నాడు అని వుంది.
నాలుగు వేదములలోనూ కీర్తించబడిన వైభవం కల, ఆ శ్రుతిసంస్తుతవైభవ కు వందనం.
ఓం శ్రీ శ్రుతిసంస్తుతవైభవాయై నమః
930. మనస్వినీ
స్వతంత్రమైన మనస్సు కలది మనస్వినీ.
మనస్సు పరాధీనము కాక, తన ఇచ్ఛాశక్తితో ప్రవర్తిల్లునది మనస్వినీ అని అర్ధం.
నిఘంటువులో మనస్వినీ అంటే, మంచి మనసు కలది, గర్వము కలది అనే అర్ధాలు వున్నాయి.
అమ్మను ముందు నామాల్లో గర్వితా, అతిగర్వితా అని చెప్పుకున్నాం.
మంచి మనసుతో అల్ప భక్తి కలవారిని కూడా కరుణించే జగజ్జనని కనుక మనస్వినీ.
స్వతంత్ర మనస్సు కల, ఆ మనస్విని కి వందనం.
ఓం శ్రీ మనస్విన్యై నమః
931. మానవతీ
ఉన్నతమైన అతిశయమైన అభిమానము కలది కనుక మానవతీ అని ఈ నామంలో అంటున్నాం.
నేను గొప్పదాన్ని అనే అతిశయము కలది కనుక మానవతీ. గౌరవము కలది కనుక మానవతీ.
ఉత్కృష్టమైన చిత్తౌన్నత్యము కలది కనుక మానవతీ. పతివ్రత కనుక మానవతీ.
కొలమానమునకు ప్రమాణమైనది కనుక మానవతీ. ఆదరణ పొందునది కనుక మానవతీ.
స్త్రీలకు ప్రియుల పట్ల కల కోపమును మానము అంటారు.
ప్రియుని పట్ల కోపమును ప్రకటించు స్త్రీ మానవతీ అనబడుతోంది.
యదార్థజ్ఞానము కలది మానవతీ అని ఒక అర్ధం.
స్వాతిశయం కల అభిమానవతి, ఆ మానవతీ కి వందనం.
ఓం శ్రీ మానవత్యై నమః
932. మహేశీ
మహేశుని ఇల్లాలు మహేశీ.
దేవీ పురాణంలో, మహాదేవుని వలన పుట్టినది కనుక మహేశీ అయినది అన్నారు.
మహాదేవుని కొరకు తపసు చేసి, మహాదేవుని వలన ఉత్పన్నమయిన శక్తి
కనుక ఈ మహేశీ అనే నామం వచ్చింది.
ఈ మహా విశ్వానికి ప్రభువు, మహారాజ్ఞి కనుక మహేశీ అంటున్నాం.
మహేశుని స్త్రీ అయిన, ఆ మహేశీ కి వందనం.
ఓం శ్రీ మహేశ్యై నమః
933. మంగళాకృతిః
మంగళకరమైన ఆకృతి కలిగినది కనుక మంగళాకృతి అని అంటున్నాం.
శోభనమయిన, శుభస్కరమయిన విగ్రహము కలిగినది కనుక మంగాళాకృతి అంటున్నాం.
అనవద్యాంగీ అనే నామంలో కూడా అమ్మ యొక్క విగ్రహ శోభను గురించి చెప్పుకున్నాం.
చక్కని శరీర అవయవములతో నిండైన శరీరాకృతి కలది మంగళాకృతి అని ఒక అర్ధం.
జగన్మాతకు నిత్యమంగళా, సర్వమంగళా, మంగళా, మంగళగౌరీ అనే నామాలున్నాయి.
మంగళకరమైన రూపములో వున్నది కనుక, మంగళాకృతి అని పిలుస్తున్నాం.
మంగుళూరులో మంగళాదేవిగా సేవింపబడేదీ ఈ దేవియే.
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన గయలో మంగళగౌరిగా పూజలందుకుంటోంది ఈ జగదంబ.
మంగళమైన ఆకృతితో భక్తులను కటాక్షించు, ఆ మంగళాకృతి కి వందనం.
ఓం శ్రీ మంగళాకృత్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి