స్వస్థా, స్వభావమధురా, ధీరా, ధీర సమర్చితా ॥ 169 ॥
912. సవ్యాపసవ్య మార్గస్థా
సవ్యము, అపసవ్యము, మార్గము అను మూడింటిలో ఉండునది సవ్యాపసవ్యమార్గ స్థా.అన్ని రకముల అర్చారీతులలో అర్చింపబడే, ఆ సవ్యాపసవ్య మార్గస్థా కు వందనం.
ఓం శ్రీ సవ్యాపసవ్య మార్గస్థాయై నమః
913. సర్వాపద్వి నివారిణీ
అన్ని ఆపదలనూ నివారించునది అని ఈ నామార్దం.
భక్తులకు కలిగే ఆపదలనూ, కష్టములనూ నివారించునది, తీర్చునది అని ఈ నామ భావం.
పైన చెప్పిన మార్గములలో అన్నీ సంపూర్ణముగా తెలుసుకొని తరించకపోతే వారు భ్రష్టులవుతారు.
కానీ ఆ పరమేశ్వరి కరుణతో, దేవీ నామములు ఉచ్చరిస్తే, వారిని కూడా ఆ ఆపదల నుండి
రక్షిస్తుంది, అని కూర్మ పురాణంలో వుంది.
"నన్ను శరణు కోరి, నా యందు భక్తితో, ఆసక్తితో వున్నవారిని, వారు ఏ ఆశ్రమములో వున్నా,
పర్వతములంత కష్టములు వారికి ఎదురైనా, వాటిని నశింపచేస్తాను", అని అమ్మ చెప్పినట్టు
కూర్మ పురాణంలో వున్నది.
హరివంశంలో కూడా, "నరులకు కలిగే బంధనము, వధ, విరోధము, పుత్రనాశము, ధనక్షయము
వంటి సర్వాపదలూ దేవి తప్పక నివారిస్తుంది", అని విష్ణువు చెప్పినట్టు వున్నది.
వరాహపురాణంలో, "పరమేశ్వరిని శరణు పొందినవారిని ఆపదలు వేధించవు", అని బ్రహ్మాది
దేవతలు కీర్తించినట్లు వున్నది.
భక్తులు యోగభ్రష్టులైనా, వారికి కలిగే సమస్త ఆపదలనూ కరుణతో నివారించు,
ఆ సర్వాపద్వి నివారిణి కి వందనం.
ఓం శ్రీ సర్వాపద్వినివారిణ్యై నమః
914. స్వస్థా
దుఃఖము వలన కలిగే చాంచల్యము లేనిది స్వస్థా.
ఎటువంటి ఒడిదుడుకులూ లేక సుఖముగా ఉండునది స్వస్థా.
పరమేశ్వరికి రాగద్వేషములు లేవు, కనుక చంచలత్వము లేదు, అందుకే స్వస్థా అంటున్నాం.
వేదములో, భగవంతుడు మహిమతో ప్రతిష్టితుడై, స్వస్థానములో ఉంటాడని చెప్పారు.
స్వర్, స్థా అంటే స్వర్గములో ఉండునది, స్వర్గమునకు అధీశ్వరి అని కూడా అర్ధం.
సు, అస్థా అంటే మంగళప్రదమైన ఉనికి కలది అని అర్ధం.
ఎటువంటి దుఃఖ చాంచల్యమూ లేక, మంగళకరముగా వుండు, ఆ స్వస్థా కు వందనం.
ఓం శ్రీ స్వస్థాయై నమః
ఓం శ్రీ స్వభావమధురాయై నమః
916. ధీరా
ధీరా అంటే ధీరురాలు, పండితురాలు, ధైర్యము కలది అని అర్ధము.
అద్వైత జ్ఞానమును ఇచ్చే శుద్ధవిద్యా స్వరూపురాలు, అద్వైతములో పండితురాలు అని భావం.
వేదములో, "ఈశ్వరానుగ్రహము వలన మాత్రమే అద్వైత భావన ప్రాప్తిస్తుంది" అని చెప్పారు.
ధీరత్వాన్ని ఇచ్చేది ధీరా. బుద్ధిప్రదమైన దశమీ తిథి స్వరూపురాలు అని కూడా భావం.
అద్వైత జ్ఞానమును ఇచ్చే, ఆ ధీరా కు వందనం.
ఓం శ్రీ ధీరాయై నమః
917. ధీర సమర్చితా
ధైర్యము కల ధీరులచే చక్కగా విధి విధానముగా అర్చింపబడునది అని అర్ధం.
జ్ఞానము కల పండితులచే పూజింపబడునది ధీరసమర్చితా.
వేదములో, "భగవంతుని పండితులైన కవులు కూడా పూజిస్తారు", అని వుంది.
ధీ, రసం, అర్చితా అంటే జ్ఞానామృతము కొరకై అర్చింపబడునది అని భావం.
లేదా జ్ఞానమనే ఆనందము కొరకు ప్రార్ధింపబడునది అని భావం.
పరమహంసలైన జ్ఞానులు కూడా అమ్మను ఆనందము కొరకు అర్చిస్తారు.
కళ్యాణచరణుడనే పరివ్రాజకుడు, " అమ్మా, నన్ను పాతాళములో పడవేసినా, నిఖిలలోక
సామ్రాజ్యమిచ్చినా, నీ పాదములు విడువను", అంటాడు.
పరమహంసలచేత, పరివ్రాజకులచేత అర్చింపబడు, ఆ ధీర సమర్చిత కు వందనం.
ఓం శ్రీ ధీర సమర్చితాయై నమః
------------భట్టిప్రోలు విజయలక్ష్మి
9885010650
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి