నిరామయా, నిరాలంబా, స్వాత్మారామా, సుధాస్రుతిః ॥ 163 ॥
872. త్రయీ
వాగ్భవబీజ స్వరూపురాలయిన, ఆ త్రయీ కి వందనం.
ఓం శ్రీ త్రయ్యై నమః
873. త్రివర్గ నిలయా
నిఘంటువులో త్రివర్గమంటే, ధర్మ, అర్థ, కామములని చెప్పబడింది.
ధర్మార్థకామములకు నెలవైనది కనుక, అమ్మను ఈ నామంలో త్రివర్గనిలయా అంటున్నాం.
మరియొక అర్ధము ప్రకారము అకార, ఉకార, మకారములకు కూడా త్రివర్గమని పేరు.
అకార, ఉకార, మకారము లంటే అ, ఉ, మ అనే అక్షరములు. ఈ మూడూ కలిస్తే, ఏర్పడేది ఓం.
ఈ నామంలో అమ్మను ఓంకార స్వరూపురాలు అంటున్నాం.
త్రివర్గములైన ధర్మార్థకామములందు, ఓంకారము నందు వుండు, ఆ త్రివర్గనిలయ కు వందనం.
ఓం శ్రీ త్రివర్గ నిలయాయై నమః
874. త్రిస్థా
త్రిస్థా అంటే మూడింటి యందు ఉండేది అని అర్ధం.
భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఉంటుంది కనుక త్రిస్థా.
అకార, ఉకార, మకారములైన ఓంకారమందు ఉంటుంది కనుక త్రిస్థా.
మార్కండేయపురాణంలో, స్వర్గ, మర్త్య, పాతాళమనే మూడు లోకములలో ఉంటుంది కనుక త్రిస్థా
అన్నారు. రుక్, యజుర్, సామ వేదత్రయము నందు ఉంటుంది కనుక త్రిస్థా.
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యందు ఉంటుంది కనుక త్రిస్థా.
త్రేతాగ్నులైన గార్హపత్యము, ఆవహనీయము, దక్షిణాగ్నుల యందు ఉంటుంది కనుక త్రిస్థా.
సూర్య, చంద్ర, వహ్ని అనే మూడు జ్యోతుల్లోనూ ఉంటుంది కనుక త్రిస్థా.
త్రివర్గములైన ధర్మార్థకామము లందు ఉంటుంది కనుక త్రిస్థా.
త్రిగుణములైన సత్వ, రజ, తమో గుణాల యందు ఉంటుంది కనుక త్రిస్థా.
శబ్దత్రయమైన స్త్రీ, పుం, నపుంసక లింగముల యందు ఉంటుంది కనుక త్రిస్థా.
త్రిదోషములైన వాత, పిత్త, కఫముల యందు ఉంటుంది కనుక త్రిస్థా.
ఆశ్రమత్రయమైన బ్రహ్మచర్య, గార్హత్య, వానప్రస్థముల యందు ఉంటుంది కనుక త్రిస్థా.
జాగ్రత్, స్వప్న, సుషుప్తులనే మూడు అవస్థల యందూ ఉంటుంది కనుక త్రిస్థా.
అహరాదిత్రయమైన రాత్రి, పగలు, సంధ్యల యందు ఉంటుంది కనుక త్రిస్థా.
పితా, పితామహ, ప్రపితామహుల యందు, మాతా, పితామహీ, ప్రపితామహీల యందు,
మాతా, మాతామహీ, ప్రమాతామహీల యందు ఉంటుంది కనుక త్రిస్థా.
త్రి సంఖ్య కల ప్రతి స్థానములోనూ ఉండు, ఆ త్రిస్థా కు వందనం.
ఓం శ్రీ త్రిస్థాయై నమః
ఓం శ్రీ త్రిపురమాలినీన్యై నమః
876. నిరామయా
ఆమయము అంటే రోగము, వ్యాధి. నిరామయము అంటే రోగములు, వ్యాధులూ లేని స్థితి.
నిరామయా అంటే ఏ రోగమూ లేనివాడు, రోగములు నశించిన వాడు అని అర్ధం.
ఈ నామంలో అమ్మను రోగములు నశించినది, వ్యాధులు తగ్గిపోయినది అని అంటున్నాం.
అసలు అమ్మవారికి వ్యాధులేమిటీ, వింత కాకపోతే. అమ్మ పరబ్రహ్మ. ఏ ఆధివ్యాధులూ అంటవు.
ఈ నామంతో అమ్మను జపిస్తే వ్యాధుల్ని నశింపచేస్తుంది అని భావం.
ఆమయములే లేని, ఆ నిరామయ కు వందనం.
ఓం శ్రీ నిరామయాయై నమః
877. నిరాలంబా
ఆలంబనం అంటే ఆధారము. నిరాలంబా అంటే ఆధారము లేనిది.
అమ్మను పూర్వ నామాలలో కూడా నిరాధారా అని చెప్పుకున్నాం.
ఆ తల్లి అందరికీ ఆధారము కానీ, ఆ తల్లికి ఏ ఆధారమూ లేదు, దాని అవసరమూ లేదు.
ఆతల్లి సర్వాధారా. తల్లి వేరు లేకపోతే చెట్టు మనలేనట్టు, ఆ జగన్మాత లేకపోతే జగములే లేవు.
జగములన్నీ ఆ తల్లి ఆధారము మీదే నడుస్తున్నాయి.
శ్రీమాతగా తాను అందరికీ ఆలంబనమైనది కానీ, తనకు ఏ ఆలంబనా లేదు, అని ఈ నామ భావం.
ఏ ఆలంబనా లేని, ఆ నిరాలంబ కు వందనం.
ఓం శ్రీ నిరాలంబాయై నమః
878. స్వాత్మారామా
స్వాత్మారామా అంటే, స్వ, ఆత్మ, ఆరామా, తన ఆత్మ యందు తానే క్రీడించునది, రమించునది
అని అర్ధం. తనలో తానే, తనతో తానే క్రీడించటం ఆ పరమేశ్వరికే సాధ్యం.
బృహదారణ్యకంలో, "ప్రజాపతి తనను తాను రెండుగా విభజించుకున్నాడు. వారే స్త్రీ పురుషులు,
భార్యా భర్తలుగా మారి రమిస్తున్నారు", అని వుంది.
అంటే తానే ఇంకొక కృత్రిమ జగద్రూపవనాన్ని సృష్టించుకుని దానిలో క్రీడిస్తున్నది అని భావం.
వాయుపురాణంలో, 'ఈశ్వరుడొక్కడే తన శక్తి చేత అనేక రూపములుగా మారి క్రీడిస్తున్నాడు. తిరిగి
ఒక్కడుగా మారుతున్నాడు', అని చెప్పారు.
మార్కండేయపురాణంలో, "ఓ, దేవీ, నీవు అక్షర స్వరూపము, నీకు నాశము లేదు. ఈ జగత్తంతా
క్షరము, నశిస్తుంది. కట్టెలో నిప్పున్నట్టు, మట్టిలో రేణువులున్నట్టు, నీలో ఈ అశేష జగత్తులన్నీ
వున్నాయి. నీవు అన్ని చోట్లా జగత్ బ్రహ్మ రూపములో వ్యాపించి వున్నావు", అని వుంది.
స్వాత్మారామా అంటే, ఒక్క అమ్మే అన్ని రూపములలో, అంతటా వ్యాపించి, తన ఆత్మ యందు
తానే రమిస్తున్నది అని అర్ధం.
తానే అనేక రూపములుగా మారి, తనలో తానే రమిస్తున్న, ఆ స్వాత్మారామా కు వందనం.
ఓం శ్రీ స్వాత్మారామాయై నమః
879. సుధాస్రుతిః
సుధాస్రుతి అంటే సుధాస్రావము అని అర్ధం. సుధలు స్రవించేది సహస్రారములో.
కనుక, సుధాస్రుతి అంటే సహస్రారములో స్రవించే సుధా స్రావము అని అర్ధం.
సహస్రారము వద్దకు చేరిన ఉపాసకులపై, సహస్రార కర్ణిక వద్ద నున్న చంద్రుని నుంచి సుధా
వర్షము కురుస్తుంది అని చెప్పుకున్నాం. ఆ సుధావర్ష స్వరూపురాలు శ్రీదేవి అని ఈ నామార్ధం.
ఆ అమృతస్రావమును కలిగించు కుండలినీ స్వరూపురాలు పరమేశ్వరి.
ఆ సహస్రార చంద్రమండలం నుంచి కలిగిన అమృతస్రావము డాకినీ మొదలైన శక్తి
మండలాలనన్నీ తృప్తి పరుస్తుంది. ఆ తృప్తి జనకమే లలితాపరమేశ్వరీ స్వరూపము.
జ్ణానార్ణవంలో, అమృతధారలు వర్షించునది, విషమును హరించునది సుధాస్రుతి అని వుంది.
సహస్రారము వద్ద స్రవించున్న అమృతధారా స్వరూపమైన, ఆ సుధాస్రుతి కి వందనం.
ఓం శ్రీ సుధాస్రుత్యై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి