22, జనవరి 2022, శనివారం

183. శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా

 

శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా ॥ 183 ॥
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః 

998. శ్రీ శివా

శ్రీ శివా అంటే శ్రీ తో కూడిన పార్వతి. శ్రీ అంటే సకల శుభాలూ కలిగించే దేవి అని అర్ధం. 

శ్రీమాతా నామంతో మొదటిశ్లోకాన్ని ప్రారంభించాం. 

శ్రీ శివా నామంతో చివరిశ్లోకాన్ని ప్రారంభిస్తున్నాం. 

శ్రీ అంటే, లక్ష్మి, సంపద, సమృద్ధి, శోభ, సంతృప్తి, బుద్ధి, ముక్తి, మోక్షం, మారేడు, సిద్ధి, కీర్తి, ప్రభ, 

విభూతి, అధికారం, వృద్ధి, కమలం, రాగం, మంత్రం, తంత్రం, యంత్రం, ధనం, ధాన్యం, వరం, 

ధైర్యం, విజయం, అభయం, విద్య, సంతానం, వాహనం, వస్త్రం, ఫలం, పుష్పం, బలం, బలగం,

బంధువర్గం, భృత్యవర్గం ఇలా ఎన్నో. 

ఇవి అన్నీ కలిగిన పార్వతి అని, ఈ శ్రీ శివా అనే నామానికి అర్ధం. 

ఇన్ని వున్న ఆ పరమేశ్వరుని పత్ని పార్వతీదేవి కన్నా సంపన్నులు ఎవరు. 

కనుక, శివానీయే ఆ సర్వ సంపత్స్వరూపిణి.  

సిరితో కూడిన గౌరి, ఆ శ్రీ శివా కు వందనం. 

ఓం శ్రీ శ్రీశివాయై నమః  


999. శివశక్త్యైక్య రూపిణీ

శివశక్తుల సామరస్యమే స్వరూపముగా కలది శివశక్త్యైక్య రూపిణి. 

సామరస్యం అంటే, సమరసత్వము, పరమసామ్యం, అత్యంత అభేదము అని అర్ధం. 

వాయవీయసంహితలో, "తిలల నుంచి తైలం వచ్చినట్టు, శివేచ్చతోనే, శివతత్త్వము నుండి 

విడివడి,  పరాశక్తి శక్తితత్త్వంగా వికసించింది", అని వుంది. 

సౌరసంహితలో, "ఏవిధముగా బ్రహ్మ నుంచి వచ్చిన శక్తి కూడా బ్రహ్మమే అవుతుందో, అదే  

విధంగా శక్తికి, శక్తివంతులకు కూడా భేదము లేదు", అని వుంది. 

వాశిష్ఠ రామాయణంలో, "ఏవిధంగా వాయువు నుంచి దాని స్పంద శక్తిని, అగ్నినుంచి దాని ఉష్ణ 

శక్తిని విడదీయలేమో, అదే విధముగా చైతన్యము, దాని స్పందశక్తి కూడా ఒక్కటిగానే ఉంటుంది. 

వాటిని విడదీయలేము", అని చెప్పారు. 

శివుడు వాక్కు అయితే, శక్తి ఆ వాక్కు  అర్ధం. శివుడు లింగమైతే, శక్తి పానవట్టం. శివుడు గుండె 

అయితే, శక్తి దాని చప్పుడు. ఈ రెండూ విడదీయరానివి, విడదీయలేనివి. 

విడివిడిగా నిరర్ధకమైనవి. "వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీ 

పరమేశ్వరౌ" అని మహాకవి కాళిదాసు తన రఘువంశం కావ్యంలో స్తుతించాడు. 

"శివచక్రములు, శక్తిచక్రములు కలిసి ఏర్పడినది శివశక్త్యైక్య రూపిణి. కనుక శ్రీచక్రస్వరూపమే 

శివశక్త్యైక్యస్వరూపం. ఈ శివ, శక్తి చక్రముల మధ్య గల అవినాభావ సంబంధమును తెలుసుకున్న 

వాడే, శ్రీచక్ర రహస్యమును తెలిసినవాడు." ఈ విషయము బ్రహ్మాండపురాణంలో వున్నది. 

యజ్ఞవైభవఖండంలో, " 'స' కారం శక్తి, 'హ' కారము శివుడు, ఈ రెండు బీజాక్షరములూ కలిసి 

ఏర్పడిన హంసమంత్రమే శివశక్త్యైక్యస్వరూపం", అని చెప్పారు. 

"శివుని యొక్క పంచశక్తులు, పాంచభౌతికమైన ప్రపంచమంతా వ్యాపించి వున్నవి, కనుక ఈ 

జగత్తు సర్వం శివ-శక్తి మయం", అని విరూపాక్ష పంచదశికలో చెప్పబడింది.

శివ, శివానీల సామరస్య స్వరూపమైనఆ శివశక్త్యైక్య రూపిణి కి వందనం.  

ఓం శ్రీ శివశక్త్యైక్యరూపిణ్యై నమః  


1000. లలితాంబికా

లలితమైన అంబిక, సుకుమారమైన అంబిక, ప్రభాసవంతమైన అంబిక, శృంగార చేష్ట చూపు 

అంబిక. ఈ అర్ధాలన్నీ లలితాపరమేశ్వరికి వర్తిస్తాయి. 

ఇంతవరకూ చెప్పుకున్న 999 నామాలూ అమ్మ స్వరూపము, శక్తి, మహిమ, లక్షణములు, 

నివాసము, పరివారము, జగత్రచనా నైపుణ్యం, జగన్నిర్వహణాశైలి, శిష్టరక్షణా, దుష్టశిక్షణా 

మొదలైన అమ్మ తత్త్వాన్ని తెలిపే విశేషణానామాలే. 

అమ్మ అసలైన నామం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అదే లలితాంబికా.

అంబికా అంటే తల్లి, జగజ్జనని, పార్వతి, పరమేశ్వరి, పరదేవత, 

ప్రయాగలో ఉన్న పీఠాధిదేవత, లలిత. ప్రయాగలోని లలితా ఆలయమే మొట్టమొదటి 

లలితా పీఠమని చెపుతారు. 

నైమిశారణ్యములో తపస్సు చేసుకుంటున్న ఋషులు, మునులు రాక్షసబాధను తట్టుకోలేక,

లలితను ప్రార్ధిస్తే, అమ్మ అక్కడ లలితాపీఠం ఏర్పరుచుకుని, వారికి రక్షణ కవచంగా నిలిచింది. 

లలిత అంటే లలితమైనది, సుకుమారమైనది, ప్రకాశవంతమైనది, కాంతి జనకమైనది, 

అందమైనది, రతిచేష్టలు చేయునది అనే అర్ధాలు అన్నీ వున్నాయి. 

ఇదే లలితాంబికా అంటే. ఈమే లలితాంబికా అంటే. ఈమే మన తల్లి, మనందరి తల్లి. 

ఈమె వలననే ఈ జగత్తులన్నీ, మనతో సహా, వర్ధిల్లుతున్నాయి. ఇహ పరములను అనుగ్రహించే 

శ్రీలలిత. 

తనను ఉపాసించే భక్తులకు భోగమూ మోక్షమూ రెండూ ఇచ్చే అమ్మ, లలితమ్మ, మాయమ్మ.

ఎవరికి వారు 'మా అమ్మ వంటిది మరొకరు లేరు' అని అనుకునే శ్రీమాతృస్వరూపం. 

శ్రీచక్రరాజ సింహాసనం మీద వున్నా, వెండికొండ మీద వున్నా, ఓంకారములో వున్నా, పంచదశీ 

మంత్రములో వున్నా, మనందరి హృదయపద్మాలలో వున్నా, ఎవరికి వారు నాకు మాత్రమే అమ్మ 

అనుకునే అమ్మ. మా అమ్మ.  

అమ్మంటే అమ్మే, ఇంకో నామం లేదు, ఇంకో అర్ధం లేదు, ఇంకో వివరణ లేదు, ఇంకో భావం లేదు, 

అంతే, అమ్మంటే అమ్మే....🙏

మనందరి హృదయాలలో కొలువై వున్న, మా చక్కని సుకుమార లతిక, సౌందర్య తిలక అమ్మ, 

ఆ లలితాంబిక కు వందనం. 

ఓం శ్రీ లలితాంబికాయై నమః  


ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః 

ఇవే శ్రీలలితాదేవి యొక్క విశిష్టమయిన వేయి నామాలు. 


ఇది శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి వ్రాసిన శ్రీలలితావిజయం లోని 

శ్రీలలితారహస్యసహస్రనామ స్తోత్రము నందు కల 

వేయి నామాల వివరణ

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼


॥ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, 

శ్రీలలితా రహస్యనామ సాహస్రస్తోత్ర కథనం నామ ద్వితీయోఽధ్యాయః॥


ఇది శ్రీబ్రహ్మాండపురాణములో, ఉత్తరఖండములో, హయగ్రీవాగస్త్యులు చేసిన సంభాషణములో,

ప్రస్తావించబడిన శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కధనం. 

ప్రథమోధ్యాయంలో పూర్వపీఠిక, ద్వితీయోధ్యాయంలో సహస్రనామస్తోత్రము, 

తృతీయోధ్యాయంలో ఉత్తరపీఠిక చెప్పబడినాయి. 


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

॥ఇతి శ్రీలలితాసహస్రనామావళిః సంపూర్ణమ్॥  

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


కౌండిన్యస గోత్రీకులైన శ్రీ భట్టిప్రోలు వెంకట్రామన్, శ్రీమతి రాధారుక్మిణి గార్ల రెండవకోడలు, 

భారద్వాజస గోత్రీకులైన శ్రీ నందివాడ శ్రీరామకృష్ణశర్మ, శ్రీమతి లీలాకుమారి గార్ల పెద్దకూతురు,  

శ్రీ భట్టిప్రోలు రమేష్ కుమార్ గారి ధర్మపత్ని అయిన శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి  అను నేను 

శ్రీలలితాపరమేశ్వరి పాదపద్మాలకు సమర్పించుకుంటున్న భక్తిపుష్పం, "శ్రీలలితావిజయం",

శ్రీ లలితాదేవి అనుగ్రహంతో వ్రాసిన, శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర సరళవ్యాఖ్యానం. 


సర్వం శ్రీ లలితా పరాభట్టారికా చరణారవిందార్పణమస్తు

ఓం తత్ సత్

------------భట్టిప్రోలు విజయలక్ష్మి

9885010650

          

2 కామెంట్‌లు: